కాలనేమి విష్ణుని గెలువదలచి పోవుట

శ్రీమత్స్యుడు మనువుతో ఇంకను ఇట్లు చెప్పెను. కాలనేమి ఆచరించు ఈ విరుద్ధ కర్మాచరణమునకు భయపడి అతనిని సేవించుటకై అతని కొలువునకు పోక అతనివైపు తిరుగనైన తిరుగక ఉండినవి ఐదు తత్త్వములు మాత్రముండెను. అవి 1. వేదము; 2. ధర్మము; 3. క్షమ; 4. సత్యము; 5. శ్రీ (సర్వకామపూర్ణతా సిద్ధమగు సచ్చిదానందతా లక్షణము) ఈ ఐదును తన్ను సేవింపరానందున ఆ దానవేశ్వరుడు సక్రోధుడై విష్ణు స్థానమును వెదకుకొనుచు (పోయి పోయి) నారాయణుని కడకు పోయెను. అతనికి అచట నారాయణుడు కనబడెను. అతడు (ప్రణవ - రూపుడగు) గరుడుని (సర్వవార్తత్త్వ మూలరూపుని) అధిష్ఠించియుండెను. శంఖచక్ర గదాధరుడు - దానవుల వినాశమునకై శుభరూపయగు గదను త్రిప్పుచున్నవాడు - సజల మేఘ సమానుడు - మెరుపువంటి వస్త్రము దాల్చినవాడు  - బంగరు రెక్కలును శిఖయు కలిగి కశ్యప (వినతా) పుత్రుడగు పక్షియైన గరుడుని చక్కగా ఆరోహించినవాడు; దైత్య వినాశమునకై నెమ్మదితో కూర్చున్నట్లు కనబడుచు ఎవరికిని కలవరపరచ నలవికాక రణరంగమునందు ఉన్న విష్ణుని ఉద్దేశించి (సర్వ తత్త్వములను తన వశము చేసికొనవలెనని) లుబ్దమానసుడగు ఆ దానవుడు ఇట్లు పలికెను: మా పూర్వులకు ప్రాణనాశకుడగు శత్రువు ఇతడే; సముద్రమునందు వసించు అసురులను - మధుని - కైటభుని - కూడ చంపినవాడు ఇతడే; మా (దానవులకు) అణచనలవికానిదై (మూర్తీభవించిన) కలహము ఇతడే; (ఇతని మూలముననే మాకు సదా దేవతలతోడి యుద్ధములు సంభవించుచున్నవి;) అని మావారు చెప్పుచున్నారు; ఇతనిచే యుద్ధములందు దానవు లనేకులు హతులయిరి. ఇతడు స్త్రీల విషయమునను బాలుర విషయమునను దయలేక ఆస్త్రీల భర్తలను చంపెను; ఆ బాలుర తండ్రులను చంపెను; కాని ఆ తప్పునకై సిగ్గుపడుటలేదు, ఇతడే దానవ నారులు పాపటలు తొలగించినవాడు; దేవతలకు విష్ణువును స్వర్గవాసులకు వైకుంఠుడును ఇతడే; నాగులలో అనంతుడును (శ్రేష్ఠుడును  -  సర్వజీవ జ్ఞాన కర్మాత్మకములగు ) జలములందు నిదురించువాడును స్వయం భూబ్రహ్మకు కూడ మొదటివాడును ఇతడే; మాచేతులలో వ్యథ పరచబడిన మనస్సులుగల దేవతలకు రక్షకు డితడే; ఇతని క్రోధమునకు పాత్రుడయియే హిరణ్యకశిపుడు చంపబడెను, ఇతని నీడ నాశ్రయించియే దేవతలు యజ్ఞారంభములందు నిలుచుచున్నారు, మహర్షులచే ప్రాతర్మధ్యాహ్న సాయం సవనములందు మూడు విధములుగా హవనము చేయబడిన ఆజ్యమును వారు గ్రహించి అనుభవింపగలుగుచున్నారు, దేవ శత్రువులకు అందరకు మరణ హేతుభూతు డీతడే కదా! దేవతల నిమిత్తమయి యుద్ధములందు ప్రాణత్యాగమునకైన సిద్ధపడి సూర్య సమాన తేజోవంతమగు చక్రము ప్రయోగించువాడితడే కదా! దైత్యులకు కాలయముడై యుండు కాలాత్మకుడు ఈతడే కదా! ఈ కేశవుడు గడచిన కాలమున చేసిన తన పనులకు ఫలమనుభవించును లెమ్ము.

