చంద్రుడు తారను అపహరించుట

ఒకమారు చంద్రునకు ఉద్యానవనములో దేవగురువగు బృహస్పతికి భార్యయగు తార కనబడెను. ఆమె అనేకములగు పుష్పములతోను ఆభరణములతోను ఉపశోభించుచుండెను. పెద్ద పిరుదులే కలిగి స్తనముల భారముచే వంగి యుండెను. పుష్పములు శిరోలంకారముగా ధరించి యుండెను. మిగుల మదించిన దేహము కలదై యుండెను. మన్మథ బాణములవలె మనస్సునకు హాయి గొల్పుచు విశాలములును మనోహరములునైన కన్నులు కలిగియుండెను.

(దక్షుడు భార్యలుగా ఇచ్చిన) తారలకు (నక్షత్రములకు) (అప్పటికే) అధిపతిగా ఉన్న ఆ చంద్రుడు కామవశుడై ఏకాంత ప్రదేశమున ఆమె జడ పట్టెను. అతని రూపముచే కాంతిచే అప్పటికే తన మనస్సు హరింపబడి ఉన్న ఆతార ఆస్థితిలో కామపీడుతురాలయి అతనితో విహరించి ఆనందించెను. చాలసేపటి వరకు ఆమెతో క్రీడించియు తృప్తి నొందక చంద్రుడు అక్కడి నుండి తారను స్వగృహమునకు తీసికొనిపోయెను. ఆమెవలన తనకు కలుగు సుఖములందు అనురక్తుడగు ఆ చంద్రునకు స్వగృహము నందు కూడ ఆమెతో ఎంత కాలము కాము సుఖములను అనుభవించినను తృప్తి కలుగలేదు.

బృహస్పతియును తన భార్యయగు తారతోడి ఎడబాటు సహించలేక విరహాగ్నితో దగ్ధుడగుచు తన మనోధ్యానమున నిరంతరమును ఆమెనే చూచుచు బాధనొందుచుండెను. కాని అతడు చంద్రుని శపించుటచే కాని మంత్రములతో కాని శస్త్రములతో కాని అగ్నితో కాని విషాదికముతో కాని అపకారము చేయజాలక పోయెను. తాను వాచస్పతి (వేదాది విద్యలకు అన్నింటికి అధిపతి) అయి వుండియు వివిధములగు ఉపాయములతో అప(భి)చారములతోను కూడ బృహస్పతి చంద్రునకు ఏమియు అపకారము చేయలేకపోయెను. అతడు కామబాధచే తపించి దీనుడై తన భార్యను తనకిమ్మని చంద్రుని వేడుకొనెను. మహేశ్వరుడు చతుర్ముఖుడు సాధ్యులు మరుత్తులు లోకపాలురు మొదలగువారు ఎవరుఎవరు వేడినను తారాసుఖ పాశములచే బద్ధుడైన ఆ చంద్రుడు తారను బృహస్పతికి తిరిగి ఈయలేదు.

ఈ కారణమున సదాశివునకు చంద్రునిపై తీవ్రమగు కోపము కలిగెను. అతడు సామాన్యుడా! వామదేవుడు (కోపించినచో ఎవరికిని అనుకూలుడు కాక హాని కలిగింపకలవాడు) అని లోకము లందు ప్రసిద్ధుడు. అనేకములగు ముద్రలతో (భావ విశేష ప్రకటనములతో) అతని పాదపద్మములను ఎల్లవారును అర్చింతురు. పైగా ఆయనకు బృహస్పతి యందు స్నేహము అధికము. ఇట్టి సదాశివుడు త్రిపురాసుర సంహారి పినాకధనుర్ధారియగు పరమేశ్వరుడు జయము తప్ప ఓటమి నెరుగనీయని అజగవమను ధనుస్సు ధరించి చంద్రునితో యుద్ధమునకై బయలు దేరెను. అతని శిష్యులను విధేయులును అతనివెంట నుండిరి. భూతనాథులును సిద్ధులును అతనిని పరివేష్టించి వచ్చుచుండిరి. తృతీయ నేత్రము అగ్ని జ్వాలలను ప్రకటించుచుండ అతని ముఖము భయము గొల్పుచుండెను. ఇట్లాయన విశేషముగా దీపించుచుండెను. రథముల తోను అశ్వములతోను కూడి గణేశులు ఇరువది అరువది నాలుగు కోట్లమంది (10000000X 20x64) శివుని వెంట బయలుదేరి వెళ్ళిరి. అదేవిధముగా కుబేరుడును రథముల నెక్కిన వీరులు అనేక శతకోటి సంఖ్యలో తనకు తోడు రాగా శివునివెంట వెళ్ళెను. వేతాళులు యక్షులు ఉరగులు కిన్నరులు పద్మము అర్బుదము సంఖ్యలో (పద్మము =1000000000, అర్బుదము = 100000000) కుబేరునివెంట నుండిరి. సోముడును అధికమగు కోపముతో మూడు పండ్రెండు లక్షల రథములపై నక్షత్రులు దైత్యులు అసురులు తనవెంట వచ్చుచుండ శనైశ్చరుడు అంగారకుడు తన తేజస్సును వృద్ధిపరచుచుండ యుద్ధమునకు వచ్చెను. ఈ భయంకర యుద్ధోద్యమమునకు సప్తలోకములును భయమునందెను. సముద్రములు అన్నియును వాని నడుమనున్న సమస్త ద్వీపములును అత్యంతముగా చలించుచుండెను. ప్రజ్వలించుచున్న అస్త్రముల నుండి విశాలములగు వహ్ని జ్వాలలు దిక్కుల వ్యాపించుచుండ పినాకధారియగు శివుడు సోముని ఎదుర్కొనెను.

