మత్స్య మహా పురాణము
బ్రహ్మదత్తుని జన్మ వృత్తాంతము
పూర్వము విభ్రాజవంశమున పుట్టిన అణుహుడు అను రాజుండెను. అతడు పాంచాల దేశరాజు. అతడు పుత్రులను కోరి ప్రభుడును, విభుడును దేవదేవులకుకూడ ఈశుడును అగు నారాయణుని తీవ్ర వ్రతపరాయణుడై ఆరాధించెను. అట్లు ఆరాధించగా చాలకాలమునకు జనార్దనుడు అతని విషయమున సంతుష్టుడుఅయ్యెను. నాయనా! రాజా! నీ హృదయమునందు ఈప్సితమయియున్న వరమును కోరుకొనుము అని విష్ణువు పలుకగా రాజు మిగుల ఉత్తమమగు వరమును ఇట్లు కోరుకొనెను. “దేవేశా! నాకు మహా బల పరాక్రముడగు కుమారుని ఇమ్ము. అతడు సర్వశాస్త్రములు తుదముట్ట చదివి వాని తత్త్వము ఎరిగినవాడును ధార్మికుడును యోగియు యోగిశ్రేష్ఠుడును సర్వ ప్రాణుల ధ్వనులను వాటి యర్థములను నెరిగినవాడునై యుండవలెను” అని కోరగా పరమేశ్వరుడును సర్వ విశ్వ రూపుడును సర్వ విశ్వములకు ఆత్మభూతుడును అగు విష్ణువు అట్లే యగుగాక!” అని అణుహునకు వరము నిచ్చి సర్వదేవతలును చూచుచుండ అచ్చటనే అంతర్ధానము పొందెను.
తరువాత అతనికి ప్రతాపవంతుడగు బ్రహ్మదత్తుడు కుమారుడుగా కలిగెను. అతడు సర్వప్రాణులయందు దయకలవాడు, బలమునందు సర్వప్రాణులలో అధికుడు. అన్ని ప్రాణుల ధ్వనులను వాటి అర్థమును ఎరుగ గలవాడు. సర్వ ప్రాణులకు అధిపతులగు వారికి అధిపతి. అంతే కాక అతడు యోగముతో సంస్కరింపబడిన ఆత్మకలవాడు. అందుచేతనే చీమలజంట రమించు చున్నచోట తానున్నప్పుడు అవి అనురాగవశమునచేసిన సంభాషణమును విని ఆశ్చర్యపడి నవ్వెను.
అంతట అప్పుడు అచ్చటనేయున్న అతనిభార్య సన్నతి అతడి నవ్వును చూచి చాల ఆశ్చర్య పడెను. కాని మనస్సులో ఏదో సందేహము కలిగి ఆ నరేశ్వరుని ఇట్లు ప్రశ్నించెను, “రాజా! మీరెందులకు నవ్వితిరి? ఇచట అందులకు తగిన హేతువు ఏమియు కనబడుటలేదు. ఇది నవ్వుటకు తగిన సమయమును కాదు.”
సన్నతిమాటవిని రాజు చీమలదంపతుల సంభాషణ వృత్తాంతమును తెలిపి అనురాగ పూర్వకమయిన చీమల సంభాషణమువిని నాకు నవ్వువచ్చినది. ఇంతకంటె ఈనవ్వునకు వేరుగ కారణము ఏమియు లేదు. నీవు ఇంతగా ఆశ్చర్యపడవలసిన పనిలేదు. అని సన్నతితో పలికెను.
కాని సన్నతి బ్రహ్మదత్తుని మాటను నమ్మలేదు. ఈ నవ్వు చీమల దంపతుల సంభాష ణమువలన కలిగినదను విశ్వాసము ఆమెకు కలుగలేదు. నీవు నా విషయమునందే నవ్వితివి. నాపై అనురాగములేని నీతో నేను జీవింపను. రాజా! మానవులకు చీమలమాటలను విని అర్థము చేసికొను శక్తి ఎట్లుండును? ఏ విధముగా ఆలోచించినను నీవు నా విషయముననే నవ్వితివి. ఇంతకంటె మరి ఏమియు కారణము లేదు అని ఆమె రాజుతో పలికెను. ఆ మాటలకు బ్రహ్మ దత్తుడు ఏమియు సమాధానము ఈయలేక పోయెను. అతడు ఈ విషయమును విష్ణు దేవుని ముందే (విష్ణుదేవునినుండియే) తెలిసినకొనగోరెను. అందులకై అతడు నిష్కల్మషమగు మనస్సుతో ఏడు దినములు నియమమునుపూని హరిధ్యానము చేసెను. స్వప్నములో అతనికి విష్ణు దేవుడు సాక్షాత్కరించి ఇట్లు పలికెను: నీవు ప్రభాత కాలమున నగరమున సంచరించుము. అప్పుడు నీకొక వృద్ధ బ్రాహ్మణుడు కనబడును.
