మత్స్య మహా పురాణము
సప్తర్షులు పార్వతీతో మాటాడుట
ఇట్టి పార్వతీ తపోజనితాగ్నికి సర్వప్రాణులును భయమందెను. అంతట భగవానుడు ఇంద్రుడు సప్తర్షులను తలచెను. వారందరును వెంటనే వచ్చి ఇంద్రుడొనర్చిన పూజలందుకొని ‘మమ్ము నీవు స్మరించిన ప్రయోజనమేమి’ అని ప్రశ్నించిరి. ఇంద్రుడు వారితో ఇట్లు పలికెను: భగవంతులారా! నేను మిమ్ము స్మరించిన ప్రయోజనము తెలిపెద; వినుడు; హిమవచ్ఛైలపుత్రి హిమాచలమున ఘోర తపమాచరించుచున్నది; మీరామె అభిమత మెరిగి అది తీర్చ మిమ్ము ప్రార్థించుచున్నాను. లోకక్షేమార్థము ఆమె తపము త్వరలో ముగియ వలయును. కావున మీరును త్వరపడవలయును. అనగా వారును సరే అని సిద్ధ జనసేవితమగు హిమశైలమున పార్వతీ తపశ్చర్యాప్రదేశమునకేగిరి. ఆమె ఎదుట నిలిచి తీయని అక్షరములుగల వాక్యములతో పార్వతితో; కమల లోచనవగు పుత్రీ! నీవే సంకల్పముతో తపశ్చర్య పూనితివి అనిన, మునులతో పార్వతి బిడియపడుచు గౌరవ పురస్సరముగా ఇట్లనెను: తపోనిష్ఠులగు తమవంటి మహానుభావులు లభించినపుడు ఊరక నమస్కరించినను పవిత్రత కలుగుననుట నిస్సంశయము; కాని మీరు నన్ను ప్రశ్నించుటకు ఉన్ముఖులై ఉన్నారు; కావున తాము మొదట ఆసనములు స్వీకరించుట యుక్తము; కూర్చుండి శ్రమ తీర్చుకొని పిమ్మట మీరు నన్ను ప్రశ్నించవచ్చును అనుచు పార్వతి వారికి ఆసనములు అర్పించి వారినందు గూర్చుండజేసెను. పూజ్యులును సూర్య సమానులునగు ఆ సప్తమునులను ఆ సతి యథావిధానముగ పూజించి తపోవ్రతరూప మగు మౌనము వదలెను; కాని బిడియముచే మౌనము పూనెను; సప్తర్షులును మౌనము నవలంబించుట యందలి ఆమె భావము గ్రహించిరి. ఆమె తమ యందు చూపిన గౌరవమునకు వివశులైరి. వారపుడు మరల తాము మొదట అడిగిన ప్రశ్నయే అడిగిరి. మెల్లగ పార్వతియు ఇంపుగ చిరునవ్వునగుచు ఆదరపూర్ణ మనస్సుతో మునుల ప్రశ్నమువిని తన మౌనము విడిచి ఇట్లు పలికెను: ఈ విషయము తమకు తెలిసినదేకదా! ఏమనిన-ప్రాణులకు మనస్సునందేవో కోరికలు ఉండును. ప్రాణుల చిత్తవృత్తులును వారికి కలుగు కోరికలును వారిని వివశులనుగా చేయుచుండును. వాటిని వారు తీర్చుకొన జాలరు. కాని వారిలో కొందరు దేవతా సమానులగు నియమవంతులుందురు. అట్టివారు చురుకుదనముతో యత్నపరులై దుర్లభములగు కోరికలును గూడ తీర్చుకొన యత్నించు చుందురు. మరికొందరు మాత్రము పరిమితమగు బుద్ధిశక్తితో దేహశక్తితో ఆయా కార్యములు ఆచరించుచుందురు. అది వారి దేహాంతరమున మరు జన్మమున హితము కలిగించుటకు ఉపయోగించునే కాని మోక్షసాధనము కాదు. కాని నామనస్సు మాత్రము గగనకుసుమ మాలను ధరించిన వంధ్యాసుతుని పొందవలెనని మరిమరి కోరుచున్నది. నేను దేవుడగు భవుని పతిగా పొందు పూనికతోనున్నాను. అతడు సహజముగనే అందరాని వాడు; ప్రకృతము తపోనిష్ఠ యందున్నవాడు. సురాసులులును అతడిట్టివాడని నిర్ణయింప జాలరు. పరమార్థ తత్వోపయోగి కర్మలనే ఆశ్రయించి ఆచరించువాడా భగవానుడు; అతని హృదయమందు కోరికలును లేవు. అతడు ఇటీవలనే మదనుని దేహమునే దగ్ధ మొనర్చినాడు. నావంటి స్త్రీ అటువంటి ఈశుడగు శివుని ఎట్లు మెప్పించగలదు?
