మత్స్య మహా పురాణము
శ్రీమత్స్య మహాపురాణము
దాత ఆనాడు మహాదానాను కీర్తనమును తాను వినవలయును; ఇతరులకు వినిపించ వలయును. దాన దినమున బ్రహ్మ చర్యముతో నుండవలయును; దీనిచే విపులశ్రీ కలుగును; ఎవరు ఈ విధానమున గోసహస్ర ప్రదులగుదురో, వారు సర్వపాప వినిర్ముక్తులయి సిద్ధచారణ సేవితులై చిరుమువ్వలగములు మాలలుగా వ్రేలాడుచుండు రవి ప్రకాశ విమానము పైకెక్కి సర్వలోకపాల లోకములకును ఏగి, అందు సర్వామర పూజితుడగుచు పుత్ర పౌత్ర సమన్వితుడై ఒక్కొక్క లోకపాల లోకమందు ఒక్కొక్క మన్వంతర కాలముండును. తరువాత ఊర్ధ్వసప్త లోకములలో ఒక్కొక్క దాని యందు ఒక్కొక్క మన్వంతర ముండి, అనంతరము శివపురమేగును, తన నూటొక్కమంది పితరులను తరింపజేయును; అందు పూర్ణముగ నూరు కల్పములుండి అనంతరము భూలోకమున శివధ్యాన పరాయణుడగు చక్రవర్తియై జనించి నూరశ్వమేధము లాచరించి తుదకు విష్ణులోకమును చేరి బంధముక్తుడగును.
“గోసహస్ర ప్రదానమును తానే చేసికొని ఆ కార్యము నందు తానును కర్మకరుడై పాలుగొని కాని అది ఎవరైన చేయుచుండగా చూచి కాని, మమ్ము ఈ సంసార సాగరమునుండి తరింపజేయు వాడు మావంశమున పౌత్రుడో దౌహిత్రుడో పుట్టినచో బాగుగా నుండును” అని పితరులు గోసహస్ర ప్రదాతను అభినందించుచుందురు. ఈ గోసహస్ర ప్రధాన విధానమును పఠించినను, సంస్మరించుచుండినను, చూచినను, విష్ణులోక ప్రాప్తుడగును, సంతోషముల నందును; ముక్తి నందును, కలుషములు బొత్తుగా ఏమియు లేకుండ నశించగా నిర్మలదేహం (జన్మ)డై ఇంద్ర లోకమునకు ఏగి సుఖమందును.