మత్స్య మహా పురాణము
దానవుడు ఈశ్వరునిచే మడియుట
సూతుడు ఋషులకు ఇట్లుచెప్పెను, తపము చేయపోవుచున్న పార్వతీదేవికి అలంకృతయై తన వైపునకు వచ్చుచున్న ఆపర్వతమునందలి కుసుమామోదిని అను ఒక దేవత కనబడెను. ఆమె పార్వతి తల్లియగు మేనాదేవికి సఖి; ఆమె గిరిపుత్రిని చూడగనే స్నేహ పరవశమానసయై గట్టిగ నామెను కౌగిలించుకొని బిడ్డా! ఎక్కడకు పోవుచున్నావనెను. ఆగిరిజయు ఆమెకు శంకరుని వలన తనకు కోపకారణముగా కలిగిన అవమాన విషయము చెప్పి ఇంకను ఇట్లనెను: నీవు దేవతవు మాత్రమే కాక నాకు తల్లి వంటిదానవు; ప్రశంసింపదగిన గుణవతివి; అనిందితవు; ఈ శైలాధి రాజమందు ఉండు దేవతవు, ఈ పర్వతమే నీ సన్నిధి; నాపై నీకు వాత్సల్యము అధికము; ఇందు చేతనే నీవు బుద్ధితో యోజించి చేయవలసిన పని ఒకటి చెప్పుచున్నాను. అన్యస్త్రీలు ఇట ప్రవేశించ కుండ నీవు ప్రయత్నపూర్వకముగ రక్షించవలయును. ఇది రహస్య ప్రదేశము; ఇతరులు ఇట చొచ్చినను నీకు తెలియకపోవచ్చును; కనుక నీవు ఈ గిరియందు సదా అవధానముతో ఉండవలెను. ఈ శివాంతఃపురమున ఏస్త్రీయైన ప్రవేశించినచో పూజ్యురాలా! నీవు నాకు చెప్పవలెను. తరువాత నేను తగిన విధమున చేయుదును అనగా ఆ కుసుమామోదిని యను శుభరూప సరే అని తననివాసమగు పర్వత భాగమునకు పోయెను; అద్రిసుతయగు ఉమయు త్వరగ తండ్రి యుద్యానమున కేగెను. మేఘమాలతో మలినమగు (నల్లని) కాంతిగల అంతరిక్ష భాగమును చేరి ఆమె తన విభూషణములు వదలి చెట్ల నారలు ధరించెను. గ్రీష్మర్తువున పంచాగ్ని సంతప్తయగుచు వర్షర్తువున నీటితో తడియుచు వన్యాహారములనే తినుచు నిరాహారగానే గడపుచు శుష్కమగు (ఏపడకలును లేని) నేలపై పండుకొనుచు ఇట్లు దేహమును సాధన చేయుచు తపస్సుతో ఆమె నియమవంతు రాలయ్యెను.
ఈనడుమ కాలములో ఆడి అనుదైత్యుడు పార్వతి ఇట్లలిగిపోయిన విషయము తెలిసికొనెను. వాడు చాలబలశాలి; అంధకాసురుని కొడుకు; బకునికి అన్న; చాలగర్వి; యుద్ధమున దేవతలనందర జయించినవాడు; యుద్ధమున ఎదురు లేనివాడు; తన తండ్రియగు అంధకుని శివుడు చంపుటచే పగ బూనినవాడు; చంద్రమౌళిపై కసి తీర్చుకొన వేచియుండెను. వాడిపు డిది ఎరిగి శివుని యంతఃపురమునకు రాగా వానికి ద్వారమందు వీరకుడు కనబడెను. అపుడు వానికి మునుపు బ్రహ్మ తనకిచ్చిన వరము గురుతునకు వచ్చెను. ఆ వర కథ ఇది; పూర్వము శివుని చేతిలో అంధకుడు చచ్చిన తరువాత ఈ ఆడి పరమదారుణమగు ఉత్తమ తపమాచరించెను. బ్రహ్మ మెచ్చి దానవశ్రేష్ఠా! ఆడీ! ఈ తపఃఫలముగా నీకేమి కావలయుననెను. మృత్యువు నాకుండరాదని వాడన బ్రహ్మ దానవా! మృత్యువు లేని ప్రాణి ఏదియు లేదు. ఏదో సమయమున ఏదోయొక దానినుండి ప్రాణి మరణించి తీరును. అనగా ఆ దైత్య సింహుడు పద్మభవునితో పద్మ సంభవా! నాకు రూప పరివర్తనము కలిగినపుడు నాకు మరణము కలుగవచ్చును. లేనిచో నేనమరుడనే కావలయును అనెను. అది విని తుష్టుడై కమలభవుడు నీకు రూప పరివృత్తిచే రెండవ రూపము కలిగినచో మృత్యువు