అని ఇట్లు పార్వతి పలికినది విని అంతట ఆ మునులు ఆమె మనఃస్థైర్యము నెరుగగోరి ప్రకృతమున కుపయోగించు క్రమగతమగు వాక్యమిట్లు పలికిరి, పుత్రీ! లోకములందు ఆయా విషయములలో లభించు సుఖము రెండు విధములని పెద్దల భావన; ఒకటి దైహిక సుఖముల వలన కలుగు తృప్తి; రెండవది కేవలము చిత్తమున కలుగు ఈ తృప్తి; నీవు పతిగాకోరు శివుడు ప్రకృతి (స్వభావము) చేతనే దిగంబరుడు; భీముడు (భయంకరుడు) శ్మశానశాయి; కపాలము ధరించిన భిక్షుకుడు; దిసమొలవాడు; వికృతమగు (బేసి) కన్నులవాడు; స్థిర క్రియుడు (శాశ్వత ములగు పనులు చేయువాడు; మొండి పట్టుతోపనులు చేయువాడు); ప్రమత్తుల-ఉన్మత్తుల ఆకారము కలవాడు; రోతగొలుపు సామగ్రులను సేకరించుకొని ఉండువాడు; భూతలములకు ప్రభువు; అతనివలన నీకు తీరు కోరిక ఏమి; నీవు నీ ఈ శరీర సుఖమునే కోరుచుంటివనిన భయంకరుడు రోత గొలుపు వాడు రక్తముకారుచు వసపూత కలిగిన కపాలములు ఆభరణము లుగా ధరించినవాడు బుసలు కొట్టు సర్ప రాజములు భూషణములుగా దాల్చిన భయంకరుడు శ్మశానవాసి రౌద్రులగు ప్రమథులు తన అనుచరులుగా గలవాడు అగు ఈ మహాదేవుని వలన నీకు కలుగు సుఖమేమున్నది?
దేవతల కిరీట సమూహముల ఒరపిడిచే తిని లేపిన పాదపద్మములు కలవాడు శత్రు నాశకుడు లోకనిర్మాత శ్రీకాంతుడు అనంతమూర్తిధరుడు అగు హరియున్నాడు; యజ్ఞ భోక్తలగు దేవతలకధిపతి పాఠానుర సంహారి అగు ఇంద్రుడున్నాడు: దేవతలకు నిధివంటివాడు సర్వకాల ప్రదుడునగు అగ్నిఉన్నాడు; లోకరక్షకుడు శరీరధారులకు ప్రాణ భూతుడునగు వాయువున్నాడు. సర్వధనాధిపతియు ప్రభువు విశ్రవసుని పుత్రుడు రాజరాజు అగు కుబేరుడున్నాడు; వీరియందుండి ఎవరినైన నీవు పతిగా పొందగోరరాదా? లేక ఒకవేళ మరియొక శరీరమున సుఖముల పొందగోరి తపము ఆచరించుచున్నావా? ఇంతే అగునేని, అట్లయినను నీవు తపమాచరింప నక్కరలేదు; ఏలయన ఇచ్చటనే ఈ దేహముతోనే నీ తండ్రి ఇంటనే నీకు స్వర్గ సంపత్ సుఖము లభించుచునే యున్నది, ఇచట నీకన్ని శుభ సుఖములును కలవు; దేవతల వలనకూడ లభించనిదెల్ల నీకు నీ తండ్రినుండియే లభించును; కావున నీవు అందులకై తపమాచరించుచు శ్రమపడుట కూడ వ్యర్థము; అది కాక కల్యాణీ! ఎంత స్వల్ప ఫలమేయైనను మనసు కావలెనని మిగుల కోరినది దుర్లభమయి దూరము పోవుట లోక సహజము; నీవిట్లు తపస్సు ఆచరించుచు శ్రమపడుట విధియోగము; బ్రహ్మ నీకిట్లు విధించినాడు కాబోలును; అని మునులు పార్వతితో పలికిరి.
