చౌర్య ప్రాయశ్చిత్తము

దొంగతనముతో వస్తువులను అపహరించినవారి దోష పరిహార ప్రకారము చెప్పెదను వినుము, ద్విజుడు బుద్ధిపూర్వకముగా తన జాతివారి ధాన్యాన్న ధనములలో ఏవి దొంగి లించి నను, కృచ్ఛార్ధ మాచరించవలయును; స్త్రీలను పురుషులను క్షేత్ర (పొలము) గృహములను కూపవాపీస్థజలములను దొంగిలించినచో చాంద్రాయణముచే శుద్ధి యగును, అల్ప సారములగు ద్రవ్యముల నితరుల గృహములనుండి హరించినచో సొంతపన కృచ్ఛమాచరించవలయును, భక్ష్య భోజ్య శయ్యా ఆసన పుష్పమూల ఫలాదులు హరించినచో పంచగవ్య ప్రాశనముతో శుద్ధి యగును; గడ్డి, కట్టెలు, చెట్లు, శుష్కాన్నము అనగా ఎండు జొన్నరొట్టె మొదలగునవి, వస్త్ర, చర్మ, మాంసములు దొంగిలించినచో త్రిరాత్రోపవాసముతో శుద్ధుడగును, మణిముక్తా ప్రవాళ స్వర్ణరజతాయః అనగా ఇనుము, కాంస్యోపలములు దొంగిలించినచో పండ్రెండునాళ్ళు బియ్యపు నూకల అన్నము తినవలెను, దూది (కీటజము-పురుగుల నుండి వచ్చునది) పట్టును ఉన్నిని రెండు గిట్టలు గల ఒక-గిట్ట గల ప్రాణులను, పక్షులను, గంధ ద్రవ్యములను ఓషధులను దొంగిలించినచో మూడు దినములు క్షీరాహారముతో ఉండవలెను; దొంగతనముచే కల్గు పాపముల నీవ్రతములతో పోగొట్టుకొనవలెను.