మత్స్య మహా పురాణము
సువర్ణ పర్వత దానము
ఈశ్వరుడు నారదునకిట్లు చెప్పెను, ఇప్పుడిక సువర్ణ పర్వత దానమును తెలుపుదును. అది పాపహరమును ఉత్తమమును. దానిని చేసిన పుణ్యప్రభావమున మానవులు బ్రహ్మలోకమున సుఖింతురు. దీనికై బంగారు వేయిపలములుకాని, ఐదువందల పలములుకాని, దానిలో సగము కాని మరియు శక్తిలేనివాడు యథాశక్తిగ బంగారు వినియోగించవచ్చును. ఒక పలమునకు తక్కువ కాకుండ ఉండవలెను. కాని ఈవిషయమున ఇతరులతో పోటీపడరాదు. ప్రతి అంశము నందును ధాన్య పర్వతమునందువలెనే చేయవలెను. అట్లే విష్కంభ శైలములను ఋత్విక్కులకు దానమీయవలెను. సువర్ణ పర్వతమా! బ్రహ్మా విద్యా స్వరూపమవు; బ్రహ్మదేవుని గర్భమవు; (బీజమవు;) అనంత ఫలమునిచ్చు దానవు; అగ్నికి సంతానమవు; పరమాత్ముని అల్పాంశ రూపమవు; కావున స్వర్ణపర్వత రూపమున నీవు నన్ను రక్షించుము. ఈవిధానమున సువర్ణ పర్వత దానము చేయువాడు పరమానంద ప్రదమగు బ్రహ్మ లోకమునుచేరి అచట నూరుకల్పములపాటు సుఖించి చివరకు మోక్షమునందును.