దైత్య దానవుల యుద్ధ ప్రయత్నము

శ్రీమత్స్యుడు మనువునకు ఇంకను ఇట్లు చెప్పెను. అంతట దైత్యులును దానవులును విష్ణువు దేవతల కభయమిచ్చెనని యుద్ధమునకును తమ విజయమునకును విఫల ప్రయత్న మొనర్చిరి. వారిలో మయుడొక మహోత్తమ రథమారోహించెను. అది స్వర్ణమయము; మూడు నల్వములు (1200 చదరపు మూరలు) విశాలమయినది. నాశములేనిది; నాలుగు చక్రములు పెద్దకాండ్లు కలదిగా నిర్మితము; చిరుగంటల మువ్వల సమూహములతో మిగుల మ్రోగుచుండెను. అది చిరుతపులి చర్మము చుట్టబడి పరచబడియుండెను. రతనాల జాలరులతో బంగారు జాలరులతో అది శోభిల్లుచుండెను. ఈహామృగగణములతో వ్యాప్తమయి పక్షి పంక్తులతో ప్రకాశించుచుండెను. దివ్యాస్త్రములును అమ్ములపొదులును దాని యందుండెను. అది మేఘమువలె గంభీర ధ్వని కలదియు మంచి ఇరుసు కలదియునై రథశ్రేష్ఠములలో శ్రేష్ఠమయి యుండెను. మంచి ఉపస్థము అనగా రథి కూర్చుండు స్థానము కలిగి, గదలు పరిఘలు మొదలగు ఆయుధములతో నిండి అది రథముగ రూపొందిన సముద్రమువలె ఉండెను. బంగరుతో చేసిన భుజకీర్తులు, వలయములు అనగా కంకణములు దానియందు అలంకరించబడి యుండెను. నొగల చివరలు బంగరు అలంకారములతో కూడి చంద్ర మండలమువలె కనబడు చుండెను. దానికి పతాకలు, ధ్వజములు ఉండెను. రవితో కూడి ప్రకాశించు మందరము వలె అది యుండెను. గజేంద్రునివలె విశాల కాయము కలిగియు సింహమువలె వర్చస్సు కలిగి యుండెను. దానియందు వేయి ఎలుగు బంటులను పూన్చిరి. అది జల సమృద్ధమయిన మేఘమువలె ధ్వని చేయుచుండెను. ప్రకాశించు చుండెను; ఆకాశమున సంచరించగలదయి దివ్యమై శత్రు రథములకు బాధ కలిగించునదై యుండెను. ఇట్టి రథమును ఆరోహించి మయుడు ప్రకాశించు మేరువును ఆరోహించిన రవివలె కనబడుచుండెను.

ఇక విరోచనుడు ఆరోహించిన రథము మిగుల ప్రకాశించునది క్రోశమును మించిన వైశాల్యము కలది చాలభాగము బంగారుతోనే అలంకరించబడినది పర్వతము వంటి రూపము కలది ఇరుకులేనిది; నల్లని కాటుక రాశివలె ప్రకాశించునది; ఏలయన అది నల్లని ఉక్కుతో చేయబడినది; కాడియు నొగలును (వాహనములను పూంచు భాగము) ఇనుముతో చేయబడినవి; అందుచేతనే చీకటులును క్రక్కు కిరణములు కలది; అందుచేతనే ఉరుముచున్న మేఘమువలె కనబడుచున్నది; గవాక్ష (రంధ్ర)ములతో కూడిన పెద్దదియగు ఇనుప జాలె (వలవంటి అల్లిక గల తెర రక్షణకై) కవచముగా తొడిగినది; ఇనుముతో చేసిన పరిఘలు విసరు ఈటెలు ముద్గరములు ప్రాసములు వివిధములగు అస్త్రములు ఒకదానితో మరియొకటి కలియని కంటకములతో కూడి భయము కలిగించు తోమరాద్యాయుధములు గండ్రగొడ్డళ్ళు - ఈ విధములగు ఆయుధములతో నిండినది, దైత్య శత్రువులు పదార్థమై లేచి వచ్చుచున్న మందరమో యనునట్లున్నది, వేయి గాడిదలను పూంచినది; విరోచనుడు ఇటువంటి రథమారో హించి మిగుల క్రుద్ధుడయి, గద ధరించి ఆ దైత్య సైన్యమునకు ముందు ప్రకాశించు శిఖరములు కల పర్వతమో యనునట్లుండెను.

