వారాణసీ మాహాత్మ్యము

ఋషులు సూతుని ఇట్లడిగిరి, సూతా! నీవు చెప్పగా అంధకవధ వృత్తాంతమును వింటిమి. ఇపుడు వారాణసీ వృత్తాంతమును వినగోరుచున్నాము. భగవానుడగు పింగళుడు ఏయోగ్యతచే గణములలోనివాడు అయ్యెను? ఆమహాతేజశ్శాలి ఈవారాణసియందు అన్న దాతయు ఆ క్షేత్రమునకు పాలకుడును ఎట్లు అయ్యెను. శివునకు ప్రియుడెట్లయ్యెను. బ్రహ్మసుతా! ఇదినీవు చెప్పగా వినవలయునని మాకు కుతూహలముగా నున్నది అన సూతుడిట్లు చెప్పసాగెను.

పింగళుడు గణేశు డెట్లయ్యెనో అన్నదాత ఎట్లయ్యెనో తెలిపెదను వినుడు; లోకములలో వారాణసి పూజ్యమగు స్థానము.

పూర్ణభద్రుని కుమారుడు పూజ్యుడు ప్రతాపవంతుడు అగు హరికేశుడు అను యక్షుడు ఒకడుండెను. అతడు బ్రాహ్మణుడు (వేదోక్త విషయముల నెరిగి వాటియందు పూజ్యతా భావముకలవాడు; ) ధర్మానుష్ఠానపరుడు; అతనికి పుట్టుక మొదలు శివుని యందు అత్యుత్తమ భక్తి ఉండెను. అతడు ఎప్పుడును అతనికే నమస్కరించును, అతని యందు చిత్తముంచును; అతడే తనకు గమ్య మనుకొనును; కూరుచుండియు పోవుచుండియు పండుకొనియు నిలుచుండియు ఒకరి వెనుక పోవుచుండియు తినుచుండియు త్రావుచుండియు రుద్రునే అనుచింతించుచుండును; ఇట్లు సమాహిత మనస్సుకల అతనితో తండ్రియగు పూర్ణభద్రు డిట్లనెను. నీవు నా కుమారుడవని నాకు తోచుట లేదు; నీవు మరియొక విధముగా తప్పుగా జన్మించితివి. ఏల యన యక్ష జాతీయులకు ఈ నడువడియుండనే ఉండదు సుమా! గుహ్యకులగు (యక్షులగు) మీరు (మనము) స్వభావముచే క్రూరచిత్తులుగా నుందురు (ము), యక్షులు మాంసాహారులు నీచాహారులు హింసాశీలురు నగుదురు; నీవు ఇట్లు చేయకుము; ఇది నీకు తగిన నడువడి కాదు; మహాత్ముడు స్వయం భూప్రజాపతి మన కేది యాదేశించెనో దానిని విడువదగదు, మన ధర్మమేదియో అది గ్రాహ్యము; గృహస్థులగువారు మరియొక (బ్రహ్మచర్య వానప్రస్థ సన్యాసములవంటి) అశ్రమ విధులను పాటించరు కదా! అట్లే మనమును మన జాతి ధర్మమును విడువరాదు; కనుక నీ వీ మనుష్య స్వభావమును విడిచి మనకు తగిన వివిధ కర్మల నాచరించుము; ఇట్లు నీవు (వేరగు) మార్గము నందు ఉన్నావనిన నీవు మనుష్యుని వలన జన్మించి యుందువు; నేను కూడ ఆయా కర్మల నాచరించుచున్న మాట నిజమే, కర్మము స్వజాతీయము పరజాతీయమునని రెండు విధములు; మనుష్యు లాచరించు కర్మములు వారి జాతికి విహితములు; నేను మన జాతికి విహితములను కర్మము లాచరించుచున్నాను; కాని నీవు నీ జాతిధర్మము విడిచి మనుష్యుల వలె ఆచరించుచున్నావు; ఇది మనకు తగదు.

ప్రతాపవంతుడగు పూర్ణభద్రుడు ఇట్లు పలికి అనంతరము నిష్ఠురముగా “పుత్రా! త్వరగా వెడలిపొమ్ము, నీ ఇచ్చ వచ్చిన చోటికి పోవచ్చును” అనెను. అంతట అతడు ఇట్లు చుట్టములను విడిచి బయలు వెడలి వారాణసి చేరి అట దుశ్చరతప మాచరించెను. అతడు మొద్దు అయ్యెను, ఎండిన కొయ్యవలె రాతివలె అయ్యెను, రెప్పవాల్చకుండెను; ఇంద్రియ నిగ్రహముతో మౌనముతో నిశ్చలుడై యుండెను. ఇట్లతడు అనిశము శివపరుడయి శివునే కోరుచు వేయి దివ్యవత్సరములు గడపెను. అతనిపై పుట్టలు క్రమ్మెను, అతనిని చెదపురుగులు తినెను, వాడి ముక్కులుగల వజ్ర సూచీ ముఖములను (వజ్రపు సూదివంటి ముక్కుగల) పురుగులు కుట్టెను. అతని శరీరము మాంసము రక్తము లేక చర్మము మాత్రము మిగిలి శంఖమువలె చంద్రుడువలె తెల్లగ నయ్యెను, శరీరము అంతయు అస్థిశేషమయ్యెను. ఐన నతడు దేవుని ధ్యానించుచునే ఉండెను.

ఈ నడుమ కాలములో పార్వతీదేవి శంకరునితో “ఈ (కనబడుచున్న) ఉద్యానమును ఎప్పుడును చూచుచునే ఉండవలెననియు ఈ వారాణసీ క్షేత్ర మాహాత్మ్యము వినవలయుననియు నాకు కుతూహలము; నీకిది అత్యంత ప్రియమగుటను బట్టి ఈక్షేత్రము ఉత్తమఫలము నిచ్చునదయి యుండవలయును. ఇట్టి ఈ వారాణసీ మహిమము తెలియ వేడెదను” అని విజ్ఞప్తి చేసెను. హరుడు ప్రశ్నానుగుణముగా వారాణసీ మహిమము ఆమెకు చెప్పదలచెను. అందులకై ముందుగా వేవేశుడా శంకరుడు దేవితో కలిసి బయలుదేరి ఆ పినాకధారి దేవి కుద్యానము చూపుచు ఇట్లు వర్ణించసాగెను.

దేవీ! చూడుము; ఈ ఉద్యానము మిగుల బాగుగ వికసించిన తీగల గుబురులతోను పొదలతోను శోభితము; తీగల సమూహముతో వ్యాప్తము; ఇది బాగుగ పూలు పూచిన ప్రియంగు వృక్షములతోను చక్కగ పూచియు తమకు స్వాభావికమగు ముండ్లతో కూడిన చెట్లతోను గగుర్పాటు చెందినదివలె మనోహరముగా నున్నది, మంచి వాసనల ఇచ్చు తమాలవన వాటితోను వృక్షపు గుబురులతోను విపులములగు కర్ణికారము (పచ్చగన్నేరు)లతోను పూచిన అశోకపున్నాగ వృక్షకములతోను వ్యాప్తమయి యున్నది; ఇచటి పుష్పసమూహములు అన్నియు తుమ్మెదల వరుసలతో కల్లోలితమయియున్నవి. విప్పారిన పద్మముల పుప్పొడితో నిండిన ఒడళ్ళు కలిగి అస్పష్టమయియు మనోహరమగు కూతలుకూయు ఇంపగు వివిధ పక్షులు ఇట ఉన్నవి. మనోహరములును మిగుల మత్తిల్లినవియునగు దాత్యూహములు నల్లని కంఠముగల పక్షులు, అందమగు నెమళ్ళు ఇంపుగ కూయు చక్రవాకములు, కాదంబములు అను ఒక విధమగు హంసలు, నీటి కాకులు, చక్కని సువాసన లీనుపూలు