అగ్ని వైకృత శాంతి

గర్గుడు అత్రితో ఇట్లు చెప్పెను: ఏ రాష్ట్రమునందు ఇంధనములు లేకయే, అగ్ని మండునో ఇంధనము లుండియు, అగ్ని జ్వలించదో ఆ రాష్ట్రమున శత్రు రాజులచే పీడ కలుగును; నీటితో తడిపిన వస్తువులును, వచ్చి వస్తువులును మండుటయు నీరు పోసినను మంటలార కుండుటయు, ప్రాకారములు, పురద్వారములు, ద్వారములు, రాజాలయ దేవాలయములు మండుటయును, మెరపుల నుండి నిప్పంటుకొని వస్తువులు కాలుటయు జరిగినచో రాష్ట్రపు రాజునకు భయము కలుగును, రాత్రి కాకయే ధూళి రేగకయే చీకట్లు క్రమ్ముట, అగ్ని లేకయే పొగ క్రమ్ముట జరిగినచో మహాభయము కలుగును, ఆకాశమున మేఘము లేకయే మెరుపులు కనబడుట, రాత్రి గగనమున నక్షత్రములు కనబడకుండుట, పగలు ఆకాశమున నక్షత్రములు కనబడుట జరిగినను భయము కలుగును, గ్రహ నక్షత్ర తారలయందు పుర వాహనయాన చతుష్పాత్ మృగపక్షులందును స్వభావ విరుద్ధములగు వైకృతములు కనబడినను ఆవులు, దూడలు మొదలగు నవి అస్వాభావికముగ ప్రవర్తించినను, ఆయుధములు మండినను, పొగలు క్రమ్మినను, ఒరల నుండి తమంతతాము వెలికివచ్చినను యుద్ధము సంభవించును, అగ్ని లేకయే నిప్పురవ్వులు రేగినను ఎక్కుపెట్టకయే తమంతతామే ధనువులు పూరింపబడినను బట్టి వికృతము లింకను ధనువుల యందును ఆయుధములందును కనబడినను యుద్ధమగును.ఇట్టి సందర్భములలో పురోహితుడు మూడునాళ్ళు ఉపవసించి సునమాహితుడై పాలుగల వృక్షముల సమిధలతోను, అవలతోను, నేతితోను, అగ్ని, దేవతాక మంత్రములతో హోమము చేయవలెను; బ్రాహ్మణులకు భోజనమును, గోధూసువర్ణ వస్త్రదానమును జరుప వలయును; ఇట్లు చేయుటచే అగ్ని వైకృతోపద్రవము శాంతించును.