అనంగ శయన వ్రతము

బ్రహ్మదేవుడు ఈశ్వరు నిట్లడిగెను. భగవన్! (వైదిక) పురాణములయందు చెప్పబడి యున్న వర్ణాశ్రమముల ఉత్పత్తిని ధర్మశాస్త్రముల యందలి ఆచార నిర్ణయములను సదాచారములను కూడ వింటిని. పుణ్య స్త్రీలు పాటించవలసిన సదాచారమును పతివ్రతల సదాచారమును వినగోరుచున్నాను. నాకు వానిని తెలుపుము.

ఈశ్వరుడు అతనికి ఇట్లు చెప్పెను, ముందు రాబోవు యుగమున శ్రీకృష్ణునకు పదునారు వేల మంది భార్యలగుదురు. ఆ కాలమున ఒకానొక వసంతర్తువునందు కోయిలల తుమ్మెదల గుంపులు దట్టమయి ధ్వనులు చేయుచుండ పూచిన ఉద్యానముల నడుమ వికసించిన ఎర్ర కలువలతో నిండిన సరస్సు ఒడ్డున ఉన్న శ్రీకృష్ణ భార్యల పదునారువేల మందికి సమీపముగా కృష్ణ కుమారుడుసాంబుడు పోవుట జరుగును. అతడు లేడికన్నులవంటి చంచలములు మనోహర ములునగు కన్నులు కలవాడు; మాలతీ పుష్పములతో కేశపాశము నలంకరించుకొనినవాడు. మద్యపాన గోష్ఠులయందు దట్టముగా మునిగియున్న స్త్రీలు ఆతని చుట్టు పరివేష్టించి యుండి ఆతని నలంకరించి యుందురు. అతడును సర్వాభరణములతో అలంకరించబడి సాక్షాత్ మన్మథునివలె నుండును. అతనిని శ్రీకృష్ణపత్నులందరును మన్మథబాణ తాపముచే వాంఛా పూర్వకముగా చూతురు. వారి మనస్సులందు కామ మధికమగుటను భగవానుడు జ్ఞాననేత్రముతో చూచి “నేను లేనిచోట మీరు కామముచే ఇట్లు ఆచరించితిరి కావున మిమ్ము దోపిడిగాండ్రు హరింతురు” అని శపించును.

శాపముచే అభితాపము చెంది వారందరును సర్వభూతముల సృజించి పోషించువాడు శారధారియగు కృష్ణ భగవానుని వేడికొని అనుగ్రహింప జేసికొందురు. “మీరు ఈ శాపమునుండి తరించుటకు మీకు దాసీత్వము ప్రాప్తించును. నేను రాబోవు పనులు ఏవి ఎట్లు జరుగనున్నవో అట్లు చేయువాడను. ఇకముందు దాల్బ్యుడు అను బ్రాహ్మణుడు మీకు ప్రీతికరమగు వ్రతమును దేని నుపదేశించునో దాని నాచరించుడు. అది మిమ్ములను మీ దాసీత్వమునుండి తరింపజేయ గలుగును.” అనిప్రీతితో భగవానుడు వారికి ఉపదేశించి వారిని విడిచి అంతర్ధానము నందును.

తరువాత చాలాకాలమునకు శ్రీకృష్ణ భగవానుడు భూభారావతారణము చేసి మౌసల (ఇనుపరోకలి పొడినుండి ఉత్పన్నమైన తుంగదుబ్బులతో యాదవులు పరస్పరము చేసికొనిన) యుద్ధమునకు తరువాత తానును వైకుంఠము చేరును. యదుకులమున వీరులు లేకపోగా అర్జునుని జయించి దోపిడిగాండ్రు కృష్ణపత్నుల నపహరించి దాసీత్వమునకు పాలుపరతురు. వారు దుఃఖముచేతను దురదృష్టముచేతను సంతాపము చెంది సముద్ర తీరమున నుండగా యోగాత్ముడగు దాల్యుడను మహాతపస్వి అచ్చటకు వచ్చును. వారతనిని అర్ఘ్యపాద్యాదులతో పూజించి పునః పునర్నమస్కారములు అర్పింతురు. బాష్ప వ్యాప్తములయిన కన్నులతో వారనేక విధములుగా ఏడ్చుచు (తా మదివరకు అనుభవించిన) దివ్య భోగములను దివ్య మాల్యను గంధాను లేపనములను లోకేశుడు అనంతుడు పరాజయము నెరుగనివాడు నగు తమ పతిని దివ్య లక్షణములుగల తమ ద్వారకాపురిని అచటి నానా రత్న గృహములను దేవ సదృశులై యుండి అప్పుడు దేవత్వమునుపొందిన ద్వారకావాసులగు కుమారకులను తలచుచు దుఃఖించుచు ఆ ముని కెదురుగా నిలిచి ఇట్లు ప్రశ్నింతురు.

