మత్స్య మహా పురాణము
గుడపర్వత దానము
ఈశ్వరుడు నారదునకిట్లు చెప్పెను, ఇప్పుడికమీదట గుడ పర్వత దానవ్రతమును తెలిపెదను. అది ఉత్తమమయినది. దాని నాచరించినవారు సురల పూజల నందుకొనుచు స్వర్గమున సుఖింతురు. దీనికై పది బారువలు కాని, ఐదు బారువలు కాని, మూడు బారువలు కాని తగినంత ధనములేనివారు ఒకటిన్నర బారువలుకాని బెల్లమును వినియోగించవలెను. ధాన్య పర్వత దానమందువలెనే ఆవాహనమును పూజయు హేమ వృక్షముల అమరికయు విష్కంభ పర్వతములను సరస్సులను, వనములను, దేవతలను విన్యాసము చేయవలెను. హోమమును, జాగరణమును లోకపాలాధి వాసనమును (ఆమరికను) కూడ ధాన్య పర్వత దానమందువలెనే (దాన మంత్రము:) దేవతలయందు విశ్వాత్ముడగు జనార్దనుడును వేదములయందు ప్రణవమును, స్త్రీలయందు పార్వతియును శ్రేష్టమయినట్లు రసములలో ఇక్షు (చెరకు) రసము శ్రేష్ఠము. కావున గుడపర్వతమా! నాకు మేలగు లక్ష్మిని ఇమ్ము. నీవు పార్వతికి నివాసమవు; కావున నీవు నన్నెల్లప్పుడును కాపాడుము. అని ప్రార్థించుచు ఈ విధానమున గుడపర్వత దానము చేసినవారు గంధర్వులచే కీర్తి గానము చేయబడుచు గౌరీ లోకమున సుఖింతురు. ఇట్లు నూరు కల్పములయిన తరువాత సప్తద్వీపాధి పతియై జన్మించి ఆయురారోగ్య సంపన్నుడై శత్రువులకు అజేయుడై వర్ధిల్లును.