శ్రాద్ధ కల్పము-నిమంత్రణాది విధి

సూతుడు ఋషులకు ఇంకను ఇట్లుచెప్ప నారంభించెను. ఈ విషయమంతయు నిరవ శేషముగా విని మనువు కేశవుని మరల ఇట్లు ప్రశ్నించెను. “శ్రాద్ధమును జరుపదగిన వివిధమగు కాలవిశేషమును వివిధములగు శ్రాద్ధ విశేషములను శ్రాద్ధమునందు భుజింపజేయదగిన వారిని భుజింపజేయదగనివారిని పితృ శ్రాద్ధ మాచరింపదగిన కాలమును ప్రదేశములను పితృదేవతలు ప్రీతి చెందుటకై శ్రాద్ధమాచరింపవలసిన విధానమును ఈ విషయములను అన్నిటికి నాకు తెలుపుడు.”

మత్స్య నారాయణుడిట్లుమనువుతో చెప్ప నారంభించెను. అన్నము మొదలగు పదార్థము లతో కాని ఉదకముతో గాని ప్రతిదినమునను శ్రాద్ధమును చేయవలెను. అన్నము లభ్యముకాని పక్షమున పాలు-పండ్లు-దుంపలు- వీనితోనైన శ్రాద్ధము జరిపి పితరులకు ప్రీతి కలిగించవలెను.

నిత్యము నైమిత్తికము కామ్యము అని శ్రాద్ధము మూడు విధములు. మొదటిది ప్రతి దిన మును చేయవలసినది. మొదట దీనిని తెలిపెదను. దీనియందు అర్ఘ్యము అవాహనము విశ్వదేవార్చనము ఉండనక్కరలేదు.

