మత్స్య మహా పురాణము
విష్ణువు గరుడునితో కూడ పారిపోవుట
సూతుడు ఋషులకు ఇంకను ఇట్లు చెప్పెను, సేనాపతియగు గ్రసనుడు నిహతుడు కాగానే దానవులు శ్రీహరితో కూడ మితిమీరిన యుద్ధముచేసిరి. పట్టనములను ముసలములను ప్రాసములను గదలను కుణికములను వాడి మొనలుగల నారాచములను శక్తులను చక్రములను వారువదలినను చిత్రయోధుడగు జనార్ధనుడు వాటి నొక్కొక్క దానిని అగ్నిజ్వాలల వంటి బాణ ములతో నూరేసిగా ఖండించెను. అంతట దైత్యులు చాలవరకు తమ ఆయుధములు అయి పోవుటచే చిత్తములు భ్రాంతినొంది రణమున అస్త్రముల ప్రయోగించుటకు అసమర్థులు కాగానే వారు చచ్చిన ఏనుగులను, గుర్రములను గొని గోవిందునితో యుద్ధమాడసాగిరి. ఇట్లు అన్నివైపుల నుండి కోట్లకొలదిగ దైత్యులు అన్ని విధముల ఎదిరించి యుద్ధమొనర్పగా వారితో పోరిపోరి విష్ణుడు కొంచెము శ్రమ చెందిన భుజములు కలవాడై ఆతుముల రణరంగమున గరుడునితో “గరుత్మన్! నీవు ఇంతవరకీ యుద్ధమున శ్రమచెందనే లేదనుకొందును. ఇది నిజమైనచో మథ నుని రథముకడకు (నన్ను తీసికొని) పొమ్ము. నీవును అలసితివా, ముహూర్త కాలము యుద్ధము నుండి తొలగి దూరముగ (నన్నును తీసికొని పొమ్ము” అనెను. మహాసమర్థు డగు విష్ణుడిట్లు పలుకగా గరుడుడు ఘోరాకారుడగు మథనుని దగ్గరకు (విష్ణునితో) పోయెను.
ఆ దైత్యుడు తన ఎదుట శంఖచక్ర గదాధరుడుండుట చూచి వాడి వాదరగల భిండి వాలముతో అతని వక్షమున కొట్టెను. విష్ణువు ఆ మహాయుద్ధమున అప్రహారము లెక్కచేయకయే శుద్ధిచేయబడి లోహపు మొనలుకల ఐదు బాణములను మరల ఐదు బాణములను ఆకర్ణముగ ధనువులాగి విడిచి వాని స్తనాన్తరమున ప్రయోగించెను. మర్మములందు దెబ్బలుతిని ఆ దైత్యేం ద్రుడు హరిని బాణములతో కంపింపజేసెను. వాడొక ముహూర్తకాలము విశ్రాంతి నొంది అగ్ని తేజస్కమగు పరిఘనుగొని జనార్దనుని కొట్టెను. విష్ణువా దెబ్బతో కొంచెము దిమ్మరపోయెను.
అంతట శాశ్వతుడగు మాధవుడు కోపముతో గ్రుడ్లు గిరగిర త్రిప్పుచు గదనుగొని దానితో వాని మేషమును పిండిచేసెను. దాన ఆ దైత్యేంద్రుడు ప్రళయ కాలమున పర్వతమువలె ఆమేషము నుండి పడెను. వీర్యశాలియగు ఆ దానవుడు భూమిపై పడగా దైత్యులు ఆ యుద్ధ కర్మమునందు తాము ఒంటరివారై పోయినట్టు అవసాదము (శక్తిహీనత) నొందిరి. అభిమాన వంతులగు దానవులు అట్లగుటచూచి దానవేశ్వరుడగు మహిషుడు స్వబాహుబల మాశ్రయముగా ప్రకోప వశమున రక్తనేత్రుడయి రౌద్రుడయి ఎదిరించి పోరెను; వాడి వాదరగల శూలముతో హరిని నొప్పించెను. వీరుడాతడు శక్తి (ఆయుధము)తో గరుడుని బలముగా కొట్టెను. అంతట దైత్యుడు మహాపర్వత గుహవలె నోరు తెరచి గరుడునితో కూడ అచ్యుతుని మ్రింగగోరెను. అదిచూచి హరి వాని తలపునెరిగి మహాబలుడతడు దివ్యాస్త్రములతో