మత్స్య మహా పురాణము
కాత్యాయనీ ప్రతిమాలక్షణము
ఈమె దశభుజ. ఈమెయందు (బ్రహ్మ విష్ణు రుద్ర) దేవతాత్రయ లక్షణములు ఉండును; ఈమె జటాజూటము, అర్ధచంద్రుడు. లోచనత్రయము, పద్మేందుసదృశముఖము అవిసిపూవు చాయను పోలినచాయ, చక్కని నిలుకడ చక్కని కన్నులు కలది. నవయౌవన సంపన్న, సర్వాభరణ భూషిత - మిగుల మనోహరములగు దంతములు కలది - వీనోన్నత స్తనయుక్త. త్రిభంగస్థాన సంస్థానయుక్త అనగా నితంబ భారముచే వేణీ భారముచేకలిగిన మూడు ఒయ్యారపు వంపులు కలది. మహిషాసుర మర్దిని; కుడిచేతులందు త్రిశూల ఖడ్గచక్ర తీక్ష్ణ బాణ శక్తులును; ఎడమ చేతులందు భేటక, పూర్ణచాప, పాశాంకుశములును ఘంటకాని, గండ్రగొడ్డలికాని ఉండును; దిగువను రెండుతలలుకల మహిషమును శిరశ్ఛేదము కలిగిన ఖడ్గపాణియగు దానవుడు ఉండును. వాని హృదయమున శూలము గ్రుచ్చబడియుండును. అడ్డముగా రక్తము స్రవించు చుండును. వాని శరీరావయవములన్నియు నెత్తుటితో ఎర్రనై విప్పారిన ఎర్రని కన్నులు కలిగి నాగపాశ వేష్టితుడై భ్రుకుటి భీషణ ముఖుడైయుండును. రక్తము వెలికి వచ్చుచున్న నోటితో దేవీ వాహన సింహమును నిర్మించవలెను. దేవీ దక్షిణ పాదమా వాహనముపై సరి మట్టముగా నుంచబడి యుండును. ఎడమ పాదము కొంచెముగ పైకెత్తి దాని బొటనవ్రేలు మహిషముపై నుండును.