అలంకరించుకొన్న దేవతాస్త్రీలు, పూచిన తీయమామిడి చెట్లు వాటికి అల్లుకొన్న తీవలు తిలక వృక్షములు బిగ్గరగ ఇంపుగా పాడు విద్యాధర సిద్ధచారణులు ఆపాటలకు సరిగి నృత్యమొనరించు అప్సరసలు మిగుల హర్షముతో ఆడుకొను నానావిధ పక్షులు మిగుల మత్తిల్లిన హారీతపక్షులు సింహముల గర్జాధ్వనులువిని కలవరపడు వనమృగములు తమతమ ప్రియులతో ప్రియురాండ్రతో జతలుగా తిరుగు జింకలు బాగుగ వికసించిన నానా విధములగు మనోహర పద్మములతో శోభించు సరస్సులు తటాకములు ఈ ఉద్యానమునకు అందము నిచ్చుచున్నవి. ఈ ఉద్యానము దట్టముగా ఉన్న ప్రబ్బలి చెట్లతో నీలమై నెమిళ్ళతో మనోహరమయి మదమెక్కి సంతోషముతో ఉన్న పక్షుల గుంపుల కూతలతో ఇంపుగొలుపుచు పూచిన చెట్ల కొమ్మలందు మరుగై ఉన్న మత్తిల్లిన తుమ్మెదలతోనిండి లేత చిగురాకుల శోభలతో శోభించు కొమ్మల రెమ్మలు కలిగియున్నది. ఏనుగులచే త్రుంచబడిన అందమగు తీగలు పెనవేసి కొనిన చిరుచెట్లు ఒయ్యారపు నెమ్మది నడకలునడచు నెమిళ్ళు కలిగినదై ఈ వనము కింపురుషులు ఎల్లప్పుడును తన్నాశ్రయించగా అందగించుచున్నది. దీనియందు దేవతాశ్రేష్ఠుల ఇండ్లును ఎన్నియో ఉన్నవి. వాని అందమగు శిఖరములందు పావురములు కూయుచున్నవి. ఆ ఇండ్లు ఆకాశమును ఒరయునంత ఎత్తయినవి. తెల్లనయి మనస్సునకు ఇంపుగొలుపు అందమగు రూపము కలవి, అంతటను వ్యాపించిన పుష్పరాశులు విపులమగు నవ్వుగా భాసించుచున్నవి. ఇచటి జలాశయములందు కలువలు వికసించి ఉన్నవి. ఈ సరస్సుల చుట్టును వేలకొలది అగురు వృక్షము లుండుటచే వాని కొమ్మలు పందిరివలె వానిపై క్రమ్మి కనబడుచున్నవి. అందుచే ఇచటి ఆకాశమును కడు శోభించుచున్నది. చెట్ల వరుసల నడుమనున్న త్రోవలలో జారిపడియున్న పూల వరుసలతో పలురీతుల పట్టికలు ఏర్పడి కనబడుచున్నవి. వాటిచే ఇచటి పొదలును చిరుచెట్లును అందముగా ఉన్నవి. ఇచటి పర్వతముల శిఖరములు కొనలయందలి అశోక వృక్షములు తమయందు మరుగు పడియున్న పూవులతో నిండి బరువగు పూలగుత్తులతో వంగిన రెమ్మలు కల అశోక వృక్షములు తమ పూలపై మూగు మత్తిల్లిన తుమ్మెదల గుంపుల గీతములతో చెవికింపు గొలుపుచు అందముచే కండ్ల కింపుగొలుపుచు మనోహరమై ఉన్నవి. ఈ శ్వేతాశోక పుష్పములతోను పూచిన తిలక పుష్పములతోను రాత్రులందలి వెన్నెల ఏకమయి మిగుల తెల్లగ కనబడుచుండును. నీడలందు (చెట్ల సమీపమున) నిదురించి మేలుకొని లేచి నిలువబడిన లేళ్ళుగా మెల్లగా వచ్చి దర్భల మొలకల కొనలను కొరుకుచున్నవి.