 అంతట భీముని (శివుని)-సోముని-భయంకరసేనలకు రెండింటికిని మహాయుద్ధము జరిగెను. ఆ యుద్ధము సమస్త ప్రాణులకును నాశము కలిగించునదియు మిగుల క్రమక్రమముగా వృద్ధి పొందుచు పోవుచున్నదియు తీక్ష్ణములగు ఆయుధములనుండియు అస్త్రములనుండియు వెలువడు మంటలు దట్టమై కనబడుచున్నదియునై భయంకరముగా ఉండెను. పరస్పరము ప్రయోగించు కొనుచున్న భయంకర తీక్ష్ణ శస్త్రములతో ఇరుపక్షములవారి సేనయంతయు తత్ క్షణమే నాశము నొందసాగెను. సేనలపై పడుచుండిన శక్తి సంపన్నములగు ఆయుధములు ఆ సేననేకాక స్వర్గమర్త్య పాతాళ లోకములను కూడ కాల్చివేయుచుండెను.

రుద్రుడు కోపించి బ్రహ్మశీర్షాస్త్రమును ప్రయోగించెను. సోముడు వ్యర్థము కాని శక్తిగల సోమాస్త్రస్తమును వదలెను. వాటిని ప్రయోగించుటవలనను అవి పరస్పరము ఢీకొనుటవలనను ద్యుభూమ్యంతరిక్షములకు మూడింటికిని (ఈ మూడు లోకములందలి సకల భూతములకును) భయము కలిగెను.

ఇట్లా భీమ సోముల యుద్ధము క్రమక్రమముగా వృద్ధి పొందుచుండెను. లోకములు క్షయము నొందునట్లుండెను. ఇది చూచి లోక పితామహుడగు బ్రహ్మ ఎంతో శ్రమతో (దేవతలతో కూడ) లోపల ప్రవేశించి యుద్ధమును నివారించెను. బ్రహ్మ సోమునితో నిట్లు పలికెను: “సోమా! నీవిట్లు అకారణముగా భూతములకు నాశమును కలిగించు యుద్ధమునకు పూనితివి. ఇది చేయరాని దుష్కృత్యము. ఇదికాక నీవు పరస్త్రీ హరణముఅనెడు అకృత్యమునకు సంకల్పిం చితివి. అందులకే నీవీ భయంకర యుద్ధమును చేయుచున్నావు. నీవు సహజముగ శాంత స్వభావుడవే కావచ్చును. కానినీవుచేసిన ఈదోషమునకు ఫలితముగా జనులయందు పాప గ్రహముగానే ప్రసిద్ధినొందుదువు. నీకు కలిగిన ఈ కోరిక (పరదార హరణవాంఛ) ఇంతటితో చాలింపుము. బృహస్పతి భార్యయగు తారను మరల అతనికి అప్పగించుము. పరుల ధనమును హరించిన వారుదానిని మరల దానిసొంతగాని కప్పగించుటలో అవమానము ఏమియులేదు.”

పితామహుని మాటలు విని సోముడు సరేయని అంగీకరించెను. ప్రశాంతభావముతో యుద్ధము నుండి తొలగిపోయెను. బృహస్పతియును భార్యయగు తారను వెంట తీసికొని హర్షించుచు రుద్రునితో కూడి స్వగృహమునకు పోయెను.