తుర్వసుడు మొదలగువారి వంశము

సూతుడు ఋషులకు ఇట్లు చెప్పనారంభించెను, యయాతి పుత్రుడగు తుర్వసునకు గర్గుడు అతనికి గోభానుడు అతనికి ధీరుడు అపరాజితుడునగు త్రిశరి అతనికి అనంతుడు అతనికి పూరు వంశీయుడగు అకల్మషుడైన దుష్యంతుడును కుమారులయిరి. (అనంతుడు పూరు వంశీయుడగు దుష్యంతునే తన కుమారునిగా స్వీకరించెను.) ఇట్లు జరా సంక్రమణము హేతువుగా యయాతి శాపము పాలైన తుర్వసు వంశము పూరు వంశములో కలిసిపోయెను.

ఈ దుష్యంతునకు వరూథుడు అతనికి ఆండీరుడు అతనికి నలుగురు పాండ్యుడు, కేరళుడు, చోళుడు, ఫల్గుడు అనువారును కుమారులయిరి. వీరి పాలిత జనపదములు పాండ్య, కేరళ, చోళములు చాల సమృద్ధితో నుండినవి. యయాతికి ఇంకొక కుమారుడగు ద్రుహ్యునకు శూరుడు, బభ్రువు, సేతువు అనువారు కుమారులు. సేతునకు భద్రుడు అతనికి గాంధారుడు కుమారులు. ఈ గాంధారుని పేరనే గాంధార దేశము ప్రసిద్ధమయినది. ఆ దేశపు గుర్రములు చాల మేలయినవి. అతనికి ధర్ముడు అతనికి ఘృతుడు అతనికి విద్రుముడు అతనికి ప్రచేతుడు కుమారులయిరి. ప్రచేతునకు నూరుమంది కుమారులు కలిగిరి.

యయాతికి మరియొక కుమారుడగు అనువునకు పరమ కీర్తిమంతులు వీరులునగు సభానరుడు చాక్షుషుడు పరమేష్ఠి అను ముగ్గురు కుమారులు. సభానరునకు విద్వాంసుడగు కోలాహలుడు అతనికి ధర్మాత్ముడగు సంజయుడు అతనికి వీరుడగు పురంజయుడు ఆతనికి మహారాజగు జనమేజయుడు ఆరాజర్షికి మహాశాలుడు కుమారులయిరి. అతడు మహాకీర్తి శాలియు ఇంద్రునితో సమానుడును. అతనికి ధార్మికుడగు మహామనస్కుడు కుమారుడు. అతడు సప్తద్వీపాధి పతియగు చక్రవర్తి. అతనికి ధర్మజ్ఞులగు ఉశీనరుడు తితిక్షుడు అనువారు పుత్రులు.

రాజర్షి సుతులగు భృశ-నర-కృశి-దర్శ-దృషద్వతి-అను ఐదు మంది ఉశీనరుని భార్యలు. అతడు చాలకాలము చేసిన మహాతపః ఫలముగా అతనికి వార్ధకమున ఆ ఐదుగురి యందు వరుసగా భృశుడు నరుడు కృశి-సువ్రతుడు-శిబి అనుఐదుమంది కుమారులు కలిగిరి.

