మత్స్య మహా పురాణము
చంద్రోదయాది వర్ణనము
తారకాక్షుడు మరణించిన తరువాత మయుడు ప్రమథులను తరిమి భయావృతులయి యున్న దానవులతో ఇట్లనెను. దానవేంద్రులారా! ఇప్పుడు నేనును మీరును ఏమి చేయవలెనో చెప్పుదును వినుడు. చంద్రుడు పుష్యనక్షత్రముతో కలియు పుష్యయోగము వచ్చినపుడు క్షణ కాలము త్రిపురములు ఒకటియగును. ఇది కోకిల ‘కూహూ’ ధ్వనికి పట్టునంతకాలము. ఆ సమయమున మనలను వార్ధకము మ్రింగి వేయును. అది పుష్యయోగ సమయమని నేను వ్యవస్థ చేసినాను. అముహూర్తమున ఈ మూడు పురముల ఏకత్వమును గుర్తించిన దేవతలలో ఎవడయి నను ఒకే బాణముతో త్రిపురదుర్గమును చూర్ణము చేయును. కావున ప్రాణములును బలమును ఉన్నంత వరకును దానవులందరు యుద్ధముచేసి పురరక్షణ చేయుడు.
మహేశ్వరుని రథ మొక్కటి సర్వప్రాణి భయంకరమైనది. దానిని మీ రెట్లయిన అడ్డగించి అతడు బాణ ప్రయోగము చేయకుండునట్లు చూడుడు. ఏలయన దేవతలు అదే పనిగా పుష్య యోగమున కెదురుచూచుచుందురు. మీ రది గమనించుడు.
మయుని మాటలువిని యముని వంటి త్రిపుర దానవులు మాటిమాటికి సింహ నాదములు చేసి మయునితో ఇట్లనిరి, మయా! మే మందరమును నీవు చెప్పినట్లు చేసెదము. శివుడు త్రిపుర దుర్గముపై బాణము ప్రయోగించకుండ వారించెదము. రుద్రుని సంహరించుటకై యుద్ధము చేసెదము. ఈ త్రిపురదుర్గము కల్పాంతము వరకు స్థిరముగ ఉండనైన వలయును; లేదా ఈ ఆకాశ సంచారియగు త్రిపురమున దానవు డొక్కడును లేకుండనైన పోవలయును. నీవు మమ్ములను విడువనంత వరకును మేమును మాధర్మమును విడువము. లోకమున దేవతలు గాని దానవులుగాని లేకుండ పోవుట మానవులు చూడగలరు అని దానవులు పలికిరి.
ఇంతలో ప్రదోషమయ్యెను. త్రైపుర దానవులెల్లరు శృంగార భావపూర్ణులై మన్మథుని సందేశహరులవలె నయిరి. క్రమముగ భగవానుడగు చంద్రుడు ఉదయ పర్వతముపై మిగుల ఎర్రనై ఉదయించుచు చీకటులను పోద్రోలుచు ఆకాశమున విజృంభింపసాగెను. అతడు సరోజల ములో కలువపూల నడుమ విహరించు హంసవలెను వైడూర్య శిఖరముపై కూర్చున్న సింహము వలెను విష్ణువక్షము నందలి హారమువలెను ఆకాశమున కనబడుచుండెను.