నా అదృష్టముకొలదిని ఈ విష్ణువు ఇప్పుడు నా ఎదుటనున్నాడు. ఇపుడు నా భుజము లనడుమ నలిగిపోయి ఇతడే నన్నే నమస్కరించును. నా అదృష్టవశమున ఇపుడు యుద్ధమున దానవ భయావహుడగు ఈ నారాయణుని చంపి నా పూర్వులకు పూజ జరిపెదను. తరువాత శీఘ్రముగా సురగణములను చంపెదను. మాకు పరజాతివారుగు దేవతల పక్ష మవలంబించి ఇతడు దానవులను యుద్ధమున బాధపెట్టుచున్నాడు. ఇతడు అనంతుడుగా పూర్వముండుచునే తన నాభియందు జన్మించిన పద్మమువలన పద్మనాభుడని ప్రసిద్ధినొంది ఆ సమయమందే ఘోరమగు ఏకార్ణవమున మధుకైటభులను సంహరించెను. పూర్వము సగము నరుడుగ సగము సింహముగా రెండువిధములగు దేహము ధరించి మాతండ్రియగు హిరణ్యకశిపుని సంహరించెను. దేవతలనెడు అగ్నికి అరణియగు అదితి ఇతనిని తన శుభగర్భముగా ధరించి కనెను. అపుడతడు మూడడుగులతో ముందునకు అడుగులు వేయుచు తానొక్కడే మూడు లోకములను హరించెను. మరల ఇపుడుగూడ ఈతారకామయ సంగ్రామము తటస్థించినది. దీనిలో నితడు నాతో తారసిల్లు చున్నాడు ఇప్పుడీ దేవుడు నశించి తీరును. ఇట్లా రణరంగమునందు నారాయణుని సాటిలేని అనరాని మాటలతో బహువిధములుగా అతనితో యుద్ధముచేయుటకు ఇష్టపడెను. అసురేంద్రుడు తన్ను తిట్టుచున్నను అగదాధరుడు కోపించలేదు. మహాక్షమాబలముతో ఉండి చిరునవ్వుతో ఇట్లు పలికెను: దైత్యా! దర్పముతో కూడిన బలము అల్పమయినది, ఆ క్రోధముచే (క్షమచే) సిద్ధించిన బలము స్థిరమయినది; నీవు క్షమను విడిచి మాటలాడుచున్నావు కావున నీదర్పము వలన కలిగిన దోషములతో నీవు తప్పక చత్తువు; నీవు ధీరుడవుకావని నాకు తోచుచున్నది; ఛీ! నీవాగ్బలము పనికిమాలినది; దైత్యా! నీవును నీపూర్వుల మార్గమునే యనుసరింతువని నాకు కనబడుచున్నది, ప్రజాపతి ఏర్పరచిన ధర్మ సేతువును భేదించిన వాడెవ్వడు శుభము పొందును? దేవతల ప్రవృత్తులనే భంగపరచుచున్న నిన్నిపుడే చంపుదును. దేవతలను వారివారి స్థానములందు నిలుపుదును.

శ్రీవత్సధారియగు విష్ణువు ఆ రణరంగమందు ఇట్లు పలుకుచుండగనే దానవుడు క్రోధముతో నవ్వెను; తన అన్ని హస్తములతోను ఆయుధములు గ్రహించెను. వాడు సాయుధము లగు తననూరు భుజములను పైకెత్తి క్రోధముతో రెండింతలుగ కన్నులెర్రజేయుచు విష్ణుని రొమ్మున కొట్టెను. మయతారాది దానవులును తమతమ సర్వాయుధములనో ఉద్యక్తులై కొట్టుచున్నను కదలని కొండవలెనే విష్ణువు చలించకుండెను. కాలనేమి మహాసురుడు గరుడునిపై తలపడి తన పూర్ణ బలముతో ఘోరమును మండు (ప్రకాశించుచున్నదియు పెద్దదియు అగు గదను భుజములతో ఎత్తి క్రుద్ధుడగుచు గరుడునిపై విడిచెను. దైత్యుని ఈపని నారాయణునకు ఆశ్చర్యము కలిగించెను. గరుడుని తలపై ఆగద పడగనే అతడు బాధను పొందుటయు తన శరీరము కూడ గాయపడుటయు చూచుకొని వైకుంఠుడు క్రోధరక్త లోచనుడై చక్రము పూనెను; గరుడుడు (త్సాహమున) వృద్ధినందగా అతనితోపాటు ఆప్రభుడు తానును వృద్ధినందెను.

