మత్స్య మహా పురాణము
మయుడు ఓడి త్రిపుర దుర్గమున ప్రవేశించుట
సూతుడు ఋషులకు ఇట్లు చెప్పసాగెను, మాయావియు దానవేశ్వరుడునగు మయుడు మహాయుద్ధము చేసిన అనంతరము మేఘము నీలాకాశమున ప్రవేశించినట్లు త్రిపురమున శీఘ్రముగా ప్రవేశించెను. అతడు దానవుల నడుమ కూర్చుండి దీర్ఘముగ వేడి ఊర్పులు వదలుచు రెండవ ప్రళయకాల యముడువలె చింతింపసాగెను. సురల కగ్రగామియగు ఇంద్రుడును యుద్ధమున ఎవని ఎదుట నిలువజాలక గడగడలాడుచుండెడివాడో అట్టి మహా యశశ్శాలియగు విద్యున్మాలియు మరణించెనుగదా! దేనికి సాటియగు మరియొక దుర్గము ఏదియు లేదో - అట్టిదానికి గూడ ఇదుగో! ఇప్పుడు నాశము ప్రాప్తించినట్లు కనబడుచున్నది; ఎక్కడను గెలుపు ఓటములకు దుర్గము హేతువుకాదు. దుర్గముకాని మరియేదికాని ప్రతియొకటియు కాలమునకు వశమయి నడుచుచుండును. అందువలన కాలుడు క్రుద్ధుడైనను కాలము రానపుడు ఇప్పుడే ప్రాణాంతము ఎట్లు జరుగును? ‘మూడులోకములయందును ఇది నిర్భయమయినదని చెప్పదగిన దేదేది కలదో-అది ఎల్ల మొట్టమొదలే కాలమునకు వశమయి యుండెను’ అని బ్రహ్మ చెప్పిన వచనము. సంధారణము చేయుటకు సాధ్యముకానిదియు అమితస్వరూపము కలదియు అగు కాలము విషయమున మహేశ్వరుడు దేవుడునగు శివుడు ఒక్కడుతప్ప మరిఎవ్వడు తన సాధన ముల అమరికతో తనశక్తి చూపగలడు? ఇంద్రుడు, యముడు, వరుణుడు కుబేరుడు - ఈ ఎవ్వరిని నేను లెక్కపెట్టను. దేవతలకు ప్రభువగు ఈ పరమేశ్వరుడు మాత్రమే యుద్ధమున ఎక్కడను దుర్జయుడు. ఐశ్వర్యమునకు ఫలము ఏదో-ప్రభుత్వమునకు ఫలము ఏదో దానిని నా విధానము ననుసరించి నంతలో నేను చూపెదను. దైత్యుల కందరకును సంజీవ నౌషధమువలె జీవనాధారమగు అమృత జలపూర్ణమగు వాపిని (దిగుడు బావిని) సృష్టింతును.
మాయావులలో మొనగాడగు మయుడు తనమనస్సులో ఇట్లాలోచించి బ్రహ్మదేవుడు రంభను సృజించినట్లు తన మాయతో వాపిని సృష్టించెను. దాని పొడవు రెండు యోజనములు; వెడల్పు ఒక యోజనము; అది ‘కథ’ యను కావ్య విశేషమువలె మాధుర్య రసముతో నిండిన అలలతో నిండియుండెను; చందనపు బంకవలె నుండినదియు, పుష్టి కలిగించునదియు, అమృతమువలె రుచి కలుగుటతో పాటు కమ్మని వాసనలు వెదజల్లు ఉత్తమ జలముతో నిండి సద్గుణ పూర్ణయగు యువతివలె కనబడు చుండెను. నల్లని తెల్లని కలువ పూలతోను, పద్మములతోను కాదంబము లనెడు హంసలతోను చుట్టుకొనబడి చంద్ర సూర్యులతో క్రమ్మబడినట్లు ఆవాపి కనబడుచుండెను. తుమ్మెదలనెడు ఆభరణములతో అలంకరించబడి యుండెను. కమ్మని ధ్వనులు చేయుచు మనోహరమగు బంగారు కాంతులు గల హంసలతో కూడి అది మన్మథ బాణములతో వ్యాప్తయైన రమణివలె కనవచ్చుచుండెను. మహేశ్వరుడు గంగనువలె మయుడు ఆ వాపిని సృష్టించి విద్యున్మాలిని ఆదరముతో దానిలో పడవేయించెను. దేవ శత్రువును మహాబలుడునగు ఆ విద్యున్మాలిని దానియందు ముంచగానే కట్టెలతో చక్కగా వృద్ధి చేయబడి ప్రజ్వలించుచు ప్రకా శించుచు అగ్నివలె అతడు ప్రకాశించుచు లేచి నిలువబడెను. మయునికి నమస్కరించెను. తారకాక్షుడు విద్యున్మాలికి నమస్కరించెను. అంతట విద్యున్మాలి మయునితో ఇట్లు పలికెను: ప్రమథులు అనెడు జంబుకములు తను కొలుచుచుండగా రుద్రుని వెంటనుండు నంది ఎక్కడ? నేను బాణములతో అతని దేహమునుపీడించి మోహపరచితిని. మనము ఇప్పుడయినను రుద్రుని అనుగ్రహము వలననే సమర్థుల మయ్యెదము. అప్పుడు శత్రువులను గెలిచెదము. లేక వారే మనలను చంపిరా-యమునకు ఆసనముగా అయ్యెదము. ఇట్లు పలికిన విద్యున్మాలి మాటలు విని మహాసురుడును మిగుల బలశాలియునగు మయుడు ఇట్లు పలికెను: విద్యున్మాలీ! మహా బాహూ! నాకు ఈరాజ్యముకూడ ఇష్టముకాదు. మహాసురా! నీకొరకే నేను మరణించిన దైత్యుల కును దానవులకును జీవన వర్ధనము కలిగించు ఈ అమృతమయియగు వాపిని నా మాయా బలముతో సృష్టించితిని. దైత్యుడా! నేను అదృష్ట వంతుడను గనుక తనంతట తాను వెలికివచ్చి నిర్ధనునకు కనబడిన మహానిధివలె నాకు నీవు కనబడుచున్నావు. మయుడు తన మాయతో నిర్మించిన ఆ మాయామయమగు అమృతవాపిని చూచిచూచి దైత్యపుంగవులు హర్షము చెంది ఇట్లు పలుక నారంభించిరి:
దానవులారా! ఇపుడు నిర్భయులై ప్రమథులతో తలపడి యుద్ధముచేయుడు. యుద్ధమున రాక్షసులు మరణించినను వారిని మయుడు నిర్మించిన ‘వాపి’ బ్రతికించగలదు అని దైత్యులు పరస్పరము అన నారంభించిరి. అంతట దానవులు మ్రోగించు భయంకరభేరి క్షోభిల్లు సముద్రము వలె మాటిమాటికి బిగ్గరగా మ్రోగ నారంభించెను. త్రైపురదానవులు ఇనుముతోను వెండితోను బంగారుతోను చేసి మణులతో అలంకరించబడిన గుండ్రని హారములును ఉత్కటములగు మకుటములును ధరించియుండిరి. దృఢ విక్రములగు ఆదానవులు కోట్లకొలదిగా ఆయుధములు ధరించి ఎడతెగక జ్వలించుచు నాలుకలు కోయు అగ్నులవలె పొగలు గ్రక్కుచుండిరి. వారు నృత్యముచేయు నటులవలెను, గర్జించు మేఘములవలెను, తొండము పైకెత్తిన ఏనుగులవలెను, నిర్ణయములగు సింహములవలెను కనబడుచుండిరి. గంభీరములగు హ్రదములవలెను అధిక ముగ తపించు సూర్యులవలెను యములవలెను దైత్యేంద్రులు తమ దైత్య మహాసేనను త్వరపెట్టు చుండిరి. ప్రమథులును ఉత్సాహవంతులయి గరుడుడు ఎగిరిపడునట్లు ఎగిరిపడు పాదములతో తాము దానవులకు శత్రువులు కావున దానవులతో యుద్ధముచేయగోరి దానవులమీదకు పరుగెత్తు చుండిరి. నందీశ్వరునితో కూడి ప్రమథులును తారకాక్షునితో కూడి దానవులును దైత్యులును తమతమ బలముల ప్రేరణతో సంగ్రామము చేయ నారంభించిరి. చంద్రులవంటి తోమరముల తోను అగ్నులవంటి శూలములతోను దృఢముగా విడువబడిన శరములతోను వారు పరస్పరము కొట్టుకొనసాగిరి. ప్రయోగించబడు శరములును విసరిపడవేయబడు ఖడ్గములును