మత్స్య మహా పురాణము
సూర్యవంశాను వర్ణనము
ఋషులు సూతునితో ఇట్లు పలికిరి, మీరు పురాణతత్వమును ఎరిగినవారు. తాము మాకు సూర్యచంద్రవంశముల వృత్తాంతములను సంప్రదాయమున ప్రతిపాదింపబడిన విధమున యథాక్రమమున తెలుపవేడుచున్నాము.
సూతుడిట్లు చెప్ప నారంభించెను, పూర్వము కశ్యప ప్రజాపతికి అదితియందు సూర్యుడు కుమారుడుగా జనించెను. ఆతనికి సంజ్ఞా, రాజ్ఞీ, ప్రభా అనువారు ముగ్గురు భార్యలు. రేవతుని కూతురు రాజ్ఞీ. ఆమె కుమారుడు రైవతుడు. ప్రభాకుమారుడు ప్రభాతుడు. త్వష్ట అను ప్రజాపతి కూతురు అగు సంజ్ఞకు వైవస్వతుడను మనువును యముడు, యమున అను కవలును కలిగిరి. సూర్యుని తేజోమయమగు రూపమును సహింపజాలక సంజ్ఞ తన శరీరము నుండి పవిత్రురాలును సుందరియునగు స్త్రీని జనింపజేసెను. ఆమెయును సంజ్ఞరూపముతో సమానమగు రూపము కలిగియుండెను. ఆమె పేరు ఛాయ. నేనిపుడేమి చేయవలయును? అనుచు తన ఎదుట నిలి చిన ఛాయతో, నీవు స్త్రీలలో ఉత్తమురాలవు. నీవు నా భర్తను భర్తగా గ్రహించియుండుము. నా సంతానమగు ఈ ముగ్గురను ప్రీతితో కాపాడు చుండుము అని సంజ్ఞ కోరగా ఛాయ అంగీకరించి ధర్మము నాచరించు తలంపుతోనే సూర్యుని కడకు పోయెను. అతడును ఆమెను సంజ్ఞనుగా తలచి ఆమెతోనే కామమున ప్రవృత్తుడయ్యెను. సూర్యునకు ఛాయ యందు మనుష్య రూపుడగు సావర్ణి మనువు పుట్టెను. అతడు తండ్రితో సమానముగా వర్ణము కలవాడు. కనుకనే అతనికా పేరు కలిగెను. పిమ్మట సూర్యునికి ఛాయ యందే శని, తపతి, విష్టి అను ముగ్గురు సంతానము కలిగిరి. ఛాయ తన పుత్రుడగు సావర్ణి మనువుపై అధికముగా ప్రేమ చూపసాగెను. దానిని సంజ్ఞ మొదటి కుమారుడగు వైవస్వతుడు (మనువు) సహించెను. కాని యముడు సహించక క్రోధోద్రేకము చెందెను. అతడు తన కుడి కాలు ఎత్తి ఛాయను బెదరించెను నీ ఈ పాదము ఎల్లప్పుడును చీము రక్తము కారుచుండును. దానిని క్రిములు తినుచుండును. అని ఛాయ యముని శపించెను. యముడును ఆ శాపమును సహించలేక సూర్యుని కడకు పోయి ఇట్లు పలికెను, దేవా! మా అమ్మ (ఛాయ) మా అన్నదమ్ముల అక్క చెల్లెండ్ర-అందరయందును సమానముగా స్నేహ భావము చూపుటలేదు. అది సహించలేక నేను చిన్నతనపు స్వభావముచే ఒక్కమారు కాలు ఎత్తితిని. కోపించి మా అమ్మ నన్ను శపించినది. వైవస్వతుడు వలదని బ్రతిమాలుచున్నను ఆమె వినలేదు. అది విని సూర్యుడు యమునితో “నాయనా! నీవు తెలియని వాడవు కావు. ఒక్కొక్కరికి తన మూర్ఖత్వముచేతను, మరియొకరికి కర్మ వశమునను దుఃఖము కలుగుచుండును. ఈ రెండు విధములలో దేనిచేతనైనను దుఃఖము ననుభవించుట శివునకును తప్పించుకొనరానిది. ఇతరుల విషయము చెప్పవలసినది ఏమున్నది? జీవుల కర్మవిపాకము వారిని క్రిములచేత భక్షింపజేయును. కర్మానుభవము వలన (పాపము అనెడి) చీము రక్తము కారుట క్షీణించి పోవును” అనెను.
