శాల్మల ద్వీప వర్ణనము

ఇక మీదట శాల్మల ద్వీప విషయము తెలిపెదను; తెలిసికొనుడు. శాల్మల ద్వీప విస్తరము క్రౌంచ ద్వీప విస్తరమునకు ద్విగుణము; దీని చుట్టును దధిసముద్రమున్నది. అచటి జనపదములు పుణ్యవంతములు; జనులు చాలకాలము జీవింతురు. వారు క్షమా తేజోవంతులు, వారు కరవులే ఎరుగరు. దీనియందు మూడు పర్వతములు గలవు. మొదటిది సుమనస్ అనునది. ఇది సూర్య కాంతితో ప్రకాశించుచుండును. నడిమింది-రెండవది-బంగారుతో ఏర్పడి పచ్చని వన్నెతో ప్రకాశించునది; దీని పేరు సర్వసుఖము. దీనియందు సర్వౌషధులును గలవు; మూడవది రో(లో) హితమను పర్వతము; ఇదియు బంగారుతో ఏర్పడినదే; కాని తుమ్మెద రెక్కల పసిమి వన్నెతో ప్రకాశించుచుండును. ఇది మహాదివ్యమగు గిరివరము; ఈ పేరులతోనే మూడు దేశములా ద్వీపమున గలవు; మొదటిదగు సుమననమను దేశము కుశలములతో కూడినది; సర్వసుఖమను దేశము సుఖములతో ఉదర్శము (అన్నింటిలో గొప్పది) సుఖముల వృద్ధి కలదియును; మూడవ దేశము పర్వతపు పేరుతో రోహితము అని మాత్రమే కాక రోహిణము అనియు ప్రసిద్ధ నామము కలది.

స్వయముగా ప్రజాపతి ప్రజలయందు ప్రసన్నుడై ఇచ్చిన నవజాతులకు చెందిన రత్నము లనేకములను ఇంద్రు డిచ్చట నుండి కాపాడుచుండును. వర్షము కాని వీతము ఉష్ణము కాని ప్రాణులకు అప్రీతికరమగు మరి ఏది కాని వర్ణాశ్రమముల మాట కాని శాల్మల గోమేద పుష్కరము లనెడు మూడు ద్వీపములందును ఉండదు. (కర్మ) దీక్ష-దండము ఈర్ష్యాసూయా భయములు అట లేవు. కొండవాగులు సెలయేళ్లు ఇచ్చు జలమును భూగర్భము చీల్చుకొనివచ్చు ఉద్భిజలమును ప్రాణుల కుపయోగపడును. స్వయముగ (అప్రయత్నముగ) అచటి జనులకు షడ్రస భోజనము ఎదుటికివచ్చి లభించును. అచట అధమోత్తమభేద వ్యవస్థలు లోభము పరిగ్రహము (కలవారు ఇచ్చుట-లేనివారు పుచ్చుకొనుట) అచట లేవు. (కలవారు లేనివారు అను భేదములే అచటలేవు.) అచటి జనులు శోకరహితులు బలవంతులు సుఖము తప్ప ఎరుగనివారు. మానవ యోగ సిద్ధినంది వారు ముప్పదివేల సంవత్సరములు జీవింతురు. శాల్మల గోమేధ పుష్కర ద్వీపముల మూడిటియందును ఇదే విధముండును.