మునివర్యులు ఇట్లు పలికినది విని శైలజ కుపితురాలయి క్రోధరక్త నేత్రముతో కంపించు పెదవులతో ఇట్లు పలికెను. “ఆలోచనలతో నడుచువానికి నీతి ఏమున్నది? వ్యసనపరునకు అదుపు ఏమున్నది? మంచిని చెడుగుగా చెడుగును మంచిగా ఆలోచించు వానిని మంచి త్రోవలో పెట్టువారెవ్వరున్నారు? మీరు ఈ విధముగా నన్ను ప్రజ్ఞాహీను రాలనుగా తగని స్థానమున, తగని విధముగా ప్రీతి కలిగియున్న దాననుగా తలచుచున్నారు గదా! నా విషయమున మీరు సరిగా విచారణ చేయుటలేదు. నేను ఇట్లు మాటాడుట అహంకారముచే అని మీరనుకొన వచ్చును; ఏమనిన-మీరందరును ప్రజాపతులతో సమానులు; సర్వజ్ఞులుకూడ; ఐనను మీరు ఆ (మహా) దేవుని సరిగా ఎరిగినట్లే లేదు; అతడు శాశ్వతుడు, జగత్ప్రభువు, అజుడు (పుట్టుకలేనివాడు); ఈశానుడు, (సర్వమునకు నియంత) అవ్యక్తుడు (స్పష్ట రూపము లేనివాడు), అమేయ (ఎరుగరాని) మహిమ సమృద్ధికలవాడు; అది అట్లుండనిండు; ఆతడు ప్రతిష్ఠించిన ధర్మపు ఉనికిని సరిగా ఎరుగుటకూడ ఆశ్చర్యకరమగు విషయమే; హరి బ్రహ్మాది సురేశ్వరులును అతనిని ఎరుగ జాలరు; ఆ మహానుభావుని విభుత్వము వలన స్వయముగనే జనించినదై లోకములయందు విజృంభించి ప్రకటమైయున్న మహామహిమను కూడ మీరెరుగరేమోకదా! గగనము, వాయువు, భూమి, వరుణుడు (జలములు)
అతని మూర్తియేకదా! చంద్రసూర్యు లాతని కన్నులు కదా! సురాసురులును భక్తితో అతని లింగ (చిహ్న)మును అర్చించుచున్నారే! బ్రహ్మేంద్రాది దేవతలును మహర్షులును అతనిని సార్థకమగు ఈశ్వరనామముతో పిలుతురుగదా! ఆ శివమూర్తుల ప్రభావమును పుట్టుకను కూడ మీరు ఎరుగనట్లున్నది; ఈ అదితి ఎవరిమాత? జనార్దనుడు ఎవరి నుండి జనించెను? నారాయణాది దేవతలు అదితి కశ్యపులకు జనించిరి. మరీచి పుత్రుడు కశ్యపుడు; దక్షునిపుత్రి అదితి; ఈ మరీచి దక్షు లిరువురును బ్రహ్మ పుత్రులు; దివ్యసిద్ధి విభూషితమగు హిరణ్యయాండము నుండికదా బ్రహ్మ జన్మించెను? ప్రకృత్యంశము లన్నియు ఆ ఈశ్వరుని ధ్యానము (సంకల్పము) వలననే కదా వక్షోభము (ప్రథమ స్పందము) నంది సృష్టి ప్రాదుర్భవించెను! మూల ప్రకృతినుండి మూడవదియగు (1.ప్రకృతి; 2. మహత్; 3. అహంకారము) అహంకార తత్త్వమునందుండి నిష్పన్నమయిన పద్మమునుండి లోకజన వ్యాపారము ( ఆ ఈశ్వరునినుండియే) కలిగెను గదా! ఇట్లు ప్రాదుర్భవించిన మూల ప్రకృతి ఆయా జీవుల కామ-కర్మకృతములయిన షడ్వర్గములను (జాయతే-అస్తి-విపరిణమునే-వర్ధతే-అపక్షీయతే-నశ్యతి అను షడ్భావ వికారములతో కూడిన ప్రాణి సృష్టిని) సృష్టించెను కదా! అజాతకుడు (పుట్టుకలేనివాడు) అనబడు (బ్రహ్మకూడ అవ్యక్త తత్త్వమునకును జన్మకారణమగు పరబ్రహ్మ రూపుడగు ఈశ్వరుని నుండియే కదా జనించెను? తన ధ్యాన (సంకల్ప) బలమున ఈశ్వరుడే మూల ప్రకృతి యందు క్షోభము(స్పందనము)కలిగించి ఇదియంతయు సృష్టించి బ్రహ్మయు సర్వార్థసిద్ధినంది సృష్టికి ఈశ్వరుడై (సమర్థుడై) లోక కర్తయగునట్లు చేసెను?
స్వమహిమ సంపన్నుడగు ఆ ఈశ్వరుని విష్ణ్వాది దేవతలును ఎరుగ యత్నించు చుందురు గదా! ఈశ్వర సంకల్పముననే విష్ణువు అసాధారణములగు అట్టి దేహముల (అవతారముల)ను ధరించి ఉత్తమ మధ్యమాధమభేదములుగల లోక వ్యాపారములు నిర్వర్తించుచున్నాడు గదా! జన్మ మరణాత్మకమగు సంసారపు స్వరూపము ఇటువంటిది; ఇది అంతయు-నానా రూపము లును, నానావిధోద్భవములునుగల ఈ జగమంతయు-ప్రాణుల కర్మఫల రూపమయినది; ఇది ఇట్లుండ నారాయణుడును ఆ ఈశ్వరుని ప్రేరణతోనే తన ఛాయయగు వైష్ణవ మాయాశ్రయముతో నానావిధ జన్మములను దాల్చును. వివశాత్ములయి విష్ణ్వారు లందరును పొందు ప్రేరణకూడ ఉన్మాదాది దోషదూషితులయిన వారి మతిప్రవృత్తి వంటిదే కాని వేరుకాదు. లోకమునందు జరుగు ప్రాణుల ఆయా వ్యవహారములనుచూచి ఈశ్వరుడు