గుడధేన్వాది దానములు

విశోక ద్వాదశీ కల్పమున ప్రాసంగికముగా పేర్కొనిన గుడధేనుదానము అనునది ఏమి? దాని స్వరూపమును విధానమును దానమున వినియోగించు మంత్రమును తెలుపుమని మనువు అడుగగా మత్స్య నారాయణు ఇట్లు చెప్పెను. సర్వపాప వినాశనమగు గుడధేను స్వరూపమును దాన విదానఫల వినియోజ్య మంత్రములను తెలిపెదను; వినుము.

నాలుగు మూరల పొడవుగల కృష్ణాజినము (నల్లని మచ్చలుగల ఇర్ఱిచర్మము)ను గోమ యముతో అలికి నాలుగువైపుల దర్భలను పరచిన ప్రదేశమున తూర్పు మొగము అగునట్లు పరచవలెను. అట్టి ప్రదేశముననే ఉత్తరమునకు మొగమగునట్లు చిన్న కృష్ణాజినము కూడ దానికి దగ్గరగా పరచవలెను. (మొదటిది ఆవుకొరకును-రెండవది దూడ కొరకును.) గుడముతో ఆవును దూడను చేసి తూర్పు మొగముగా ఆవును ఉత్తరపు మొగముగా దూడను నిలుపవలెను. యథాశక్తిగా ఆవును నాలుగు ‘బారువ’లు దూడను ఒక బారువ-ఇదే వంతున ఆవును రెండు బారువలు-దూడను అరబారువ-ఆవును ఒక బారువ దూడను పావు బారువ తూకముగల బెల్లముతో చేయవలెను. వీనికి ముత్తెపు చిప్పలతో చెవులు-చెరకుగడతో కాళ్లు-ముత్తెములతో కండ్లు తెల్లని దారములతో నాడులు-తెల్ల కంబళితో గంగడోలు-పలుచని రాగి రేకుతో మొగము- వీపు- తెల్లని చామరముతో తోక కుచ్చు- పగడములతో కనుబొమలు- వెన్నతో చన్నులు- పట్టుదారముతో తోక కాడ- కంచుపాత్రతో పొదుగు-ఇంద్రనీలముతో కను గ్రుడ్లు- బంగారు కొమ్ములు వెండి గిట్టలు సంపెంగ పూలతో ముక్కులు అమర్చవలెను. వాని ముందు నానా ఫలము లుంచవలెను. ఇట్లు సిద్ధపరచిన ఆ ఆవును దూడను గంధ ధూప దీపాదికముతో నైవేద్యముతో అర్చించవలెను.

పిమ్మట ఈ అర్థమునిచ్చు మంత్రముతో వాటిని ప్రార్థించవలెను. (మంత్రార్థము: ) సర్వ భూతములందును సర్వదేవతలయందును సర్వదేహములందును ఉన్నదియై శంకరుని ప్రియురాలగు రుద్రాణిగా విష్ణుని వక్షస్సునందు లక్ష్మిగా అగ్నియందు స్వాహాగా చంద్ర రవి నక్షత్ర తారలయందు కాంతిరూపయగు లక్ష్మిగా చతుర్ముఖునందు వాణిగా కుబేరునందు ధన ముగా లోకపాలురయందు ఆయా రూపములతో లక్ష్మిగా పితృదేవతలయందు స్వధారూపగా నున్న లక్ష్మియే ధేను రూపముననుండి నాపాపమును పోగొట్టుగాక! సర్వపాపహరయగు దేవీ: లక్ష్మీ! ఇట్టి నీవు నాకు శాంతిని ఇమ్ము.

ఇట్లు ఆగుడ ధేనువు నామంత్రించి దానిని బ్రాహ్మణునకీయవలయును.

పాపహరములగు ధేనువులు ఇట్టివి గుడ-ఘృత-తిల-జల-రస-ధాన్య- శర్కరా-లవణ- రత్న-స్వరూప (గోరూప) ధేనువులనునవి పది కలవు. సువర్ణ- నవనీత తైల ధేనువులను కూడ కొందరు మహర్షులు చెప్పినారు. వీటిలో ద్రవ ధేనువులను అవి నింపిన మట్టి కడవలలో (చిన్న పాత్రలతోకాని) అమర్చవలెను. గట్టి ద్రవ్యములైనచో రాసులుగా అమర్చవలయును. అన్నిటి విషయమునను ఇదే విధానము; ఇవే మంత్రములు. ఆవాహనాది పూజలతో ఆయా పర్వములందవి ఈయవలయును. గుడధేను ప్రసంగమున ఇవి చెప్పుటయైనది. ఇవి అన్నియు సర్వపాపహరములు; అనేక యజ్ఞ ఫలప్రదములు.

విశోక ద్వాదశీ వ్రతము వ్రతములలో నెల్ల ఉత్తమమయినది. దానికి అంగభూతము ఈగుడధేను దానము. ఈధేను దానములు ప్రత్యేకముగా ఈయవలెనని(ఉత్తర-దక్షిణ) ఆయన ములు-విషువ (రాత్రింబవళ్ళు సమముగా ఉండు) కాలము వ్యతీపాత యోగమున్న దినము-ఇట్టివి తగిన కాలములు.

ఈ విశోక ద్వాదశి పుణ్యప్రదము-సర్వపాపహరము-శుభకరము, ఈ దినమున ఉపవాసము ముక్తిప్రదము. దీనిచే ఇహమున ఆయురారోగ్య సౌభాగ్యములు-మరణ కాలమున (ఇది చేసినవారికి) హరిస్మరణ మాత్రమున విష్ణులోక ప్రాప్తి కలుగును. ఇరువది ఏడువేల అర్బుదముల సంవత్సరములపాటు దారిద్య్రమును తీవ్ర దుఃఖములును లేక సుఖింతురు. నృత్తగీతాది పూర్వకముగా నియమముతో ఈ వ్రతము చేసిన స్త్రీకిని ఈ ఫలము కలుగును. కనుక హరి ఎదుట నృత్తగీతములు భక్తితో చేయుట కర్తవ్యము. దానిచే సకల సంపదలును ముక్తియు లభించును.

ఈ వ్రతమును వినినను చదివినను ఇతరులకు తెలిపినను చూచినను కల్పకాలము ఇంద్రలోకమున దేవపూజితుడై సుఖించును.