వీరిలో శిబికి శిబులు అను పేరున లోక విశ్రుతులగు పృథుదర్భుడు, సౌవీరుడు, కేకయుడు, భద్రకుడు అను నలుగురు కుమారులు. వీరి పాలిత జనపదములు సర్వసమృద్ధములగు కేకయ-భద్రక-సౌవీర-పౌర-జనపదములు. వీరిలో భృశుని కుమారులు కేకయులని ప్రసిద్ధులయిరి. సౌవీరుని కుమారుడు అంబష్ఠుడు. కృశి కుమారులు కృశళులు. నరుని కుమారుడు నరరాష్ట్రుడు. తితిక్షుడు తూరుపున రాజయ్యెను. అతనికి వృషద్రథుడు అతనికి ఫేనుడు అతనికి సుతపుడు అతనికి బలియనువారు కుమారులయిరి. (సుతుపుడు దైత్యుడగు బలిని తన కుమారునిగా స్వీకరించెను.) ఇతడు మహాయోగి. పూర్వము విష్ణునిచే బంధింపబడిన బలియే ఇతడు. మనుష్యుడుగా అయిన బలి మానవజాతి యందలి తన వంశము నశించునట్లున్న సమయమున క్షేత్రజ్ఞులనుగా మానుషి (మనుష్య స్త్రీ) యగు తన భార్యయందు ఐదుమంది క్షత్రియ కుమారుల నుత్పాదించెను. వారు అంగుడు, వంగుడు, సుహ్ముడు, పుంద్రుడు, కళింగుడు అనువారు. వీరు బలి సంతతిలోని క్షత్రియులు. వీరు కాక బలి సంతతివారు కొందరు బ్రాహ్మణులుగానై విప్ర వంశములను నిలిపి వృద్ధిచేసిరి. ఈ అంగుడు మొదలగు ఐదుమంది వంశములందు జన్మించి వారి వంశముల నిలిపిన వారికి అంగులు, వంగులు, సుహ్ములు, పుండ్రులు, కళింగులు అనిపేరు. (వీరి జనపదములకును ఇదియే పేరు.)

పూర్వము బలి విషయమున బ్రహ్మ ప్రీతుడై అతనికి వరముల నొసగెను. వానిచే అతడు మహాయోగిత్వమున కల్పపరిమాణపు ఆయువును యుద్ధమున ఓటమి లేకుండుటయు ధర్మమునందు అత్యుత్తమ స్థిరబుద్ధియు త్రిలోకములందలి సర్వవిషయముల చూచుట తన జాతివారిలో ప్రధానుడగుట యుద్ధమున సాటిలేనిగెలుపు ధర్మతత్త్వార్థమును దర్శించుట నాలుగు వర్ణముల వారిని వారివారి నియమములందు నిలుపుట అను యోగ్యతలను సంపాదించెను.

ఋషులు సూతుని ఇట్లు ప్రశ్నించిరి: “మహాత్ముడగు బలికి మానుషి అగు భార్యయందు ఐదుగురు కుమారులు ఎట్లు కలిగిరి? అతని భార్య (అగుమనుష్య స్త్రీ)ఎవరు? వారిని అమెయందు కనిన ముని ఎవరు? ఎట్లు వారిని అతడు జన్మింపజేసెను? ఆ ముని మాహాత్మ్య ప్రభావములు ఎట్టివి? ఇది అంతయు మాకు తెలుపుము.”

సూతుడు ఋషులకు ఇట్లు చెప్పసాగెను: పూర్వము అంగిరోముని కుమారుడు ఉచ(త) థ్యుడను ప్రసిద్ధుడగు ఋషి ఉండెను. ఈ మహాత్ముని భార్యపేరు మమత. ఇతని తమ్ముడును దేవగురువును బ్రహ్మతేజస్సంపన్నుడును అగు బృహస్పతి ఒకమారు తన వదినెను-ఈ మమతను-కామించెను. ఆమె ఇట్లనెను: “నేను నీకు వదినెను. గర్భవతిని. నా గర్భమునందున్న నీయన్న కుమారుడు షడంగవేదవేత్త. ఇట్టి ఈ మహాగర్భము నీపై కోపించును. నీవును అమోఘ వీర్యుడవు. కనుక నీవు నన్నుకూడుట మంచిపనికాదు. కనుక తగని ఈ ప్రయత్నము మాను కొనుట మంచిది. ఈ సమయమునకు తగిన విషయము ఇది. నీవు ఏమనుకొనినను సరియే.”

బృహస్పతి బ్రహ్మతేజస్సంపన్నుడే, మహాత్ముడే కాని అతడు తన కామమును నిగ్రహించు కొనలేకపోయెను. అందుచే అతడు ధర్మాత్ముడై యుండియు కామములేని తన వదినెను కూడెను.