తనలోతాను నవ్వుకొనుచుండును. మానవులాచరించు ధర్మాధర్మములకు పుణ్యపాప ఫలములు లభించుటకు ఈశ్వరాధీనుడై విష్ణువే హేతు భూతుడని శాస్త్రములు నిర్దేశించుచున్నవి. ఈ జీవునకు సామాన్య సిద్ధాన్తముగా అనాదిత్వము చెప్పబడెనేకాని ఈతడు ఏదేహమందును దీర్ఘకాల ముండడు; అంతేకాదు; ఈజీవుని అంత రంగము (అంతఃకరణము) మీరుకాని మరెవ్వరుకాని చూచియుండలేదు. ఒకచోట పుట్టుట మరియొకచోట చచ్చుట అనునది దేహధారియగు జీవుని ధర్మము; అతడు ఒకచో గర్భమందుం డగనే మరియొకచో వార్ధకమున, ఇంకొక చోట వ్యాధిచేత, వేరొకచోట నూరేండ్లు జీవించి, ఇంకొక దేహమున బాల్యమున మరణించును. స్వల్ప కాలము జీవించువాని కంటె నూరేండ్లు జీవించువాడు అనంతకాలం జీవిగా కనబడును; అట్లే (సృష్టి కాలమంతయు) మరణించక జీవించియే ఉండువాడు అమరుడనబడు చున్నాడు; అల్పకాల జీవులగు మానవులకు వారి (దేవతల) మరణములు కనబడవు! అంతే; ఇట్లే విష్ణువు మొదలగువారి చావుపుట్టుకలు సాధారణులు చూడలేకున్నారు; ఈశ్వరునికిగల ఇటువంటి జన్మమరణాదులు బొత్తుగాలేని ఈశ్వరత్వమును ఈ సంసారమును మరి ఎవ్వరు పొందగలరు. ఈ ప్రపంచమున జీవన మరణాదులు ఉండుటచే నానాశ్చర్య స్వరూపులు ఈ దేవతలందరును; కావున వీరందరును మలిన రూపులు; వీరి ఈశ్వరత్వము అల్పమయినది! పూజ్యులారా నేను శర్వుడు అనగా సర్వ ప్రాణిసంహారి; పినాకధను ర్ధారియగు శివుని తప్ప మరెవ్వని నేను పతిగా కోరను! ఐశ్వర్యాది షడ్గుణములును ఇతరులగు దేవతలయందు తారతమ్యముతో ఒకరి యందెక్కువ-మరియొకరి యందు తక్కువ ఉన్నవి; కాని ఈశ్వరుని యందు ఇది అత్యుత్కృష్టమయి ఉన్నది; జ్ఞాన బలైశ్వర్యాది లక్షణములు దేవునియందు మహత్తులలో మహత్ పరిమాణమున ఉన్నవి, అతని కంటె మరి గొప్పది కాని ఇతరముకాని లేదు; సర్వమును అతని నుండియే ప్రవర్తిల్లుచున్నది. అతని ఈశ్వరత్వమునకు ఆదియు అంతమునులేవు; అట్టి ఈశ్వరునే నేను ఆశ్రయించుచున్నాను. ఇదియే నా నిశ్చయమును-నా ప్రయత్నమును; ఇది లోక విరుద్ధమయినదే కావచ్చును; నన్ను ఆయాకార్యములందు ఆజ్ఞాపించు యోగ్యతగల ఋషులారా! మీరిది విని (సంతోషముతో) ఉన్నను సరియే; (కోపించి) వెడలిపోయినను సరియే; (నానిశ్చయము మారునదికాదు) అని పార్వతి సప్తరులతో పలికెను.
ఇట్లు పలికిన దేవీవచనములువిని తమ కన్నుల ఆనందాశ్రువులు క్రమ్మ వారు ఆ తపస్వినిని అభినందించిరి, పరమ ప్రీతులయి వారు మధురవచనములతో ఆమెతో ఇట్లనిరి; ఆహో! దేవీ! అత్యద్భుత స్వభావురాలగు నీవునిర్మల జ్ఞానరూపురాలవువలె కనబడు చున్నావు; నీవు సర్వ భావముతో భవుని (శివుని) ఆశ్రయించిన దానవయి మాభావమును ప్రసన్న మొనర్చు చున్నావు; కాని మేము ఆ మహాదేవుని అద్భుతమగు ఐశ్వర్యమును (ఈశ్వరత్వమును) నీవలె ఎరుగము, నీ నిశ్చయమునందలి దృఢత్వమును పరీక్షించి ఎరుగదలచి ఇచటకు వచ్చినాము. సుందరరూపా! అచిరకాలముననే నీ సంకల్పము నెరవేరును; సూర్యతేజము సూర్యునికాని రత్నకాంతి రత్నములను కాని విడిచి ఎక్కడ కైన పోవునా? వర్ణరాశి రూపమగు శబ్దముచే వ్యక్తముకాక అర్థము వేరొకచోటికి పోదుగదా! అట్లే నీవును పరమేశుని విడిచియుండవు; కావున మేమును అనేకాభ్యు పాయములతో (నైనను) ఆ ఈశ్వరుని అభ్యర్థించుటకు (నీపక్షమున) పోవుచున్నాము; మా హృదయము లందును (చాల కాలముగా) ఈ విషయమే మిక్కిలిగా ఉండినది. ఈ కార్య సాధనమునకు కావలసిన నీతి (ఉపాయ) రూపురాలవును నీవే; కావుననే అందులకు కావలసిన బుద్ధి (ఆలోచనలు-నిశ్చయము) కూడ నీవే అయి యున్నావు; (నీకు శివుని యందుగల దృథాను రాగ విషయక నిశ్చయమే ఈ కార్యము సిద్దించుటకు కావలసిన ఆలోచనమును ఉపాయమును మాకు స్ఫురింపజేయును.) ఈ హేతువున నీశంకరుడును నిస్సంశయముగ ఈ కార్యమును నెరవేరునట్లు చేయును.
