మత్స్య మహా పురాణము
రత్న పర్వతదానము
ఈశ్వరుడు నారదునకు ఇట్లు తెలిపెను, ఇక మీదట రత్న పర్వత దానము విషయమును తెలిపెదను. ఇది అత్యుత్తమమయినది. దీని నాచరించినవారు సర్వోత్తమమగు విష్ణులోక మేగుదురు. వేయికాని, ఐదువందలుకాని, మూడువందలు కాని ఫలముల ముత్తెములు దీనికై వినియోగించవలెను. మొత్తము తూకములో నాలుగవ వంతుతో విష్కంభ పర్వతముల నాలుగు దిక్కులందు చేయవలెను. తూర్పున వజ్రములతో గోమేదములతో మందరమును దక్షిణమున ఇంద్ర నీలములతో పద్మరాగములతో గరుడ పచ్చలతో సుపార్శ్వ పర్వతమును నిర్మించవలెను. మంత్రములు అర్చన విధానము బంగారుతో వృక్షములు దేవతలు వారి నావాహనము చేయుట అన్నియు ధాన్య పర్వతమునందు వలెనే. దానదినపు ఉదయమున మత్సరము లేక లోగడ చెప్పినట్లే గురునకును ఋత్విక్కులకును మేరువును విష్కంభ పర్వతములను దానమీయవలెను. (దానమంత్రము) దేవతలందరు అన్ని రత్నములయందు వసింతురు. అట్టి రతనముల పర్వతమా! నన్నెల్లప్పుడు కాపాడుము. అన్న(హవిః) ప్రదానముచే ఇంద్రుడు సంతసించి వర్షమును కురిపించు నట్లే నేనుచేసిన ఈరత్న ప్రదానముచే హరి సంతసించి నాకు కోరికలు కురియునట్లు అనుగ్ర హించుము. ఈ విధానమున రత్న పర్వతదానము చేసినవారు దేవేంద్రునిచే కూడ పూజితమగు విష్ణు లోకమున కేగి పూర్ణముగ నూరు కల్పములపాటు అచటనుండి మరల కల్పాది సృష్టియందు రూపారోగ్య సద్గుణ సంపన్నుడైన సప్త ద్వీపాధిపతిగా జన్మించును.