లోకమంతయు గాఢాంధకారములో మునిగియుండగా ఉదయించిన చంద్రుడు తాను అత్రి మహాముని నేత్రము నుండి ఉద్భవించినవాడు అగుటను సార్థకము చేయుచు లోకములను వెన్నెలతో తడుపుచు తాను ప్రకాశించుచు లోకములను ప్రకాశింపజేయుచు లోకములకు కన్నులను ఇచ్చెను. ఇట్లు చంద్రోదయ మయ్యెను. త్రిపురము వెన్నెలతో నిండెను. భవనము లందును దీపములు వెలిగింపబడెను. ఇట్లా పురమున బయట వెన్నెలతో లోపల దీపములతో ప్రకాశమయ్యెను. అసురులును తమతమ ఇండ్లను దేహములను కూడ అలంకరించుకొనసాగిరి. రచ్చలలో రాజమార్గములలో ప్రాసాదములందును గృహములందును నూనెతో నింపిన దీపములు వెలిగింపబడి సంపెంగ పూలవలె ప్రకాశించుచుండెను. ధనముతో నిండినవగు దానవుల నవ రత్నమయ గృహములలో దీప ప్రకాశములో ఆయా వస్తువులు, ధనములు, రత్నములు చంద్రోద యవశమున ప్రకాశించు గ్రహములవలె ప్రకాశమునందెను. దుష్టపుత్రుల వలన కులమునకు కలిగినట్లు బయటి వైపున వెన్నెలతోను ఇండ్లయందు దీపములతోను చీకటికి పీడ కలిగెను. ఇట్టి ప్రదోషకాలారంభమున చంద్రుని అట్టహాసము (అధిక ప్రకాశము) యౌవనము నంది రాత్రికి ప్రకాశము నందించుచుండ దానవులు శృంగార సుఖమును కోరి స్త్రీ జనములతో కూడి అలంకరించుకొనుచు ప్రకాశించుచునుండిరి.
పూర్వము శివునిపై ప్రయోగింపబడి వినోదము ననుభవించిన ఐదు బాణములను ఇపుడు త్రిపుర దానవులపై ప్రయోగింపబడి అచటి స్త్రీ పురుషులకు తమ రుచిని చూపెను. మన్మథుడు అచటి దానవస్త్రీల అవ్యక్తమధుర వచనములలో వీణాలాపనలలో సంగీత మూర్ఛనలలో దానవులు చేయు శృంగార మత్తప్రలాపములలో విజృంభించి వారి మనస్సులను కలవరపరచెను. చంద్రుడా కాశమున తనపత్నియగు రోహిణీదేవితో కూడి వెన్నెల కురియుచు రాజ్యము చేయుచుండ ఆతని వెన్నెల అచటి రాత్రి చీకటులను పారద్రోలుచు జగమునకు హితము చేయుచుండెను. ఆ దానవాంగనలలో ఒకతె మన్మథుని పాదములకడ నిలిచి తన చెక్కిళ్ళయందు విశేషకము అను రంగు పూలతో అలంకరణము చేసికొనుచు దానితో తన ముఖమునకు శోభ సమకూర్చు కొనుచుండెను. తరువాత ఆమె తన ముఖమును గుండ్రని అద్దములో చూచుకొని ‘నా ముఖ మునకు ఎంతయో శోభకలిగెను కదా’యని మురియుచు తనప్రియుడు కూడ తను ఇట్లు ప్రశంసించునను భావముతో చాల ఆనందించుచుండెను. కొందరు యువతులు గగుర్పాటు చెందిన శరీరములతోను తన ప్రియునితో కూడి రమించవలెను. ఆసక్తితోను చక్కగా అలంకరించు కొని మదపుటేనుగులవలె ఆనందముతో మత్తిల్లి యుండిరి. ఒకతె శృంగార