మత్స్య మహా పురాణము
కశ్యప సంతతి
సూతుడు ఋషులతో ఇంకను ఇట్లు చెప్పెను, మరీచి పుత్రుడగు కశ్యపుని పత్నులనుండి కలిగిన పుత్ర పౌత్రాది సంతతిని ప్రవచింతును. అదితి-దితి-అరిష్ట-సురస-దనువు-సురభి-వినత-తామ్ర-క్రోధవశ-ఇళ-కద్రువ-విశ్వ-ముని అను పదుముగ్గురును కశ్యపుని పత్నులు. వీరి సంతతిని తెలిపెదను. చాక్షుషమన్వంతరమున తుషితులు అను దేవతలు వైవస్వత మన్వంతరమున అదితికి కుమారులై ఆదిత్యులనబడుదురు. ఇంద్రుడు-ధాత-త్వష్ట-మిత్రుడు-వరుణుడు-యముడు-వివస్వాన్-సవిత-పూష-అంశుమాన్-విష్ణువు-అను పండ్రెండు మంది సూర్యులే వీరు ఆదిత్యులు.
కృశాశ్వుడను ఋషికి పుత్రులు దేవగణములు దేవవిప్రులు. వీరు ప్రతిమన్వంత ఆరంభము లందును జన్మించుచు కల్ప కల్పమునందును పుట్టుచు లయించుచుందురు.
కశ్యపునకు దితియందు హిరణ్యాక్ష హిరణ్యకశిపులను ఇద్దరు కుమారులు కలిగిరి. హిరణ్య కశిపునకు ప్రహ్లాద, అనుహ్లాద, సంహ్లాద, హ్లాదులను నలుగురు కుమారులు. ప్రహ్లాదుని కొడుకులు ఆయుష్మాన్ శిబి, బాహులుడు, విరోచనుడు అనువారు. విరోచనుని కుమారుడు బలి. బలి కుమారులు నూరు మంది. వారిలో పెద్దవాడు బాణుడు. అతడు మంచి గుణములు కలవాడు. వేయిభుజములు కలవాడు. ధృతరాష్ట్రుడు, సూర్యుడు, చంద్రుడు, దుర్యోధనుడు, నికుంభుడు, నాభుడు, గుర్వక్షుడు, కుంబి, క్షీబుడు, విభీషణుడు మొదలగువారు అనేకులు అతని తమ్ములు. అతడు అన్ని అస్త్రములను ఎరిగినవాడు. తపస్సుచే శివుని మెప్పించి అతడు తన పురమునందు వసించునట్లు వరము పొందెను. బాణుడు మహాకాలత్వమును పొంది శివునితో సముడయ్యెను.
హిరణ్యాక్షునకు దుర్దురుడు, శకుని, భూతసంతాపనుడు, మహానాభుడు అను వారు కుమారులు. వీరి పుత్ర పౌత్రాది సంతతి డెబ్బది ఏడు కోట్లమంది. వీరందరు మహాకాయులు మహాబలులు నానారూపములు ధరించగలవారు. మహాశక్తి సంపన్నులు.
దనువు అను కశ్యపుని పత్నియందు బలదర్పితులగు నూరుమంది కుమారులు కలిగిరి. మహాబల సంపన్నుడగు విప్రచిత్తి వీరిలో ముఖ్యుడు. ఇంకను ద్విమూర్ధశకుని, శంబరుడు మరీచి మథనుడు, ఇరుడు, గర్గతరుడు, విద్రావణుడు, ఫేనుడు, కేతువీర్యుడు, శతహ్రదుడు, ఇంద్రజిత్, వజ్రనాభుడు, మయుడు, ఏకవక్ర్తుడు, మహాబాహుడు, అజాక్షుడు, తారకుడు, అసిలోముడు, విలోముడు, రిపుడు, బాణుడు, స్వర్భానుడు, వృషపర్వుడు మొదలగువారు దనుపుత్రులు. స్వర్భాను నకు సుప్రజా పులోమునకు శచీ-మయునకు ఉపధా-మండోదరీ కుహూ అనువారు. వృషపర్వునకు శర్మిష్ఠ-సుందరి-చంద్ర అనువారు-పులోమ-కాలక అను ఇద్దరును వైశ్వానరునికి కుమార్తెలు. వీరు ఇరువురును హితకరులు గొప్ప బలముకల వారు బహుసంతానము కలవారును; వీరు మారీచుడు అను మునికి పత్నులైరి వీరివలన మారీచునకు పౌలోములు కాలకేయులు అను రాక్షస గణము జనించెను. వీరు నరులచేత చావకుండ బ్రహ్మవలన వరము పొందిరి. హిరణ్యపురము వారి నివాసము. వారు అర్జునుని చేతిలో మరణించిరి. విప్రచిత్తికి సింహికయందు సైంహికేయుడు కొడుకయ్యెను. హిరణ్యకశిపునకు మేనల్లుళ్ళు అగు వత్సుడు, శల్యుడు, రాజేంద్రుడు, బలుడు, వాతాపి, ఇల్వలుడు, నముచి, ససర్జుడు, అశ్వాంజకుడు, నరకుడు, కాలనాభుడు, నరమాభుడు, అల్ప వీర్యుడు అను పదు ముగ్గురును దనువంశములోనివారే. వీరు దేవ గంధర్వోరగ రాక్షసులకు లొంగనివారు. వీరును బలశాలియగు అర్జునునిచేతిలో రణరంగమున మరణించిరి.