సంయోగ క్రమములో బృహస్పతి తన శుక్రమును మమతా గర్భమునందు విడుచు సమయమున ఆమె గర్భమునందున్న శిశువు ఇట్లు పలికెను: “తండ్రీ! నీవు చేయుచున్న ఈ పని చాల నీచమయినది. ఇచ్చటనో- ఇద్దరు ఉండుటకు అవకాశము లేదు. నీ రేతస్సును వ్యర్థము కానిది. (అదియు సఫలమై శిశువు అగును.) కాని నేను ముందుగా ఇచటకు వచ్చి ఉన్నాను.” ఈ శిశువు ఇట్లనగా బృహస్పతి క్రుద్ధుడయి అతనిని శపించెను. ఆ శిశువు తన అన్నగారి కుమారుడు. గర్భమునందున్న పసికందు. బృహస్పతి తానును ఋషి. అయినను కాముకుడు. “ఇటువంటి సమయమున నన్ను వారించితివి కావున నీవుదీర్ఘమగు తమస్సును (అంధత్వమును) ప్రవేశింతువు” అని అతడు అతనిని శపించెను.

తరువాత మమతకు శిశువు జనించెను. అతడు రెండవ బృహస్పతి వంటివాడు. మహాకీర్తి సంపన్నుడగు ఋషి అయ్యెను. కాని ఈ శాపముచే అతడు దీర్ఘతముడు అనబడెను. అతడు ఊర్ధ్వరేతస్కుడు (బ్రహ్మచర్య ధర్మమున ఇంద్రియమును నిగ్రహించుకొనినవాడు. )

అతడు తన (తండ్రి) సోదరుని ఆశ్రమమునందు నివసించుచు ఒకమారు సురభి (కామధేనువు) వంశము వారికి సంబంధించిన గోధర్మములను ఒకానొక ఋషభము వలన వినెను. ఎట్లనగా- ఈ దీర్ఘతముడు తన తండ్రికి సోదరుని పోషణలో అతని ఆశ్రమమున నివసించు చుండెను. ఒకనాడు దానిలోనికి దైవవశమున ఒక వృషభము వచ్చెను. యజ్ఞమునకై తెచ్చి ఉంచిన దర్భలను అది తినెను. దీర్ఘతముడు దానికొమ్ములు బిగించిపట్టుకొనెను. అది కదలలేక పోయెను. “తండ్రీ! నన్ను విడువుము. నీవు బలశాలురలో గట్టివాడవు. ఈ వనమున నీవంటి బలశాలి నాకు మరెవ్వరును కనబడలేదు. నా అక్షయ బలమును, నీ బలముతో సమానముకాదు. నీ బలమునకు నేను ప్రీతుడనైతిని. నన్ను విడువుము. నీకు వరముల నిత్తును” అని అది మునితో సనెను. “నీవు ప్రాణములతో నన్ను తప్పించుకొని పోలేవు. నేను నిన్ను విడువను. (నీవు మా దర్భలను తింటివి.) “ అని ముని వృషభముతోననెను. అంత వృషభము “నాయనా! మాకు ఇది దొంగతనము. ఇదిచేయుట పాతకము అనునది లేదు. ఇది భక్ష్యము-ఇది అభక్ష్యము-ఇది పేయము-ఇది అపేయము (త్రాగదగినది-త్రాగరానిది) అను నియమము మాకు లేదు. ఇవి అన్నియు మానవులకు మాత్రమే. ఇది చేయతగినది. ఇది చేయతగనిది. వీరిని కూడవచ్చును. వీరిని కూడరాదు అను వ్యవస్థ కూడ మానవులకే కాని మాకు లేదు” అనెను.

దీర్ఘతముడు ఈ గోధర్మములను విని తడబాటు చెంది ఆ వృషభమును విడిచెను. దానికి భక్తి పూర్వకముగా అన్నపానములనిచ్చి దానిని అనుగ్రహింపజేసికొనెను.

