మత్స్య మహా పురాణము
క్రౌంచ ద్వీప వర్ణనము
ఇకమీదట క్రౌంచ ద్వీపపు యథాస్థితిని వివరింతును. కుశద్వీపపు వైశాల్యముకంటె క్రౌంచ ద్వీప వైశాల్యము ద్విగుణము. దీనిచుట్టు చక్రము చుట్టు నేమి (బండి పట్టాయును దానికి లోపల నుండునదియు చక్రపు ఆకులను అమర్చిన పూటీలు అనబడు దారు ఖండముల అమరికతో ఏర్పడినదియు అగు వృత్తాకృతియును) వలె వృత్తాకృతి గల ఘృతోదక సముద్రము చుట్టియున్నది. ఈ సముద్రము విస్తారము (మండలము) నందు క్షీరోదక సముద్రమునకు ద్విగుణము. దీనియందలి నరులు శ్రేష్ఠులు,
దీనియందు వర్ష పర్వతములు: 1. క్రౌంచము; 2. పావకము, 3. అండకారము; 4. దేవవాన్; 5. దేవకోటి; 6. గోవిందము; 7. పుండరీకము. ఇవన్నియు రత్నమయములును ఒకదాని నడిమి వ్యాసము కంటె ద్విగుణమగు వ్యాసము (విష్కంభము) కలవియు.
దీనియందలి వర్షములు: 1. కుశలము; 2. అనుగము; 3. ఉష్ణము; 4. పావనకము; 5. అండకారము; 6. మునిదేశము; 7. చంద్రనిఃస్వనము.
ఈ ద్వీపము రక్తాంత-రంగ (ఆపిల్) నారంగ (ఆరెంజ్),-ప్రియంగు-వృక్షములతో వ్యాప్తము. సిద్ధులు చారణులు దేవతలు తరచుగా కలిగిన శుచియగు దేశమిది.
ఈ ద్వీపమున ప్రతివర్షమునందును వ్యాపించి ప్రవహించు నదులేడు గలవు. 1.గౌరి; 2. కుముద; 3. సంధ్య: 4. రాత్రి; 5. మనోరమ; 6. ఖ్యాతి; 7. పుండరీక; ఇవి అన్నియు గంగా భేదములే; దీని సమీపముగా ప్రవహించుచు ఈ ప్రధాన నదులలో కలియు చిన్న నదులు నదములు వేలకొలది అట గలవు. ఇవన్నియు బహూదకములు; అచటి దేశ భేదములు-వాని స్వభావము మొదలగునవి సవిస్తారముగా చెప్పవలెననిన నూర్ల ఏండ్లయినను చాలవు. అచటి ప్రజలకు ఉపద్రవములుకాని అచటివారు ప్రళయమునకులోగా నశించుట కాని యుండదు.