అంతరిక్షము నుండి రాలిపడు ఉల్కలవలె కానవచ్చు చుండెను. శక్తుల దెబ్బలతో హృదయములు చీలగా నిర్దయముగా తగిలి దెబ్బలతో పడిపోవుచున్న ప్రమథులును దేవతలును నరక కూపములలో మునిగిపోవుచున్న వారువలె కనబడుచుండిరి. బంగారు కుండలములు అలంకారములుగా గలిగి కిరీటములును మకుటములును ధరించియున్న ప్రమథుల దేవతల శిరస్సులు పర్వత శృంగ ములవలె అంతరిక్షమునుండి క్రింద పడుచుండెను. బాణములతో పట్టినములతో ఖడ్గములతో గండ్రగొడ్డండ్రతో నరుకబడిన ప్రమథుల భుజములు ఏనుగు తొండమువలవలె క్రింద పడుచుండెను. చక్కగా అలంకరించుకొని యుద్ధము చేయుచున్న ప్రమథులు కొందరు భయంకరముగా గర్జించుచుండిరి. ఇది అంతయు చూచుచు అంతరిక్షమున సిద్ధులు కొందరు అద్భుతమగు యుద్ధ సంగీతమును సాధనచేయుచు ఆనందించు చుండిరి. (ఈ యుద్దమును వర్ణించుచు గేయములు రచించి పాడుచుండిరి.) రణభూమికి తిన్నగా అంతరిక్షమున నిలిచిన చారణులనెడు దేవ జాతులవారు ‘ప్రమథుడా! నీవు దానవునికంటె బలవంతుడవుగా కానిపించుచున్నావు. దానవా! నీవే ప్రమథునికంటె దర్పితుడవుగా భాసించు చున్నావు’ అని ఇట్లు యుద్ధములో పైచేయిగా నున్నవారిని పొగడుచుండిరి.
ప్రమథులు కొందరు దానవుల పరిఘలు దెబ్బలు తిని నోట నెత్తురు కక్కుచు స్వర్ణ ధాతు వుల కక్కు కొండలవలె నుండిరి. ప్రమథులును దేవతలును చీల్చివేయగా వృక్షములతో పర్వత శిఖరములతో కొట్టగా దానవులు చచ్చుచుండిరి. అట్టివారిని మయుడు తన వారిచేత వాని యందు పడవేయించుచుండెను. వారు మరల బ్రదికి ప్రకాశించు దేహములతో స్వర్గము నుండి వచ్చు దేవతలవలె వచ్చుచుండిరి: వారి ఆభరణములును వస్త్రములును దేవతలకువలె నుండుటచే పొగడ్తలందు కొనుచుండిరి. అట్లు తిరిగి బ్రదికిన కొందరు దానవులు భుజములు చరచి సింహ నాదము చేయగా భయపడి ప్రమథులును దేవతలును పారిపోవుచుండిరి. దానవులు కొందరు ప్రమథులను దేవతలను చూచి ‘ఇంకను పారిపోక నిలిచెదరేల? మీరు మమ్ము చంపినను ‘వాపి’ మమ్ము మరల బ్రదికించును’ అనుచుండిరి. అది విని వజ్ర సమానుడగు శంకుకర్ణుడను నాతడు శివునికడకు పోయి ఇట్లనెను: దేవా! ఈ దానవులను మన ప్రమథులు చంపివేసినను నీటితో తడిపిన పైరులవలె లేచి భయంకరులై వచ్చుచున్నారు. ఈ త్రిపురదుర్గము నందు అమృత రసముతో నిండిన ‘అమృతరసా’ అను ‘వాపి’ (దిగుడు బావి) కలదట. చచ్చిన దానవులను దానియందు వేయగా వారందరు మరల బ్రదికి వచ్చుచున్నారు.
అంతలో దానవులు దారుణమగు కోపోద్రేకము చెందిరి. తారకాక్షుడు భయంకర నేత్రములతో తారకాక్షమును మేఘమువలె మహా క్రోధముతో మహాదేవుని రథము వైపునకు పరుగెత్తుకొని వచ్చెను. దేవదేవుని రథము వైపునకు దానవులుద్ధతులయి పోవుట తెలిసి త్రిపురదుర్గ వాసులు అధిక భయంకరముగా భేరీ శంఖధ్వనులు చేసిరి.
