కౌశిక పుత్త్రులకు బ్రహ్మలోకప్రాప్తి

ఋషులు సూతునితో నిట్లు పలికిరి, “భూలోకమునందలి ఇందరిలో ఈ బ్రహ్మదత్తుడు ఒకడు అపురూపముగా ఎట్లు ఆయా ప్రాణుల ధ్వనులను వాటి అర్థములను తెలిసికొనగల వాడయ్యెను? ఈ ఏడు చక్రవాక పక్షులలో ఈ ముగ్గురును కాక మిగిలిన నలుగురును ఎవరి వంశమునందు జన్మించిరి?”

సూతుడు ఇట్లు చెప్ప నారంభించెను, బ్రహ్మదత్తుడు ఉండెడి ఆ పాంచాల రాజధానీ పురమునందే విద్యాచండుడను వృద్ధ బ్రాహ్మణుడుండెను. అతడు తనపేరునకు తగినట్లు సకల విద్యలయందు చాల సమర్థుడగు విద్వాంసుడు. ఆయా విషయములను తెలిసికొనవలెనను జిజ్ఞాసయు, కుతూహలమును కలవాడు. చాలదరిద్రుడు. ఆపదలలోను కలతపడని గుండె నిబ్బరము కలవాడు. విద్యల తత్త్వమును ప్రపంచ తత్త్వమును, భగత్తత్త్వమును ఎరిగినవాడు. ఈ వైరాగ్యముగల నాలుగు చక్రవాక పక్షులును ఆ బ్రాహ్మణునికి కుమారులుగా జన్మించిరి. వీరు పూర్వజన్మ స్మరణము కలిగిఉండిరి. వారికి నలుగురకును తపస్సు చేసికొనవలెనను సంకల్పము కలిగెను. మేము తపస్సాచరించి ఉత్తమసిద్ధిని పొందదలచి ఉన్నాము అని వారు తమ తండ్రితో పలికిరి. ఆ మాట విని మహా తపస్సంపన్నుడగు ఆ విద్వాంసుడు దీనవచనము లతో ఇట్లు పలికెను: “నాయనలారా! ఇది ఏమి? మీకు కలిగిన ఈ సంకల్పము ధర్మానుకూల మయినదికాదు. వృద్ధుడును, దరిద్రుడును అగు తండ్రిని వదలిపోవుటచే మీకు లభించు ధర్మము ఏమున్నది? దీనివలన ఏ మానవునకుగాని ఏ సద్గతి లభించును?”

కుమారులు తండ్రితో ఇట్లనిరి! “నాయనా! నీకు తగిన జీవనవృత్తి (భగవంతునిచే) ఏర్పరుపబడియే యున్నది కదా! మా ఈ వృత్తాంతమును రాజునకు తెలుపుము. అతడు నీకు పుష్కలముగా ఇచ్చును. ఉదయకాలమున వేదాదికమును పఠించునట్లు ఏర్పాటుచేసి రాజు నీకు వేలకొలది గ్రామములను జీవనమునకై ఈయగలడు. మొదట కురుక్షేత్రము నందు సప్త బ్రాహ్మణులుగా తరువాత దశపురమునందు వ్యాధులుగా పిమ్మట కాలంజరపర్వతమున లేళ్లుగా అటుపిమ్మట మానససరస్సునందు చక్రవాక పక్షులుగా జన్మించిన మేము ఈ జన్మమున ఇట్లు జన్మించి సిద్ధి పొందనున్నాము.”

ఇట్లు తండ్రితో పలికివారు తమసంకల్పము ననుసరించి తపస్సు ఆచరించుటకు వనమునకు పోయిరి. వృద్ధ బ్రాహ్మణుడగు విద్యాచండుడును తనకుమారులు చెప్పినట్లు రాజు దగ్గర తన పనిని చూచుకొనుటకు రాజసభకు పోయెను.