అతని భుజములు దశదిశలనిండ వ్యాపించుచు, వృద్ధినందెను. ప్రదిశలను దిశలను భూమ్యంతరిక్షములను కూడ కేశవుడు తనమూర్తితో నింపివేసెను. మరల ఒక మారు లోకములను తన తేజస్సుతో ఆక్రమింపగోరువాడువలె అతడు వృద్ధినందెను. అసురేంద్రుల భయపెట్టుటకై వర్ధిల్లుచున్న మధుసూదనుని చూచి అంతరిక్షమందుండి ఋషులును గంధర్వులును అతనిని స్తుతించిరి. శ్రీధరుడు గదాధరుడునగు నారాయణుడు తన పాదములతో భూమినాక్రమించి బాహువులతో దిక్కు లాక్రమించి సూర్యకిరణసమతేజోవంతమును, వేయి అరలు కలదియు, శత్రునాశకమును, దీప్తాగ్ని సమానమును, ఘోరమును అయిన చూచుటకు ఇంపుగొలుపు చుండుటచే సుదర్శనమను పేరుకలదియు, తన అంచులందు బంగారు రేణువుల పూతకలదియు నాభియందు (నడుమ భాగమునందు) వజ్రముకలదియు భయజనకమును దానవుల నుండి కలిగిన మేదస్సు (మెదడు కాదు)ఎముకలు మజ్జ రక్తము -  వీటితో తడిసినదియు ఆయుధములలో సాటిలేనిదియు వాడియగు అంచులతో ఏర్పడిన మండలాకారము కలదియు పూలదండల మాలికలతో వ్యాప్తమును (నారాయణుని) సంకల్పానుసారము పోవునదియు కామరూపమును స్వయంభూబ్రహ్మ స్వయముగా సృష్టించినదియు సర్వదేశశత్రువులకును భయప్రదమును మహర్షుల రోషమును ప్రవేశించినదియు సర్వదా దేవదానవ యుద్దములందు విజృంభించు నదియు తను విసరినంత మాత్రమున స్థావర చర భూతములకు బుద్ధిమోహము కలిగించునదియు మహాయుద్ధములందు మాంసాహారి ప్రాణులకును భూతములకును తృప్తి కలిగించు నదియు సాటిలేని పనులు నెరవేర్చునదియు సూర్యసమాన వర్చశ్శాలియు అగు చక్రమునెత్తి తన తేజముతోనే భయంకరములును అగ్నితో నిండినవై మండుచున్నట్లు అట్టహాసము చేయుచున్నవియు అగు ఆదానవుని నూరుముఖములను శిరములను నరకెన, కాని తలలును భుజములును తెగినను ఆ దానవుడు చలించలేదు. కొమ్మలు తెగిన చెట్టువలె వాని మొండెముట్లే యుండెను. అంతట గరుడుడు వాయుసమాన వేగముతో వచ్చి తన మహాపక్షములను విప్పి వచ్చి తన వక్షముతో కాలనేమిని పడగొట్టెను. బాహువులును ముఖములును లేనివాని శరీరము అపుడు అంతరిక్షమును విడిచి భూతలమును కలవరపెట్టుచు నేలబడెను. ఆదైత్యుడు పడగానే దేవతలును, ఋషులును “సాధు సాధు” అనుచు ఒక్కుమ్మడిగా వైకుంఠుని తమ వాక్కులతో పొగడి పూజించిరి.

అంతవరకును యుద్ధమున తమతమ పరాక్రమము చూపిన దైత్యులు అందరును నారాయణుని బాహువులు తమపై క్రమ్ముకొనగా రణమున కదలనైన లేకపోయిరి. విష్ణువు కొందరను జుట్టుపట్టియు మరికొందరను చెవులు పట్టియు బాధించెను. ఒకని ముఖమును నరకెను. ఇంకొకని నడుము పట్టివేసెను. ఇట్లు వారందరును చక్రముతోను గదతోను నిర్దగ్ధులయి బలము తరిగి ప్రాణములు పోయి గగనము నుండి తమ దేహములు జారిపోగా ధరణీతలముపై పడిరి. ఇట్లా దైత్యులందరును హతులుకాగా గదాధరుడగు పురుషోత్తముడు ఇంద్ర ప్రీతి కలిగించి కృతకృత్యుడై (తన పని తానుచేసి) రణరంగమున నిలిచెను.

