రత్నధేను దాన విధానము

శ్రీమత్స్యుడు మనువున కిట్లుచెప్పెను, ఇప్పుడిక నరులకు గోలోక ప్రదమును అనుత్తమ మునునగు రత్నధేను మహా దానమును వివరింతును, పుణ్యమగు పర్వదినమున తులా పురుష దానమందువలెనే లోక పాల ఆవాహనమును జరిపి ఈ రత్నధేను రచన జరిపించవలయును: భూమిపై కృష్ణాజినమును అమర్చి ద్రోణ పరిమాణ లవణమును దానిపై పోసి దానిపై ఈ రత్నమయ ధేనువును సంకల్ప పూర్వకముగా కల్పోక్త విధానములో నిర్మించవలయును, ఎట్లన ముఖస్థానము నందు ఎనుబదియొక పద్మరాగములను ముట్టె యందు నూరు పుష్యరాగములను లలాటమునందు బంగరు తిలకమును కన్నులయందు నూరు ముత్తెములను రెండు కనుబొమల యందును నూరు పగడములను రెండు చెవులందును రెండు ముత్తెపు చిప్పలను బంగరుతోనే కొమ్ములను నూరువజ్రములలో శిరస్సును మెడయందు నూరు గోమేదకములతో గంగడోలును నూరింద్ర నీలములతో వీపును వైదూర్యములతో పార్శ్వములను స్పటికములతో ఉదరమును నూరు సౌగంధికములతో కటిప్రదేశమును బంగరుతో గిట్టలను ముక్తావళులతో సూర్యకాంత చంద్ర కాంతములతోను తోకను కర్పూర చందనములతోను ముకుపుటములను కుంకుమ పూవుతో రోమములను వెండితో నాభిని నూరు గరుడ పచ్చలతో ఆపానమును అమర్చి సర్వ సంధులందును ఇతర రత్నములను అమర్చవలెను.

శర్కరతో నాలుకను గుడముతో గోమయమును అజ్యముతో గోమూత్రమును వస్తువులు గానే గోదధి గోక్షీరములను తోకచివర కుచ్చుగా చామరమును తత్సమీపమందు పాలు పెరుగు రాగి పాత్రను బంగరుకుండలములను ఇతర భూషణములను యథాశక్తిగ చేయించ వలయును, ఈ విధముగానే ఇందు నాలుగవ వంతుగ ఆయా సామగ్రితో దూడను చేయించ వలయును. ఆవునకును దూడకును గూడ చెరకుతో పాదములను అమర్చవలయును, సర్వ ధాన్యములను సర్వ నానాఫలములను ఐదువన్నెల వితానకమును (మేలుకట్టును) అమర్చుకొన వలయును; హోమమును దేవతాధి వాసనమును జరిపి ఋత్విజులకు దక్షిణలను ఇచ్చి తరువాత ఈ రత్న ధేనువునకు గుడధేనువు నందు వలెనే అవాహనము జరిపి ఈ మంత్రమును పలుకుచు అమంత్రించవలయును.

“రుద్రేంద్ర రవి బ్రహ్మ విష్ణువులును ‘నీవు సర్వదేవగణములకును ఆవాస స్థాన’మని పేర్కొనుచున్నారు, కావున ఆ ప్రమాణము ననుసరించి సమస్త భువనత్రయ మందలి దేవతలును నీయందే యున్నారు, ఇట్టి దేవీ! నీవు సంసార సాగరముచే పీడింపబడుచున్న వాడనగు నన్ను కాపాడుము.” అని ఇట్లా మంత్రించి భక్తితో చుట్టును ప్రదక్షిణించి జలపూర్వకముగ ఆగోవును తన గురుడగు బ్రాహ్మణునకు దానము చేయవలయును.

పుణ్య పర్వదినమున ఉపవాస పూర్వకముగ ఇది యాచరించినవాడు పాపవిముక్త దేహుడై విష్ణు స్థానప్రాప్తుడగును.