కచ దేవయానీ సంవాదము

శౌనకుడు శతానీకునితో ఇట్లు చెప్పెను, కచుడు ఇట్లు విద్యాధ్యయనము సమాప్తి చేసి సమావర్తన వ్రతము జరిపి స్వగృహమునకు పోవుటకు తన గురుని అనుమతి నందెను. గురుడు అతనికి వీడ్కోలు చెప్పెను. అతడును దేవలోకమునకు పోవుటకు బయలుదేరెను. అపుడు దేవయాని కచునితో ఇట్లు పలికెను: ”నీవు స్వయముగా అంగిరః ప్రజాపతికి పౌత్రుడవు. ఉన్నత వంశము మంచి నడవడి విద్య తపస్సు దమము కలిగి మిగుల ప్రకాశించుచున్నావు. మాతండ్రికి మహాయశుడగు అంగిరోమహర్షి పూజ్యుడైనట్లు మీ తండ్రి బృహస్పతి నాకు అట్లును అంతకంటె అధికముగా కూడ మాన్యుడును పూజ్యుడును. ఇది తెలిసి తపోధనా! నేను చెప్పుచున్న విషయము అర్థము చేసికొనుము. నీవు విద్యావ్రతము నందుండి ఆనియమములు పాటించుచున్న నీ విషయములో నే నెట్లుంటినో నీవు ఎరుగుదువు. ఇప్పుడు నీవు విద్యాధ్యయనము ముగించి సమావర్తనము చేసికొనినావు. నేనో నీ భక్తురాలను. నన్ను నీవు విడుచుట తగదు. యథావిధిగా మంత్ర పూర్వకముగా నీవు నా పాణిగ్రహణము చేయుము.”

కచుడు: ”నీవు లక్షణవంతమయిన దేహము కలదానవగుటతోపాటు ఉత్తమురాలవు పవిత్రురాలవును. భగవానుడగు మీతండ్రివలె నీవును నాకు పూజ్యురాలవు. మహాత్ముడగు భార్గవు (శుక్రు)నకు నీవు వారిప్రాణములవలె ఇష్టవు. గురుపుత్రి వగుటచే పూజ్యురాలా! ధర్మము ననుసరించి నీవును సదా నాకు పూజ్యవు. నీకు తండ్రియు నాకు గురుడును అగు శుక్రుల వారు నాకు సదా పూజ్యుడేకదా! కనుక నీవును నాకు అట్టిదానవే. కనుక దేవయానీ! నీవు ఇట్లు పలుకతగదు.”

దేవయాని:”నాకు గురుడు (పూజ్యుడు) అగు అంగిరసుని కుమారుడగు బృహస్పతికి కుమారుడవే కాని నాతండ్రికి పుత్రుడవు కావు. కనుక నీవునునాకు మాన్యుడవును, పూజ్యుడవును. అదియుగాక మాటిమాటికిని నిన్ను రాక్షసులు వధించగా నేను నీ విషయమున ఎట్లుంటినో నీవు ఎరుగుదువా-ఎరుగవా? సౌహార్దముగాగాని అనురాగముగాగాని నాకు నీయందలి భక్తిని నీవు ఎరుగుదువు. నీవు ధర్మమును ఎరిగినవాడవు. నేను శక్తురాలను-సౌందర్యవతిని-నీ మనస్సును ఆనందపెట్టుదానను. నన్ను నీవు విడుచుట తగదు.”

కచుడు: “నీవు శుభములగు కర్మములనే అచరించుదానవు. నియోగించకూడని పనిలో నీవు నన్ను నియోగించుచున్నావు. నాపై దయ చూపుము. (అనురాగమును కాదు.) నీవు సుందరివి కాదని నేను అనలేదు. కాని నీవు శుభస్వరూపవు. కావున నీవు నాకు నా గురుని కంటెను గురుతర (పూజ్యతర)వు. నీవు వసించిన శుక్రుని గర్భమునందే నేనును వనించితిని. కోపింపకుము. ధర్మముచే నీవు నాకు సహోదరివి. శుభాననా! నన్నిట్లు పలుకదగదు. నీ దయచే నేనిచట సుఖముగాఉంటిని. నిజమే. నీ విట్లడిగితి వని నాకు నీపై కోపమును లేదు. నాకు సెలవు ఇమ్ము. పోయివత్తును. నాకు మార్గమున శుభమగునట్లు దీవించుము. ఇకమీదట ఇతర విషయములందును ధర్మవిరుద్ధముగా నడుచుకొనునట్లు ఆశీర్వదించుము. ఏమరు పాటులేని పూనికతో నా గురుని నిత్యమును ఆరాధించుచుందును.”

దేవయాని: ”నీవు కేవలము ధర్మమునందే దృష్టినుంచి నా అనురాగమును తిరస్కరించు చున్నావు. కనుక నీకు ఈ విద్య సిద్ధి నీయదు.”

కచుడు: ”నీవు గురుపుత్రివి అను హేతువుచే నేను నిన్ను కాదంటినే కాని నీయందు దోషమున్నదని కాదు. ఒకవేళ మీ తండ్రి అనుమతించినచో నన్ను నీవు భర్తగా ఆశ్రయించినను నేను కాదనను. నేనుచెప్పినది ఆర్షమగుధర్మము. ఇట్టి నన్ను నీవు ధర్మదృష్టితోనైనను, కామదృష్టి తోనే యైనను శపించుట న్యాయము కాదు. కనుక నీ కామ పురుషార్థము కూడ అది ధర్మాను కూలముగా నడువకపోవుగాక! (బ్రాహ్మణుడగు) ఋషి పుత్రుడు ఎవ్వడును ఎప్పుడును నిన్ను వివాహమాడ కుండుగాక! నీ మాటచే నాకు ఈ విద్య ఫలింపకున్నను నేను దాని నుపదేశించిన వానికి ఫలించును.”

దేవయానితో ఇట్లు పలికి వెంటనే కచుడు స్వర్గమునకై బయలుదేరిపోయెను. ఇంద్రాది దేవతలును కచుడు స్వర్గమునకు మరలివచ్చిన సందర్భమున బృహస్పతి సన్నిధిలో సభ జరిపి దానిలో సంతోషమున కచునితో ఇట్లనిరి: ”నీవు చాలగొప్పదియు అద్భుతమునునగు హితమును మాకు ఆచరించితివి. కావున నీ తేజస్సు ఎన్నటికిని నశింపకుండును. నీకు యజ్ఞములందు భాగము ఉండును.”