హంసలు రెక్కల విసరులచే మిగుల కదలియాడుచున్న కమలములతో నిండి విశాలమును స్వచ్ఛమును అగు జలముకల సరస్సులు ఆసరస్సుల తీరములందు మొలిచి పెరిగిన అరటి చెట్ల వరుసల నడుమ నృత్యము చేయు నెమిళ్ళు అటనట రాలిపడిన నెమిలి పింఛపు ఖండములతో వన్నెలు వన్నెలుగా కనవచ్చు ప్రదేశములు ఆయా ప్రదేశములందు వ్యాపించి మత్తిల్లి మిగుల సంతసమున ఆడు హారీత పక్షులు కలది ఈ ఉద్యానము. వ్రేళ్ళు తమ కాశ్రయ మొనర్చుకొని తావులతో నిండిన వన్నెలపూలతో కప్పువడిన చెట్ల గుబురుల నడుమ మత్తులయి హర్షముతో మధురముగా పాడు కిన్నరాంగనలతో ఇది మనోహరము; చక్కగా అలికి పూవులు వెదజల్లిన మునుల ఆవాస ప్రదేశములును ఆ ఆవాసముల పరిసరములందలి వృక్షములును, చెట్ల వేళ్ళ మొదలు పండ్లతో నిండి విశాలములయి ఎత్తయిన పనస వృక్షములును ఇటనున్నవి; చూడుము. ఇందలి అతి ముక్తలతా గృహములందు సిద్ధులు (దేవజాతులు) విహరించుచున్నారు. ఇందు సిద్ధ స్త్రీల బంగరుటందెల మనోహర నాదములు వినవచ్చుచున్నవి. మనోహర ప్రియంగు వృక్ష పుష్ప మంజరులందు తుమ్మెదలు మ్రోయుచు ఆడుచున్నవి. పుష్పరాసులతో నిండిన వృక్షముల కొనలు గాలిచే అందముగ కదలుచున్న ఏనుగుల మందల నాయకులు (అగు పెద్ద ఏనుగులు) పడగొట్టిన వెదురు పొదలు - పొదలనడుమ దాగిన ఆడులేళ్ళు - కలది ఈ వనము! మోహవశులగు పాంచభౌతిక దేహధారులును ఇట తప మొనరించినచో వారికి ముక్తి లభించును. చంద్ర కిరణములవలె తెల్లనై, ఇంపగు తిలకపుష్పములతో సింధూరమువలె కుంకుమ పూవులవలె కుసుమ పూలవలె ఉన్న రక్తాశోక పుష్పములతో బంగరువలె మెరయు పచ్చగన్నేరు పుష్పములతో నిండిన ఆయా చెట్ల విశాలములగు కొమ్మలు విప్పారిన తెల్లని ఎర్రని పచ్చని తామర పూలతో రచింపబడినవేమో యను నట్లు కనబడుచున్నవి చూడుము, వెండిరేకులవలె పగడములవలె బంగరు పూలవలె మెరయు పూవులతో ఇచటి నేలలు నిండియున్నవి. పున్నాగ వృక్షములందలి పక్షుల మందల కూతలతో నిండి రక్తాశోకపు పూలగుత్తులతో వంగిన కొమ్మలు కలిగి మనోహరములగు పరిసరము లందు వీచు గాలి శ్రమహరము కాగా వికసించిన పద్మములపై ఆటలాడు తుమ్మెదలతో ఈ వనమెంత అందముగనున్నదో చూడుము అని ఇట్లు సకల భువననాథుడును లోకనాథుడును నగు పరమేశ్వరుడు అపుడు పార్వతితోను తనకు ప్రీతిపాత్రులగు గణేశులతోను కూడి విహరించుచు వివిధ వృక్షములతో విశాలమయి మత్తిల్లి ఆనందముతోనున్న కోకిలతో నిండిన ఉపవన వృక్ష రామణీయకమును దేవికి చూపెను.