హయగ్రీవుడను దానవుడు శత్రు సమూహమును మర్దించు సంకల్పముతో వేయి గుర్రములను పూంచిన రథము ఆరోహించి ముందునకు నడచెను. వారాహుడను దానవుడు వేయి మూరల పొడవయిన మహాధనువును సారించి ధ్వనిచేయుచు ప్రరోహములతో (మొలక పర్వతములతో – శిఖరములతో) కూడిన పర్వతమువలె ముందు నిలిచెను. ఖరుడను దైత్యుడు దర్పము వలనను రోషము వలనను కన్నుల నుండి నీరు చిందిపడుచుండ పెదవులు వణకుచుండ పండ్లు పటపట కొరుకుచు సంగ్రామముకోరి ముందునకు సాగెను. వీర్యవంతుడగు త్వష్టయను దానవుడు ఎనిమిది ఏనుగులను పూన్చిన భయంకరమగు రథమారోహించి దానవుల సేనా వ్యూహమును పన్నుటకై ముందునకు నడచెను. విప్రచిత్తి అను దానవుని కుమారుడు తెల్లని కుండములు భూషణములుగా దాల్చి తెల్లని పర్వతమువలె ప్రకాశించుచు యుద్ధాభిముఖుడై నిలిచెను. బలిపుత్రుడగు అరిష్టుడనువాడు శ్రేష్ఠములగు పర్వత శిలలను ఆయుధములుగా గ్రహించి చరాచర లోకమును కంపింపజేయుచు యుద్ధమునకు సిద్ధపడెను. కిశోరుడను దానవుడు రెచ్చగొట్టబడిన సింహపుపిల్లవలె అధిక హర్షోత్సాహములతో బయలుదేరెను. వానితో పాటు దానవులు అందరును తమతమ బలముల (సేనల)తో కూడి యథాక్రమముగా సన్నద్ధులు అయిరి. ఇటువంటి దైత్యసేనా మధ్యమున లంబుడను దానవుడు (నిండయిన శరీరముతో) నీటి బరువుతో వ్రేలాడు మేఘము వంటివాడై వ్రేలాడుచున్న వస్త్ర భూషణములు దాల్చి దైత్య వ్యూహము నడుమ మంచుతో కప్పిన రవివలె ప్రకాశించుచుండెను.

మహాగ్రహమగు స్వర్భానుడు (రాహువు) నోటితోను దంతములతోను పెదవులతోను కన్నులతోను యుద్దము చేయువాడై సేనలకు ముందుభాగమందుండెను. ఇక మిగిలిన దైత్యులు హయములను గజములను సింహములను వరాహములను ఎలుగుబంటులను ఒంటెలను మేఘములను వాహనములనుగా చేసికొనియు కొందరు పదాతులుగాను ఉండిరి. వారు భయంకరులు వికృతముఖులు ఏకపాదులును ద్విపాదులునయి యుండిరి. వారందరును యుద్ధ కాంక్షులై ఉత్సాహముతో నృత్యము చేయుచుండిరి. భుజములను చరచుచు సకిలించుచు గర్జించుచు పులులవలె ధ్వనులు చేయుచు ఉండిరి. భయముగొల్పు గదలను పరిఘలను శిలలను ముసలములను చేత ధరించియు పరిఘలనుపోలు భుజములనే ఎత్తియు ఆ దానవులు దేవతలను భయపెట్టుచుండిరి; వారెల్లరును పాశములతో ఖడ్గములతో తోమరములతో అంకుశములతో పట్టిసములతో శతఘ్నులతో ముద్గరములతో పెద్దశిలలతో శైలములతో పరిఘలతో చక్రములతో ఇంకను ఇట్టి వాడియగు ఉత్తమాయుధములతో ఆడుచు తమసేనను ఆనందింప జేయుచుండిరి. ఈ విధముగా దానవసేన అంతయు హద్దుమీరిన యుద్ధమదముతో అద్భుతమగు మేఘసమూహమువలె అమరి దేవతలకు ఎదురుగా నిలిచెను. ఆ సేన వేల కొలది దైత్యులతో దట్టమై వాయువులను అగ్నులను శైలములను మేఘములను జలములను పోలి యుద్ధ పరంపర యందు జయము పొందవలెనను ఉత్సాహముతో యుద్ధముచేయు కాంక్షతో వెర్రి ఎత్తినదివలె ప్రకాశించెను.