నిమిత్తము అనగా కాలవిశేష రూపమయిన హేతువు. ఆయా కాలవిశేషములందు చేయ వలసినది నైమిత్తిక శ్రాద్ధము. ఇది మరల పార్వణ శ్రాద్ధము, సాధారణ శ్రాద్ధము, అభ్యుదయ శ్రాద్ధము అని మూడు విధములు - వీనిలో శుక్ల, కృష్ణ పక్షములందలి చతుర్థినాడును అష్టమి నాడును పూర్ణిమ అమావాస్యల యందును చేయవలసినది నైమిత్తిక (పర్వదినములలో చేయ దగిన) శ్రాద్ధము. శ్రాద్ధమునందు చేయవలసినవి మూడు- హోమము-బ్రాహ్మణ భోజనము - పిండదానము అనునవి తర్పణము పిండదానములో చేరును. ఆవాహనాదికము బ్రాహ్మణ భోజనములో చేరును. హోమము తెలిసినదే. వానిలో భోజనమునకై పిలువదగిన బ్రాహ్మణులను తెలిపెదను వినుము. పంచాగ్ని హోత్ర ధర్మములను అనుష్ఠించువాడు (1. అన్వాహార్య పచన లేక దక్షిణ - 2. గార్హపత్య - 3. ఆహవనీయ-4. సభ్య-5. అవసథ్య-అనునవి పంచాగ్నులు) వేదాధ్యయనము యథాశాస్త్రముగా ముగించి, స్నాతకవ్రతము జరుపుకొనినవాడు త్రిసుపర్ణము లను (ఋగ్వేదమునందలి “చతుష్కపర్దా” ఇత్యాదిగా మూడు ఋక్కులను గాని యజుర్వేదము నందలి “బ్రహ్మమేతుమాం” మొదలగు మూడు అనువాకములుగాని) అధ్యయనము చేసినవాడు ఆరు వేదాంగములను అధ్యయనము చేసినవాడు శ్రోత్రియుడు (వేదమును బాగుగా అధ్యయనము చేసినవాడు) శ్రోత్రియుని కుమారుడు (వేదశాస్త్రములందలి) విధివాక్యము (అర్ధము)లను బాగుగ ఎరిగినవాడు అన్ని విషయములను ఎరిగినవాడు సత్రయాగములను ఆచరించినవాడు అందర కును తెలిసిన ప్రసిద్ధకులమున వంశమున పుట్టినవాడు, పురాణములను ధర్మ శాస్త్రములను ఎరిగినవాడు, స్వాధ్యాయములను ఎల్లప్పుడును శ్రద్ధతో చేయుచుండువాడు. శివభక్తుడు పితృ భక్తుడు సూర్య భక్తుడు విష్ణుభక్తుడు బ్రహ్మతత్త్వమును ఎరిగినవాడు యోగవిద్య నెరిగినవాడు శాన్తుడు ఆత్మయోగము నెరిగినవాడు మంచి శీలము కలవాడు దౌహిత్రుడు తన భార్యకు తండ్రి తన గురుడు తన కులమువారిలో పెద్ద - వీరినే ఆంధ్రదేశమున సభాపతి అందురు కులపు పెద్ద-మేనమామ బంధువు ఋత్విక్ ఆచార్యుడు (ధర్మశాస్త్రాదికమును బోధించగలవాడు) సోమయాజి వాక్కును (భాషలను) వ్యాకరించగలవాడు (వ్యాకరణ తత్తమును ఎరిగినవాడు) యజ్ఞ ప్రక్రియను శాస్త్రీయముగా చర్చించి వివరించగలవాడు. సామవేద స్వర ప్రక్రియను బాగుగా ఎరి గిన వాడు పంక్తిని పావనము చేయువారిలో శ్రేష్ఠులు. సామ వేదము నేర్చినవాడు బ్రహ్మచారి భగవద్భక్తుడు బ్రహ్మతత్వవేత్త ఏశ్రాద్ధమున భుజింతురో ఆశ్రాద్ధము సార్థకమయి పరమార్థ ఫలమును ఇచ్చును. కనుక శ్రాద్ధమునందు భోక్తలుగా ఇట్టివారినే నియమించవలెను. ఇక భోక్తలుగా పిలుచుటలో విడువవలసినవారిని తెలిపెదను. వినుము. పతితుడు పతితుని కుమా రుడు నపుంసకుడు కొండెములు చెప్పువాడు అంగహీనుడు రోగి పుప్పిగోళ్ళవాడు గుర్రములను పోషించి జీవించువాడు అన్నకు పెండ్లి కానిదే పెండ్లి చేసికొన్నవాడు లేదా తన కంటె ముందే పెండ్లి చేసికొన్నవాని అన్న తనకు తానై కోరి ఇతరుల సేవకు పాల్పడి జీవించువాడు త్రాగుడు మొదలైన వానిని ఉపయోగించి మత్తులో ఉండువాడు వెర్రివాడు క్రూరుడు పిల్లివలె కొంగవలె మోసముచే జీవించువాడు కపటి గొప్పలు చెప్పుకొనువాడు, పూజారి, కృతఘ్నుడు, నాస్తికుడు మ్లేచ్ఛ దేశములలో నివసించు (చిన) వాడు, త్రిశంకు, బర్బర, ఉత్కల, ఆంధ్ర, చీన, ద్రవిడ, కొంకణ దేశములవారు తన సంప్రదాయ చిహ్నములను ఎల్లప్పుడు ధరించి తిరుగువారు. ఇట్టివారిని కర్మానుష్ఠాన ధర్మమును ఎరిగినవారు శ్రాద్ధమున భోక్తలుగా నియమించ కూడదు. వేదతత్త్వము నెరిగి కర్మల ననుష్ఠించువారు వీరిని అందరను శ్రాద్ధ సమయములందు భోక్తలనుగా పిలువక విడువవలయును.

