కల్పనామాను కీర్తనము

మనువు మత్స్యరూప జనార్దనుని ఇట్లడిగెను. భగవన్! అచ్యుతా! నీవు నాకు యుగములయు మన్వంతరములయు పరిమాణమును వానితో ఏర్పడు కల్ప పరిమాణమును ప్రవచించితివి; ఇపుడిక సమాన (సంక్షేప) రూపమున కల్పముల నామములను చెప్పుము; అనగా శ్రీమత్స్యుడిట్లు చెప్పెను; సరి; నీవడిగినట్లు కల్పనామములను అనుకీర్తించినంత మాత్రముననే వేదముల నధ్యయనము చేయుటచే కలుగు పుణ్యమును మానవుడు పొందును.

మొదటిది శ్వేతకల్పము, రెండవది నీలలోహిత కల్పము, మూడవది వాసుదేవము, నాల్గవది రాథంతరము, ఐదవది గౌరవము, ఆరవది దేవము, ఏడవది బృహత్, ఎనిమిదవది కందర్పము, తొమ్మిదవది సద్యము, పదియవది ఈశానము, పదునొకండవది తమము పండ్రెడవది సారస్వతము, పదుమూడవది ఉదానము, పదునాలుగవది గారుడము, పదునైదవది కౌర్మము; ఇది శుక్లపక్ష పంచదశ తిథియగు పూర్ణిమ యగును, అనగా శ్వేతకల్పము మొదలుగా ఒక్కొక్క కల్పము ప్రతిపత్ మొదలుగా శుక్లపక్షమునందలి పదునైదు తిథులగునని యర్థము.

తరువాత కృష్ణ ప్రతిపత్ మొదలుగా తిథులగు కల్పములు మరి పదునైదు; అవి పదునారవది నారసింహము, పదునేడవది సమానము, పదునెనిమిదవది ఆగ్నేయము, పందొమ్మి దవది సోమము, ఇరువదవది మానవము, ఇరువది యొకటవది తత్పురుషము, ఇరువది రెండవది వైకుంఠము, ఇరువది మూడవది లక్ష్మీ కల్పము, ఇరువది నాలుగవది సావిత్రీకల్పము, ఇరువది ఐదవది ఘోరము, ఇరువది ఆరవది వారాహము, ఇరువది ఏడవది వైరాజము, ఇరువది ఎనిమిదవది గౌరీకల్పము, ఇరువది తొమ్మిదవది త్రిపురాసుర సంహారము జరిగిన కాలమగు మహేశ్వరకల్పము ముప్పదవది పితృకల్పము, ఇది బ్రహ్మజీవితమందలి మాసము నందలి తిథులలో కడపటిదగు కుహూరూపమగు అమావాస్య అని బ్రహ్మయే స్వయముగా స్మృతులందు (వేద ప్రమాణములగు శాస్త్రములయందు) చెప్పెను; (చతుర్దశితో ఏ మాత్రమును స్పర్శలేనిదై చంద్ర దర్శనము ఏ మాత్రమును లేని అమావాస్యకు “కుహూ” అని సంజ్ఞ.)

ఇట్లు ఈ కల్పముల రూపమున చెప్పినవి బ్రాహ్మమాసము, ఇది వినినను అధ్యయనము చేసినను మహాపాతక నాశమగును.

ఒక్కొక్క కల్పము బ్రహ్మకు ఒక్కొక్క అహోరాత్రము, కావున ఆ అహోరాత్రపు పగటి యందలి ఆరంభకాలమున అనగా ఉదయమున - బ్రహ్మదేవుడు లోకసృష్టికి ప్రవృత్తుడగును; అట్టి సృష్టాది ప్రవృత్తి యందు ఏ రూపమగు భగవత్తత్త్వపు మాహాత్మ్యము (అనగా ఏ రూపమగు భగవదంశ తత్త్వపు ప్రాధాన్యము) ఆ కల్పమునందు ప్రతిపాదింపబడునో ఆ కల్పమునకు ఆ భగవదంశ తత్త్వపు పేరు పూర్వమందే స్వయంభూ బ్రహ్మచే ఈయబడినది.