భావముతో నిండిన మనస్సుతో మద్యము త్రావుచుండెను. మరియొకతె ప్రసన్న హృదయముతో ప్రియుని వెదకు కొనుచుండెను. మరియొకతె చాలసేపు తన ప్రియుని విషయములో ప్రసన్నురాలయి యుండెను. ఇంకొక దానవస్త్రీ తన ప్రియుడు చేయు ప్రలాపములకే ఆనందపడుచుండెను. గోశీర్ష పద్మములు హరిచందనము మొదలగు అలంకరణములతో సుగంధ ద్రవ్యపు పూతలతో చన్నులు బురదతో పులిమినట్లు కనబడుచుండ పెదవులు మెరయుచుండ వారి రూపములు మనోహరములయి ఆసక్తి గొల్పునవై ప్రకాశించెను. అమృతముతో నిండిన బంగారు కుంభములవలె వారి రూపము లుండెను. కొందరు దానవులు ప్రియురాండ్రయం దనురక్తులయి వారి పెదవులను గాయపరచి వారు శీఘ్రముగా కోపింపగా మరల వారిని బ్రతిమాలి వినోద పెట్టి ఆనందపరచుచు ఆనంద పడుచునుండిరి. కాని వారు తమ ప్రియురాండ్ర మాటలయందుకంటె వీణావాద్య ధ్వనులయందు ఎక్కువ ఆసక్తులై అవి వినగోరిరి. కొందరు దానవులు తమ ప్రియురాండ్ర మధుర వచనములు విన్నంత మాత్రాన కామబాణ వశీభూతులగుచుండిరి; కొందరు దానవస్త్రీలు మద్యపానశాలా ప్రదేశములందు పానముచేసి తను ప్రియుడు కౌగిలించుకొనగా అతడు పాడుచుండ తాను వాద్యము వాదించుచుండెను. కొందరు దానవులు తమ ప్రియురాండ్రను బ్రతిమాలుచుండిరి. కొందరు తమ ప్రియురాండ్రు అలుగగా వారికి నచ్చచెప్పుచుండిరి. ఆ సమయమున త్రిపురములు యందలి సుగంధమము మన్మథుని బాణపు పూవుల వాసనలను వెదజల్లుచుండెను. (దానవులలో స్త్రీలును పురుషులును శృంగారభావ పరవశులగు చుండిరని భావము) ఒకానొక దానవాంగన శయ్యపై సుఖముగా పండుకొని ప్రియుడు కౌగిలించుకొనగా పులకించి చెమర్చి లేతగడ్డి మొక్కల చిగురాకులతో అందగించుచున్న భూమి ఆ తృణాంకురములపై సన్నని మంచు చినుకులు క్రొత్తగా పడినపుడు ప్రకాశించునట్లు ఒప్పారెను.
చంద్రుని వెన్నెలలతో శోభించుచున్న త్రిపుర సౌధాగ్రములందు మాధుర్య భావ ప్రకటన వశమున కదలుచున్న ఆభరణములును ఒడ్డాణపు గజ్జెలును మొలనూలు లందలి చిరుగజ్జెలును చేయు ధ్వనులు మన్మథుడు ప్రయోగించిన బాణములు వచ్చి పడునపుడు అయ్యెడు ధ్వనులవలె మనోహరములయి వినబడుచుండెను. ఒక దానవ స్త్రీ తన ప్రియునితో “నీవు ఆసవపానముచే అలసితివి. అమితముగా నా చెక్కిలి ముద్దాడి యాడి ఇంకను అలసితివి. నా పిరుదులు విశాల మయినవి. అవిబంగారు మొలనూలితో మనోహరమయి మనోహరధ్వని చేయుచున్నవి. పుష్టితో విశాలమైయున్నవి. నీవు వానిపై కూర్చుండి శ్రమ దీర్చుకొనుము” అనుచుండెను.