శ్రాద్ధమునకు ఒకనాడుగాని రెండునాళ్ళుగాని ముందుగా భోక్తలగు బ్రాహ్మణులను వినయముతో నిమంత్రణము-నేను అనుష్టించు శ్రాద్ధమునందు మీరు భోక్తలుగా ఉండవలెనని ప్రార్థనచేయవలెను. చేసి అంగీకరింపజేసి, తన ఇంటికి పిలిచికొని రావలెను. అట్లు నిమంత్రించినచో పితృదేవతలు ఆ బ్రాహ్మణులందు ప్రవేశించి నిలుతురు. పితృదేవతలు వాయురూపులయి ఆ బ్రాహ్మణుల దగ్గరకు పోవుదురు. వారు భోజనమునకై కూర్చుండినప్పుడు వారియందుండి వారితో పాటు తామును కూర్చుందురు.

శ్రాద్ధకర్త భోక్త యొక్క కుడి మోకాటిని తాకుచు “అయ్యా! ఈ శ్రాద్ధమునందు భోక్తగా నేను మిమ్ములను నిమంత్రించుచున్నాను అని నిమంత్రించవలెను. తరువాత అతడు పితృదేవతల యందు భక్తితో ఈనియమమును వారికి వినిపించవలెను. “మీరు ఈ శ్రాద్ధకాలములో ఆరంభము నుండి చివర వరకును క్రోధము విడిచి శౌచము కలిగి దేవతా తత్త్వ విషయమునే మాటలాడుచు ఉండవలెను. మీరేకాదు. శ్రాద్ధకర్తనగు నేనును అట్లేయుండవలెను” అని ఈనియమ మంత్రము నకు అర్థము. పార్వణ శ్రాద్ధమును జరుపు నిత్యాగ్ని హోత్రియగు గృహస్థుడు అమావాస్య మొదలగు పర్వములయందు యథావిధిగా పితృయజ్ఞమును జరిపి పిండముల అన్వాహార్యకమును పితరులకు పిండములను ఆహారముగా సమర్పించుటను-నిర్వర్తించవలెను.

శ్రాద్ధమును జరుపవలసిన ప్రక్రియాక్రమము ఇది. గోశాలా ప్రదేశమున గాని సరస్సులు నదులు మొదలగు జల సమీపమునందుగాని దక్షిణము వైపునకు వాలుగా ఉన్న ప్రదేశములను గోమయముతో అలికి అచ్చట భక్తితో శ్రాద్ధమాచరించుట ఆరంభించవలెను. అగ్నిహోత్రమును ఏర్పరచుకొనవలయును. చరువును (పితృదేవతలకు అర్పించుటకై పక్వము చేసిన పదార్థమును) సమపరిమాణముకల పిడికిళ్ళుగా పాత్రయందు వడ్డించుకొనవలెను. “అయ్యా! ఇది పితృ దేవ తలకై వడ్డించుచున్నాను. మీరును నేనును సావధానతతో ఉండవలయును!” అని భోక్తలను ప్రార్థించుచు అదియంతయు దక్షిణమున ఉంచవలెను! తరువాత దానిపై నేతితో అభిఘారణము చేసి తనముందు మూడువడ్డనలను చేయవలెను. ఆవడ్డించు చరు పిండ పరిమాణము పండ్రెండు అంగుళముల పొడవుతో నాలుగంగుళముల వెడల్పు నాలుగు అంగుళముల మందము కలిగి ఉండవలెను. (1 భారతీయాంగుళము=3/4 బ్రిటిషు అంగుళము) చండ్రకొయ్యతో మూడు దర్వులను (తెడ్డులను) చేయవలెను. వాటిలో వెండి రేకు నమర్చవలెను. అవి పిడికిలి మూసిన మూరపొడవున నున్ననై చేతిముందు భాగపు ఆకారములో ఉత్తమమై ఉండవలెను. కంచుతో చేసిన నీటి పాత్ర - మేక్షణము వైదిక కర్మములందు ఉపయోగించు ద్రవమును వడ్డించు ఉపకర ణము) సమిధలు-కుశలు-తిలపాత్రములు-మడుగ వస్త్రములు గంధములు ధూపద్రవ్యములు అను లేపనములు (పూసికొను సుగంధ వస్తువులు ఈ మొదలగునవి సేకరించుకొనవలెను. వీటిలో ప్రతి ఒక్కటియు అపసవ్యముతో నెమ్మదిగా దక్షిణపు వైపుగా తెచ్చుకొని ఉంచుకొనవలెను.

