మత్స్య మహా పురాణము
తారకాసుర వధ
దేవతావందులు (స్తోత్ర పాఠకులు) బిగ్గరగ పాడుచుండిన ఈ స్తుతులను వినగానే తనకు బాలుని వలన మృతికలదను బ్రహ్మ వచనములు తారకునకు స్మృతికి వచ్చెను. వాడును పుణ్యపాప నియంతయగు ధర్మదేవుని స్మరించి భారమంతయు అతనిదేయను భావముతో కవచమును ధరించకయే పదాతియై పదాతులనే తనవెంట తీసికొని శోక వ్యాప్త చిత్తముతో తన మందిరము నుండి శీఘ్రముగా వెలికివచ్చెను. అతని సేనానులగు కాలనేమి మొదలగు దైత్య యోధులు భావావేశమున భ్రాంతచిత్తులై అటునిటు పరుగు లెత్తుచుండిరి. దేవతలను పట్టుకొనుచుండిరి. తమ సేనను కూర్చుకొనుచుండిరి. ఇట్లు పలువురు పలువిధములుగా అదే పనిగా చేయుచుండిరి.
తారకాసురుడు భయంకరాకారుడై పోయి కుమారుని చూచి ఇట్లనెను: బాలుడా! బంతితో ఆడుకొనునట్లే యుద్ధముకూడ చేయుద మనుకొనుచున్నావా ఏమి? యుద్ధ భయంకరులగు దానవులను నీవు ఎప్పుడును చూడనట్లున్నావు; లేదా పిల్లవాడవు కావున ఎక్కువగా లోక విషయములను చూడనందున ఇట్లు మాటాడుచున్నావేమో అని అనగా కుమారుడును తన ముందున్న తారకాసురునితో దేవతలకు హర్షకారణముగా ఇట్లు పలికెను, తారకా! నీవు శాస్త్ర విషయములు మాటలాడుచున్నావు కావున నీకు శాస్త్రము నందు చెప్పిన విషయమే నిరూపింతును వినుము; సమరమనిన భయమెరుగని వీర భటులెన్నడును శాస్త్రములచే చెప్పబడిన విషయములను నీవలె చూచుచు విచారించుచు ఉండరు. నాశిశుత్వమును నీవలక్ష్యముగా చూడకుము. కాలభుజంగము శిశువే; భాస్కరుడు బాలుడయ్యు చూడ శక్యుడు కాడు? అట్లే నేను శిశువనైనను దుర్జయుడనని ఎరుగుము, దైత్యుడా! మంత్రము తక్కువ అక్షరములు కలదేయైనను అధిక ప్రకాశము కలదై యుండుట కనబడుచునే యున్నది కదా! అని ఇట్లు కుమారుడు పలుకుచుండగనే తారక దైత్యుడు ముద్గరమును విసరెను. దాని నతడు అమోఘ తేజముగల వజ్రముతో వెనుకకు త్రిప్పి వేసెను. దైత్యేంద్రుడు అయోమయమగు ఇనుప భిండివాలము విసరగా దేవశత్రు హంతయగు కార్తికేయుడు దానిని చేతితో పట్టివేసి ఆ షణ్ముఖుడు దైత్యునిపై పరుషధ్వని కల గదను వదలెను. ఆ దెబ్బతిని వాడు పర్వతరాజమువలె ఉండియు కంపించెను. దానితో దైత్యుడీ షడ్వదనుడు రణ దుర్జయుడనియు తనకు కాలము సమీపించి నట్లున్న దనియు తలచెను. కాలనేమ్యాది దైత్యేశ్వరులందరును తారకుడు కంపితుడగుట గమనించి రణదారుడగు కుమారునికొట్టిరి. మహాతేజస్కుడగు ఆ కుమారుడును వారి క్లేశము వ్యర్థముకాగా ఆ దెబ్బలేమియు