మత్స్య మహా పురాణము
గాథార్థము
సాటిలేని శక్తి అను ఆయుధపు కాంతులతో నిండిన దేహముగల పింజరవర్ణుడా! భుజదండములతో భయంకరమగు యుద్ధావేశము కలవాడా! దేవతా ముఖములనెడు కలువలకు వికాసము కలిగించు చంద్రా! కుమారులలో శ్రేష్ఠుడా! నీకు జయము; దైత్యవంశ మహా సముద్రమునకు బడబాగ్నీ! షణ్ముఖా! మధుర ధ్వనిగల నెమిలిని పూనిచిన రథము కలవాడా! దేవతల కిరీటముల కొనలతో నలిగిన కాలి గోళ్ళ మొలకలతో కూడిన మహాపీఠము కలవాడా! నీకు జయము; సుందరమగు వెంట్రుకల కొప్పను కమలవన మందు ఉండిన విమల దళములు కల కమలములతో అందమగువాడా! దైత్యరాజ వంశమునకు సహింపరాని దావాగ్నీ! నీకు జయము; ప్రభూ! విశాఖ! ఏడు దినముల పసివాడా! సకలలోక తారకా! స్కందా! గౌరీ నందనా! ఘంటా ప్రియా! ప్రియా! విశాఖా! విభూ! దేవ సేనానాయకా! పతాకలను దాల్చినవాడా! చెదరిపోయి మిగుల కదలుచున్న బంగరు సొమ్ములతో ప్రకాశించువాడా! సూర్యతేజస్కా! నీకు జయము; యుద్ధ సంభ్రమమున అవలీలగా సమస్త శత్రువులను ఖండించువాడా! సకల లోక తారకా! దితి సంతానమగు అసురులలో శ్రేష్ఠుడగు తారకునకు యముడా! భువన సమూహ శోక వినాశనా! జయము.