స్తంభమాన వినిర్ణయము

సూతుడు ఋషులతో ఇట్లుచెప్పెను. ఇకమీదట స్తంభమాన వినిర్ణయమును తెలిపెదను. భవనపు ఎత్తును ఏడుతో గుణించి ఎనుబదితో భాగించగా అగు నన్నిమూరలు స్తంభపు మందముగా ఉండవలెను. స్తంభపు బోదె ఇంకను ఎక్కువ మందముతో ఉండవలెను, అది ఎట్లన; భవనపు ఎత్తును తొమ్మిదితో గుణించి ఎనుబదితో భాగించగానైనన్ని మూరలు స్తంభపుబోదె మందము. స్తంభపు ఆకృతి చతురస్రమయినచో ‘రుచకము’ అష్టాస్రమయినచో ‘వజ్రము’ షోడశాస్రమయినచో ‘ద్వివజ్రము’ ద్వాత్రింశాస్రమయినచో ప్రలీనకము’ మధ్యప్రదేశమున వృత్తాకృతితో నున్నచో ‘వృత్తము’ అనబడును, సర్వవాస్తు లందును ఈ ఐదు విధముల మహా స్తంభములును ప్రశస్తములు; స్తంభపు ఎత్తులో పదియవవంతు (ప్రదేశము)ను పద్మములు వల్లులు లతలు కుంభములు పత్రములు అద్దములు - వీని శిల్పముతో అలంకరించవలెను; స్తంభ మెంత మందముండునో అంతేమందమున దూలము (తుల) ఉండవలయును; (ఉపతులలు) చిరుదూలములు (వీనిని ఎల్లవలు అందురు.) ఈ పెద్ద దూలపు మందములో మూడవ వంతుగాని నాలుగవ వంతుకాని క్రమముగ తగ్గుచు పోవలెను; నివాస గృహములకు దక్షిణ దిక్కు నుండి ప్రవేశించుట ప్రశస్తము, అందులకై ఉండవలసిన ద్వార స్థానములు ఏవో తెలిపెదను; తూర్పు దిక్కున ఇంద్ర జయంత స్థానములు మంచివి; సర్వవిధములగు వాస్తుల యందును ద్వారా వేధ (వాకిటికి ఎదురుగ ఏదయిన తనది కానిది ఉండుట) లేకుండ చూచుకొనవలయును; రథ్యా (నాలుగు వీధులు కలియు చోటి) వేధ సర్వ వంశనాశమును వృక్షవేధ శత్రు విస్తారమును పంక (బురద) వేధ శోకమును కూపవేధ అపస్మార రోగమును ప్రస్రవణ (సెలయేటి- నీటిబుగ్గల) వేధ వ్యథను కీల(రెండు వస్తువుల అదుకునకై కాని హద్దుల నిర్ణయమునకై కాని నాటిన రాళ్ళు దారువుల వంటి - వీథి దీపస్తంభముల వంటి-వాని) వేధ అగ్ని భయమును, దేవతావేధ వినాశమును, స్తంభమున్నచో స్త్రీకృత దుఃఖమును గృహవేధ, గృహస్వామి నాశమును అమేధ్యము (పెంట)లతో అవస్కరము (కసపు) లతో వేధ ఇల్లాలికి వ్యభిచారిణీత్వమును అంత్యజ గృహవేధ అస్త్రభయమును కలిగించును; ఇంటిఎత్తు ఎంత యుండునో ఇంటినుండి అంతకు రెట్టింపు దూరములో వేధలు ఉన్నను వానివలన దోషము కలుగనేరదు.

ద్వార నిర్మాణమునందలి దోషమువలన తలుపు తనంతటతానే తెరచుకొనుచున్నచో ఆ గృహవాసులకు ఉన్మాదమును మూసికొనుచున్నచో కులనాశమును కలుగును; ద్వారము శాస్త్రోక్త పరిమాణముకంటె అధిక పరిమాణములో ఉన్నచో రాజభయము-తక్కువ పరిమాణముతో నున్నచో చోరభయము; వాకిటిపై వాకిలియున్నచో దానికి మృత్యు ముఖమని పేరు. తలవాకిటి కంటె లోపలి వాకిండ్లు పెద్దవిగ నున్నచో అట్టితలవాకిటికి సంకటమనియు ఈ పెద్దదిగా నున్న లోపలి వాకిటికి వజ్రమనియు వ్యవహారములు; ఇట్టిదోషముచే గృహస్వామి సద్యోమృతి నందును, ఇట్లు తలవాకిలి ఇతర ద్వారములచే పీడితమగుట బహుదోషకరము; కావున ఎన్నడును మూల(ప్రధాన)ద్వారము కంటె ఇతర ద్వారములు ఏవియు పెద్దవిగ నుండరాదు; మూల ద్వారమును అనుదినమును పూర్ణకుంభముతో శ్రీపర్జిలతతో ఇతరులతా విశేషములతో శోభింపజేయుచుండవలయును, బలులతోను అక్షత ఉదకములతోను పూజించు చుండవలయును; ఇంటికి తూర్పున మర్రి, దక్షిణమున ఉదుంబరము (మేడి), పడమట రావి, ఉత్తరమున జువ్విచెట్టు ఉండుట శుభము; ఇవికాక మరేవయినను ముండ్ల చెట్లు పాలుకలచెట్లు అసనవృక్షము మరేవయిన నిషిద్ధ ఫలవృక్షములు ఇంటి ఆవరణమునకు లోపలనున్నచో భార్యా హానియు సంతాన హానియు నగును. కాని అవి వానియంతట అవియున్నచో వానిని నరుకరాదు; వాని నడుమ మంచి వృక్షములను తెచ్చి నాటవలయును; పున్నాగము, అశోకము, వకుళము (పొగడ) జమ్మి, తిలక వృక్షము, సంపెంగ, దానిమ్మ, పిప్పలి, ద్రాక్ష మరేవయిన పూల పొదలు నిమ్మ, పోక, పనస, మొగలి, జాజి, తామర, నూరురేకుల తారమ, మల్లె, కొబ్బరి, అరటి, పాటలా - ఇట్టి వృక్షములు లతలు ఇంటి ఆవరణములో నుండుట గృహశోభాకరము.