అట్లు వృషభము అనుగ్రహముతో వెళ్ళిన తరువాత దీర్ఘతముడు తాను గోవృషభము నుండి భక్తితో వినిన గోధర్మములను తనకు పరమార్థముగా ముఖ్యాశ్రయముగా భావించి వానినే ధ్యానింపసాగెను. అతని తమ్ముని పేరు గౌతముడు. అతని భార్యను ఈ దీర్ఘతముడు కలియుగోరెను. ఆమె తనకు కోడలివంటిది. ఐనను అతడు గోధర్మములను శ్రేష్ఠములనుగా తలచి అట్లు సంకల్పించెను (ఆమె అంగీకరించలేదు) అది ఆమె గర్వము అని తలచెను. అతడది సహించలేకపోయెను. అతడామెను బెదరించెను. ఆమె తలను తన బాహువులతో అదిమిపట్టెను. అతడు మహాత్ముడయ్యు జరుగవలసినది ఇట్లు ఉన్నదని నిశ్చయించి తన కోరిక ఆమెతో పలికెను: అతడు మహాత్ముడని ఆమెకు తెలియును. కానీ అతడు విపర్యయమునకు సిద్ధపడి   నాడు. (మానవుడయి యుండి పశు ధర్మమునకు పాల్పడుట విపర్యయము-విరుద్ధ ధర్మము.) అది చూచి ఆమె అతనితో ఇట్లు పలికెను: “నీవు విపర్యయమునకు పూనితివి. ఎద్దువలె ప్రవర్తించు చున్నావు. ఎవరిని కలియవచ్చునో ఎవరిని కలియరాదో ఎరుగకున్నావు. వృషభ ధర్మము నవలంబించి కోడలిని పొందగోరుచున్నావు. నీ నడువడి మంచిదికాదు. నీవు గ్రుడ్డివాడవు. వృద్ధుడవు. నిన్ను మేము పోషించుచు కాపాడవలసిన మాట నిజమే. ఐనను నీ ప్రవర్తనము మంచిదికాదు. కావున నిన్ను విడుచుచున్నాము. ఇది నీ ఈకర్మమునకు ఫలితము; పొమ్ము” అని పలికి ఆమె అతనిని కొయ్య పెట్టెలో ఉంచి కట్టివేసి గంగా జలములో విడిచెను.

దీర్ఘతముడట్లు గంగా ప్రవాహమున కొట్టుకొని పోవుచుండెను. ఆ సమీపమునకు వచ్చియుండిన విరోచన పుత్రుడు ధర్మాత్ముడు అగుబలి అదిచూచి అతనిని తీసికొనెను. అతడతనిని భక్ష్య భోజ్యములతో తృప్తినందించుచు తన అంతఃపురము నందు దాచెను. దీర్ఘతముడు ప్రీతుడై బలిని వరము కోరుకొమ్మనెను. ఆ అసురోత్తముడు పుత్రులు కావలెనని కోరెను. పూజ్యమునీ నావంశము (మానవులలో) కొనసాగునట్లు నా భార్యయందు ధర్మార్థ తత్త్వజ్ఞులగు కుమారులను మీరు జన్మింపజేయ వలయునని వేడెను. ఆ దేవర్షి సరేయనెను. తన భార్యలలో సుదేష్ణ యను నామెను మునికడకు పొమ్మనెను. ఆరాణి అతడు అంధుడును వృద్ధుడును అని ఎరిగి అతనికడకు పోవక తన దాని కూతురగు శూద్రస్త్రీని పంపెను. చిత్త నిగ్రహముకల ధర్మాత్ముడు ఆ దీర్ఘతముడు ఆమెయందు కక్షీవాన్ మొదలగు శూద్రులను జనింపజేసెను. వారందరును జాతిచే శూద్రులు, ఐనను వారందరును అధ్యయనము చేసినవారు-ఋషిత్వము నందినవారు. ఈశ్వరత్వము కలవారు. బ్రహ్మవాదులు (వేదవేదాంగ వేదాంత తత్త్వము నెరిగినవారు.) (శారీరకముగను చిత్తమునను) శుద్ధులు. ధర్మమును సాక్షాత్కరించుకొనినవారు. శుచియగు బుద్ధికలవారు. ఇట్టి వీరిని చూచి బలి ‘వీరు నా కుమారులే అగుదురా?” అని దీర్ఘతము నడుగగా “కాదు. నా కుమారులు” అని అతడనెను. “వీరు నావలన శూద్రయోని యందు జనించినారు. నీ భార్య యందు కలిగినవారు కారు” అని జరిగినదంతయు రాజునకు ముని చెప్పెను.