“భగవన్! మేమందరమును దస్యులచే బలాత్కారమున అనుభవించబడితిమి. మాకు కలిగిన ఈధర్మ భ్రంశములో మీరే మారు దిక్కు అగుదురని పూర్వమే శ్రీకృష్ణభగవానుడు మాకు ఆదేశించియున్నాడు. భగవానునకు పత్నులమగు మేము వేశ్యాత్వమును పొందుటకేమి హేతువు? తపోధనా! వేశ్యలకు ఆచరణీయమగు ధర్మమేదియో మాకు తెలుపుము” అని అడుగగా ఆశ్చర్యచకితమయిన ముఖముతో చాల్యుడు వారితో నిట్లనును, “పూర్వము మీరందరును అగ్ని పుత్రికలగు అప్సరసలుగా ఉంటిరి. ఒకప్పుడు మీరు మానస సరస్సున జలక్రీడా విహారము లందుండగా నారదుడు మీకడకు వచ్చెను. మీరు గర్వముచే అతనిని నమస్కరించకయే ‘మాకు నారాయణుడు పతియగు ఉపాయము ఏమ’ని అడిగితిరి. మధు (చైత్ర) మాధవ (వైశాఖ) మాసము లందు బంగారు అలంకరణములతో సర్వ పరికరములతో మంచములను పడకలను (ఒక్కొక్క మాసమునందొక్కొక్కటిగా) ఉపవాస సహితమగు వ్రతాచరణముతో దానము చేసినచో నారాయణుడు పతియగునని ఉపదేశించి ఆముని రూప సౌభాగ్య గర్వముచే నన్ను నమస్క రింపకయే ఈ విషయము అడిగితిరి కావున మీకు నారాయణునితో వియోగము శీఘ్రకాలము లోనే కలుగును. చోరులచే అపహరింపబడి మీరు వేశ్యాత్వమును పొందుదురు అని శపించును. ఇట్లు నారద శ్రీకృష్ణుల శాపముచే మీరు కామమోహితులయి వేశ్యాత్యమును పొందితిరి. ఉత్తమ స్త్రీలారా! నేనిపుడు చెప్పునది వినుడు.

పూర్వము దేవాసుర యుద్ధములందు దేవతల చేతులలో వందలకొలదిగా దానవులు అసురులు దైత్యులు రాక్షసులు మరణించిరి. వారి స్త్రీలు వేలకొలదిమంది వీరిచే హరించబడి బలాత్కారమున పెండ్లాడబడుటయో అనుభవించబడుటయో జరిగెను. వారితో పురుషోత్తముడగు దేవేంద్రు డిట్లనెను-మీరికమీదట (భూలోకమున) రాజమందిరములందును దేవమందిరము లందును భక్తిమతులై వేశ్యా ధర్మముతో నుండుడు. (అచటి) రాజులే మీకు యజమానులగుదురు. వారికి వచ్చిన అశౌచములు మొదలగునవి మీకును వర్తించును. మీకందరకును యోగ్యతానుసారము సౌభాగ్యము (ఐదువతనము) ఉండును. కపటి కాని ఎవడు శుల్కము (వెల) తీసికొని మీకడకు వచ్చినను అతనికి మీరు కపటము లేకుండ ఉపచారము చేయవలయును. పుణ్యదినము లందు దేవతలకును బ్రాహ్మణులకును గో భూ-హిరణ్య-దానములు చేయవలయును. బ్రాహ్మణు లకు మీచేతనైన కార్యములు (నృత్యము- సంగీతము మొదలగునవి) చేయవలయును. ఇదికాక నేను మీకొక వ్రతము నుపదేశింతును. దానిని మీరు ఏమాత్రమును వెనుకముందులు విచారించక అనుష్ఠించవలయును. దానిచే మీరు సంసారమును తరింతురు. ఆదిత్యవారమున హస్త పుష్య పునర్వసులలో నేదైన నక్షత్రముండగా (మీజాతి వారు) సర్వౌషధులతో స్నానమాడి మన్మథునిసన్ని ధానము (ప్రతిమా ప్రతిష్ఠాపనము) ఏర్పరచుకొని మన్మథ నామములతో విష్ణు నర్చించవలయును.

గదాధరుడు-పీతవస్త్రుడు-శంఖచక్రధరుడు-మన్మథాత్ముడునగు నారాయణునకు నమ స్కారము. శాంతి-ప్రీతి-రతి-పుష్టి - తుష్టి- సర్వార్థసంపద్ రూపయగు లక్ష్మికి నమస్కారము.

