మందార సప్తమీ వ్రతము

ఈశ్వరుడు బ్రహ్మతో ఇట్లు చెప్పెను, ఇక ఇప్పుడు సర్వపాపనాశకము సర్వకామప్రదము పుణ్యదమునగు మందార సప్తమీ వ్రతమును తెలిపెదను. మాఘ శుక్ల పంచమినాడు లఘువుగా భుజించవలెను. షష్ఠినాడు స్నానాదికమును చేసికొని పగలంతయు ఉపవసించి రాత్రి మందార కుసుమమును ఆహారముగా తీసికొనవలెను. సప్తమినాడు బ్రాహ్మణ భోజనము జరుపవలెను. ఆనాడు ఎనిమిది బంగరు మందార పుష్పములను-పద్మహస్తుడగు మనోహరుడగు పురుషుని బంగారు ప్రతిమను అష్టదళ సువర్ణ కమలమును రాగి పళ్లెరములో నూవులు పోసి వానిపై నుంచవలెను. పిమ్మట ఆ అష్టదళ పద్మమునందలి దళములలో తూర్పునుండి ఈశాన్యము వరకుగల ప్రతియొక దళమును ఈఎనిమిది బంగారు మందార కుసుమములతో పూజించవలెను.

ధనమునకై లోభించక యథాశక్తిగ ఇట్లు ప్రతిమాసము సంవత్సరకాలము చేయవలెను. వ్రతాంతమున ఈ సామగ్రులను కలశముతోను గోవుతోను కూడ విప్రునకు దానము ఈయవలెను. దీనిచే సకల సంపదలు కలుగును. “మందారనాదుడు మందార కుసుమము భవనముగా కలవాడు అగు రవీ! మమ్ము సంసార సాగరమునుండి తరింపజేయుము” అని ప్రార్థించుచు ఇట్లు మందార సప్తమీ వ్రతము చేయు నరులు పాపముక్తులై స్వర్గమున ఇంద్రునితో కూడి ఆనందింతురు. పాపము లనెడు చీకటితో నిండిన సంసారమనెడు రాత్రియందు దీపమువంటి ఈ వ్రతమును ఆధారముగా తీసికొనినచో జారిపడరు. ఈప్సితార్థ ఫలప్రదమగు దీనిని వినినను చదివినను తెలిపినను అట్టివాడును పాపముక్తుడగును.