మత్స్య మహా పురాణము
వృషోత్సర్గ వృష లక్షణము
భగవన్! వృషోత్సర్గమున వదలవలసిన వృషభపు లక్షణమును వృషోత్సర్జన విధానమును దాని మహాఫలమును వినగోరుదుననిన మనువుతో మత్స్యుడిట్లు చెప్పెను. మొదట ఆ వృషభమునకు తల్లియగు ధేనువును పరీక్షించవలయును. ఆ ధేనువు సుశీలయు గుణవతియు, అంగవైకల్యము లేనిదియు నలిగి (చిక్కి) పోనిదియు, పుట్టిన దూడలన్నియు బ్రదికియున్నదియు, రోగములు లేనిదియు, నున్నని వన్నెయు గిట్టలును కొమ్ములును కలదియు, మనోహరాకృతి కలిగి సౌమ్యయై, సరియగు ప్రమాణముతో నుండి పొగరు లేనిదిగా నుండ వలయును; దాని కుడివైపు సుడులు కుడివైపునకును ఎడమవైపు సుడులు ఎడమవైపునకును తిరిగియుండవలెను; విశాలమగుమలుగు (జఘనము) మెత్తనై దట్టమగు ఎర్రని పెదవులు ఎర్రని మెడ కలిగి చక్కగ ఒప్పుచుండవలయును; ఆ ధేనువు కొంచెము చామనచాయ కలిగి దేహమున ముడుతలు లేక విప్పారిన ఎర్రని నాలుకయు, విశాలములు నిర్మలములు ఎర్రనివి వైడూర్యపు వన్నెయో తేనెవన్నెయో కలవి నీటి బుడగలవలె ఎత్తుగా కనబడునవి, ఎర్రని కనుపాపలు కలవినున్ననివి అగు కన్నులును ఒత్తయిన గట్టిగిట్టలును ఏడుకాని పదునాలుగుకాని దంతములును చామన చాయగల లోదౌడలును కలిగి యుండవలయును. ఆరు ఉన్నతములయి చక్కని పార్వ్శములు, తొడలు కలిగి విశాలమయి ఐదు సమములు ఆయతములునయి ఎనిమిది ఆయతములయిన తలయు, మెడయు ఉన్న ధేనువులు మంచి లక్షణములు కలవి; అనగా మనువు-భగవన్! షడున్నతములు పంచసమాయతములు అష్టాయతములు అననేవేవి? అవి యుండుట ధేనువులకు శుభకర మంటిరికదా! తెలుపుడన మత్స్యుడిట్లు పలికెను: ఉరము, వీపు, శిరము, పొట్ట, పిరుదులు రెండు-మొత్తమీయారును ఉన్నతములయియున్న ధేనువులు మంచివని పండితులు ప్రశంసింతురు; రెండుచెవులు, రెండుకన్నులు లలాటము ఈ ఐదును సమములై పొడవై యుండవలెను. తోక, గంగడోలు, రెండు తొడలు, నాల్గుస్తనములు ఈ ఎనిమిదియు వీనితో పాటు శిరము కంఠము కలిసి మొత్తము పదియు పొడవయి యుండవలెను.
తరువాత ఆ ధేనువునకు కుమారుడగు వృషభమును పరీక్షించవలెను, అది లక్షణ వంతము కావలెను; దాని మూపును మూపురమును ఎత్తుగా తోకయు గంగడోలును వంకర లేక ఉండవలెను. అదిపెద్ద కటి స్థలము మూపులు వైడూర్యమణి వంటి కన్నులు పవడము వంటి కొమ్ముల కొనలు చెవుల కొనలు -చాల పొడవై విశాలమగు తోకకుచ్చు తొమ్మిదికాని వదునెనిమిది కాని వాడి మొనలుగల చక్కని దంతములు కలిగి యుండవలెను, మల్లెమొగ్గల వంటి కన్నులుకల దానిని వదలినచో వదలినవాని ఇంట ధనధాన్య వృద్ధియగును; ఎర్రని కపిల వర్ణపుది, తెల్లనిది, రాగివన్నెది, నల్లనిది, గౌరవన్నెది, పాటల వర్ణపుది (తెలుపు, ఎరుపు సమముగ కలిసిన వన్నెది)లావు కొమ్ములు, ఎర్రని వీపు, ఐదు వన్నెలు కలిసిన తోక కుచ్చు వెంట్రుకలు విశాలములగు చెవులు విశాలములగు మూపులు దట్టములైనున్ననైన రోమములు, ఎర్రని కన్నులు కల కపిల వృషభము-ఎర్రని కొమ్ముల పైవన్నె-తెల్లని పొట్ట, నల్ల డొక్కలు కల వృషభమును బ్రాహ్మణులు విడువవలయును; చిక్కని ఎరుపువన్నెకలది క్షత్రియులు విడువదగినది; బంగరువన్నె ఎద్దును వైశ్యులు, నల్లని దానిని శూద్రులు విడువవలయును; ముందువైపునకు