కలుగును. లేనిచో కలుగదు అనెను. దీనితో తనకు అమరత్వము లభించెనని సుమహాబలుడు అగు ఆ దైత్యుడు తలచెను. ఇపుడు వానికి ఇతరులు తను చంపుటకు ఇది యుపాయమైనది అని తోచియు వీరకుని దృష్టి మార్గము నుండి తప్పించుకొనదలచి సర్పరూపుడై ఒకానొక రంధ్రము నుండి వాడంతఃపురములోన ప్రవేశించెను. ఇట్లు ఆ గణేశుని దృష్టి మార్గమునుండి తప్పుకొని దేవతలకు జయింప అలవియే కాని ఆ ఆడి దానవుడు వీరకునకు కనబడకుండలోన ప్రవిష్టుడై ఆట భుజంగ రూపము విడిచెను. ఆ మూఢ చిత్తుడు శివుని మోసగింపదలచి ఉమారూపియయ్యెను. వాడు ఊహింపనలవి కానియంత సరిగా మనోహరమగు ఉమారూపము దాల్చెను. అది ఆమెకు గల అన్ని గుర్తులు పైకి కనబడుచున్నది, సర్వావయవ సంపూర్ణము; వాడు తన బుద్ధి మోహముచే గిరీశుని చంపుట కుద్యుక్తుడై తన రహస్యాంగమున వజ్రమువంటి వాడి మొనలుగల దృఢ దంతముల నమర్చుకొనెను. తరువాత ఆ దైత్యుడు ఉమారూప అమరికతో హరుని సమీపమునకు ఏగెను. వాడిపుడు చిత్ర వస్త్ర భూషణములు భూషించుకొని రమ్యమగు స్త్రీరూపముతో నున్నాడు. ఆమెను చూచి గిరీశుడు తుష్టుడై వెంటనే ఆ మహాసురుని ఆలింగనము చేసికొనెను. సర్వావయవ లక్షణములబట్టియు ఆమె గిరిసుతయేయని అతడు తలచెను - గిరిపుత్రీ! ఇపుడు నీ భావము కృత్రిమముగాక నిర్మలమై ఉన్నదికదా! వరవర్ణినీ! ఉత్తమసుందరీ! నీవు నా ఆశయము గ్రహించుటయే అందులకు ప్రమాణము; నీవు లేక నాకు జగత్రయమును శూన్యమై తోచెను. ఇట్టితరి నీవు నాకడకు వచ్చితివి; నీకు నాపై ఇంత ప్రీతి తగినదే సుమా! అనుచు శివుడిట్లు పలుకగా దానవుడు మెల్లగ నవ్వుచు మాటాడసాగెను; ఏలయన శివునకు మాత్రమే తెలిసిన పార్వతీ చిహ్నములు కొన్ని వానికి తెలియవు; వాడిట్లనెను, నీ ప్రీతి లభించుటకై సాటిలేని తపమాచరించ సాగితినే కాని అచ్చట నాకు మనస్సునకు హాయి కలుగలేదు. అందుచే నీకడకు వచ్చితిని. ఈ మాటవిని శంకరునకు ఒకానొక శంక కలిగి అది నిర్ణయించు కొనదలచి ఆదేవుడు చిన్నగా నవ్వుచున్న మోముతోను దృఢ నిశ్చయముతోను ఇట్లనుకొనెను. సుందరియగు పార్వతి నాపై కుపితయై వెళ్లెను. స్వభావముచే ఆమె దృఢవ్రత; కావున ఆమె తాను కోరిక తీర్చుకొనియే వచ్చెనా? అని నాకు సంశయము కలుగుచున్నది. అనుకొనుచు ఆమెకు ఉండు గుర్తులన్నియు పరీక్షించి నిర్ణయించుకొనదలచెను. పరికించి చూడగా ఆమె ఎడమవైపున ఉండవలసిన పద్మాకారపుసుడి ఈస్త్రీకి లేదు. దానితో ఇది దానవ మాయయని శివుడు గురుతించెను. అయినను తన హృదయగత భావ మాకారమున కప్పిపుచ్చుకొని తనరహస్యావయవమున వజ్రాస్త్రము ఇముడ్చుకొని ఆ దానవుని సంహరించెను. ఈ అంశము లేవియు వీరకునకుతెలియవు. హరుడు స్త్రీరూపుడు అగు దానవేశ్వరుని చంపుట చూచియు పర్వతదేవత తనకు వాస్తవ విషయము ఎరుగకయే శీఘ్రగామి కావున వాయుదేవుని దూతగాచేసి ఈ విషయమును శైలపుత్రికి తెలిపెను. అదివిని పార్వతి క్రోధరక్తాక్షయై మనస్సున నొప్పిపడుచు తన పుత్రుడగు వీరకుని ఇట్లు శపించెను.