ఏకోద్దిష్టాది శ్రాద్ధవిధి

సూతుడు మహర్షులకు ఇంకను ఈ విధముగా చెప్ప నారంభించెను, మత్స్యరూపుడగు నారాయణుడు మనువునకు చెప్పినట్లు తండ్రి మరణించినపుడు పుత్రులు చేయవలసిన ఏకోద్దిష్ట శ్రాద్ధ విధానమును ఆశౌచము పాటించవలసిన నిర్ణయమును తెలిపెదను.

మృతాశౌచము బ్రాహ్మణులకు పది దినములు, క్షత్రియులకు పండ్రెండు దినములు వైశ్యు లకు పదునైదు దినములు, శూద్రులకు ముప్పది దినములు పాటించవలసియుండును. (పదు నొకండవ-పదుమూడవ -పదునారవ ముప్పదియొకటవ దినములందు స్నానము చేసిన వీరి కందరకు శుద్ధి యగును.) చూడాకర్మ జరుగని (మూడేండ్లు నిండని) శిశువు మరణించినచో ఒక దినము మూడేండ్లు నిండినది మొదలు ద్విజులకు ఉపనయనమును ఇతరులకు వివాహమును కానంతవరకు మూడు దినములు మృతాశౌచము.

జాతాశౌచము (పురుడు) కూడ ఆయా వర్ణములవారికి పైని చెప్పినట్లు పది-పండ్రెండు- పదునైదు-ముప్పది దినములే అని తెలియవలెను.

తండ్రి మొదలగువారు మరణించినపుడు దహనము జరిపి పిమ్మట అస్థి సంచయనము (దహనము చేయగా ఏర్పడిన భస్మమునుండి ఎముకలను ప్రోగుచేయుట) జరిగిన తరువాతనే అంగస్పర్శము (మరణించిన వాని పుత్రుడు మొదలగు శ్రాద్ధకర్తలను అతని సన్నిహిత జ్ఞాతులైనను తాకుట) జరుగవలెనని శాస్త్రము విధించుచున్నది.

తరువాత పండ్రెండు దినముల వరకు ప్రేతమునకు పిండదానము చేయుచుండవలెను. ఏలయన పరలోకమునకు పోవు ప్రేతమునకు ఆ పిండములు దారిబత్తెముగా అయి చాల ప్రీతిని కలిగించును. ఈ పిండదానముచే సంతృప్తి చెందుచు ప్రేతము పండ్రెండు దినములు ముగియుసరికి ప్రేతములు చేరవలసిన లోకమునకు తీసికొనిపోబడును. (చేర్చబడును.) మరణించిన ప్రాణి (ప్రేతము) ఈ పండ్రెండు దినములును తాను మరణించక మునుపు తన విగా నుండిన ఇల్లు పొలము పుత్రులు భార్య మొదలగునవి చూచుచునే ఉండును. (వీరు తన కొరకై దారిబత్తెముగా ఏమయిన సుఖ సాధనమును సమకూర్తురా లేదా యను చింతతో ఉండును.) అందుచేతనే పది దినములవరకు శూన్యమునందు వ్రేలాడునట్లుగా ప్రేతము నుద్దేశించి నీటితో(పాలతో) నిండినపాత్రము ఉంచెదరు. దీనివలన ఆ ప్రేతమునకు తాపోప శాంతియు మార్గాయాస శాంతియు కలుగును.

పదునొండవనాడు బ్రాహ్మణులు పదునొకండు మంది బ్రాహ్మణులను భోక్తలుగా ఉంచి శ్రాద్ధము జరుపవలెను. ఇట్లే క్షత్రియులును వైశ్యులును శూద్రులును వారివారి ఆశౌచమ ముగిసిననాడు బేసి సంఖ్యలో భోక్తలను భుజింపజేయవలెను. (శూద్రులు ఆహార పదార్థ దానము మాత్రమే చేయవలెను.)