అని ఇట్లు పలికి సప్తమునులును గిరి పుత్రిచే పూజలందుకొని శివుని దర్శింపగోరి (అతడుండు) హిమవత్పర్వత సానువునకు బయలుదేరిరి. ఆ సానువు చాల గొప్పది. శివునివలెనే అ సానువును సమానముగ గంగా జలముతో తడుపబడిన శరీరము కలది; పచ్చని జడలను జూలును దాల్చి శివునివలెనే ఆ సానుపు పచ్చని గైరిక ధాతువులతో అలంకృతము; శివుని చేతి యందలి మందార కుసుమమాలలను తుమ్మెద లనుసరించు చుండెను. సానువునందలి వృక్ష శాఖల యందు పూచిన పుష్ప శ్రేణులను తుమ్మెదలు వెంటాడుచుండెను. ఇట్టి హిమవత్సానువు నందలి శంకరాశ్రమమును ఆ ఋషులు దర్శించిరి. అచటి మృగ సమూహములు ప్రశాంతములై యుండెను. వనప్రదేశము కోమలమును నిశ్చలమునై యుండెను. నిశ్శబ్దములును కలత లేనివి యునగు జల ప్రపాతములు దాని అన్ని దిశలందుండెను. ఆ ఆశ్రమద్వారమున పూజ్యులగు ఆ సప్త మునులకును తనచేత ప్రేప బెత్తము ధరించిన వీరకుడుకనబడెను. తాము వచ్చినపని గొప్పదియగుటచే వారు వినయవంతులయి మాటలాడుటలో మేటి నేర్పరులు కావున మధుర భాషన యుతములగు వాక్కులతో ఆతనితో నిట్లనిరి; లోక శరణ్యుడును ప్రమథగణ నాయకుడును అగు త్రిలోచనుడైన ఈశ్వరుని దర్శింప మేమిటకు వచ్చితిమి. దేవకార్యప్రేరణ మారాకకు హేతువని తెలియుము. కాలాతిక్రమము జరగకుండుటలో నీవే మాకు శరణ్యుడవు కావలయును. ఏలయన సాధారణముగా ద్వారపాలుర అనుకూలతచేతనే ప్రభువులు దర్శనమిత్తురు.
మునులు పలికిన ఈమాట విని వీరకుడు ఆదరమున వారితో ఇట్లనెను: “విప్రులారా! ఈశుడు మందాకినీ జలమున స్నానమాడి సాయం సంధ్యను ఉపాసించి క్షణకాలములో ఇటకు వచ్చును. అచ్చట మీరు పరమేశుని దర్శింతురుగాని.” ఈమాట విని మునులు వర్షాకాలమున దప్పిగొన్న చాతకములు గంభీర మేఘము వచ్చు సమయము కొరకు వలె శివుడు వచ్చు సమయమునకై ప్రతీక్షించుచు నిలిచిరి. తరువాత క్షణకాలములో శివుని యోగ సమాధ్యాను స్థానము ముగిసెను. మృగ చర్మమున నియమ పూర్వకముగ అమర్చుకొనిన వీరాసనమును శివుడు వదలెను. అంతట వీరకుడు వినయవంతుడై ప్రీతిభావముతో నిండిన మనస్సుతో మోకాళ్ళు వంచి నేలకు ఆనించి ఇట్లు శివునితో మనవి చేసెను; విభూ! దీపించు తేజస్సుకల సప్తమునులు మిమ్ము దర్శింప ఇటకు వచ్చినారు. దర్శనమునకు అనుజ్ఞ ఈయవలెనని ఎరుగ ప్రార్థించుచున్నాను అనిన మహాత్ముడగు వీరకుని వచనము విని శివుడు కనుబొమ విరుపు సైగతోనే వెంటనే వారికి ప్రవేశమనుమతించెను. వీరకుడును అచటికి దూరమున నిలిచియున్న సప్త మహర్షులను శివుని దర్శనమునకై రావలసినదిగా తన శిరఃకంపముతోనే పిలిచెను. ఆ పిలుపునందుకొను త్వరలో ఊడిన జుట్టును సగమే ముడివేసికొని తమ కృష్ణాజినములును, వస్త్రములును వ్రేలాడుచుండ విభూతులతో శుద్ధమగు పరమేశుని వేదికను ప్రవేశించిరి. చేదోయి దొన్నెలతో స్వర్ణ పుష్పముల రాసులు నీశునిపై వెదజల్లుచు వారుదేవతలకును వంద్యుడు అగు పినాకపాణి పాదపద్మములకు వందన మాచరించిరి. అంతట శూల పాణియు ప్రేమార్ద్ర దృష్టులు తమపయి ప్రసరింపజేయ ఆ సప్తర్షులు ఆదరపూర్వకముగ గిరీశుని చూచుచు ఆ దేవుని లెస్సగా ఇట్లని స్తుతించిరి.
