దేవతా విగ్రహ ప్రతిష్ఠాపన

(ఈ చెప్పబోపు ప్రక్రియను నేత్రోన్మీలనము, నేత్రోద్ధరణము అనగా కనురెప్పలు పైకెత్తుట, కనులు తెరచుట, కనులకు చూపు వచ్చునట్లుచేయుట, కనులకు ప్రకాశమును, జ్యోతిస్సును కలిగించుట మొదలగు పదములతో ఇందు వ్యవహరించి యున్నారు. దేవతా ప్రతిష్ఠా ప్రక్రియ యందు ఇది ముఖ్యాంశము)

దేవుని అర్చామూర్తిని (లింగమును) దర్భలు మొదలగు వానితో ఏర్పరచిన ప్రస్తరణము పై (పాన్పుపై) ఉంచి ఆ మూర్తికి నేత్రజ్యోతిస్సును ప్రకల్పింప (ఏర్పరచవలయును, సంక్షేపముగా ఈ అక్ష్యుద్ధరణ ప్రక్రియను (అక్షి+ఉద్ధరణము = అక్ష్యుద్ధరణము, కనులు పెకెత్తుట, మూతను తెరచుట అని యర్థము) తెలిపెదను - వినుడు; మూర్తిని తెల్లని పూవులతో అలంకరించి నేతితోను గుగ్గులతోను ధూపమిచ్చి అర్చించవలయును; తెల్లని ఆవలతోను నేతి పాయసములతోను మూర్తికి బలి (నివేదనము) జరుపవలయును. విప్రులనుకూడ అర్చించవలయును; యథాశక్తిగ వారికి గోవునో, భూమినో, బంగారమునో, దక్షిణగా స్థాపకునకు (ప్రతిష్టా ప్రక్రియలో ప్రధాన ఋత్విక్, అధ్వర్యుడు, గానున్న విప్రునకు) ఈయవలయును. తరువాత (స్థాపక) ద్విజుడు ఈ మంత్రముతో భక్తిపూర్వకముగా మూర్తికి లాంఛనము (మంత్రమును ఆ మూర్తిపై వ్రాయుట) జరుపవలయును.

మంత్రార్థము: సర్వమును ప్రణవాత్మకము, ప్రణవముకంటె వేరగునది ఏదియును లేదు; భగవానుడవును, వేదరూపుడవును, శుభకరుడవును, పరమాత్ముడవును హిరణ్య రేతస్కుడవును (స్వయం జ్యోతీరూప వీర్యము కలవాడవు) సర్వవ్యాపియును, సకల విశ్వరూపుడవును, సకల విశ్వములకు చూపును ప్రసాదించు వాడవును అగు నీకు నమస్కారము.

నేత్ర జ్యోతిః (నేత్రోన్మీలన) ప్రక్రియను జరుపునపుడు సర్వదేవతల విషయమునందును వినియోగింపవలసిన మంత్ర మిదియే, ఇట్లీ మంత్రమును పఠించుచు దేవుని ఆ మూర్తిలోనికి ఆవాహనము జరిపి (దేవుని ఆ మూర్తిలోనికి వచ్చి యండుమని ఆహ్వానించి) అదే సమయమున ఆమంత్రమును బంగారు ఉపకరణముతో మూర్తిపై విలిఖించవలయును. ఈ ప్రక్రియ సరిగా సిద్ధించుటకుగాను శాస్త్రసంప్రదాయముల నెరిగిన స్థాపకుడు మంగళవాద్య ధ్వనులను వేద ధ్వనులను పాటలు గానము మొదలగు వానిని జరిపించ వలయును; అమంగళకరములగునవి ఏవియు అచట జరుగకుండునట్లు చూచుకొనవలయును.