జగత్సృష్టి

ఋషీ-హింసాగత్యోః; అను ధాతువునుండి ఋషి అను శబ్దము సిద్ధించును. బ్రహ్మ (చతుర్ముఖ బ్రహ్మయును పరబ్రహ్మయును) విద్యా సత్యతపః శాస్త్ర జ్ఞానముల రాశి స్వరూపుడు కావున అతనికి ఋషి అని వ్యవహారము, పరమాత్ముడు తాను వివృత్తి (సృష్టిగా రూపొందుట) పొందిన సమయమునందే బుద్ధి రూపమున వ్యక్తుడై (స్పష్టరూపము నందినవాడై) నందున అతడు ఋషి; పరమము (సర్వోత్తమము) అగుదానిని ‘ఋషతే’ తెలిసికొనెను; కావున అతడు పరఋషి; ఇట్లే ‘గతి’ ‘గమనము - జ్ఞానము’ అను అర్థమును ఇచ్చు ‘ఋష’ ధాతువునుండి ఈ ఋషి శబ్ధము ఏర్పడినది కావుననే-స్వయముగా తానే జ్ఞానము పరమాత్మగా స్వయం సముద్భూత మయినది. కావున జ్ఞానమునకును ఋషి అని వ్యవహారము; ఇట్లే 1. బ్రహ్మ మానసపుత్రులగు మరీచి మొదలగువారు మైథున ప్రవృత్తితో పనిలేక స్వయముగా ఉత్పన్నులయిరి. వారును ఋషులు; వీరును వివర్తము పొందుచునే న్యాయముగా బుద్ధి (జ్ఞానము)తో వ్యాపింపబడిరి; కావున వీరు ఈశ్వర ఋషులు; (జ్ఞానమునకు అధీశ్వరులు); 2. ఈఈశ్వర ఋషులకు మానస పుత్రులుగాను-ఔరస (మైథునముతో జనించిన) పుత్రులుగాను కలిగినవారు కొందరు తాము పుట్టుచునే మహాజ్ఞానముతో (ఋషితో) వ్యాప్తులయిరి; కావున వీరు మహర్షులు; 3. భూతాది సృష్టికాలమున ఔరస సంతానముగా (మైథునముతో జనించినవారు కేవలఋషులు; 4. మైథు నముతో ఋషుల గర్భమునుండి జనించినవారు ఋషికులు; వీరు ఉత్కృష్టమగు విధమున భూతాది సృష్టి విషయములను తెలిసినవారు; 5. ఋషికుల ఔరస పుత్రులు ఋషి పుత్రులు; వతులను శ్రుతము (వినబడినవి)గా చేసికొని లోకమున ప్రచారము చేయువారు; శ్రుతి తత్త్వము నెరిగినవారు; కావున వీరు శ్రుతర్షులు అనబడుదురు.

ఇక సృష్టిక్రమ దశలను అసరించి పరతత్త్వము 1. అవ్యక్తాత్మా 2. మహాన్తాత్మా, 3. అహంకారాత్మా, 4. (సూక్ష్మ) భూతాత్మా, 5. ఇంద్రియాత్మా అని ఐదు విధములగును, ఈ చెప్పినవారిలో 1. ఈశ్వర ఋషులు అవ్యక్తాత్మను; 2. మహర్షులు మహాన్తాత్మను, 3. ఋషులు అహంకారాత్మను, 4. ఋషికులు భూతాత్మను; 4. ఋషిపుత్ర్తలు ఇంద్రియాత్మను స్వయముగా జ్ఞాన విజ్ఞానములతో ఎరిగినవారు.