ఇపుడు మీదర్శనముచే మేమే ధన్యులమగుచున్నాము. ఈ విధముగా సురేశ్వరుడును లోకప్రసిద్ధి పడయుచున్నాడు. మీయనుగ్రహమను నిర్మల జలముతో తడియగోరి ఒకానొక స్త్రీయును తపమాచరించుచున్నది; తపః ఫలమందుకొననున్నది. ఈ హిమాచలుడును లోకమున ధన్యతముడు, ఏలయన నీ ఆశ్రయము నర్థించి అతని పుత్రికయే తపమాచరించుచున్నది. మహాబల సమృద్ధి కలవాడై సమస్త సురులను నిర్మూలించిన తారకాసురుడు గూడ ధన్యుడే; ఏలయన వాడు నీ యంశ భూతమగు తత్త్వమును (కుమారస్వామిని) దర్శించి తన పాపముల నుండి ముక్తినందబోవుచున్నాడు. ఆ తారకుని వలన కలిగిన భయ సంభ్రమములకు వశులై ఆ సంభ్రమాగ్నిచే ఉద్దీపితులయి మహాం భితాపప్రశాంతి హేతువగు మీ పాదపద్మములను తమ హృదయముల దాల్చి మిమ్మారాధించు బ్రహ్మయు విష్ణువును ధన్యులు; వాస్తవమున నీవొక్కడవే ఉండియు వివిధాకృతులతో వివిధ క్రియలు నిర్వర్తించుచున్నావు; ఇట్టి నిన్ను సరిగ ఎరుగలేక జనులు వాక్కులను శ్రమపెట్టుకొని వివిధములుగ నిన్ను గూర్చి పలుకుచుందురు. ఒక వేళ అద్యుడవగు నీవు ఈ విధముగా జరుగు లోకోపద్రవమును ఎరిగేయున్నావు; అనినచో లోకమప్పుడు నీవు నిర్దయుడవని నిన్ను నిందించవలసివచ్చును. ఈ సంసారాత్మక (లోక మందలి ప్రాణుల) దుఃఖమును నీవెరుగ కున్నావా? (ఎరుగుదువు;) నీవు చేయు ఈ సృష్టిస్థితి క్రియలు అన్ని విధములుగా (ఈ తారకాదులచే) దెబ్బతినుచున్నవి: ఇట్టి ఈ జగదుపద్రవమును నీవు చూచుచు ఊరకున్నచో దయామయుడవని నిన్నెవరును ప్రశంసించరు. స్వయోగమాయా మహిమలకు గూఢముగా (ఎవరికిని ఎరుగరాక) ఆశ్రయ మయియున్న నీ నిర్మలైశ్వర్య గౌరవము నెవ్వరును కొనియాడరు. ఇట్టి నిన్ను దర్శింపగలుగు చున్నందున మేము ప్రాణులన్నిటికంటె ధన్యతరులము; మొదట మేము మాకు మీదర్శనము కాదేమోయనుకొంటిమి; ఇప్పుడు తమ దర్శనముచే మా మనోరథము సఫలమయినది. జగ్సృష్టిస్థితి సంహారకర్తవును జగములకు ఆదిభూతుడవును అగు నీవు ఎవరు కోరినను కోరకున్నను మేము కోరినంతకంటె అధికములగు కార్యమునే చేయుదువు; ఐనను మేమింద్రుని సందేశమునుగొని నీకడకు వచ్చితిమి అని ఇట్లు మునులు తమ వాక్కులను పరమేశుని శ్రవణ భూమి సమీపమున అర్పణచేసి వంగి నమస్క రించిరి. అది కర్షకులు మంచి పంట పండుటకై మేలగు పంటభూమియందు విత్తనముల నాటినట్లుండెను.
తగిన విధముగ ఆరంభించి కొనసాగించిన సప్తమహర్షుల రమ్య స్తుతి వచనములు విని పరమేశుడు చక్కని చిరునగవుతో మనోహర వచనములు బృహస్పతివలె ఇట్లు పలికెను. మీరు వచ్చిన పని నేను చేయు లోక విధానము నందలి ఉత్తమ సత్కార్యము నకు అంగమనియు అందులకై ఈసర్వ సంకేతముల నెరుకపరచు దేవి హిమశైల పుత్రిగా జనించినదనియు నేనెరు గుదును. దేవతలందరును చాల తహతహపాటుతో ఉన్నారనుటయు నిజమే, మీరు దేవ కార్యార్థమే పూని వచ్చితిరి. ఆ దేవతల మనస్సులును త్వరపడుచున్నవి. కాని నిర్వహింప దలచిన కార్యము నెరవేరుటకై విచక్షణులగువారు లోక వ్యవహారానుసారముగానే పనిచేయ వలయును. ఏలయన ఉత్తములగు వారు ధర్మవ్యవస్థ ననుసరించి ధర్మము నందు ప్రవర్తింతురు. ఇతరులు దానిని ప్రమాణముగా గ్రహించి నడుచుకొందురు అనిన పరమేశుని మాటలు వినుచునే త్వరితముగా సప్త మునులును హిమవంతుని భవనమునకు ఏగిరి. అచట ఆ పర్వతరాజుచే సాదర పూజల నందు కొని ప్రీతులయి మునివరులు అల్ప వర్ణము (వచనము)లతో త్వరతో ఇట్లు శైలేంద్రునితో పలికిరి.