వంగి పొడవై కనుబొమలవైపునకు చూచుచున్న కొమ్ములుకలది సదాసర్వవర్ణముల వారును విడువదగినది. (వృషభముల లక్షణములబట్టి నామ విశేషములు కలవు; ఎట్లన) పిల్లి పాదముల వంటి పాదములు కపిలవర్ణము–కపిల పింగళ వర్ణము కలదియు తెల్లనిదై మార్జాల పాదసహితము మణుల వంటి కన్నులు కలదియు పింగళ వర్ణము తెల్లని పాదము-సర్వత్ర తెల్లని పాదములు-తెల్లని రెండు పాదములు కలదియు-ఇట్టి కోడెదూడలను ధన్యజాతి అందురు, చెవి మొదళ్ల యందు తెలుపు కలిగి ప్రకాశించు మొగము రక్తవర్ణ ముఖము - శరీరమంతయు రక్తవర్ణము- కల కోడెను నందీ ముఖ మందురు; శరీర మంతయు ఎక్కువ భాగము ఎర్రనై పొట్టయు వీపును తెల్లగానున్న కోడెదూడను సముద్రము అందురు, ఇదియు వంశ వృద్ధి కలిగించును, మల్లెపూవువలె నుండియు పలువన్నెలు కలదియు పద్మమువలెనుండియు పలువన్నెలు కలదియు భాగ్యవృద్ధి కలిగించును; అవిసిపూవన్నె కలదియు మరియు ధన్యతరము; ఈచెప్పిన వన్నియు ధన్య వర్గమునకు చెందినవి; (మేలయినవి), ఇక అధన్యములు: నల్లని దౌడలు పెదవులు దంతములు బిరుసు కొమ్ములు గిట్టలు అస్పష్ట వర్ణము కలవియు పొట్టివి పులివలె సింహమువలె కనబడునవి పులివన్నె గ్రద్దవన్నె కలవి ఎలుకవన్నె కలవి చాల నల్లనివి మెల్లకంటివి కొంకికాళ్ళవి ఓరచూపులవి ఎగుడుదిగుడైన తెల్లని పాదములు కలవి గ్రుడ్లు త్రిప్పునవి మిడిగ్రుడ్లవి- ఇట్టి వృషభములను విడువరాదు; ఇంటనుంచుకొనరాదు; వృషోత్సర్గమున విడువదగినవియు-ఇంటనుంచు కొనదగినవియునగు వృషభముల లక్షణమును మరల జెప్పెదను వినుము.
స్వస్తికాకారపు కొమ్ములు ఉరుమువంటి కంఠధ్వని పెద్దకొలత మదపుటేనుగు నడకవలె నడక వెడలపు రొమ్ము పెద్ద ఎత్తు మహాబల పరాక్రమములు కలవియు శరీరమంతయు తెల్లనై తల, చెవులు, లలాటము, తోకకుచ్చు, పాదములు, కన్నులు, డొక్కలు నల్లగా ఉండినవియు తోక వెంట్రుకలు నేలకు తాకుచు వ్రేలాడుచుండ తోక మాత్రము లావై ముందునకు సాగినట్లుండు నవియు ప్రశస్తములు: రోమశ్రేణియందు శక్త్యాయుధమును- ధ్వజమును (పెద్దజెండా) పతాకను (చిన్న జెండాను పోలిన గుర్తులు కలవియు మరలించినపుడు కుడివైపుగా మరలునవియు చాల ఎత్తగు తలయు మెడయు కలవియునగు కోడెలు వృద్ధిని పలువిధములగు సిద్దులను జయమును కలిగించును, శరీరమంతయు తెల్లనై కొమ్ముల కొనలు కన్నులు మాత్రము ఎర్రనై పగడములవంటి గిట్టలు కల వృషభముకంటె మేలగునది మరి ఏదియును ఉండదు; ఇట్టివానిని వదలినను ఇంట ఉంచుకొనినను మంచిదే; ఇవి ధనధాన్య వృద్ధికరములు. పాదములు ముఖము తోక తెల్లనై శరీరమంతయు ఎర్రనైనదానిని నీల వృషభ మందురు, దీనిని వృషభముగా విడువదగునేకాని ఇంట ఉంచుకొనదగదు; దీని విషయముననే పురాతనమగు గాథ (గీతము) ఇట్లు కలదు; చాలమంది పుత్రులు కావలెనని గృహస్థులు కోరుకొనవలెను, వారిలో ఒకడైన గయకు పోవునేమో! గౌరియగు (రజస్వల కాకముందు) కన్యకు వివాహము చేయునేమో! నీలవృషోత్సర్గము చేయునేమో! రాజా! ఇట్లు సల్లక్షణము గల వృషభమును తన ఇంట పుట్టిన దానినేకాని కొనిన దానిని కాని, వదలుట చేసినవాడు తన మరణ విషయమున శోకింపవలసిన పనియుండదు, అట్టి మహాత్ముడు తుదకు ముక్తికూడ పొందును.