తామ్ర అనునామెకు శుకి-శ్యేని-భాసీ-సుగ్రీవా-గృధ్రికా-శుచి-అను ఆరుగురు కుమార్తెలు. శుకి-చిలుకలను, గ్రుడ్ల-గూబలను, శ్యేని-డేగలను, భాసి-కురర పక్షులను, గృధ్రి -గ్రద్దలను, పావురములను పావురపుజాతి పక్షులను కనెను. శుచి-హంసలను, బెగ్గురులను, నీరుకోళ్లను, నీరుకాకులను కనెను. సుగ్రీవ అను ఆమె మేకలను, గొఱ్ఱెలను, ఒంటెలను, గాడిదలను కనెను. ఇది తామ్రా సంతానము.
ఇక వినత సంతానమును వినుడు. పక్షులకు నాథులగు అరుణుడు (సూర్యుని రథమునకు సారథియగు అనూరుడు) గరుడుడును ఆకాశమున కనబడుచు ప్రసిద్ధురాలగు సౌదామిని (మెఱుపు) అను కన్యయు కలిగిరి. అరుణునకు సంపాతి జటాయువులు సంపాతికి బహ్వశ్వుడు అతి ప్రసిద్ధుడగు శీఘ్రగుడు జటాయువు కర్ణికారుడు విశ్రుతుడగు శీఘ్రగామి సారసుడు, రజ్జుపాలుడు, అరుణుడు అనువారు కుమారులు. ఈ పక్షులకు అనంతమగు పుత్రపౌత్రాది సంతానము కలిగెను.
సురస అను కశ్యప భార్యకు వేయేసి శిరసులు కల వేయి సర్పములు సంతానమయ్యెను.
కద్రువకు వేయి సర్పములు కలిగెను. వారిలో ఇరువది ఆరు మంది ప్రసిద్ధులు. వారు: శేషుడు, వాసుకి, కర్కోటుడు, శంఖుడు, ఐరావతుడు, కంబళుడు, ధనంజయుడు, మహానీలుడు, పద్ముడు, అవతరుడు, తక్షకుడు, ఏలాపుత్రుడు, మహాపద్ముడు, ధృతరాష్ట్రుడు, వలాహకుడు, శంఖపాలుడు, మహాశంఖుడు, పుష్పదంష్ట్రుడు, శుభాననుడు, శంఖరోముడు, నహుషుడు, వామనుడు, పాణిని, కపిలుడు, దుర్ముఖుడు, పతంజలి అనువారు. వీరి పుత్ర పౌత్రాది సంతతి అనంతముగా అయ్యెను. వీరిలో చాలమంది జనమేజయుని సర్పయాగమున దగ్ధులైరి.
క్రోధవశ అనునామెకు అపరిమిత సంఖ్యగల రాక్షసులు జన్మించిరి. వారు అందరు కోరలు గలవారు. వారిలో లక్షమందిని భీముడు చంపెను.
సురభి అను కశ్యప పత్నికి రుద్రుల గణమును గోవులు గేదెలును కలిగెను.
ముని అనునామెకు మహాముని గణమును అప్సరోగణమును కలిగెను.
అరిష్టకు కిన్నరులు గంధర్వులు అనేకులు గలిగిరి.
ఇర అను ఆమెకు తృణజాతులు వృక్షములు లతలు గుల్మములు (గుబురు పొదలు మొదలగునవి) సంతానమయ్యెను.
విశ్వకు కోట్లకొలది యక్షరాక్షసులు కలిగిరి.
ఇట్లు కశ్యపునకు నూర్ల-వేల-లక్షల కోట్లకొలది సంతతి కలిగెను. ఇది స్వారోచిష మన్వంతరమునందలి సృష్టి క్రమము. అనంతరము కశ్యపుని వలన నలువది తొమ్మిది మంది మరుత్తులను కుమారులు కలిగిరి. వారందరును ధర్మము ననుసరించి నడచువారును దేవతలకు ఇష్టులును అయిరి.