మత్స్య మహా పురాణము
పంచలాంగలక (నాగళ్ళ) దాన విధానము
శ్రీమత్స్యుడు మనువున కిట్లు చెప్పెను, ఇపుడు ఇక అను (అత్యు)త్తమమగు పంచ లాంగలక దానమను మహాదానపు విధానమును తెలిపెదను. అది మహాపాతక నాశనము; యుగాది మన్వాది చంద్రసూర్యగ్రహణాది రూపమగు పుణ్యతిథియందు లాంగల పంచకముతో కూడ భూదానము చేయవలయును, దానముచేయు భూపరిమాణము పంట, పైరులతో నిండిన దగు 1. ఖర్వటము (పర్వత సమీప గ్రామము) 2. ఖేటము (చిన్న పల్లె - గూడెము); 3. గ్రామము, 4. నూరు నివర్తనములు; 5. దానిలో సగము - వీనిలో నేదయిననై ఉండవలెను, విచక్షణుడగు దాత బలముగల దారువుతో ఐదు నాగళ్లను వానికి కావలసిన సర్వోప కరణములతోను అవికాక ఐదుపలములకు పైగా వేయి పలములకు లోపల తూకము గల బంగరుతో ఐదునాగళ్ల ప్రతి మలను చేయించవలయును, కొయ్య నాగళ్లకై మంచి లక్షణములు కలవియు బాగుగ బరువు మోయగలవియు అగు పది ఎద్దులను కూడ వేరుగ ఉంచి వాటికి బంగరు కొమ్ముల సొమ్ములను నాగళ్లకు ముత్తెపు సొమ్ములను వెండితో పాదాగ్రపు (గిట్టల) సొమ్ములను వెండి తిలకములను ఎర్ర పట్టువస్త్రపు గవుసెనలను మాలలను దండలను చందనాలంకారములను కూర్చి, వాటిని శాలయందు నిలిపి అధివాసనము జరుపవలయును, పర్జన్యుని ఆదిత్యులను రుద్రుని ఉద్దేశించి గురుడు ఒకే కుండయందు చరుపాయసమును నిర్వహించి నివేదించవలయును; పలాశ సమిధలను ఆజ్యమును నల్లనూవులను కూడ వేల్చ వలెను; తులాపురుష దానమందువలెనే లోకపాల ఆవాహనము చేయవలయును; తరువాత మంగళవాద్య వైదిక ధ్వనులతో బ్రాహ్మణులచే స్నానము చేయించుకొని యజమానుడు తెల్లని వస్త్రములను పూలను ధరించి ద్విజదంపతులను ఆహ్వానించి వారిని బంగరు దండలతో ఉంగరములతో కడియములతో మురుగులతో మణులతో పట్టు వస్త్రములతో పూజించవలయును; ఉపస్కరములతో కూడ శయ్యను ఒక పాడి ఆవును వారికి ఈయవలెను; అంతకుముందే అష్టాదశ ధాన్యములను అధివాసనము చేసియుండి, ఈ చెప్పిన సర్వసామగ్రిని అగ్నిని బ్రాహ్మణు లకు త్రిః ప్రదక్షిణించి దోసిట పూవులు పట్టుకొని ఈ మంత్రము నుచ్చరించుచు అవన్నియు ఆచార్యుడు మొదలగువారికి ఈయవలెను.
“సర్వ దేవగణములును చరస్థావర భూతములును ధురంధరమగు నాగళ్ల అవయవములందే యుండును, కావున అట్టివాని దయచే నాకు శివునియందు భక్తి కలుగుగాక! ఇతర దానము లేవియు భూదానములో పదారవ పాలునకు సరిపోలవు; కావున ఆ దానపు మహిమచే నాకు ధర్మమునందు దృఢభక్తి కలుగుగాక!”
ఏడు మూరల పొడవు ఒక దండము అనియు ముప్పది దండములు చదరపు భూమి నివర్తనమని వ్యవహారమనియు దానినుండి మూడవవంతు తగ్గినది గోచర్మ పరిమాణమనియు ప్రజాపతి వ్యవస్థ చేసియుండెను. అనగా 40000 చదరపు మూరలు నివర్తనము. ఈమానముల ననుసరించి నూరు నివర్తనముల భూమిని దానము చేసిన వానికి పాపరాశియంతయు శీఘ్రమే క్షీణించును; శక్తిలేనిచో ఏబది నివర్తనములో గోచర్మ మాత్రమో భవనమునకు సరిపోవు మాత్రమో ఐనను ఇచ్చినచో పాపముక్తియగును, ఇట్లు భూమి ప్రదానము చేసిన మానవుడు ఆ భూమియందు ఎన్ని నాగటి చాళ్లు ఏర్పడునో దాన మిచ్చిన పాడియావు శరీరమందలి రోమము లెన్ని యుండునో అన్ని సంవత్సరములు శివనగరమున వసించును. గంధర్వ కిన్నర సురాసుర సిద్ధ సంఘములు చామరములు వీచుచుండు మహావిమాన మారోహించి అమర నాయకుడై పితృపితామహ బంధుయుక్తుడై శివపురమునకేగి అట సంపూజితుడై సుఖించును; గోవును భూమిని లాంగలములను వాటి ధురంధరములగు (బరువును లాగు) ఎద్దులను దానమిచ్చుటతో కలుగు పుణ్యఫలముతో పోల్చినప్పుడు యాగాది పుణ్య కార్యములచే లభించు ఇంద్రత్వాది పదములు కూడ క్షీణించునవియే అగును, అందువలన పాపరాశి పటలమును క్షయింప జేయునదియు భూతిభవము (అభ్యుదయ నిః శ్రేయసన వృద్ధి) ఉద్భవింపజేయునదియు అగు భూదానము చేయవలయును.