సూర్యుడు పలికినది విని మహాయశశ్శాలియగు యముడు తీవ్రమగు తపస్సు చేసెను. అతడు గోకర్ణ తీర్థమున కోటి సంవత్సరములపాటు వైరాగ్యమును పూని పండ్లు, దుంపలు, వేళ్లు, గాలి ఆహారముగా తీసుకొని శివుని అరాధించెను. త్రిశూల ధారి మహాదేవుడు సంతుష్టుడై వరము కోరుకొమ్మనెను. యముడును లోకపాలత్వమును పితృలోకపాలనాధి కారమును ధర్మాధర్మ స్వభావములతో నడచు జగములను నిరీక్షించుచుండుటయు కోరెను. శివుని అనుగ్రహమున యమునకు ఈ మూడధికారములును లభించెను.
వాస్తవ స్థితిని ఎరిగి సూర్యుడును రోషము చెంది త్వష్టకడకుపోయి సంజ్ఞ చేసిన పని తెలిపెను. త్వష్ట అతనితో ప్రార్థనా పూర్వకముగా ఇట్లు పలికెను, భగవన్! అనాడు సంజ్ఞ చీకటులను పారదోలు నీ తీవ్ర తేజమును సహించలేనిదయి నీకడనుండి బయలుదేరి ఆడు గుర్రపు రూపముతో నా కడకు వచ్చెను. నేను నీకు భయపడి ఆమెను నా ఇంటికి రావలదని వారించితిని. నీవు నీభర్త హృదయమును ఎరుగక (అతని అనుమతి లేక) నా దగ్గరకు వచ్చితివి. కనుక నీవు నా గృహమును ప్రవేశించదగదు అని నేను అనగా ఆ సుగుణవతి భూలోకము నందలి మరుదేశమునకు పోయినది. ఆమె ఇప్పుడును అదే ఆడు గుర్రపు రూపముతో అచ్చట (తానుండ దగిన చోటు దొరుకక తిరుగుచు) ఉన్నది. నేను నీ అనుగ్రహము పొందుటకు అర్హతగలవాడనని మీరు భావించినచో నన్ను అనుగ్రహించుడు. మీ దేహమును యంత్రము సందు ఉంచి మీ తీవ్ర తేజస్సును (కొంత) పోగొట్టుదును. మీరూపము ప్రాణులకు ఆనందకరము అగునట్లు చేయుదును.
త్వష్ట మాటలను రవి అంగీకరించెను. త్వష్టయును భాస్కరుని తరిమెన పట్టు యంత్రము నందుంచి అతని తీవ్ర తేజస్సులో కొంతభాగము వేరుపరచెను. దానితో అతడు విష్ణుని చక్రమును, శివుని త్రిశూలమును, దైత్యదానవ సంహర్త అగు ఇంద్రుని వజ్రమును చేసెను. అప్పటికిని త్వష్ట సూర్యుని రూపమును చూడజాలకపోయెను. అందుచే అతడు సూర్యుని కిరణములను ఇంకను తగ్గించి సహస్ర కిరణములు మాత్రమే కలిగిన సాటి లేని గొప్ప అందమైన రూపమును రవికి కలిగించెను.
అందుచేతనే నాటి నుండి తరువాత ఇప్పటికిని ఎవరును సూర్యునికి పాదములున్నట్లుగా అతని ప్రతిమను నిర్మింప జేయరాదు అను నిషేధము ఏర్పడినది. ఒకవేళ అట్లు పాదములు గల రవి ప్రతిమ చేయించినచో ఆ పాపిష్ఠుడు నిందితమగు గతిని పొందును; కుష్ఠు రోగమును పొందును. ఈలోకమున దుఃఖములను పొందును. కావున ధర్మమును కామమును కోరిన వారెవ్వరును చిత్తరువుల యందును ఆలయములందును దేవ దేవుడును, మహాబుద్ధి శాలియును అగు సూర్యునకు పాదములు నిర్మింపజేయరాదు.
తరువాత అమరులకు అధిపతియగు భగవానుడు సూర్యుడు భూలోకమునకు పోయెను. అతడు మహాతేజస్సుతో చుట్టుకొనబడినవాడును, అశ్వ రూపమును ధరించినవాడును అయి, ఆమె కడకుపోయెను. ఆ దివాకరుడు కామార్తుడుగా ఉండినందున ఆడు గుర్రపు రూపమున ఉన్న సంజ్ఞ ముఖమునే తన కామ ప్రవృత్తికి సాధనముగా చేసికొనెను. ఆమె తన భర్తను గుర్తించక ఆతడెవరో పరుడు అను భ్రాంతిచే మనస్సునందు భయముచే బాధనొంది కలవరపాటు చెందెను. ఆమె సూర్యుని వీర్యమును తన ముక్కు పుటముల ద్వారమున వదలివేసెను. ఇట్లు జరిగిన ఈ రేతఃస్రావము వలన పుట్టిన ఇద్దరు దేవతలే అశ్వినులు అని మనము వినుచున్నాము.
నాసికల (ముక్కుల) నుండి పుట్టినందున నాసత్యులు అనియు దస్రము (అశ్వము) యొక్క ఓష్ఠము (పెదవు)ల నుండి పుట్టుటచే దస్రులనియు అశ్విని దేవతలకు పేరు లేర్పడినవి.
తరువాత సంజ్ఞ తాను పూర్వము చాలకాలము క్రిందట అర్చించిన తన పతియే ఇతడని సూర్యుని గుర్తించి మరల సంతోషము నందెను. రవియు విమానముపై తన భార్యతో కూడ స్వర్గమునకు వెళ్లెను.
సూర్యునకు ఛాయయందు కలిగిన సూర్యసావర్ణి తపోధనుదుగా ఈ నాటికిని మేరు పర్వతమునందు ఉన్నాడు. శని తపస్సాచరించి తన తపోబలమున గ్రహములతో సమానత్వము పొందినాడు. యమున, తపతి అను ఇద్దరు కన్యలును నదులుగా మారిరి. విష్టి అను కన్య మాత్రము ఘెర రూపురాలు (మిగుల నల్లనిది) ఈమె కాల రూపురాలై ఉన్నది.
వైవస్వత మనువునకు మహాబలులగు పదిమంది కుమారులు కలిగిరి. వారిలో మొదటి వాడు ఇళుడు. ఇంకను ఇక్ష్వాకుడు, కుశనాభుడు, అంష్టుడు, ధృష్టుడు, నరిష్యంతుడు, కరూశుడు, శర్యాతి, పృషదశ్వుడు, నాభాగుడు అనువారు తొమ్మిది మంది. ధర్మమును ఎరిగి అనుష్టించు ధార్మికుడగు వైవస్వతుడు జ్యేష్ఠ పుత్రుని ఇళుని రాజ్యమునందభిషేకించి శ్రేష్ఠమగు హిమవచ్చి ఖరమునకు పోయి అందరికంటె మిన్నగా తపము ఆచరింపసాగెను.
తరువాత దిగ్విజయమును సాధించుటకై ఆ ప్రతాపవంతుడగు ఇళుడు ఈ భూమియం దంతటను అన్ని ద్వీపముల యందును సంచరించుచు రాజులను అందరను తనకు లోబరచు కొనెను. ఆ దిగ్జయయాత్రా క్రమములో అతడు తన గుర్రము తీసికొనిపోగా శివుని ఉద్యాన వనమునకు పోయెను. ఆ ఉద్యానము కల్పవృక్షపు లతలతో వ్యాప్తమై అనగా సుందరమైనది. అది చాల పెద్దది. గొప్పది. దాని పేరు శరవణము. దాని యందు అర్ధచంద్రుని శిరోభూషణముగా ధరించువాడును దేవేశుడును అగు సోముడు (స+ఉమా) పరమేశ్వరుడు పార్వతి (ఉమ)తో కూడి విహరించుచు ఆనందించుచుండును. దశయోజన వైశాల్యము గల ఈ మా వనమునందు పురుషప్రాణి ఏది వచ్చినను అట్టి ప్రతి పురుష ప్రాణియు స్త్రీత్వమును పొందును అని పూర్వము ఒకప్పుడు పార్వతి ఈ వన విషయముగ ఒక వ్యవస్థ (కట్టడి) చేసెను.
పూర్వము ఎప్పుడో శివుడు చేసిన ఈ వ్యవస్థ తెలియని రాజు ఇలుడు ఆ శరవణములో ప్రవేశించిన వెంటనే స్త్రీ అయ్యెను. అతని అశ్వమును బడబ (ఆడు గుర్రము) అయ్యెను. రాజు వెంటనే తాను పురుషుడుగా ఉన్నప్పుడు చేసిన ప్రతి పనిని మరచెను. అతడు ఇళ అను పేర స్త్రీ అయ్యెను. ఈ రూపములో ఆమె వక్షోజములు బలిసినవై ఉన్నతములై యుండెను. ఆమె పిఱుదులును కటి ప్రదేశమును ఉన్నతమయి ఉండెను. ఆమె కన్నులు తామరపూరేకులవలె విశాలములయి యుండెను. ఆమె ముఖము నిండు చందురుని పోలియుండెను. ఆమె శరీరము అంత స్థూలముకాక సన్ననైయుండెను. ఆమె చూపులు ఒయ్యారపు కదలికలచే మెరయుచుండెను. అంతవరకు సంతానమును కని ఉండని యౌవనములో ఉండెను. ఆమె మేను బంగారు చాయతో ఉండెను. ఆమె హంసవలె నడచుచుండెను. కోరికల రేకెత్తించు రూపమును శృంగార గుణములును కలిగి యుండెను. ఆమె గోళ్ళ మొలకలు పలుచనై ఎర్రనై యుండెను.