ఇట్లా రాత్రియందు త్రిపురములందలి రథ్యలు (విశాల రాజవీథులును నాలుగు వీథులు కలిసిన తావులును) వెన్నెలతో నిండి ఒప్పుచుండెను. రాజమార్గముల మాటయే అందరును మరచిపోయినట్లు అచట ఎవరును సంచరించక తమతమ భవనములందును సౌధములందును సుఖించుచుండిరి. కాని కొందరు దైత్యులు పెద్ద గుంపులుగా కూడి సాయంకాలానంతరము చంద్రునితో కూడిన నక్షత్రములవలె ప్రకాశించుచుండిరి. దానవులు తమతమ భవనములయందు వెన్నెల అట్టహాసముల నడుమ ఊయెలలయందు మదలోలభావములతో ఊగుచు ఆనందించు చుండిరి. వారి మనస్సులు తమ ప్రియురాండ్ర మొలనూలులందలి చిరుగజ్జెల మ్రోతలచే ఆకర్షింప బడుచుండెను. దానవాంగనలు ఆ సమయమున వాడని పూలమాలలు ధరించి మిగుల ఉత్సుక భావముతో అతిహర్షముతో నిండియుండిరి. భవనములందు ఈ దానవ స్త్రీల మధుర వచనము లను దిగుడు బావులందలి కలహంసముల ధ్వనులును ఒకే విధముగా మధురములై వినవచ్చు చుండెను. ఆ పురమందెల్ల చోటులందును-ఒడ్డాణముల అందములు-దానవస్త్రీల మధురాంగ విన్యాసములు శోభలు-ఎప్పుడును నవ్వులు చిందెడి బాలురు-మన్మథ బాణములకు ప్రియ నివాసములగు దానవాంగనల సౌందర్యములు. ఇవి ఆ పురమునందంతట కనబడుచుండెను.
వన్నెవన్నెల వస్త్రములు పైకెత్తి కట్టిన కేశపాశములు ధరించిన స్త్రీ పురుషులతో తరంగిత మయి మనోహరమగు వస్త్రములు ఆభరణములు ధరించిన జనముతో కూడిన ఆ త్రిపురపురి ఆ రాత్రివేళ చంద్రునితో తారలతో కూడి వెలుగు ఆకాశము వలెనే ప్రకాశించెను. కదలికచే ధ్వనించుచు తెగిపడిన మొలనూలులతో ఒడ్డాణములందుండి చెదరి రాలిపడిన రత్నములతో చిత్రకాంతులతో విరాజిల్లుచు త్రిపుర భవనములందలి శయ్యాభూమి చంద్రుని సమీపమున ప్రకాశించు చిత్రా నక్షత్రమువలె ప్రకాశించుచుండెను. వెన్నెలలతో తళతళలాడు ఉద్యానములందు కోకిలల మనోహర ధ్వనుల నడుమ ఆ దానవుల త్రిపుర భవనములందు మన్మథుడు తన బాణములను ప్రయోగించి ప్రయోగించి ఆ శరములన్నియు వ్యయమయి పోగా అతడు ఏమియు తోచక తిరుగుచుండెను. అంతలోనే దానవ పుంగవుల ఆ త్రిపురములందు రాత్రి ముగియగా వెన్నెలలు తగ్గుచు చంద్రుడు పడమట వాలెను. కొలది సేపటిలో యుద్ధరంగమున నిలువబోవు శివుని తురగములే దేవ శత్రువులగు దానవులకును చంద్రునకును ఒకేసారి ఒకే విధముగా క్షీణదశను కలిగించి నట్లయ్యెను. అస్తమించుచున్న చంద్రుడు తరిగిన వెన్నెలలతో వెలవెలపోవుచు మొల్లపూవులను కలువపూలను కర్పూరమును పోలిన కాంతితో కూడి భాగ్యక్షయము కలిగిన ధనవంతునివలె వివర్ణుడై కనబడుచుండెను. అతని ఛాయ అంతయు వ్యయమయ్యెను. వెన్నెల రాసులన్నియు కరగిపోయెను. చివరకు అతని వర్ణము ఆకాశ వర్ణముతో సమానమయ్యెను.
అంతలో సూర్యుడు ఉదయించెను. అతడు తన సారథియగు అరుణునితో చంద్రుని కాంతిని అణగద్రొక్కెను. అతని బింబము మిగుల కాచిన మేలిమి బంగారు వన్నెతో మెరయు చుండెను. ఇట్లతడు లోకమందలి చీకటులను మేఘములు పారదోలుచు ఉదయాద్రి శిఖరమును చీల్చుకొని వెలికి వచ్చి ప్రకాశించసాగినా డిడుగో! అని ఆనందించిరి.