నారసింహ ప్రతిమా లక్షణము

నరసింహమూర్తికి ఎనిమిది భుజములు; రౌద్రమూర్తి, సింహముఖము; విప్పారిన ముఖమును కన్నులును; నిక్కపొడిచి బలిసియున్న జూలును నిక్కపొడిచిన చెవులును; హిరణ్యకశిపుని చీల్చుచుండును; ఆ దానవుని ప్రేవులు బయటికి వచ్చుచుండును; వాడు నెత్తురు కక్కుచు కనుబొమలు ముడితోకూడిన ముఖమును కన్నులును కలిగియుండును; కొన్ని మూర్తులందు వాడు యుద్ధమునందు కరణ బంధములతో యుద్ధము చేయుచున్నట్లుండును; ఆ దైత్యుడు అలసి మాటిమాటికి నరసింహుని బెదరించుచుండును. వాని చేతులందు ఖడ్గమును ఖేటకము నుండును; ఆ దేవుని అమర శ్రేష్ఠులు పొగడుచుందురు.