అంతట దేవి ఈశ్వరునితో ఇట్లనెను, దేవా! పరమశోభాయుతమగు ఉద్యానమును చూపితివి, ఈ క్షేత్ర గుణముల నన్నిటిని మరల తెలుప వేడుచున్నాను. ఈ అవిముక్త క్షేత్ర మాహాత్మ్యమును అట్లు ఎన్నిమారులు వినినను నాకు తృప్తియగుట లేదు. కావున మరల తెలుప ప్రార్థించుచున్నాను అనగా మహాదేవుడనెను: ఈవారాణసీ క్షేత్రము నాది. ఇది సర్వ ప్రాణులకును సదా మోక్షహేతువు; దేవీ! ఇందు నాలోకము కోరి నానా విధములగు నా చిహ్న ముల దాల్చి శైవవ్రత మవలంబించిన వారెప్పుడును సిద్ధినందుదురు; ఇంద్రియములను మనస్సును నిగ్రహించికొని వారు ఉత్తమయోగ సాధన చేయుచుందురు. నానావృక్ష వ్యాప్తము నానా పక్షి నాదయుతము కమల కువలయ పుష్పపూర్ణ సరోలంకృతము సదా అప్సరోగంధర్వగణ సేవితమునగు ఈశుభ స్థానమునందు సదా నివాసము నాకు ఇష్టము, దీనికి హేతువు తెలిపెద వినుము, నాయందే మనస్సుంచి నా భక్తుడై సకల క్రియలను నాయందే అర్పించువాడు ఇచట ముక్తినందును, మరియొకచోట ఇట్టిది కాదు. ఇది నాది, పురములలో దివ్యమయినది, గుహ్య ములగు వానిలోనెల్ల గుహ్యతమము, చాల గొప్పది, దీని తత్త్వమును బ్రహ్మాది దేవతలును ముముక్షువులగు సిద్ధులును మాత్రమే ఎరుగుదురు, ఈ చెప్పిన కారణముల చేతనే ఇది నాకు ప్రియతమ క్షేత్రము; దీనియందు నాకు ఆసక్తియు అధికము. నేను దీనిని ఎన్నడును విడువను, ఇది అంతటి మహాక్షేత్రము, అందుచేతనే దీనికి 'అవిముక్తము' అనగా విడువ బడనిది అని పేరు, నైమిశ కురుక్షేత్ర గంగాద్వార పుష్కర తీర్థ క్షేత్రములందు స్నానమాడినను వానిని సేవించినను ముక్తి లభించదు, ఇచట లభించును, కావుననే ఇది విశిష్టమయినది; నా సొంతము లగుటచే ప్రయాగము నందు కాని ఈవారాణసియందు కాని ముక్తి లభించును, ప్రయాగము తీర్ధశ్రేష్ఠమే, కాని ఇది అంతకంటెను గొప్పది.

మహా తపశ్శాలియగు జైగిషవ్యుడు ఇట ఉత్తమ సిద్ధినందెను. ఈ క్షేత్రపు మాహాత్మ్యము వలనను ఇచట భక్తితో నన్ను భావన చేయుటవలనను జైగిషవ్యుడు మహాశ్రేష్ఠయోగి అయ్యెను; కావుననే ఈవారాణసి యోగుల స్థానమనబడుచున్నది. ఇట నన్ను సదా ధ్యానించువానికి యోగాగ్ని మిగుల దీప్తినందును; అట్టివాడు దేవతలకును దుర్లభమగు కైవల్య ముక్తినందును. సర్వ సిద్ధాంతవేత్తలయి బాహ్య చిహ్నములేవియు ధరించని (అవధూత) యోగులు అగు మునులు మరెచ్చటను దుర్లభమగు ముక్తి నిచట పొందుదురు. అట్టివారికి నేను సర్వోత్తమమగు యోగ సంపదను నాతోడి సాయుజ్యమును వారు కోరిన స్థానమును ఇత్తును. మహాయక్షుడగు కుబేరు డును అట్లు సకల క్రియలను శివునకు అర్పించి ఈ క్షేత్రమును సేవించుట చేతనే గణేశుడు అయ్యెను. ఇకమీదట నా భక్తుడుగా జనించబోవు సంవర్తుడును దేవీ! ఈ క్షేత్రమందు నన్నా రాధించి నందుననే మహోత్తమ సిద్ధినందును. పరాశరసుతుడు యోగి మహాతపస్వి భారతముతో ధర్మ నిర్మాత వేద వ్యవస్థా ప్రవర్తకుడు ముని పుంగవుడు అగు వ్యాసుడును పద్మాక్షీ! ఈ క్షేత్రమునందే ఆనందము నందును; ఓ సువ్రతా! బ్రహ్మయు దేవర్షులును విష్ణువు వాయువు రవి దేవరాజగు ఇంద్రుడు ఇతరులగు దేవతలు ఇట్టి సర్వమహాత్ములును నన్నిచట ఉపాసింతురు. ఇతర యోగులును సిద్ధులును స్థాణురూపులును మహావ్రతులును అనన్య మనస్కులయి నన్నిచట సదా ఉపాసింతురు. అలర్కుడు నా అనుగ్రహమున ఈ పురిని ఆశ్రయించును. అతడు దీనిని తన పూర్వుల వలెనే చతుర్వర్ణ ప్రజలతో నిండిన దానినిగా సమృద్ధి కలదానినిగా జనపదముల (గ్రామముల)తో చుట్టుకొనబడినదానినిగా చేసి చాలకాలము రాజుగా నుండి తన సకల గుణము లను నాయందే అర్పించి నన్నే పొందును. మనోహరాంగీ! అది మొదలుకొని (అటు తరువాత కూడ) ఈ క్షేత్రమునందు నివసించువారు గృహస్థులేకాని (సన్యాసాది) చిహ్నముల దాల్చినవారే కాని, నా భక్తులయి నన్నే ఆశ్రయించి నా ప్రసాదమున పరమ దుర్లభమగు ముక్తి నందుదురు.