ఇట్లు ఈ వస్తువులలో ప్రతి ఒక్కటియు సమకూర్చుకొని తన భవనమునకు (ఇంటికి) ముందు ప్రదేశమున గోమూత్రముతోను గోమయముతోను అలికినచోట గోమయముతో మండలము చేయవలెను. ఆ ప్రదేశమున అపసవ్యముతో బ్రాహ్మణులను అక్షతలతోను పుష్పముల తోను అర్చించవలెను. తరువాత వారికి మాటిమాటికి అభివందనము చేసి వారి పాదములను ప్రక్షాళనము చేయవలెను. తమ పాదప్రక్షాళనానంతరము ఆ బ్రాహ్మణులు ఆచమనము ఉదకోప స్పర్శనము చేయవలెను. అట్టి వారిని చక్కగా అమర్చబడి దర్భలుపరచిన ఆసనములపై శాస్త్ర విధానమున కూర్చుండపెట్టి అనుమంత్రణము (మరల ఆహ్వానించుట - దయచేయుడు- కూర్చుండుడు అనుట) చేయవలెను. విశ్వదేవ స్థానమున ఇద్దరను - పితృ స్థానమున ముగ్గురను సంభవము కాని యెడల రెండు స్థానములలోను ఒక్కొక్కరినే కాని భుజింపజేయవలెను. శ్రాద్ధకర్త తాను ఎంత ధనవంతుడైనను ఇంతకంటె ఎక్కువ మందిని శ్రాద్ధమున భోక్తలుగా చేసి భుజింపజేయరాదు.

శ్రాద్ధకర్తయగు విప్రుడు భోక్తలుగా కూర్చున్న విప్రులను అర్ఘ్యము మొదలగు వాటితో దేవ పూర్వకముగా (మొదట విశ్వదేవ స్థానమున తరువాత పితృ స్థానమున) అర్చనము జరుపవలెను. తరువాత ఆ విప్రుల అనుమతి పొంది తరువాత చరువు (హోమమునకై ఉంచిన ద్రవ్యము)ను కంచు పాత్రలోనికి తీసికొని దానిని తన గృహ్య సూత్రములందు చెప్పబడియున్న విధమున అగ్నౌకరణము చేయవలయును. సంప్రదాయమును ఎరిగినవాడు (అగు గృహస్థుడు) ఈ అగ్నౌకరణముచే అగ్నీషోయములకు తృప్తి కలిగించవలయును. శ్రాద్ధకర్తయగు ద్విజోత్తముడు ఏకాగ్ని (వానప్రస్థుడు) ఐనచో దక్షిణాగ్నిని (దీనినే అన్వాహార్య పచనాగ్నియనియు లౌకికాగ్ని అనియు వ్యవహరింతురు) ప్రణయనము (ప్రజ్వలనము) చేసి దానియందు ఈ అగ్నౌకరణము జరుపవలెను. ఈ సందర్భములో పర్యుక్షణము అమంత్రకముగా ఏ ఇతర ప్రక్రియ లేకుండ అగ్నిహోత్రుని చుట్టును నీటిని చిలుకరించుట) మొదలగునవి యజ్ఞోపవీతి (ఎడమ భుజము మీదుగా సవ్యముగా జందెము ధరించినవాడు) అయిచేయవలెను. మిగిలినది అంతయు ప్రాచీనావీతి కుడి భుజము మీదుగ జందెము ధరించినవాడు-అపసవ్యముగా) అయి చేయవలెను.