చలింపరానివియు దివ్య శక్తి భావితములును అగు అవయవములుకల తనకు తాకకపోగా దానవులనందరను ఎదిరించి యుద్ధము చేయసాగెను. యుద్ధ నిపుణులు బలశాలురు దేవ కంటకులునగు ఆ దైత్యేంద్రులు దేవతలును కుమారుని కూడ ప్రాసములతో బాణములతో కొట్టిరి. దైత్యాస్త్ర నిహతుడయ్యు కుమారు డేమియు వ్యథ చెందలేదు. కాని దానవులతోడి యుద్ధము దేవతలకు మాత్రము ప్రాణాంతకమయ్యెను. దేవతలు పీడితులగుట చూచి కుమారుడు కోపావిష్ణుడయి, దానవ సేనను అస్త్రములతో చీల్చి చెండాడసాగెను. సురకంటకులగు కాలనేమి ప్రముఖ దానవు లందరును ప్రతీకారము చేయ అలవికాని కుమారాస్త్రములు దెబ్బలుతిని యుద్ధమునకు పెడమొగము పెట్టిరి. దైత్యులందరును పారిపోవుటయో మరణించుటయో కాగా కిన్నరులు బిగ్గరగా పాడుపాటలతో వినబడు నవ్వునకు మహాదైత్యుడు అసుర నాయకుడా తారకుడు క్రుద్ధుడయ్యెను. బంగరు పరికరములతో అలంకృతమయిన దివ్య గదను చేబూని ఒరపిడిచేసి పరీక్షించబడిన మేలిమి బంగారపు భుజకీర్తులతో అలంకృతుడగు ఆ దైత్యుడు దానిని ఆగదతో కొట్టెను. ఆశ్చర్యకర శరములతో నెమిలిని రణ విముఖముగా చేసెను.
షణ్ముఖుడగు ఆ కుమారదేవుడు తన వాహనము రక్తము క్రక్కుచు రణమునకు పెడమొగ మగుటచూచి బంగరు భుజకీర్తులతో రుచిరమగు భుజముతో కనక భూషణములు గల విమల మగు శక్తిని పూనెను; అంతట మహాసేనుడు “మమాదుర్బుద్ధీ! నిలునిలుము; ఒకసారి ఈ జీవలోకమును చూచుకొనుము, ఇపుడు నాచేతి శక్తితో చావనున్నావు! దైత్యుడా! నీవు నేర్చిన అస్త్రమును స్మరించుము; అది నిన్ను కాపాడునేమో చూతము అనుచు వానిమీదకు ఆశక్తిని వదలెను. కుమారుని భుజముల నుండి విడువబడిన ఆ శక్తి అతని భుజకీర్తుల ధ్వని తనతోపాటు వచ్చుచుండగా పోయి వజ్ర శైల రాజమువలె కఠినమగు దైత్య హృదయము చీల్చెను. వాడును చెదరిన కిరీటముతో తలపాగతో జారిపడిన ముంగురులతో భూషణములతో ప్రళయకాలమున పర్వతమువలె నేలపై పడెను.
ఆ దైత్యుడు వినిహతుడు కాగా అది దేవతలకు పెద్ద పండుగ అయ్యెను. నరక మందున్న పాపకరుడు కూడ ఆ సమయమున ఎవడును దుఃఖవంతుడు కాకుండెను. దేవతలు షణ్ముఖ దేవుని స్తుతించుచు తమతమ స్త్రీలతోకూడి ఆడుచు మహాధామ (తేజో) వంతులయి క్రొత్త కుతూహలము (వేడుక)లతో తమతమ భవనముల కేగిరి. తమతమ కోరికలన్నియు ఈడేరుటతో తుష్టులయి దేవతలందరును స్కందముఖము (కుమారో పాఖ్యానము) విషయమున సిద్ధులతో తపోధనులతోకూడి ఈ విధముగ ఫలశ్రుతి రూపములగు వరములను లోకములకు ప్రసాదించిరి.