మత్స్య మహా పురాణము
సావిత్రికి తృతీయ వరము
సావిత్రి యమునితో ఇట్లనెను, సురశ్రేష్ఠా! ధర్మార్జనము చేయుట జరుగునప్పుడు శ్రమ ఎక్కడిది. అదికాక ఇట్లు నీపాదమూల సేవనము పరమధర్మ సాధనము; విజ్ఞానియగు పురుషుడు సదా ధర్మమార్జించవలయును; ఈ లాభము సదా సర్వలాభము కంటెను విశిష్టమైనది. ధర్మార్థకామములనెడు త్రివర్గపు సాధనమే జన్మఫలము. ప్రభూ! ధర్మము నార్జించని వానికి అర్థ కామములు రెండును గొడ్రాలి కొడుకు వంటివి అనగా ఉండనే ఉండవు. ధర్మముచే అర్థమును దానిచే కామమును (లోకపు కోరికలను తీర్చుకొనుట) సాధ్యమగును. ధర్మముచేత (ఇహపర) లోకములు రెండును సాధించుకొనవచ్చును. జీవుడు ఎక్కడకు పోవలెనో అక్కడకు (సుఖ స్థానమునకు) అతని వెంటనుండి తీసికొనిపోవునది ధర్మ మొక్కటియే. ఇతర మంతయు శరీరముతో పాటే నశించును. జీవుడు తానొక్కడే పుట్టును, తానొక్కడే చచ్చును, మిత్రులు కాని బాంధవులు కానీ కాక ధర్మ మొకటి మాత్రము వానివెంట పోవును; తానాచరించు క్రియలలో సౌభాగ్యమును లావణ్యమును ధర్మముచేతనే లభించును. ప్రాణుల నంతమొందించు ధర్మరాజా! సర్వకామ (కోరికల) సుఖములనిచ్చు బ్రహ్మేంద్రోపేంద్ర, శివచంద్ర, యమ, రవి, అగ్ని, వాయు, వరుణ, వసు అశ్వి, దేవతా, కుబేరాది దేవతల లోకములన్నియు ధర్మము చేతనే ప్రాణులకు లభించును. మనోహరములగు (జంబూ ప్రభృతి) ద్వీపములను (భరత వర్షాది) వర్షములను నందనాది ముఖ్య దేవోద్యానములను స్వర్గమును నరులును నరోత్తములునుకూడ పొందగలుగుట ధర్మము నాచరించుటచేతనే! హృదయాశ్చర్యకర విమానములును శుభరూపులగు అప్సరసలును పుణ్య వంతుల పుణ్యఫలమగు తైజన శరీరములును రాజ్యమును రాజపూజయు ఈప్సిత కామ సిద్దియు పుణ్యఫలమయి కనబడు ఉత్తమ సంస్కారములును బంగారమును వైడూర్యాది రత్నములును చంద్రకిరణములను పోలు వస్త్రములును పూర్ణ చంద్రమండలము వంటివియు రత్న ఖచితములునగు చామరములును సురాధ్యక్షా! శుభధర్మ కర్మాచరణముతోనే లభించును, ఛత్త్ర ధారణము జయశబ్దములు శంఖధ్వనులు సూతమాగధుల స్తుతులు ఉత్తమాననములు బంగారు జలపాత్రము ఉత్తమములగు అన్నపానీయ గీతనృత్తమాల్య సుగంధానులేపనములు రత్నవస్త్రములు రూపౌదార్య గుణయుక్తలగు అతి మనోహర స్త్రీలు ప్రాసాద శిఖరములయందు నివాసము బంగరు గజ్జెలతో మొవ్వలతో కూడ తలలపై చామరాలంకారములుకల అశ్వములపై స్వారీ చేయుచు తిరుగుట బంగరు పద్మ చిహ్నములతో అలంకృతములయి ప్రకాశించునవి పర్వతములవంటివి ఒయ్యారపు పాద విన్యాసములతో నడుచునవియగు మదపుటేనుగులు వాహనములగుట-ఇంతయు ధర్మ పుణ్యకర్మముచేతనే లభించును. సర్వకామ ప్రదుడును సర్వపాపదోష నాశకుడునగు దేవునియందు భక్తియు ధర్మ పుణ్య కర్మ లభ్యములే. యజనము (యజ్ఞముల నాచరించుట) తపము దానము దమ (బహిరింద్రియ నిగ్రహ)ము క్షమాగుణము బ్రహ్మచర్యము సత్యము శుభ తీర్థ(గురు)సేవనము స్వాధ్యాయ సేవనము సాధుసహవాసము దేవతార్చనము గురు శుశ్రూష బ్రాహ్మణ పూజనము- ఇంద్రియ జయము బ్రహ్మచర్యము అమత్సరము ఇవి అన్నియు ధర్మార్జన సాధ్యములు.
కావున విజ్ఞానవంతుడు అగు పురుషుడు (స్త్రీ అయినను) ధర్మమాచరించవలయును; మనము చేయవలసిన పనిని (ధర్మమును) చేసినను చేయకున్నను మృత్యువు (మనమది చేసివచ్చు వరకు) ఎదురుచూడదు, ఇట్లు దేవా! జీవితము అనిత్యము కావున బాలుడుగా ఉండగనే ధర్మము ఆచరించవలయును; ఎప్పుడు ఎవనికి మృత్యువు వచ్చి పడనేపడునో ఎవరు ఎరుగుదురు? చూడుము. చూచుచుండగనే లోకమునకు (ప్రాణికి) మరణము తన ముందే నిలిచియున్నది. సురోత్తమా! ఇట్టి ప్రాణులు తాము అమరులేమో అనునట్లు గర్వించుట అత్యాశ్చర్యకరము గదా! బాలుడు యౌవనమునను-యువకుడు వార్ధకమునను తనకు మరణము రావచ్చునేమో కాని ఇపుడే చావురాదు లెమ్మని ఆయా వయస్సులలో ధర్మమాచరించకుండును. కాని ప్రతివాడును చావునకు భయపడును, తాను ఎన్నటికిని చావకుండవలయును అనుకొనును. ఇక ఈ ప్రాణికి గతి ఏమి? దేవా! ప్రాణులకు అభయ స్థానము ఏదియులేదు. మరణము అందరకును భయస్థాన (కారణ)ము; ఇట్టి భయకారణమగు మృత్యువునకు భయపడనివారు పుణ్యకర్మ ఫలముగల ధర్మమును ఆర్జించువారు మాత్రమే. అనగా ఈ సావిత్రీ వచనములు విని యముడు “విశాలాక్షీ! నీ ధర్మ సంయుత వచనములతో సంతుష్టుడనయితిని; సత్యవంతుని ప్రాణములను తప్ప వరమింకేదైన శీఘ్రముగా కోరుము” అనెను; “అనపత్యునకు (పురుష-సంతతి లేనివారికి) ఏ లోకములందును గతి (ప్రవేశము-సుఖప్రాప్తి) లేదందురుగదా! కావున నాకు ఔరస అనగా కడుపున పుట్టిన పుత్ర శతము వరముగా మిమ్ము వేడుచున్నాను” అని సావిత్రి పలికెను. యముడును ఆ వరము అంగీకరించి “కల్యాణీ! నీ కోరిక నెరవేరినది; ఇక మరలుము, నీవనినది ఇది అంతయు జరుగును. ఇంకను నీవు నావెంట వచ్చినచో నాకు అటంకమును, నీకు శ్రమమును అగును. అందుచే ఈమాట పలుకుచున్నాను” అనెను.