తరువాత బలి మరల ఆఋషి సత్తముని అనుగ్రహింపజేసికొని తన భార్యను చీవాట్లు వేసెను. ఆమెను అలంకరింపజేసి ఋషికి అప్పగించెను. నీవు నా శరీరమునందంతటను పెరుగు, ఉప్పు, ఇప్పతేనె పూసి అసహ్యపడక శరీరమంతయు నాకవలయును. అపుడు నీకు మనస్సునకు ఇష్టులగు కుమారులు కలుగుదురు అని ముని సుదేష్ణతో పలికెను. ఆమె అంతయు అట్లే చేసెను. కాని అపానప్రదేశమును నాకక విడిచెను. ఇందువలన నీకు జ్యేష్ఠుడు అపానము లేని కుమారుడు కలుగునని మునియనెను. “మహాభాగా! నిన్ను వేడుచున్నాను. నాకట్టి కుమారు నీయవలదు. నాయథాశక్తి నీమనస్తృప్తి కలిగించితిని. అనుగ్రహించుము” అని రాణి వేడగా “నీవు మంచిదానవే. కాని ఈ అపచారము వలన ఇది ఇట్లే జరుగును. అపానము లేనివాడయినను ఆ కలిగెడి పుత్రుడు యోగ్యుడేఅగును” అని ముని ఆమె కుక్షిని తన చేతితో స్పృశించి మరల ఇట్లు పలికెను: “శుచియగు చిరునవ్వు కలదానా! నీవు మొదట నా అంగమందలి పెరుగు తింటివి. కావున నీ గర్భమునందు పూర్ణిమాతిథి యందలి చంద్రుడువలె నిండినది. దాని ఫలితముగా నీకు దేవకుమారుల వంటి కుమారు లైదుగురు జనింతురు. వారు తేజోవంతులు-పరాక్రమవంతులు యజ్ఞములు చేయువారు ధార్మికులు ఆగుదురు.”

పిమ్మట సుధేష్ణ అంగము (గర్భము)నుండి జ్యేష్ఠుడుగా అంగుడును వంగ కలింగ పుండ్రసుహ్ములు అను మరి నలుగురును-ఐదుగురు బలి దైత్యునకు మానవియగు భార్యకు క్షేత్రజులుగా కుమారులు కలిగిరి. దీర్ఘతముడు బలికి ఇచ్చిన వీరందరును అతని బ్రాహ్మణ్య ప్రభావమున లోకమున ప్రతిష్ఠనార్జించి గొప్పవారయిరి. ఇట్లు బలి తాను దైత్యుడయ్యు మానవ స్త్రీయందు సంతానమును కనెను. తరువాత సురభి (కామధేనువు) దీర్ఘతమునితో ఇట్లు పలికెను: “ప్రభూ! నీవు గోధర్మమును ఉత్తమముగా భావించి దానిని ప్రమాణముగా తీసికొంటివి. నీవు మాయందు ప్రపత్తి పూర్వకమగు భక్తి చూపితివి. అందుచే నేను నీయందు ప్రీతి చెందితిని. నేను నిన్ను ఆఘ్రాణించి నీయందు బృహస్పతి శాపముచేతను అతని రేతఃసంసర్గ పాపముచేతను సంక్రమించిన దోషమును జరా మృత్యువులను దీర్ఘమగు తమస్సును (దృష్టియందలి దోషమును) తొలగింతును.” ఇట్లుపలికి సురభి దీర్ఘతముని ఆఘ్రాణించి (ముక్కుతో పీల్చివేసి) అతని యందలి ఈ దోషములన్నియు లాగివేసెను. దానితో అతడు ఆయుష్మంతుడు, వపుష్మంతుడు (సుందర శరీరుడు) చక్షుష్మంతుడు. (చూడగలవాడు) అయ్యెను. గోవుచే అతని ‘తమస్సు’ హరింపబడి నందున అతనికి “గో-తముడు” అను ప్రసిద్ధి వచ్చెను.