ఆసమయమున తారకాక్షునితో జరుగనున్న ఆయుద్దమునకై దేతలును వెలుపలికి వచ్చి రంగమున నిలిచిరి. ఇది తెలిసి రుద్రుడును స్వయంభూబ్రహ్మయు కలతచెందిరి. ఆ దేవశ్రేష్ఠులిద్దరు నారోహించియున్న అరథోత్తమము అనాథుడు వచ్చి తన్నాశ్రయించగా వానినెట్లు రక్షింతు నాయని దిగులుచెందు గుణవంతుడగు వీరుడువలెను ధాతు క్షయవ్యాధి గ్రస్తమయిన దేహము వలెను గ్రీష్మ నదీజలము వలెను తిరస్కరింపబడిన స్నేహమువలెను (తాను చూపిన స్నేహమును అవతలివారు తిరస్కరించినచోవలె) శిథిలము కాసాగెను. ఆరథము సామాన్యమయినదికాదు- త్రైలోక్య రూపమయినది. అట్టి శంకర రథమును (త్రైలోక్యమును) తాను శరీరమునందు ఉండియే మహా (ముఖ్య) ప్రాణతత్త్వరూపుడుగా ఆ బాణమునందున్న విష్ణువు పైకి లేవనెత్తెను. ఐనను అది నిలువబడుట లేదు. అందుచే పీతాంబరుడగు జనార్ధనుడు వెంటనే శరమునుండియు ఎగిరి దుమికి మహావృషభ (ధర్మ) రూపమును ధరించి వచ్చి మరెవ్వరికి ధరించుటకు (పడకుండ నిలిపి పట్టుటకు) సాధ్యముకాని ఆ రథమును తన కొమ్ములతో ఎత్తిపట్టి నిలిపెను. అది కేవల రథముకాదు. త్ర్యైలోక్యరూపము అయినది. దేవోత్తముడగు ఆ విష్ణువు దానినట్లు నిలిపి పట్టుట ఒక కులమందలి మహాపురుషుడు తన కులమును ఉన్నతికి తెచ్చుటవలె కనబడుచుండెను.
దైత్యేంద్రుడగు తారకాక్షుడు తెక్కలుగల గిరివలె ఎగిరివచ్చి పరిఘతో అశ్వములను సారథిని చావమోదెను. బ్రహ్మయు తారకాక్షుని చేతిదెబ్బతిని వ్రతోదము (కశా-కొరడా)ను కూబరమున పడవేసి మాటిమాటికి శ్వాసవదలుచు ఉష్ణమును క్రక్కుచు కూలబడెను. అది చూచి దైత్య దానవులు మాటిమాటికి భయంకరమగు నాదము చేయసాగిరి.
అంతట విష్ణువు వృషభరూపమున త్రిపురదుర్గమును ప్రవేశించెను. అచ్చట ఆదేవుడు ‘అమృతరస’ యను ‘వాపి’ని చూచెను. దానియందు సాధారణజాతి పద్మములును నూరు దళముల పద్మములు నుండెను. కర్పూరపు పొడివాసన దానినుండి వచ్చుచుండెను. వృషరూపధారియగు హరి దానవులను సమ్మోహపరచి వారికి తెలియకుండ అ వాపి (యందలి నీటిని)ని త్రాగివేసెను. పీతాంబరుడగు జనార్దనుడు అసురేంద్రుల ఆవాపిని త్రావి ఆ మహాబాహుడు గర్జన సేయుచు మరలశరమును ప్రవేశించెను. తరువాత అసురులను భయంకరులగు ప్రమథులు బాణపు దెబ్బలతో బాధించిరి. ఆ శరప్రహారములతో రక్తనదులు అధికమయ్యెను. ఇట్లు వారు సింహములు మృగములను తరిమినట్లు దానవులను రణమునుండి పరాఙ్ముఖులనుగా చేసి తరిమిరి. తారకాక్షు డును విద్యున్మాలియు మయుడును పారిపోయిరి. శరీరమునుండి ప్రాణవాయువులు మొదలగు జీవాశ్రిత ధర్మములు వెడలిపోయినట్లు వారెల్లరును రణ రంగమునుండి త్రిపురదుర్గమునకు వెడలిపోయిరి.
మహేంద్ర నందీశ్వర షణ్ముఖులును చంద్రుడును దిక్పాలురును ప్రమథ గణాధి పతులును అత్యధిక గర్వశాలురై యుద్దమున మనము జయించెదమను విశ్వాసముతో దుర్మదులయి గర్జించిరి; బిగ్గరగా నవ్విరి.