ఆదిత్యశయన వ్రతము

నారదుడు ఈశ్వరుని ఇట్లు ప్రశ్నించెను, ఉపవాసములు చేయుటకు శక్తిలేని వారైకాని వ్యాధిబాధవలనకాని అనాయాసముగా ఇదే పైని చెప్పిన ఫలమును కోరువారు చేయదగిన వ్రతమును ఉపదేశించుము. అనగా ఈశ్వరుడు ఇట్లు చెప్పెను, ఉపవాసము చేయశక్తిలేనివారు నక్తము (పగలు ఉపవసించి రాత్రి భుజించుట) భుజించి చేయదగిన మహావ్రతమును కలదు. చెప్పెదను; వినుము. ఈవ్రతమునకు ఆదిత్యశయనమని పేరు. ఆయానక్షత్రములు కల దినము లందు (సూర్యాభేదభావనతో) శంకరు నర్చించవలయును. సప్తమీతిథి ఆదిత్యవారము-హస్త నక్షత్రము-సూర్యుడు ఏదేని రాశియందు ప్రవేశించుట-ఈ నాలుగు అంశములును కలిసిన దినమున ఈవ్రతము చేసినచో అన్నికోరికలును నెరవేరును. గృహము నందు సూర్యప్రతిమ శివలింగము ఈరెంటిని పూజించరాదు. (ఏదో ఒకటి మాత్రముండవలెను.) అదికాక రవి శివు లకు భేదములేదు. కనుక రవి నామములతో శివమూర్తిని (కాని లింగమును కాని) పూజించవలెను.

ఈ పూజావ్రత దినములందు తైలము (మాంసాహారులు కూడ) మాంసము ఉప్పు (కారము-పులుపు) లేని భోజనము చేయవలెను. ఇది పదునాలుగు సంవత్సరములు చేయవలసిన వ్రతము. ప్రతి సంవత్సరమును వ్రతము కడపటి (ఇరువది ఐదవ) దినమున కుంచెడు మంచి వరిబియ్యమును మేడి పాత్రలో నేతిని బంగారమును బ్రాహ్మణునకు దానమీయవలెను. ఏడవ సంవత్సరపు వ్రతములో వస్త్రముల జతనుకూడ ఈయవలెను. పదునాల్గవ సంవత్సరపు వ్రతములో భక్తితో బ్రాహ్మణులకు గుడక్షీర ఘృతాదికముతో భోజనములు పెట్టవలెను. ఎనిమిది అంగుళముల వ్యాసముకల బంగారు పద్మమును ఎనిమిది రేకులు నడుమ దుద్దు కల దానిని చేయించవలయును. రేకులయందు పద్మరాగములు తాపటము చేయవలెను. ముడులు కాని ఎదురు నాలుకలు కాని లేని కొయ్యతో మంచము చేయించవలెను. దిండ్లు చాందనీలు-పరుపు, విసనకర్రలు-పాదుకలు- చెప్పులు-గొడుగు-చామరములు, కాలిపీటలు-అద్దములు-ఆలంకారములు-ఫలములు-వస్త్రములు-గంధ ద్రవ్యములు అమర్చవలెను. ఆ మంచముపై ఆ పద్మమును అన్ని అమరికలతో ఉంచవలెను. పొడువని కపిల గోవును పాలిచ్చు దానిని దూడ కలదానిని వస్త్రములతో బంగారు కొమ్ములతో వెండిగిట్టలతో అలంకరించవలెను. పాలు పిదుకు కంచు పాత్రతోకూడ ఈ ఆవును-పై సామగ్రిని బ్రాహ్మణునకు మధ్యాహ్నము గడువ కుండ దానమీయవలెను. దానము ఇచ్చునపుడు ఈ యర్థముకల మంత్రము చెప్పవలెను. “ఆదిత్యా! నీ పడక ఎల్లప్పుడును కాంతితో నిబ్బరముతో శోభతో ఆనందముతో నిండియుండునట్లే నాకును ఈ అన్ని వృద్ధులును కలుగుగాక! దేవతలు కూడ నీకంటే మరెవ్వరిని పూజ్యునిగా తలచరు కావున (నీ వందర దేవతల కంటె గొప్పవాడవు కావున) నన్ను అశేష దుఃఖసంసార సాగరము నుండి ఉద్ధరింపుము.” పిమ్మట (బ్రాహ్మణునకు ప్రదక్షిణము చేసి అతనిని పంప వలయును. ఈ దాన ద్రవ్యములను ఆ విప్రుని ఇంటికి చేర్చవలెను.

ఈ వ్రతమును నాస్తికుడు కుతర్కదుష్టుడు నిందకుడు అగువానికి చెప్పరాదు. ఇది విని వాడింకను అధిక నిందచేయును. ఇంద్రియ నిగ్రహము కల భక్తునకు చెప్పవలెను. ఇది శివున కానందకరము; పాతకహరము; అక్షయ పుణ్యప్రదము. దీని నాచరించిన స్త్రీకిని పురుషు నకును బంధుపుత్ర పరివారములు దేవతాప్రీతి లభించును. రోగ శోక దుఃఖములు కలుగవు. దీనిని పూర్వము వసిష్ఠుడు అర్జునుడు కుబేరుడు ఇంద్రుడు చేసిరి. దీనిని కీర్తించినను పాపములు నశించును. దీనిని చదివినను వినినను ఇంద్రుడు ప్రీతి చెందును. ఆచరించినచో వాని పితరులు నరకములందున్నను స్వర్గమునకు పోయి సుఖింతురు.