ఇటువంటి ఆ సుందరి ఇళ ఆ శరవణమను ఉద్యానమునందు అటునిటు తిరుగుచు తన మనస్సులో “నా నాయన ఎవరో! అమ్మ ఎవరో! సోదరులు ఎవ్వరో! ఎవరిని భర్తగా చేసి, నన్ను అతనికి ఇచ్చిరో! భూలోకమున అతడు ఏవర్ణము వాడో!” అని ఆలోచింపసాగెను. ఆమె ఈ విధముగా ఆలోచించుచు తిరుగుచుండగా, చంద్రుని పుత్రుడగు బుధుడు ఆమెను చూచెను. ఆమె సౌందర్యము అతనిని ఆకర్షించెను. కామము పీడింపగా ఆ ఉద్యానమునందే అతడామె యందు అనురాగము చెందెను.
అతడు ఆమె విషయమున తన కోరిక తీర్చుకొనుటకై ఒక ఉపాయము చేసెను. బుధుడు ఒక విశిష్టమయిన రూపము ధరించెను. అతని చేతులయందు దండము, కమండలువు. పుస్తకమును ఉండెను. బ్రాహ్మణ రూపము, శిఖ, బంగారు కుండలములును దాల్చి ఉండెను. వేదము చెప్పుచుండెను. తమచేతులందు వేణు దండములు ధరించి సమిధలు పుష్పములు, కుశలు, ఉదకము చేతపట్టుకొనియున్న అనేకులగు బ్రహ్మచారులు అతని వెంట ఉండిరి. ఇట్టి రూపముతో పరివారముతో ఆబుధుడు ఇళ తప్పిపోగా ఆమె కొరకై వెదకుచున్న వానివలె నటించుచు ఆ శరవణమున ఆమెను గట్టిగా పిలువసాగెను. బుధుడు ఆ శరవణమునకు వెలుపలనే లోపలకు వచ్చినచో తానును స్త్రీగా మారునను భయమున చెట్ల గుబురుచాటున నుండి తడబాటుపడుచు ఆకస్మికముగా మందలింపు మాటలతో పెద్దగా “అగ్నిహోత్ర కాలములో చేయవలసిన నాశుశ్రూష చేయక విడిచి నా ఇంటి నుండి ఎక్కడకు వెళ్ళితివి? నీవు విహరించువేళ ఇప్పుడు ముగిసిపోయినది. ఓ సుందరీ! రమ్ము-రమ్ము! ఇంకను రాకున్నావు. కారణమేమి? సాయంకాలమున నీవు విహరింప దగిన సమయము గడచి పోవుచున్నది. నాఇంటికి రమ్ము. వచ్చి ఇల్లు అలికి పూలతో అలంకరించుము” అని అనసాగెను.
ఈ మాటలు విని ఇళ “తపోధనా! నేను ఈ విషయ మంతయు మరచితిని. మీరు ఎవరో మీ కులమేమో శీలమేమో చెప్పవేడుచున్నాను.” అని పలికెను.
బుధుడు మిగుల సౌందర్యవతియగు ఇళతో “నే కాముకుడు అను పేరుతో ప్రసిద్ధుడను. అనేకములగు విద్యల నెరిగినవాడను. (కనుక) బుధుడను ప్రసిద్ధి వహించి యున్నాను. తేజస్వి (కాంతి గలవాడు-చంద్రుడు) అనువాని కులము (వంశము-ఇల్లు) నందు పుట్టిన వాడను. నా తండ్రి బ్రాహ్మణులకు (ద్విజులకు-అనగా పక్షులకు) అధిపతి (చంద్రుడు) [ఇట్లు పైకి తాను బ్రాహ్మణుడైనట్లును రహస్యార్ధమున తాను చంద్రుని కుమారుడగు బుధుడనియు చెప్పగా మాటలాడగా] ఆమె అతని ఆమాటలు విని బుధుని గృహమునకుపోయి దానియందు ప్రవేశించెను. అది మనోహరములగు స్తంభములతో వ్యాపింపబడి యున్నది. దివ్యములగు ముత్తెములు అంతట కూర్చబడియున్నవి. ఇది యంతయుచూచి ఆ ఇళ ఆ ఇంటిలో ఉండుట వలన తాను కృతార్థురాలయ్యెనని తలచెను. ఎంతో మెచ్చదగిన ఇల్లు. ఎంతో మెచ్చదగిన రూపము. ఎంతో ప్రశంసింప దగిన ధనము. ఎంతో పొగడదగిన వంశము. ఎంతో కాలము నుండియు ఇతడే నా భర్త. ఇతని లావణ్యము ఉత్తమమైనది అని ఆమె సంతోషపడెను.
నాటి నుండియు చాలకాలము వరకు ఇళ, ఇంద్రభవనము వంటిదిగా తనకు తోచుచు సర్వభోగములతో నిండిన ఆ ఇంటియందు, ఆ బుధునితో కూడ విహరించి ఆనందించెను.