ఇట్లు ఆ తారకామయమను యుద్ధము ముగియగానే లోక పితామహుడగు బ్రహ్మ బ్రహ్మర్షి గంధర్వాప్సరో గణములతో కూడ అచటికి వచ్చెను. అతడు ఆ దేవదేవుడగు హరిని నుతించుచు ఈ వాక్యము పలికెను. దేవా! ఈ దానవ వధతో నీవు మహాకార్యము నెరవేర్చితివి. దేవతల హృదయము నుండి శల్యము పెకలించినట్లయినది. మేమును సంతసించి తిమి. నీవు చంపిన ఈకాలనేమిని చంపగలవాడు నీవుతప్ప మరిఎవ్వరును లేరు. వీడు సకలచరాచర లోకములను అవమానపరచుచు బాధించుచు ఎవరిని లెక్కపెట్టక ఋషులకు నాశమును వ్యథను కలిగించి నామీద కూడ విజృంభించి గర్జించుచున్నాడు. వాడు అట్టివాడు కావునను నీవు అంతటి వానిని చంపితివి కావునను నీవు చేసిన మహా కార్యముతో నేను పరితుష్టి చెందినాను. కాల పురుషునితోను సమానుడగు కాలనేమి మరణించినాడు; కావున మనమిక ఉత్తమమగు ద్యులోకమునకు పోవుదము; లోకక్షేమమునకు గాను నీకును శుభమగుగాక! పూజ్యుడగు భగవన్! అచ్చట ద్యులోకమునందు (అందునను బ్రహ్మలోకమున) సదస్సు (మునులు ఋషులు) మొదలగువారు సమావిష్ణులగు తావు) నందు ఉన్న బ్రహ్మర్షులు నీకై వేచియున్నారు. మరియు ఒకవిషయము; వరములను కోరువారలలో ఉత్తముడవు నీవు; ఏలయన నీవు వామనావతారము నందు వలె ఎవరినైన ఏదయిన వేడినను లోకకళ్యాణము కొరకే యాచింతువు. దేవతలకును దానవులకును వరముల నిచ్చువాడవుకూడ నీవే; ఇట్టి నీకు నేను కూడ వరమీయ దలచియు ఏమీయగలను? ఇపుడిట్లు నిష్కంటకమయి సర్వ సంపత్సమృద్ధమగు ఈ త్ర్యైలోక్యమును సుమహాత్ముడగు ఇంద్రునకు ఈ యుద్ధరంగ మందే అప్పగించుము అని ఇట్లు భగవానుడగు బ్రహ్మపలుకగా అవ్యయుడగు హరి ఇంద్రాది దేవతల నందరను ఉద్దేశించి శుభ వాక్కుతో ఇట్లు పలికెను.