ఇంద్రియ విషయసుఖము లందాసక్తి గల చిత్తముగలవాడే ఐనను ధర్మమందాసక్తిని విడిచినవాడే ఐనను మానవుడు ఈ క్షేత్రమునందు మరణించినచో అంతమాత్రముననే మరల సంసారమున (జనన మరణ ప్రవాహమున) ప్రవేశించడు. ఇక మరి మమత లేక స్థిరచిత్తులయి సత్త్వగుణులై జితేంద్రియులయి కర్మల ననుష్టించువారయినను, అనుష్ఠించనివారయినను వివేక వంతులయి సంగమును విడిచి నాయందు భావనను నిలిపినవారయినచో ఇచట దేహత్యాగ మొనర్చినవారు నా ప్రసాదమున ఉత్తమ (కైవల్య) ముక్తిని పొందియే తీరుదురని చెప్పవలసిన దేమి? వేలకొలది జన్మములందు యోగ మనుష్ఠించిన యోగి దేనిని పొందునో (ఆ సిద్ధిని) పరమ మోక్షమును ఇట మరణించి నంతనే పొందును. దేవీ! ఇట్లు నేను నీకు రహస్య వచనమగు ఈ అవిముక్త క్షేత్ర మహాఫలమును తెలిపితిని. మహేశ్వరీ! ఇంతకంటే ఉత్తమమగు రహస్యసిద్ధి మరిలేదు. దీనియందలి రహస్యమును ఈ భూలోకమున యోగజ్ఞులును యోగేశ్వరులును అగువారు మాత్రమే ఎరుగగలరు. ఇదే పరమమగు జ్ఞానము; ఇదే పరమ శుభకరము; ఇదే పరబ్రహ్మతత్త్వము, ఇదే పరమపదము. గిరిరాజ పుత్రీ! వారాణసి లోకత్రయసారము; నాకు సదా ఆనందకరము; ఇచ్చటికి వచ్చినవారు వివిధ దుష్కృతముల నాచరించిన వారయినను మర్త్యులు పాపక్షయమంది రజోదూరులయి ప్రకాశింతురు. అద్భుతముగొలుపు వివిధ వృక్షలతా గుల్మములును అందలి పూవులును కలిగి ఒప్పు ఈ క్షేత్రము దేవీ! నాకు సదా ప్రియతమము; మూర్ఖులును శాస్త్రజ్ఞానము లేనివారును అగు ప్రాణులు కూడ ఇట మృతినందిన మాత్రమున పరమపదమందుదురు; సంశయములేదు.