అతడు నీ వాక్యమును అంతయు తెలిసికొని తగిన సమాధానము ఈయగలడు. ఇట్లు పలికి విష్ణువు అంతర్ధానము నందెను. తెల్లవారిన తరు వాత ఉదయమున రాజగు బ్రహ్మదత్తుడు భార్యయగు సన్నతితోను ఇద్దరు మంత్రులతోను కలిసి పురమునండి వెలుపలికి పోవుచుండగా అతని ఎదుట వృద్ధ బ్రాహ్మణుడు కనబడెను. అతడును తన వైపునకే వచ్చుట ఆరాజు గమనించెను. అంతలో బ్రాహ్మణుడు తన రాజుకడకు వచ్చి ఇట్లు పలికెను. “కురుక్షేత్రమునందు బ్రాహ్మణులుగా మొదటి జన్మమునందు పుట్టిన వారే తరువాత దశపురమున వ్యాధులుగా జన్మించిరి. వారేతరువాత కాలంజర పర్వతమున లేళ్ళుగా జన్మించిరి. పిమ్మట మానస సరస్సు నందు చక్రవాక పక్షులుగా జన్మించిరి. ఆ మేమే ఇపుడు ఇక్కడ యోగసిద్ధిని పొందుచున్నాము.”
ఈ మాటను వినుచునే రాజు పూర్వ జన్మ స్మృతి కలిగి శోకముతో క్రిందపడెను. మంత్రులు ఇద్దరును అదేవిధముగా పూర్వజన్మ స్మరణము కలిగి క్రింద పడిపోయిరి.
ఈ ఇద్దరిలో సువాలకుడు బాభ్రవ్య గోత్రమున పుట్టినవాడు. “పంచాలము” అను జన పదములందు. అనేక శాస్త్రములు ఎరిగిన పండితుడుగా ప్రసిద్ధుడు. కామశాస్త్రమును లోకమున ప్రవర్తింపజేసినవాడు. నిర్మలచిత్తము కలవాడగు కండరీకుడు అను రెండవ మంత్రి లోకమున వైద్యశాస్త్రమును ప్రవర్తింపజేసెను.
ఇట్లు ఈ యోగపారంగతులగు ముగ్గురును అనేక విధముల విలపించిరి. తాము పూర్వ జన్మమునందు శ్రాద్ధముయొక్క మహిమయే ఇది అనిగుర్తించి ఆశ్చర్యపడుచు ఆ మహిమను మాటిమాటికి అభినందించిరి.
అనంతరము వారు ఆ వృద్ధ బ్రాహ్మణునకు సమృద్ధమయి ధనవంతములగు గ్రామములను ధనమును ఇచ్చిరి. ధనముతోను సంతోషముతోను కూడిన వానినిగా చేసినవారా బ్రాహ్మణు నికి వీడ్కోలు చెప్పి పంపివేసిరి.
తరువాత రాజగు బ్రహ్మదత్తుడు సమస్త రాజ లక్షణములతో కూడిన తన కుమారుని రాజ్యమునందు అభిషేకించెను. తరువాత ఆ యోగి శ్రేష్ఠులగు బ్రహ్మదత్తాదులు అందరును మత్సరము మొదలగు అవగుణములు లేనివారయి తమకు గల పితృభక్తిచే గలిగిన ఈ సత్ఫలిత మును పొంది అందరును పరస్పరము మానస సరస్సునందు కలిసికొనిరి.
అది ఎట్లు జరిగెను అనిన-వృద్ధ బ్రాహ్మణుని వచనమును విని బ్రహ్మదత్తుడు క్రింద పడ గానే అదిచూచి రాణియగు సన్నతి-రాజా! ఇది యంతయు ఇట్లు జరుగుటకు నేనే హేతువ నైతిని. ఏఏ కోరికలైనను యోగసిద్ధికి ఫలముగా లభించును - అనెను. “అది నిజమే” అని రాజనెను. ఇందు నీదోషములేదు సరేకదా! నీవు నాకు మేలే చేసితివని రాజామెను మెచ్చుకొనెను. నీ అనుగ్రహము వలననే నా కీ మహాఫలము లభించెనని అతడామెతో పలికెను.
తరువాత ఆ బ్రహ్మదత్తుడును అతని మంత్రులగు కండరీక సువాలకులును మనోమయ మగు యోగమును పూనిరి. బ్రహ్మరంధ్ర మార్గమున ప్రాణములను వదలిరి. తమ తపోబలమున వారిట్లు పరమపదమును-విష్ణుస్థానమును పొందిరి.
పితృ పితామహ ప్రపితామహాది పితృదేవతలు మానవులకు ఈ విధముగానే ఆయువును విద్యను ధనమును స్వర్గమును మోక్షమును అన్ని సుఖములను సుతులను రాజ్యమును కూడ ఇత్తురు. పితృదేవతా మహిమమును బ్రహ్మదత్తుని చరిత్ర మాహాత్మ్యమును శ్రాద్ధకాలమున బ్రాహ్మణులకు వినిపించినను తాము వినినను చదివినను నూరుకోట్ల కల్పముల కాలము బ్రహ్మ లోకము నందు సుఖింతురు.