శుక్రగురు పూజా విధానము

పిప్పలాదుడు యుధిష్ఠిరునితో ఇట్లు చెప్పెను, భూపాలా! ఇక ఇప్పుడు యాత్రారంభావ సానములందు ప్రతి శుక్ర (చుక్క ఎదురు) (దోష) ప్రశాంతికై శుక్రోదయ సమయమందు చేయవలసినది చెప్పెదను. బంగారుతోకాని వెండితోకాని కంచుతోకాని చేసిన పాత్ర (పళ్లెర) మందు తెల్లని వస్త్రము పరచి తెల్లని బియ్యము నింపి శుక్రుని రజత ప్రతిమను పులు కడిగిన ముత్తెములను దానియందుంచి ఈ అర్థము నిచ్చు మంత్రముతో అవి అన్నియు సామవేదియగు బ్రాహ్మణునకు దానమీయవలెను. “సర్వలోకేశా! భృగునందనా! కవీ! నీకు నమస్కారము. అర్ఘ్య మందుకొని మాకు సర్వార్థసిద్ధి కలిగించుము.” ఇట్లు చేసినచో అన్ని కోరికలును (ఇహమున) తీరి విష్ణులోకమున పూజితుడై సుఖించును.

ఇట్లు సోమాలికములు వటుకములు పూరికలు అపూపములు శనగలు వీనితో శుక్రుని పూజించు నంతవరకును ఇంటిలో స్త్రీలును క్రొత్త పంట ధాన్యపు అన్నమును తినరాదు. ఇట్లు నియమమును పాటించినచో సర్వార్థసిద్ధి కలుగును.

యుధిష్ఠిరా! ఇట్టిదే బృహస్పతి పూజయు కలదు. అది చెప్పెదను. బంగారు పాత్ర (పళ్లెర) మందు గురుని స్వర్ణ ప్రతిమను పచ్చని పట్టు వస్త్రము చుట్టి నిలుపవలెను. యజమానుడు ఆవాలతో (ఆవపిండి-ఆవనూనెలతో) మోదుగ-రావి-చిగుళ్ల ముక్కలతో కూడిన పంచగవ్య మిశ్రితజలముతో స్నానమాడి పీతాంబరములు ధరించి నేతితో (బృహస్సతి నుద్దేశించి) హోమము చేయవలెను. బ్రాహ్మణునికి నమస్కరించి గోవును ఈ చెప్పిన సామగ్రిని దాన మీయవలెను. (మంత్రార్థము) “పచస్సులకు నాథా! వాక్పతీ! బృహస్పతీ! క్రూరగ్రహ పీడితులను రక్షించువాడా! నమస్కారము.”

సంక్రాంతి (బృహస్పతికాని రవి కాని రాశియందు ప్రవేశించు) సమయమందును యాత్రాకాలమునందును అభ్యుదయ (శుభ) కర్మారంభములందును బృహస్పతి పూజ చేయువారికి సర్వకామములును సిద్ధించును. (యాత్ర-రాజులు యుద్ధములకై కాని రాచరికపు పనులకై కాని బయలుదేరుట; లేదా స్త్రీలు పుట్టినింటికో అత్తవారి ఇంటికో బయలుదేరుట; లేదా వ్యాపారమునకో వ్యవహారమునకో తీర్థక్షేత్రాది సేవకో బయలుదేరుట)