హిమాలయా! సాక్షాత్ పినాకధారి నీ కొమరితను పత్నిగా కోరుచున్నాడు; కావున ఆహుతిని అగ్నియందర్పించి ఆమె నతని యందర్పించి నిన్ను నీవు పవిత్రునిగా జేసికొనుము; ఇందు చాల కాలముగా ఏర్పడిన దేవకార్యమును ఇమిడియున్నది; కావున జగదుద్ధరణార్ధమయి నీవు ఈ పూనిక నెరవేర్చవలయును అనిన మునులమాట విని పర్వతరాజు హర్షావిష్టుడై వారితో ఏదో చెప్ప నారంభించెను. కాని మాటాడజాలకపోయెను. కేవలము శివుని ప్రార్థించి ఊర కుండెను. అంతట మేనాదేవి పుత్రీ ప్రీతిపారవశ్యముతో మునులు నమస్కరించి భగవానుడగు ఈశ్వరుని పాదములను ఆశ్రయించిన అర్థవంత మగు వాక్యమిట్లు పలికెను. కూతురు పుట్టి ఉభయవంశములవారిని తరింపజేయును గావున ఆమె జన్మము మహాఫలప్రదమే; ఐనను ఆమె తల్లిదండ్రులను విడిచి పోవునను భయముచే కూతురు పుట్టవలెనని కోరరు. క్రమ పరిణామముగా ఇపుడదియే తటస్థించినది; కులజన్మ వయోరూపైశ్వర్య సమృద్ధికల వరుడు లభించినచో అతడు కోరకున్నను కన్న తల్లిదండ్రులాతని కామె నీయవలయును. ఆ శివుని యందే ఆసక్తురాలయిన మా పుత్రి తన్నాయన కీయనిచో ఆ ఘోర తప మెట్లు విడుచును? కనుక ఆమె మాట ననుసరించి ఈ విషయములో ఏమి చేయదగునో ఆ పని చేయుడు అని పలికిన హిమవత్సతియగు మేనా వచనములువిని మునులు ఆమె మనస్సు పరీక్షింపగోరి ఉదారార్థవంతమగు మాట ఇట్లు వచించిరి. దేవతలు ఆ మహాదేవుని పాదాబ్జ ద్వంద్వమును ఆరాధించి మిగుల సుఖ మందుచున్నారనిన ఆ శంకరుని ఐశ్వర్యమెట్టిదో ఎరుగుము; ఆ శివునకు ఉపయోగించి ప్రీతి కలిగించు రూపమును పొందగోరి నీ పుత్రి ఘోర తపమాచరించు చున్నది; ఆమెకా రూపముతో శివప్రాప్తి అను మహానందము లభించును. ఏ శంకరుడు ఆమె ఇంతవరకాచరించుచుండిన వ్రతములను ముగింపజేయునో అతనియందే ఆమె అవధానము నిలిపి యున్నది; అట్టి ఆమె ఇప్పుడతని ఇల్లాలగును అని ఇట్లు పలికి ఆ సప్తమునులును హిమ వంతుని కూడి-రవి వహ్ని తేజముల మించిన తేజము కలదియు తపస్తేజోమయ రూపయునగు పార్వతి తపమాచరించుచోట కేగిరి.
మునులు ఆ పార్వతితో ప్రీతిపూర్వకముగా ఇట్లనిరి: సర్వజనాదరణీయమును రమ్యమును మనోహరమును ప్రీతికరమునునగు నీరూపమును తపోగ్నితో దహించుకొనకుము. పుత్రీ! రేపటి ఉదయమే శంకరుడు నీపాణిని గ్రహించును. మేమందరమును వచ్చి ఈ విషయమును మీతండ్రిని అర్థించితిమి. నీవు నీతండ్రితో స్వగృహమేగుము; మేమును మా ఇండ్లకేగుదుము; ఇట్లు పలికిన సప్తర్షుల మాట విని పార్వతి తపమునకు ఫలము కలుగుననుట సత్యమయ్యెనని సంతసముతో దివ్య పదార్థ శోభితము అగు పితృ భవనమునకు త్వరితముగా ఏగెను. అచట ఆ హైమవతికి వరు నెప్పుడు చూచు నాయను తహతహతో ఆ రాత్రి పదివేల యేండ్లుగా తోచెను. తరువాత బ్రాహ్మ ముహూర్తమున ఆమె ప్రియసఖులు యథా సంప్రదాయముగ క్రమముతో సకల మంగళాలంకార సముదాయములతో ఆమెను అలంకరించిరి. బహు మంగళ భరితమగు మందిరమున ఆమెకు ఆయా అవయవములందు అనేకాభరణములు లంకరించ బడెను. ఆరు ఋతువులును మూర్తీభవించి సర్వకామముల పూరించుచు హిమవంతుని సేవిం చెను. వాయువులు కనపూడ్చెను; మేఘములు నీరు చల్లెను. లక్ష్మీదేవి ఆతని హర్మ్యములందు నానా పదార్థ సాధనములు అమర్చెను; సర్వ పదార్థములందును సర్వ భావములందును కాంతియు సమృద్ధియు వ్యాపించెను. చింతామణి మొదలగు రత్నములును పర్వతములును కల్పవృక్షాది మహావృక్షములును వచ్చి హిమవంతుని కొలిచెను. ఓషధులు దివ్యౌష ధములతో రసములతో ధాతువులతో కూడి మూర్తీభవించి హిమశైలమునకు కింకరు లయ్యెను. అతని కింకరులును ఆ శైలుని ఆజ్ఞానువర్తులై వ్యగ్రతతో పనులు చేయుచుండిరి. నదులును సముద్ర ములును సకల స్థిరచర ప్రాణి పదార్థ సముదాయమును హిమవంతుని మహత్త్వమును మరింత వృద్ధిపరచెను. ఇట్లు వివాహార్థము పార్వతి కలంకరణము జరుగుచుండ అట గంధమాదన పర్వతమున దేవతలందరును శంకరు నలంకరింపదలచి నిర్మలమూర్తులై సకలములగు అలంకరణ సంభారములు ధరించినిలిచిరి. వారిలో బ్రహ్మ విప్పారిన కన్నులతో శర్వుని జటా జూటమున ప్రేమోదర భావమున చంద్ర ఖండమును అమర్చెను. చాముండ (మాతృ దేవత) శివశిరమున విపులమగు కపాలమాలను కట్టెను. దైత్యేంద్రకుల హంతయై రక్తముతో మాకు తృప్తికలిగించు పుత్రునికనుము శంకరా! యని ఆమెశంకరుని దీవించెను. యముడు ప్రకాశిం చుచు శిరోరత్నములు కలదై అగ్నివలె స్ఫుటముగ ప్రకాశించు సర్పాభరణమును చేత ధరించి శంకరుని ముందు నిలిచెను. (వానితో శివునలంకరించెను. ) ఇంద్రుడును చెమర్చుచున్న విశాల ముఖపద్ముడై వనపూతకల కొనలుగల గజ చర్మమును ఉత్సాహముతో శివునిచే ధరింపజేసెను. వాయువు శివునికై వాహనముగా విశాలమయిన వాడి కొమ్ములు కలిగి హిమగిరివలె తెల్లనికాంతి కలదైన మనోహర వృషభమును అలంకరించెను. సూర్య చంద్రాగ్నులు శంభుని నేత్రాంత రాళమున నిలిచి జగత్కర్మసాక్షియగు ఆ దేవుని శరీరమున తమ కాంతినే విస్తరింపజేసిరి. యముడు కపాలమునందు వెండివలె మెరయు చితాభస్మమును తీసికొని తన చేతితో ఆ దేవుని కంఠమున మనుజాస్థిమయ మాలను కట్టి తనచేత గద ధరించి శివుని ఎదుటి భాగమున దూరముగా నిలువబడెను. కుబేరుడు స్వయముగా తెచ్చిన నానాకార మహారత్న భూషణమును వదలి ఈశుడు భయంకర సర్పేంద్రములు కడియముగానున్న తన చేతితో వాసుకుని తక్షకుని తన చెవికి ఆభరణ ములుగా తానే ధరించెను. స్థాణు (శివ) దేవుడు వరుణుడు తెచ్చినదై పూవులతో కూర్చిన మాలను కూడ ధరించుకొనెను. అంతట ప్రమథ గణాధీశులు వీరకునితో (అపేరుగల ద్వార పాలునితో) ఆయా పనులయందు వ్యగ్రమగు ఆకృతిగల వీరకా! నీవు శూలికిమారాక నివేదింపుమని వినయమున పలికిరి. సప్త సముద్రములును ఆయా ఆభరణములు సమకూర్చ బడిన ఈశుని లెస్సగా అలంకరించి అద్దపు విలాసమును సమకూర్పవేచి యుండెను.
ఈశుడు సముద్రజలములందు తన రూపు (అద్దమునందువలె) చూచికొనిన తరువాత హరి తనమోకాళ్ళు భూమినితాకునట్లు వంచి అతనితో: “దేవా! జగదానందదాయి యగు రూపముతో ప్రకాశించుచున్నావు” అనెను. ఇదే సమయమని మాతృకలును వైధవ్య లక్షణములతో ఉన్న మన్మథ పత్నియగు రతిని ఆయా ప్రకారముల ఇంగిత సంజ్ఞలతో ప్రేరించిరి. తరువాత రతి తమ్ము వేడుకొనగా వారు నవ్వు మొగములతో శివు నుద్దేశించి “దేవా! మదనుడు లేక రతి తమఎదుట కాంతిహీనయైయున్నది” అనిరి. అప్పటికే పార్వతీ ముఖ దర్శనోత్సుక మానసుడై యున్న శివుడు ప్రయాణోన్ముఖుడై ఆమెను కొంచెము వేచియుండుమని తెలుపుడని ఎడమచేతి వ్రేళ్ళ సైగతోనే మాతృకలకు తెలిపెను.