ఇట్లు చెప్పుచు, ఇంతలోనే మహాదేవుడు భక్తుడగు యక్షునకు వర మీయదలచి గిరిరాజ పుత్రియగు మహాదేవితో ఇట్లనెను. భామినీ! భువనేశ్వరీ! అహో! వరారోహా! (మహాసుందరీ!) ఇతడు మనవలన వరమందదలచి తపముచేతన పాపములు నశింపజేసికొనినాడు. ఇట్లు పలికి జగత్పతియగు ఆ దేవుడు దేవితో కలిసి యక్షుడు కృశుడై నాడులు మాత్రము ఎడము లేక కనబడు దేహముతో నున్న చోటికి పోయెను. చర్మమే లేక తెల్లని వర్ణము కలిగి సన్నని నాడులతో అమరిన అస్థిపంజరము మాత్రమే మిగిలియున్న ఆ గుహ్యకుని నిరీక్షించుచు దేవి అతనిని పరమేశ్వరునకు చూపుచు ఇట్లనెను: శంకరా! నిన్ను దేవతలు ఉగ్రుడు అందురు, అది సత్యమే, ఏలయన ఇతడింత తపమొనర్చినను ఇంతవర కీతనికి వరమీయలేదే! పుణ్య ప్రదమగు ఇటువంటి క్షేత్రమును చక్కగా సేవించియు ఈ యక్ష కుమారుడు ఇంతవర కింత పరిక్లేశ మందవలసిన పని ఏమి? ప్రసాదము చూపి పరమేశ్వరా! శీఘ్రమే ఇతనికి వరము నిమ్ము; మనువు మొదలగు దేవతలును పరమ ఋషులును ఇట్లు చెప్పుదురు; (ఏమనిన) “వాక్కుతో సదాశివుని స్తుతించి సంతోషింప చేసినను ఈ రెండు విధములు గూడ భోగప్రాప్తియు రాజ్యమును అంతమున మోక్షమును లభించును;” ఇట్లు దేవి పలుకగా దేవుడగు ఆ జగత్పతి ఆ యక్షుడు కృశుడై ధమనులతో నిండి కూర్చుండిన తావునకు దేవితో కూడ పోయెను. భక్తుడగుచు ప్రణతుడగు అతనిని చూచుచునే హరికేశుడు (పచ్చని వెంట్రుకలు కలవాడు) వృషభ ధ్వజుడునగు శివుడు అతనికి దివ్యనేత్ర మొసగెను. దానితో అత డతని చూడగలిగెను. అంతట యక్షుడును శివుని ఆదేశమున మెల్లగ కన్నులు విప్పి శ్వేత వృషభ మందున్న శివుని అతని వెంటనున్న ప్రమథ గణమును చూచెను. దేవదేవు డతనితో “నీకు అపూర్వమగు వరము (నీ వడుగకయే) ఇచ్చు చున్నాను; త్రైలోక్యమందును నీవు నన్ను (త్రైలోక్యము శివ మయమునుగా) చూతువు; నీశరీర వర్ణము నా శరీర వర్ణముతో సమానమగును. సంతాప రహితుడవయి నన్నుచూడుము” అనెను.

అంతట అతడు ఇట్లు వరమంది శరీరము అక్షతము (ఏ లోపమును లేనిది) కాగా శివుని పాదములందు ప్రణతుడయి తన శిరమున దోయిలి ఘటించెను. నేను వరమిత్తును కోరుకొమ్మని శివుడడుగగా ఆ యక్షుడు “భగవన్! నాకు నీయందు అవ్యగ్రము (స్థిరము) అనన్యము నగు భక్తి కలుగనిమ్ము, సర్వ లోకముల వారికి అన్నము పెట్టువాడను శాశ్వతముగ నీ గణముల లోని వాడను అయి నీఅవిముక్త క్షేత్రమును సదా చూచుచుండుదును గాక! దేవేశా! నీ నుండి నేను కోరు సర్వోత్తమ వరమిదియే” అనెను. దేవదేవుడు “నీవు జరామరణములును ఏ రోగము లును లేక వరదుడును సర్వపూజితుడును గణాధ్యక్షుడును ఎవరికిని అజయ్యుడును లోకములకు అన్నదాతయును క్షేత్రపాలుడును మహాబలుడును మహాసత్త్వుడును బ్రహ్మకును నాకును అత్యంత ప్రీతి పాత్రుడును త్రినేత్రుడును దండపాణియు, మహాయోగియు, దిగ్విజయుడవు అగుదువు” అనెను. ఇట్లు దేవేశుడగు మహేశ్వర భగవానుడు అచ్చట ఆ యక్షుని గణేశ్వరునిగా చేసి వానితో కూడి తన నివాసమున కేగెను.