వానినోరునింపెను. పిమ్మట దివ్యాస్త్రము లతో అభిమంత్రించిన దివ్య బాణములతో వానిని కొట్టెను. వాడాదెబ్బలుతిని పర్వతమువలె వెల్లకిల పడెను; మరణించనుకూడ మరణించెను. మహిషుడు క్రింద పడియుండగా చూచి కేశవుడు వాని నుద్దేశించి ఇట్లు స్పష్టముగా పలికెను. మహిషాసురా! నీవిచట నాయస్త్రములతో మృతినొందతగవు; సాక్షాత్తుగ (బ్రహ్మ (పద్మ సంభవుడు) నీవు స్త్రీచేతిలో మరణింతువని పలికెను. కావున జీవితమును కాపాడుకొనుచు రణరంగమునుండి శీఘ్రముగా పొమ్ము,
ఆ దైత్యుడు మహిషుడు పరాఙ్ముఖుడై పోగానే శుంభదైత్యుడు కోపముతో పెదవులను కొరుకుచు కనుబొమలముడితో వికృతముఖుడై కరముతో కరము పిసికికొని భయంకర ధనువు పూనెను. సర్పములవంటి బాణములుగాని వింటనారి ఎక్కించి వాటిని సంధించి చిత్రముగ యుద్ధముచేయు యోధుడును దృఢముష్టితో బాణప్రయోగము చేయగలవాడునగు ఆ శుంభుడు వాటితో గరుడుని విష్ణుని నొప్పించెను. జ్వలించు అగ్ని జ్వాలలతో సమములును శీఘ్రములును సంఖ్యాతీతములును నగు బాణములతో వాడు హరి గరుడులనట్లు చుట్టివేయగా ఆ దైత్యేంద్రుని శరములనొప్పి నందిన విష్ణుడు యమసమానమగు శక్తి పూని దానితో పర్వత సమానమగు వాని వాహన మేషమును అట్టివాడేయగు దైత్యునికూడ పిండిచేసెను. మేషముచచ్చెను. ఆ దనుజాధిపతి చచ్చిన మేషము నుండి దుమికి నేలపయి నిలువబడెను. హరి వానిపై ప్రళయాగ్ని వంటి బాణములను ప్రయోగించెను. ఆ హరి గ్రుడ్లు త్రిప్పుచు ఆకర్ణాంతము ధనువు నారి లాగి మూడు బాణములతో వాని భుజమును చీల్చి ఆరింటిని వాని తలపై నాటి పదింటితో ధ్వజమును కొట్టెను. ఆ దెబ్బలతో శుంభ దైత్యుడు రక్త ప్రవామముతో నిండి వ్యథనొందెను; ధైర్యమునుండి కొంత చలించెనుకూడ; అది చూచి హరి ‘శుంభాసురా! కొలది దినములలో కుమారి చేతిలో చంపబడెదవు; ఇప్పటికి యుద్ధము మానుము, మూఢా! వ్యర్థముగా యుద్ధమునకై తహతహ పడెదవేల; నా చేతిలో నీవు చావదగవు” అనెను. విష్ణుని నోటి నుండి శుంభుని చావుమాట విని నిమి విష్ణుని నెదుర్కొనెను; వాడాకసమున నిలిచి ప్రచండ గద ఎత్తి గరుడుని కొట్టెను. జంభుడనువాడు సానపట్టిన రత్నముల విచిత్ర కాంతులతో వెలుగు పరిఘతో విష్ణుని తలపయి కొట్టెను. అట్లు అప్పుడు గరుడుడును హరియు ఆ దానవుల చేతిలో విషమ ప్రహారములు తిని దట్టములగు అగ్నులవలె పడిపోయిరి. ఈ కార్యముచూచి దైత్యులందరును బిగ్గరగా గర్జించిరి. సింహనాదములు చేసిరి. ప్రచండులై ధనువులు నారులను వేగముగా సారించి ఆస్ఫోటించి భూమిని బ్రద్దలు చేసిరి. వస్త్రములను విసరిరి; శంఖములు ఆనకములు గోముఖములు మొదలగు వాద్యములను మ్రోగించిరి. కొంతసేపటికి తెలివివచ్చి హరి గరుడునితో కూడి యుద్ధమునకు పెడమోమయి మహాజవమున పారిపోయెను.