తరువాత ‘కక్షీవాన్’ తన తండ్రి (దీర్ఘతముని)తో కూడ గిరివ్రజమునకు పోయి అచ్చటనే ఉండి చిరకాలము తపము నొనరించెను. అనంతరము అతి దీర్ఘకాలమునకు అతడు తపస్సుచే భావితుడై (సంస్కారమునంది) శూద్ర (సంస్కారముకల) శరీరమును విడిచి బ్రాహ్మణ్యమును పొందెను. అంతట తండ్రి దీర్ఘతముడతనితో “నాయనా! నేను నీచే పుత్రవంతుడనైతిని. నీవు సత్పుత్రుడవు. ధర్మజ్ఞుడవు. కీర్తిమంతుడవు. నీచే నేను కృతార్థుడనయితిని. నీవు ఈనీవుగా (ఈ దేహముకలవాడుగా) ఉండియే దేహమును (దేహమందలి సంస్కారములను) విడిచి బ్రహ్మ యొక్క స్థానమును (బ్రాహ్మణ స్థానమును బ్రాహ్మణత్వమును) పొందితివి.” అనెను.

కక్షీవాన్ ఇట్లు బ్రాహ్మణత్వమును పొందిన తరువాత అతనికి వేయిమంది కుమారులు కలిగిరి. వారికి కుశ్మాండులు, గౌతములు అని నామము.

ఇట్లు మీకు దీర్ఘతమునికిని విరోచన సుతుడగు బలికిని సమాగమము కలుగుటయు ఇరువురి సంతానమును తెలిపితిని. అనంతరము బలి అకల్మషులగు అంగుడు మొదలగు ఐదుమంది కుమారులను అభివాదము చేసి కృతార్థుడయ్యెను. ఆ ధర్మాత్ముడు తాను యోగ మాయచే కప్పువడి ఏ భూతములకును కనబడనివాడయి రానున్న కాలమును ఎదురుచూచుచు ఉండెను. వీరిలో అంగునకు దధివాహనుడు అతనికి దధిరథుడు అతనికి విద్వాంసుడగు ధర్మ రథుడు కుమారులయిరి. ఇతడు చాల పూజ్యుడు. విష్ణుపదమును పర్వతమున ఇతడు దేవరాజగు ఇంద్రునితో కూడి సోమపానము చేసెను. అతనికి తండ్రితో సముడగు చిత్రరథుడు అతనికి చైత్రరథుడు అతనికి రోమపాదుడని ప్రసిద్దుడును శాంతకు తండ్రియు అగు దశరథుడు (ఇతడు శ్రీరాముని తండ్రియగు దశరథుడు కాదు. అదే పేరుగలవాడు కావచ్చును) అతనికి ఋశ్య శృంగుని అనుగ్రహమున వంశవర్ధనుడగు చతురంగుడు అతనికి పృథులాక్షుడు అతనికి పూర్వపు మాలినీ నగరమును చంపానగరియని ప్రసిద్ధికి తెచ్చిన చంపుడు అతనికి పూర్ణభద్రముని అనుగ్రహమున హర్యంగుడు విభాండకుని దయవలన వారణుడు కుమారులయిరి. ఈ వారణుడు శత్రువులను నిరోధించగల వీరుడు. మంత్రబలముతో ఉత్తమ వాహనమును (ఉచ్చైః శ్రవమును) భూమికి దిగి వచ్చునట్లు చేసెను. హర్యంగునకు భద్రరథుడు అతనికి బృహత్కర్మ అతనికి బృహద్భానుడు అతనికి బృహన్మనసుడు అతనికి జయద్రథుడు అతనికి జనమేజయుడు అతనికి అంగుడు అతనికి కర్ణుడు (కుంతికి కానీనసుతుడు) అతనికి వృషసేనుడు అతనికి వృషసేని కుమారులయిరి. ఇది అంగ వంశీయులగు రాజుల పరంపర. ఇక పూరువంశమును వివరింతును.