అగ్నౌకరణము చేయగా మిగిలిన హవిః శేషము నుండి ఆరు పిండములను చేయ వలెను. ఎడమ చేతితో నూవులతో కూడిన ఉదక పాత్రను పట్టుకొనవలెను. పిమ్మట అపసవ్యము చేసికొని దర్భలతో రేఖను (నిలువుగా దక్షిణాగ్రములుగా దర్భలను పరచుట) చేయవలెను. పిమ్మట చేతితో దర్విని పట్టుకొని దానితో ఆచోటు అవనేజనము (నీటితో తడుపుట) చేయవలెను. ఇది యంతయు దక్షిణ ముఖముగా తిరిగియే చేయవలెను. తరువాత దర్బలపై ఒక్కొక్క పిండమునే వారివారి నామ గోత్రములను చెప్పుచు ఉంచవలెను. తరువాత లేపభాక్కుల (చేతికి అంటుకొనిన పిండపు అంటు అర్పించుటతోనే తృప్తిపడవలసినవారు) నిమిత్తమై శ్రాద్ధకర్త ఆ దర్భలపై తన చేతులను కొద్ది నీటితో కడుగుకొనవలెను. తరువాత మరల ప్రత్యవనేజనము (మరల నీటితో తడుపుట) చేయవలెను. గంధ ధూపములు దీపము నైవేద్యము మొదలగు అర్చనలతో పిండము లను అర్చించి వాటికి నమస్కరించవలెను. ఇది యంతయు వారివారి గృహ్య సూత్రములందు చెప్పబడిన విధమున బ్రాహ్మణులందు విశ్వదేవులను పితృదేవతలను ఆవాహనము చేసి జరుప వలెను. ఏకాగ్నియగు (వాన ప్రస్థుడగు) శ్రాద్ధకర్త మాత్రము దర్వితో ఒకే వడ్డన చేసిన చాలును.

ఇట్లు పురుషులగు పితరులకు పిండదానము చేసిన తరువాత వారి పత్నులకు దర్భలు మొదలైన వాటిని ఆ పిండములు మొదలైన వానిని ఆవాహనమును విసర్జనమును జరుపవలెను. తరువాత పిండములనుండి అల్పాంశములను తీసికొని ప్రతియొక భాగమును భోక్తలచే తినిపించ వలెను. ద్విజులయినవారు అగ్నియందు వేల్చగా మిగిలిన శేషమునే (అగ్నౌకరణము కాని హోమము కాని చేసిన తరువాతనే) ఆహారమును తిందురు. కావున అట్టి అగ్ని హవన శేషమునకు అన్వాహార్యకము అని పేరు. కనుక భోక్తలకు హవన శేషము కాని అన్నమును తినిపించరాదు.

మొదట భోక్తల హస్తమున పవిత్రముతో కూడ తిలోదకమును విడువవలెను. తరువాత ఆ పిండమాత్రను (పిండపుతునుకను) “స్వధా ఏషాం అస్తు” అని చెప్పుచు వారి చేతియందుంచ వలెను. ఎల్లప్పుడును అన్నము పవిత్రముగాను ఉష్ణముగాను ఉండునట్లు చూచి ఆ విషయమును వర్ణించుచు భోక్తలచే భుజింపజేయవలెను. త్వరపెట్టుట కాని క్రోధము కాని లేకుండ హరినామ స్మరణ చేయుచు భోక్తలను భుజింపజేయవలెను.

వారు భుజించి తృప్తినొందినట్లు తెలిసిన తరువాత వికిరాన్నమును వారి దగ్గర (సమంత్ర కముగా) ఉంచవలెను. ఉదకముతో కూడ అన్నము తీసికొని నీటిని మాత్రము భూమిపై వదలవలెను. వారు (భుజించి హస్తములు పాదములు కడుగుకొని) ఆచమించిన తరువాత మరల జలముతో కూడిన పుష్పములను అక్షతోదకమును వారి హస్తములందు వదలవలెను.

