ప్రహ్లాద కృత నరసింహస్తుతి

సూతుడు ఋషులకు ఇంకను ఇట్లు చెప్పెను, కాలచక్రమువలె వచ్చిన ఆ మహాభాగుని నరసింహుని చూచి హిరణ్యకశిపు పుత్రుడు వీర్యవంతుడునగు ప్రహ్లాదుడు అనునాతడు - ఈ వచ్చిన యాగడు నివురుకప్పిన నిప్పువలె నరసింహ శరీరము కప్పుకొనిన పురుషోత్తమ దేవుడేయని తన దివ్య (జ్ఞాన) నేత్రముతో చూచి ఎరిగెను. బంగరు కొండవంటి అపూర్వ శరీరముదాల్చియున్న ఆ నృసింహుని చూచి దానవులందరును హిరణ్యకశిపుడు కూడ ఆశ్చర్యపడిరి.

అపుడు హిరణ్యకశిపునితో ప్రహ్లాదుడు ఇట్లనెను. మహారాజా! ఇట్టి నారసింహరూపము ఇదివరకు వినినదియు కనినదియుకాదు; అవ్యక్తతత్త్వమునకు కూడ ప్రాదుర్భావ కారణమగు పరమాత్మ రూపమే ఇట్లు వచ్చినదేమో! ఈ ఘోర రూపము దైత్యనాశకరమేమోయని నామనస్సు చెప్పుచున్నట్లున్నది. ఈ దేవుని శరీరమున సాగరములు నదులు హిమవత్పారియాత్రాది కులపర్వతములు చంద్రుడు నక్షత్రములు ఆదిత్యులు అశ్వినులు కుబేర వరుణ యమ శచీపతి మరుత్తులు దేవతలు గంధర్వులు మునులు ఋషులు నాగయక్ష పిశాచులు భయంకర విక్రములగు రాక్షసులు బ్రహ్మరుద్రులు ఈతని లలాటమున తిరుగుచున్నారు. స్థిరచర ప్రాణులు పదార్థములు నేను మొదలగు ఈ దైత్యగణము లతోకూడ నీవు నూరులకొలది విమానములతో నిండిన ఈనీసభ సర్వ త్రిభువనము శాశ్వతములగు లోక ధర్మములు అఖిల జగమును ఈ నరసింహుని యందు కనబడుచున్నవి. మహాత్ములగు ప్రజాపతులు మనువులు గ్రహములు యోగములు భూమ్యంతరిక్షములు ఉత్పాత సమయము ధృతి స్మృతి రతి సత్యదమ తపస్సులు మహానుభావుడగు సనత్కుమారుడు, విశ్వదేవులు, సర్వ ఋషులు కామక్రోధ ధర్మ హర్ష మోహములు సర్వపితరులు అందరు ఈ నృసింహునియందు కనబడుచున్నారు అని పలికెను.

ప్రహ్లాదుని మాటవిని ప్రభువగు హిరణ్యకశిపుడు దానవ గణములతో, గణాధిపతులతో అందరతో “ఎన్నడును ఎరుగని ప్రాణి. ఇదేదియో సింహమువలె కనబడునది వచ్చినది; దీనిని పట్టుకొనుడు. మీకేదయిన సంశయము ఉన్నదా? ఇది వనమృగమే; మరేదియు కాదు; బంధించుడు,” అనెను. ఆ గణదానవులందరును భయంకర విక్రమముగల ఆమృగేంద్రుని చుట్టుముట్టుచు సంతోషముతో తమ శక్తికొలది భయపెట్టసాగిరి. అంతట మహాబలుడగు నరసింహుడు యమునివలె నోరుతెరచి సింహనాదములు చేయుచు ఆ సభనంతటిని విరుగ గొట్టెను. అది చూచి హిరణ్యకశిపుడు రోషవ్యాకుల నేత్రుడయి తానే ఆ సింహమూర్తిపై అస్త్రములను విసరసాగెను.