స్నాన విధి

మనో నిర్మలత్వమును మనఃశుద్ధియు స్నానము లేనిదే కలుగవు. కావుననే పెద్దలు స్నానమును మొదటిదానిగా విధించిరి. పైకి తీయనినదులనీటితోగాని తీసిన(బావుల) నీటితో గాని స్నానము చేయవచ్చును. మొదట సంప్రదాయము నెరిగి ‘నమో నారాయణాయ’ అను మూల మంత్రముతో తీర్థకల్పనము చేసికొనవలెను. ఎట్లన నాలుగుమూరల కొలతతో చతురస్రముగ తన చుట్టును తీర్థప్రకల్పనము చేసికొని ఈ మంత్రములతో దానియందు గంగ నావాహనము చేయవలెను! ‘నీవు విష్ణుపాదమునుండి పుట్టితివి; విష్ణుసంబంధినివి; విష్ణువే నీ కధిష్ఠానదేవత; కావున అట్టి నీవు ఆజన్మమరణముగా మమ్ములను పాపములనుండి రక్షింపుము. వాయుదేవుడు పేర్కొన్న భూమ్యంతరిక్షద్యులోకము లందలి మూడున్నర కోట్ల తీర్థములును నీయందున్నవి. భూలోకమున నందిని-ద్యులోకమున నళిని అని నీ పేరులు. ఇవికాక దక్షా-పృథ్వీ-విహగా-విశకామా-శివ్వప్రదా-విద్యాధరా-సుప్రసన్నా-లోకప్రసాదినీ-క్షేమ్యా-జాహ్నవీ శాంతిప్రదాయినీ (ఆనందము కలిగించునది-పద్మములు కలది-సమర్థురాలు విశాలమయినది-ఆకాశమున సంచరించుచున్నది-అన్ని కోరికలు తీర్చునది-శుభము ఇచ్చునది-విద్యలను ధరించునది-మిగుల తేటయైనది-లోకములకు ప్రసన్నత-తేటదనము కలిగించునది-క్షేమము కలిగించునది-జహ్ను ముని నుండి వెలికి వచ్చినది-జహ్నుముని కూతురు-శాంతి నిచ్చునది) స్నాన కాలమున ఈ పుణ్య నామములను కీర్తించుటచేత త్రిపథగా (తూర్పునకు-పడమరకు-పాతాళమునకు-పోవు మూడుత్రోవలు కలది) అగు గంగ సన్నిహితయగును; ఇట్లు స్నానీయ జలమును ఏడు మార్లభి మంత్రించి దోసిట నింపుకొన్న ఆనీటిని మూడుకాని నాలుగుకాని ఐదుకాని సారులు తలపై పోసికొనవలెను. అట్లే మృత్తికను అభిమంత్రించి అది రాచికొని కూడ స్నానము చేయవలెను. (మంత్రార్థము) అశ్వములచే రథములచే విష్ణునిచే పాదములు ఉంచబడినదియు ధనమును ధరించునదియు అగు మృత్తికా! నేను చేసిన దుష్కృత సిద్ధ పాపములను పోగొట్టుము. వరాహరూపుడు, నల్లనివాడు, శతబాహుడు అగు విష్ణునిచే ఎత్తబడినావు; నీకు నమస్కారము; ఇట్లు స్నానమాడి యథావిధానముగ ఆచమించి తెల్లని శుద్ధ వస్త్రముల ధరించి త్రిలోక (స్థితదేవతాదుల) తృప్తికై తర్పణము (తృప్తి కలిగించునది) ఈయవలెను.

(మంత్రార్థము) దేవ యక్షనాగ గంధర్వాప్సరః సురక్రూర సర్పసువర్ణ (గరుడ) తరు (చెట్టు) జంగమ(సంచరించు ప్రాణులు) ఖగ(పక్షులు) విద్యాధర జలధరా (మేఘములు) కాశగామి ప్రాణులు-ఇవి అన్నియును నిరాధార జీవులును ధర్మరతులగువారును తృప్తి నొందుటకీ తర్పణ మిచ్చుచున్నాను అనుచు ఉపవీతముగా దేవతర్పణముచేసి పిమ్మట నివీతముగా ఉండి భక్తితో మనుష్యులకును సనకసనందన సనాతన కపిలాసురివోడు పంచశిఖులనెడు బ్రహ్మపుత్రులగు ఋషులకు మరీచ్యత్ర్యంగిరః పులస్త్య పులహక్రతు వ్రచేతో వసిష్ఠ భృగునారదులను దేవర్షి బ్రహ్మర్షులకు అక్షతోదకములతో తర్పణము నీయవలెను. తరువాత అపసవ్యముతో ఎడమ మోకాలిని నేలపై తాకించి అగ్నిష్వాత్త సౌమ్య హవిష్మత్ ఊష్మపసుకాలిన్ బర్హిషద్-ఆజ్యపులు అనెడు పితృ దేవతావర్గములకు తన పితరులకు భక్తితో తిలచందనోదకములతో తర్పణ మీయవలెను. ప్రాణులను నియమించువాడు ధర్మముతో రంజింప జేయువాడు మృత్యురూపుడు అంతమొందించువాడు సూర్యపుత్రుడు నల్లనివాడు సర్వభూతనాశకుడు ఔదుంబరదఘ్న నీల-పరమేష్ఠి వృకోదర చిత్ర చిత్రగుప్త నామములతో వ్యవహరింపబడు నీకు తర్పణమనుచు యమునకు ఆయా నామగోత్రములతో పితృ పితామహ మాతామహాదులకు తర్పణమిచ్చి “ఈ జన్మ మందో పూర్వజన్మములందో నాకు బంధువులో బంధు బంధువులో అగువారు నానుండి తృప్తికోరు పితరులెవ్వరైనను తృప్తి చెందుదురుగాక!”యని దర్భపాణియై అందరకు తర్పణ మీయవలెను.

తరువాత యథావిధిగా ఆచమించి తన ముందు పద్మమును లిఖించి దానిపై సూర్యనామ కీర్తన పూర్వకముగా పుష్పాక్షతరక్తచందన సహితముగా సూర్యునకు అర్ఘ్యము నీయవలెను. (నామార్థములు): విష్ణురూపుడు, విష్ణుముఖుడు, సహస్రకిరణుడు, సర్వతేజోరూపుడు, శుభకరుడు, సర్వేశుడు, అందరయందు వాత్సల్యము కలవాడు, లోకప్రభువు, దివ్య చందనభూషితుడు, పద్మాసనుడు-కుండలములతో భుజకీర్తులతో భూషితుడు సర్వలోకేశుడు సర్వజగముల మేల్కొలుపు వాడు సర్వసుకృత దుష్కృతసాక్షి సర్వవ్యాపి సత్యదేవుడు తేజో నిర్మాతయగు రవీ! నీకు నమస్సులు-అనుచు రవికి అర్ఘ్యము ఇచ్చి ముమ్మారు ప్రదక్షిణించి నమస్కరించి బ్రాహ్మణుని గోవును బంగారమును తాకి తరువాత విష్ణ్వాలయమునకు పోవలెను.