ఈ స్వస్తి వాచనికము (శుభమును కలిగించుటకై చేయు ప్రక్రియ) అంతయు పిండముల మీద చేయవలెను. శ్రాద్ధ ప్రక్రియ అంతయు విశ్వేదేవులతో ఆరంభించి వారితోనే ముగియునట్లు జరుపవలెను. లేనిచో శ్రాద్ధ నాశము జరుగును. భోక్తలగు బ్రాహ్మణులకు వీడ్కోలు చెప్పవలెను. వారికి ప్రదక్షిణము చేయవలెను. తరువాత దక్షిణ దిశగా తిరిగి పితృ దేవతలను ఉద్దేశించి ఇట్లు వేడుకొనవలెను. “(తమంతట తామే ఇచ్చు) మా దాతలు వృద్ధినొందుదురు గాక! మా వేద సంతతి (పరంపర) వర్ధిల్లుగాక! మా చిత్తములందు శ్రద్ధ (ఆస్తికతా బుద్ధి) తొలగక నిలిచి యుండుగాక! మేము అధికముగా దానము చేయుదుము గాక! మాకు అన్నము అధికముగా లభించుగాక! (మా ఆతిథ్యము అందు కొనుటకు) అతిథులును మాకు లభింతురుగాక! మమ్ములను యాచించువారు (చాల మంది) ఉందురుగాక! మేము ఎవ్వరిని యాచింపకుందుముగాక! అయాచితముగా వచ్చిన దానితో తృప్తి నొందెదము గాక!) ఇది అన్వాహార్య పూర్వకమగు పార్వణ శ్రాద్ధ విధానము. ఈ ప్రక్రియ అమావాస్య నాడు జరుపవలసిన శ్రాద్ధమునకు సంబంధిం చినది. ఇతర పర్వ దినములందును పార్వణ శ్రాద్ధము ఇట్లే జరుపవలెను.

శ్రాద్ధము అంతయు ముగిసిన తరువాత పిండములను గోవులకో మేకలకో బ్రాహ్మణు లకో తినుటకు ఈయవలెను. లేదా అగ్నిలోనో నీటిలోనో వేయవలెను. బ్రాహ్మణుల ముందయి నను వెదజల్లవలెను. పక్షులకైన ఆహారముగా వేయవలెను. శ్రాద్ధ కర్తయొక్క భార్య మాత్రము నడిమి పిండమును వినయముతో తినవలెను. తినునప్పుడు “ఓ పితృ దేవతలారా! నా గర్భమున పద్మ మాలికల ధరించు కుమారుని కలుగజేయుడు.” భోక్తలగు బ్రాహ్మణులకు వీడ్కోలు చెప్పి పంపువరకు ఉచ్ఛేషణమును (ఎంగిళ్ళను) ఉంచవలెను. (తరువాత అది తీసి శుద్ధి చేయవచ్చును.)

ఇట్లు పితృ కార్యము ముగిసిన తరువాత వైశ్వ దేవమును జరుపవలెను. తరువాత కర్త తన ఇష్టులతోకలిసి పితృ శేషమును భుజించవలెను. శ్రాద్ధ దినమున శ్రాద్ధకర్తగాని శ్రాద్ధమున భోక్తగా ఉండువారు కాని ఈ చెప్పబోవు వానిని చేయరాదు: మరల భోజనము చేయుట-దారి ప్రయాణము చేయుట-వాహనములపై పయనించుట-శ్రమ కలిగించు పనులు -స్త్రీ సంగమము- స్వాధ్యాయము-కలహము-విరోధపు పనులు-పగటి నిద్ర-ఇవి చేయకూడదు.

ప్రత్యాబ్దిక శ్రాద్ధమును కూడ ఇదే విధముగా జరుపవలెను. సూర్యుడు కన్యా కుంభ వృషభ రాసులలో ఉండగాను ఏ కృష్ణ పక్షమునందే కాని సపిండీకరణము జరుపు సందర్భము లందు కాని అగ్నిమంతుడు అగువాడు (సన్యాసి కాక మిగిలిన ఆశ్రమములవారు) ఇట్లే శ్రాద్ధము జరుపవలెను.