ఇచ్చట కూడియున్న సర్వదేవతలారా! ఇంద్రుడు ప్రధానుడుగా మీరందరును వినుటకు అవహితములగు చెవులతో సరిగ వినుడు. మేము కాలనేమి ప్రభృతి దానవుల నందరను సంహరించితిమి. వారందరును విక్రమవంతులును ఇంద్రునికంటె గొప్పవారును, ఈ మహా సంగ్రామమందు తప్పించుకొనినవారు దైత్యేశుడగు విరోచనుడును మహాబలుడగు స్వర్భానుడు (రాహువు)ను ఈ ఇద్దరు మాత్రమే; ఇంద్ర యమ వరుణ కుబేరులు తమతమ దిక్కులకు పోయి వానిని పాలింతురుగాక! నక్షత్రముల అమరికతో కూడి చంద్రుడును పోయి యథాకాల యోగముగ వానితో వర్తిల్లుగాక! సూర్యుడు ఋతువులతో ఆరంభించుచు అయనములతో కూడ సంవత్సరము నాశ్రయించియుండుగాక! (మూర్తుడగు రవికి అమూర్తమగు సంవత్సరమును దాని అవయవములగు కాలపరిమాణ విశేషములును ఆత్మ - తదంశ భూత - తత్త్వములు) సదస్సులు (యజ్ఞశాల యందలి ఋత్విక్కులు) మంత్రములతో అభిపూజించి వేల్చు హవిస్సులు ఎప్పటివలె ప్రవర్తిల్లుగాక! వేదమునందు కనబడు విహితకర్మ విధానానుసారము విప్రులు అగ్నులందు వేల్తురుగాక! దేవతలు బలి హోమములతో ఋషులు స్వాధ్యాయముతో పితరులు శ్రాద్ధముతో యథాసుఖముగా నుండి తృప్తినందుదురుగాక! వాయువు తన సప్తమార్గము లందు నిలిచి ప్రవర్తించుగాక! తనకు స్వాభావికములగు సత్త్వరజస్తమోగునత్రయముతో కూడి వానికి ప్రతీకములగు శుక్ల రక్త కృష్ణ వర్ణత్రయముతో కూడి వెలుగుచు అగ్ని ఆ మూడు వర్ణములను మూడు లోకములను కూడ తృప్తి నందించుగాక! దీక్షణీయులగు (యజ్ఞములందు ఋత్విక్కులు గాను, యజమానులుగాను, దీక్షాగ్రహణమున కధికారులయి యుండి, ఆ అధికారమునకు తగినట్లు దీక్ష వహించి, యజ్ఞముల ప్రవర్తిల్లజేయు) ద్విజాతులు క్రతువులను ప్రవర్తిల్ల జేయుదురు గాక! యజ్ఞములందు యాజ్ఞికులకు వేరువేరుగా శ్రౌత శాస్త్రమునందు నిర్ణయించినట్లు ఆయా దక్షిణలును లభించుచుండుగాక! (ఏలయన సద్ర్బాహ్మణ గృహస్థులకుగల జీవన వృత్తులలో ముఖ్యమయినది యాజనము - ఆది వారికి లభించనిచో వారి జీవనము ప్రతిబద్ధమగును. (రవి గోవులను (ఆవుల వంటి పశువులు - గ్రహములు - తేజఃకిరణములు - వేదాత్మక వాక్కు  -  ఇవి యన్నియు గోశబ్దమునకు అర్థముగా ఇచట చెప్పుకొనవలయును.) చంద్రుడు రసద్రవ్యములను వాయువు ప్రాణుల ప్రాణములను తమతమ విషయమునందు వేదములచే చెప్పబడిన మంత్రార్థానుసారము ప్రవర్తిల్లు సుకర్మములకు ఫలరూపముగా తృప్తినందింతురుగాక! మహేంద్ర మలయాది పర్వతముల నుండి ప్రభవించిన త్రైలోక్య మాతృమూర్తులగు నదులన్నియు ఎప్పటివలె తమతమ క్రమముతో సముద్రమునకు పోవుగాక! దేవతలారా! మీరు దైత్యులనుండి భయములేక యుండుడు; శాంతి పొందుడు, మీకందరకును శుభమగుగాక! సనాతమగు శాశ్వతమగు బ్రహ్మ లోకమునకు పోవుచున్నాను; పోయివత్తును, ఒక ముఖ్య విషయము చెప్పుచున్నాను; స్వగృహమందే కానిండు, స్వర్గలోకమందే కానిండు, విశేషించి సంగ్రామ రంగమందే కానిండు, మాకు ఏమిలెమ్మను నమ్మికతో నుండగూడదు; ఏలయన దానవు ఎల్లప్పుడును క్షుద్ర స్వభావులుగా నుందురు, అవకాశము దొరకినప్పుడెల్ల - అవకాశము లభించిన ప్రతియొకచోట దెబ్బ తీయుదురు, వారు తిన్నగానుండుట స్థిరమయినది కాదు; మీరు అందరును సౌమ్యులు; ఋజు భావులు; ఇట్టి మీకు అర్జవము అనగా కపటము లేని వర్తనము ధనము; అని ఇట్లు దేవతలతో పలికి మహాయశుడును సత్య పరాక్రముడును అగు విష్ణువు బ్రహ్మతో కూడి బ్రహ్మ లోకమునకు పోయెను దానవులకును విష్ణువునకును జరిగిన తారకామయమను సంగ్రామము నందు జరిగిన ఆశ్చర్యము ఇది; నీవు నన్నడిగిన విషయము నీకు ఇట్లు తెలిపితిని.