యుగ పరిమాణాది కథనము

శ్రీమత్స్యుడు మనువునకు ఇట్లు చెప్ప ఆరంభించెను, నాలుగువేల దివ్యవర్షములు కృతయుగము; నాలుగు వందల దివ్య వర్షములు సంధ్యయు అంతయే సంధ్యాంశమును; ఈ యుగమున ధర్మము చతుష్పాదమయి అధర్మము పాదము (1/4) కంటె తక్కువగా నుండును. మానవులు స్వధర్మ నిరతులగు సజ్జనులుగా నుందురు, విప్రులు విప్ర ధర్మపరులుగా, క్షత్రియులు క్షత్రియ ధర్మపరులుగా, వైశ్యులు కృషిపరులుగా, శూద్రులు సేవాపరులుగా ఉందురు. సత్యశౌచ ధర్మములు వృద్ధి నందును. సజ్జను లాచరించిన కర్మము నందరు మెచ్చి ఆచరింతురు. ఎంత నీచకర్ములగు వారు కూడ తమతమ కర్మలను ఎరిగి ఆచరించుటతో కృతయుగమున సర్వ ప్రాణుల నడువడులు నిట్లే యుండును.

మూడువేల దివ్య వర్షములు త్రేతాయుగము; మూడు వందల దివ్య వర్షములు దాని సంధ్య; అంతయే దాని సంధ్యాంశము; మూడు పాదములతో ధర్మమును రెండు పాదములకు తక్కువగ అధర్మమును ఆ యుగమున ఉండును. శాస్త్రాధ్యయనము సత్యము బలము నిబ్బరము (సత్వము) క్షమ - ధర్మము ఇవి విధింపబడియును ఆ యుగమున ఆయా వర్ణములవారు వాని ఆచరణము సరిగి చేయరు. దానిచే జనులు దుర్బలులు అగుదురు. ఇది త్రేతాయుగపు నడక.

ఇక ద్వాపరయుగ ప్రవృత్తిని వినుము, దాని పరిమాణము రెండు వేల దివ్య వర్షములు; రెండు వందల దివ్య వర్షములు దాని సంధ్యాకాలము; అంతయే దాని సంధ్యాంశము; ఆ యుగమున మానవులు రజోగుణులయి అర్థము (ధనము)నకు ప్రాధాన్యము నిత్తురు. అందరును మోసగాండ్రును క్షుద్రులు నగుదురు, రెండు పాదముల ధర్మ ముండగా ఆధర్మము మూడు పాదములకు తక్కువగా నుండును. దీనిచేత క్రమముగా కలియుగము నాటికి ధర్మము క్షయము నందును. ద్వాపరయుగము క్రమముగా గడచుకొలదిని బ్రాహ్మణ్యమునందు ఆసక్తి తగ్గును, ప్రతోపవాసాదికము విడువబడును.

కలియుగము అన్నింటిలో క్రూరమయినది; దాని పరిమాణము ఒకే వేయి దివ్య సంవత్సరములు; నూరు దివ్య సంవత్సరములు కలిసంధ్య. అంతయే దాని సంధ్యాంశమును. దీనియందు అధర్మము నాల్గుపాదములుండును, ధర్మము పాదముకంటె తక్కువగా నుండును; మానవులు కాముకులు తమోగుణులు నగుదురు, అతి సాత్వికుడు సాధు స్వభావుడు సత్యవచనుడు అరుదుగా నుండును. జనులు నాస్తికులును బ్రహ్మ భక్తులు (నేనే బ్రహ్మ నైతినను దంభభక్తులు) నగుదురు అహంకార వంతులు ఎవరియందును స్నేహంధనము లేనివారు నగుదురు; విప్రులందరును శూద్రుల ప్రవర్తనముతో నుందురు, ఆశ్రమ ధర్మము వ్యత్యస్త మగును, యుగాంత కాలము నాటికి వర్ణములు ఉన్నవా లేవాయను సందిగ్ధ స్థితికి వచ్చును. పండ్రెండుకల దివ్య వర్షములు ఒకచతుర్(మహా) యుగము; వేయి చతుర్యుగములు బ్రహ్మకొక పగలు; అది గడువగానే సర్వప్రాణుల శరీర నాశము చేయదలచి లోక సంహారముచేయు సంకల్పముతో మహాభూతాధి పతియగు నారాయణుడు బ్రహ్మాది సర్వదేవతలును దైత్య దానవ యక్షరాక్షస పక్షి గంధర్వాప్సరో భుజంగ పర్వత నదీ పశు ప్రభృతులును ఇంకను తిర్యగ్యోని గత సమస్త ప్రాణులును కృములును -  మొదలగు వాని నుండియు సమస్త జడ పదార్థముల నుండియు (స్థూల - సూక్ష్మ) పంచ భూతములను ఉపసంహరించి జగత్సంహారార్థము అతిహింసజరుపును. ఆ భగవానుడు తాను సూర్యుడై ప్రాణుల నేత్రములను వాయువై ప్రాణములను ఉపసంహరించి అగ్నియె సర్వ లోకములను దహించి తరువాత భయంకర మేఘమయి వర్షించును.