ఈ ముప్పది కల్పములును తామసములును, రాజసములును, సాత్తికములును, సంకీర్ణములును (గుణత్రయమునకో, గుణద్వయమునకో, సాంకర్యము, పరస్పర సంమిశ్రణము కలవియు) అని పలువిధములుగ నున్నవి; వీనిలో గుణత్రయ సంమిశ్రణముగల పురాణములు యందు సరస్వతీ మహత్త్వమో పితరుల మహత్త్వమో ప్రతిపాదింప బడును, తమోరూప (తమో గుణ ప్రధాన)ములగు వానియందు అగ్నిశివుల మహత్త్వమును రజోగుణమయ కల్పములందు బ్రహ్మ మహత్త్వమును సాత్తిక కల్పములందు విష్ణు మాహాత్మ్యమును ప్రధానముగా వర్ణింపబడును. పూర్వము బ్రహ్మ ఏకల్పము నందు ఏపురాణమును ప్రవచించెనో ఆ కల్పాను సారమా గుణతత్త్వము ప్రధానముగాగల ఆదేవుని మాహాత్మ్య మా పురాణము నందు వర్ణింపబడును.

ఆయా కల్పము లందు ఉపాసకులు ఆదేవతల నుపాసించి యోగ సంసిద్ధి నంది పరమగతి నందుదురు; బ్రహ్మ ప్రోక్తమగు పాద్మకల్ప వృత్తాంతమును ప్రతిపాదించు ఈ మత్స్య పురాణమును ఎవరు పర్వదినములయందు పఠింతురో వారికి ధర్మమందు స్థిరచిత్తమును విపుల శ్రీని బ్రహ్మ కలిగించును.

ఈ కల్ప ప్రతిమలను బంగారుతో చేయించి ఆయా పర్వదినములందు దానము చేయువాడు బ్రహ్మపుర, విష్ణుపురము లందు కల్పకాల ముండి అందును ద్యు లోకమునందు ముని పూజితుడగును, విషయ వివేకముకల మానవులు ఈ కల్పములను ముని రూపముతో ప్రతిమలుగా రూపొందించి దానమీయవలెను.

అని పలికి మత్స్యుడు మనువుతో పురాణోప సంహార వచనమునిట్లు పలికెను: మను రాజా! నీకు నేను చెప్పిన ఈ పురాణ సంహిత (సంహిత = మహా రచన - వేదము) సర్వ పాప హరమును నిరంతరమగు ఆరోగ్యమును శ్రీని ఇచ్చునదియును.

(కల్ప పరిమాణ పరిణామమును వినుము) ఇట్టి ముప్పది కల్పములతో ఏర్పడు మాసములు పండ్రెండు ఒక సంవత్సరముకాగా అట్టి బ్రహ్మ సంవత్సర శతము శివున కొక దినము; శివుని నూరు సంవత్సరములు విష్ణున కొక రెప్పపాటు; విష్ణుడు మెలకువతో నున్నప్పుడు (కను తెరచినప్పుడు) ఈ జగత్తు ప్రవర్తిల్లును; ఆవిశ్వాత్ముడు శాంతాత్ముడై నిద్రించునపుడు (కనుమూయగా) ఇదియంతయు ప్రవలీనమగును, (అని మత్సుడు మనువునకు చెప్పి పురాణమును ముగించెను.)

అనుచు సూతుడు ఋషులకు ఇట్లు చెప్పెను.

ఇట్లుపలికి మత్స్యు రూపుడును దేవేశుడునగు జనార్ధనుడు సర్వభూతములును చూచుచుండగా (సర్వభూతములును సాక్షులుగా, సర్వభూతముల అనుభూతియే ప్రమాణముగా) ఆ దేశము నందే ఆ కాలము నందే అంతర్హితుడయ్యెను.

తరువాత భగవానుడగు వైవస్వతుడను ఈ మనువు వివిధ ప్రజలను సృజించెను; ఆ రవి కులానంద కరుడు తన అన్తరమును (తన కాలావధి యందలి విశ్వ ప్రవృత్తిని) పాలించెను, ఇపుడు అనువర్తితమగుచున్న మన్వంతరము అతనిదే; ఋషులారా! మీకు నే జెప్పిన ఈ మత్స్య రూప జనార్దన భాషితమగు ఈ పురాణ సంహితను వింటిరి కదా! ఇది సర్వ శాస్త్రములకు మూర్ధ (శిరః)స్థానమునందున్నది. (‘సర్వస్య గాత్రస్య శిరః ప్రధానమ్’ అను న్యాయము ననుసరించి ఇది సర్వపురాణ ప్రధానము.)