ఇట్లు మన్మథాత్మకుడు ఈశ్వరుడగు గోవిందుని గంధమాల్య ధూపదీప నైవేద్యములతో ఈ స్త్రీలు పూజించవలెను. తరువాత ఆమె ధర్మజ్ఞుడు వేదపారంగతుడు అంగవైకల్యములేనివాడు నగు బ్రాహ్మణుని పిలిపించి గంధ దీపాద్యర్చనలతో అతనిని పూజించి కుంచెడు మంచి రాజనాల వరి బియ్యమును నేతితోడి పాత్రను ‘మన్మథః ప్రీయతామ్’ అనెడు మంత్రముతో దానముచేసి ఈ పదార్థములు మీయథేష్ట భోజనమునకు సరిపోవుగాక! యని భక్తితో పలుకవలెను. రతీదేవికి ఆనందము కలిగించు మన్మథుడే ఈ బ్రాహ్మణుడని భావన చేయుచు ఈ విలాసిని ఆ విప్రుని మనస్సునకు ప్రీతికరముగా అతడు కోరినట్లు సర్వభావముతో ఆత్మార్పణముచే నృత్య గీతాది విలాసములతో అతనిని సంతోషపెట్టవలయును. ఇట్లు ప్రతి ఆదివారమునాడును పడుమూడు మాసములు విడువక వ్రతము చేయవలయును.

పదుమూడవ మాసమున బ్రాహ్మణ దంపతులను బంగారు గొలుసులు యజ్ఞోపవీతము ఉంగరములు కడియములు మురుగులు సన్నని వస్త్రములు గంధమాల్యానులేపనములు- ఇట్టివానితో అలంకరించి వారికి దానము చేయవలెను. వారికి అన్ని పరికరములతో కూడిన మంచము-దిండు-పరపు-పరపుపై కప్పు దుప్పటి - ఆనుకొనుదిండు-ప్రదీపము-చెప్పులు- గొడుగు-పాదుకలు-పీట-ఇట్టి వన్నియు చేర్చిన విలక్షణమయిన శయ్యను దానము చేయవలెను. ఒక కడవలో బెల్లము నింపి దానిపై తామ్ర పాత్ర నిలుపవలెను. దానిపై ఆసనము నమర్చి దానిపై రతీ మన్మథుల (బంగారు) ప్రతిమలను బంగారు సరిగగల వస్త్రములు కట్టిన వానిని ఉంచవలెను. కంచు పాత్రను చెరకుగడనుకూడ వాటితోపాటు చేర్చి పాడి ఆవును దానితో లు అవి అన్నియు కూడ ఆ విప్రదంపతులకు దానమీయవలెను.

దాన మంత్రమునకు అర్థము ఏమనగా, మన్మథ విష్ణువుల నడుమ నేను అభేదము భావించుచు (నారాయణుని) సేవించుచున్నాను కావున నారాయణా! నాకు అన్ని కోరికలు నెరవేరుగాక! కేశవా! నీ దేహమునుండి నీకామిని (లక్ష్మి) వేరుకానట్లే నాకును అన్ని కోరికలును (కామములు) తీరుగాక! ఈదానమును ప్రతిగ్రహించువాడును దానఫలమును ఇచ్చువాడును మన్మథుడే. విప్రా! దానము గ్రహించు నిన్నును ఇచ్చు నన్నును తరింపజేయువాడును మన్మథుడే. అట్టి మన్మథునకు నమస్కారము. (ఇచట కామో దాతా-ఇత్యాది వేదమంత్రమును చెప్పవలెను.)

తరువాత ఆ విప్రదంపతులను ప్రదక్షిణించి వారిని వారి గృహమునకు పంపి పిమ్మట ఈదానమిచ్చిన వన్నియు వారిఇంటికి చేర్చవలెను. అదిమొదలు తమ ఆనందమునకై తమ ఇంటికి ఎవరు వత్తురో వారిని ఉపచారములతో ఆనందపరచవలెను.

లోగడ చెప్పిన పదుమూడు మాసముల క్రమములోను ఒక బ్రాహ్మణుని మాత్రమే అర్చించవలెను. ఒకవేళ అతడు ఆనడుమ దేశాంతరము పోయినచో అతని అనుమతితో మరియొక బ్రాహ్మణుని అర్చించవచ్చును. తాను గర్భవతి యగుట-తనకు పురుడువచ్చుట-తన రాజునకు అశౌచమువచ్చుట-ఇతరములగు దైవిక హేతువులు-మానుషములైన హేతువులు-గ్రహణములు-వ్యతీపాతము మొదలగు దోషములు-వీనిచే వ్రతమున విఘ్నము సంభవించినను ఎనిమిది- ఐదు-ఎనిమిది ఈ క్రమమున (8+5=13) మొత్తము పదుమూడు మాసములగునట్లు కొన్ని సంవత్సరముల పాటు ఈ వ్రతమును ఆమె చేయుచుండవలెను. ఏ విఘ్నము వచ్చినను (బ్రాహ్మణుని (మన్మథ) దేవుని యథాశక్తిగా అర్చించుచునే యుండవలెను.