మత్స్య మహా పురాణము
సంక్రాత్యుద్యాపన వ్రతము
ఇక ఇప్పుడు సంక్రాంత్యుద్యాపన వ్రతమును తెలిపెదను. అది మేలయినది. ఇహమున సర్వకామ ఫలప్రదము; పరలోకమున అక్షయ ఫలదము. విషువము (రాత్రింబగళ్ళు సమముగ నుండు దినము) నందుకాని అయన పుణ్యకాలము లందుగాని దీని నాచరించవలెను. ముందటి దినమున ఏక భుక్తముచేసి గడపి వ్రతదినమున దంత ధావనమయిన పిమ్మట తిలలతో (తిలల పిండి నూనెలతో) స్నానమాడవలెను. తదుపరి (గోమయముతో అలికిన) భూమిపై-చందనముతో అష్టదళ పద్మమును కర్ణికతోకూడ లిఖించి దానియందు రవిని ఆవాహనము చేయవలెను. కర్ణికయందు ‘సూర్యాయ నమః’ తూర్పున ‘ఆదిత్యాయ నమః’ ఆగ్నేయమున ‘సప్తార్చిషే నమః’ దక్షిణమున ‘ఆర్యమ్ణే నమః’ నైరృతమున ‘ఋఙ్మండలాయ నమః’ పడమర ‘సవిత్రే నమః’ వాయవ్యమున ‘తపనాయ నమః’ ఉత్తరమున ‘మార్తాండాయ నమః’ ఈశాన్యమున ‘విష్ణవే నమః” అని వ్రాయవలెను. తరువాత ఆ స్థండిలమునందు గంధమాల్యఫల భక్ష్యములతో రవి నర్చించవలెను బ్రాహ్మణునకు ఉదకుంభమును ఘృత పాతమును సువర్ణకమలమును యథాశక్తిగ దానమీయవలెను. చందనోదక కుసుమములతో నేలపై రవి కర్ఘ్యము విడువవలెను. (అర్ఘ్య మంత్రార్థము); “విశ్వుడు విశ్వరూపుడు విశ్వధాముడు స్వయంభువు అనంతుడు ధాత యజుస్సులకు అధిపతి అగు రవికి నమస్కారము.” (సర్వము తానైనవాడును అన్నిటియందును తాను ప్రవేశించి యున్నవాడును విశ్వుడు; ప్రతియొకదాని రూపమును ప్రపంచ రూపమును తానైయున్నవాడు విశ్వరూపుడు, ప్రతియొక తేజోరూపతత్త్వమును తానైయున్నవాడు విశ్వధాముడు; తనకుతానై జనించినవాడు తనకుతానై మరియొకరితో పనిలేకయే నిలిచియున్న వాడు స్వయంభువు; అంతములేనివాడు అనంతుడు; సర్వమును నిర్మించువాడుధాత; యజ్ఞములను ఆచరించుట కుపయోగించు మంత్రములు యజుస్సులు; యజ్ఞముల నాచరించుట వలని ఫలితము హిరణ్య గర్భోపాసనా ఫలితమగు సూర్యలోకప్రాప్తియే; కావున రవి యజుస్సులకు అధిపతి.)
ఈ విధానమున ప్రతి మానమునందును ప్రత్యంశమును ఆచరించవలయును. సంవత్సరాంతమున నేతి పాయసముతో (హోమముతో) అగ్నిని (భోజనములతో) ద్విజపుంగవులను సంతృప్తుల జేయవలెను. పండ్రెండు కడవలను పండ్రెండు రత్న (ఖండ)ములతో కూడ పండ్రెండు బంగారు పద్మములను బంగరు కొమ్ముల కొనలు వెండి గిట్టలు పాలు పిదుకుటకు కంచు పాత్రలు మంచి శీలము కలిగి పూలతో వస్త్రములతో అలంకరించియున్న పండ్రెండు పాడి ఆవులను శక్తి లేనిచో నాలుగు కాని ఒకటికాని ఇట్టి ఆవులను బ్రాహ్మణులకు వేరువేరుగా దానమీయవలెను. శక్తి ననుసరించి బంగారుతోనో వెండితోనో రాగితోనో నూవుల పిండితోనో చేసిన భూ ప్రతిమను కూడ బంగారు రవి ప్రతిమతోపాటు ఈయవలెను. ధనము విషయమున శాఠ్యము, కొంటెతనము చేయరాదు; చేసినచో అధోగతి చెందును.
ఇది ఇట్లుచేసినవాడు నారదా! మహేంద్రాది పర్వతములును సప్తద్వీప సప్త సముద్రాన్విత పృథివియు ఉన్నంతవరకు స్వర్గమున అశేషగంధర్వ గణముల పూజలనందుకొనుచు సుఖించును. పిమ్మట పుణ్య క్షయముకాగా భూమిపై కులశీలయుక్తుడగు సప్త ద్వీపాధిపతిగా జన్మించును. మరల సృష్టికి ఆదియందును ఆవికలాంగుడు యోగ్యులగు దారపుత్రులు మంచి వంశము కలిగి జన్మించి ఎల్లరు తన పాదములకు నమస్కరించుచుండ సుఖించును. ఈ పుణ్యకరమగు రవి సంక్రాంత్యుద్యాపన వ్రతమును చదివినను వినినను ఇతరులకు వినిపించి తెలిపినను అట్టివారును ఇంద్ర భవనమున దేవతల పూజల నందుకొనుచు ఆనందింతురు.