ఆశౌచము ముగిసిన రెండవనాడు (పదునొకండవ పదుమూడవ - పదునారవ ముప్పది యొకటవ దినములలో ప్రేతముద్దేశించి ఏకోద్దిష్టమును జరుపవలెను. (ఏక+ఉద్దిష్ట= ప్రేతమును మాత్రము ఉద్దేశించి-వారి పై వారినిగాని విశ్వేదేవులను గాని ఉద్దేశించక-చేయు శ్రాద్ధము అని అర్థము) దీనియందు అవాహనము అగ్నౌకరణము యథావిధానముగా ఉండును. విశ్వేదేవులకు అర్చన యుండదు. ఒకే పవిత్రము ధరించుట ఒకే అర్హ్యము వదలుట ఒకే పిండము వేయుట దీనియందు విధింపబడును. దీనిలో “ఇదం ఉపతిష్ఠతు.” ఇది ఈ ప్రేతమునకై సన్నిహితమై ఉండుగాక!” అని మాత్రమే చెప్పవలెను. (స్వధా అని చెప్పకూడదు) పిండదానము తరువాత తిలోదకము ఈయవలెను. వికిరపిండము ఇచ్చు సమయమున “స్వదితం” “చక్కగా తినబడినది” అనియు-బ్రాహ్మణులకు వీడ్కోలు చెప్పునప్పుడు “అభిరమ్యతామ్” “సుఖము అనంద మును పొందుగాక!” అనియు చెప్పవలెను. ఇవి కాక మిగిలిన ప్రక్రియలన్నియు లోగడ ఆయా శ్రాద్ధముల విషయమున చెప్పినట్లే ఈ ఏకోద్దిష్టమునను చేయవలెను.

ఈ విధముగా ఏకోద్దిష్టమును ప్రతి మాసమునందును జరుపుచుండవలెను. (వాస్తవమున సపిండీకరణము సంవత్సరాంతమున జరుగవలెను. అంతవరకును మరణించిన జీవునకు “ప్రేతము” అను వ్యవహారమే యుండును. కాని పితృ దేవత్వము రాదు. అంతవరకును చేయు పితృకార్యము అతనిని ఒక్కనికే ఉద్దేశించి చేయుదురు. కావున ఇది ఏకోద్దిష్టము.)

ఆశౌచము తీరిన తరువాత రెండవ దినమున (విప్రులు 11వ-క్షత్రియులు; 13వ-వైశ్యులు; 16వ-శూద్రులు; 31వ దినములందు) సంప్రదాయము నెరిగి శ్రాద్ధకర్త ప్రేత నుద్దేశించి అతని సుఖమునకై శయ్యను బంగారు ప్రతిమను ఫలములను వస్త్రములను బ్రాహ్మణ దంపతులకు-వారిని నానా-భరణ భూషణములతో అలంకరించి పూజించి - దానము ఈయవలెను. వృషోత్సర్జనము-ఆబోతును విడుచుట చేయవలెను. కపిలగోవును దానమీయవలెను. భక్ష్య భోజ్యములను ఉదకుంభమును దానము చేయవలెను. ఇట్లు సంవత్సరము నిండువరకు ఆయా దానములును శ్రాద్ధములును తిలోదక పూర్వకముగా ఆయా సమయములందు జరుపుచుండ వలయును. సంవత్సరము నిండిన తరువాత సపిండీకరణము జరుపవలెను. సపిండీకరణము జరిగిన తరువాతనే మరణించిన వ్యక్తికి ప్రేతత్వము తీరి పార్వణమునకు (పార్వణ శ్రాద్ధము నందు చేయు ఆయా పిండదానాదికమును గ్రహించుటకు) అర్హుడగును.

తల్లిదండ్రులు మరణించినపుడు పదునొకండవ దినమున కుమారుడు వారి సుఖము నుద్దేశించి వృషోత్సర్గము చేయవలెను. లేదా ఏదైన పుణ్య సమయమునందైనను ఇది చేయవచ్చును. కుమారుడు ఇది తల్లి విషయములో ఆమె మరణించిన తరువాత పదునొకండవ దినమునగాని మరేదైన పుణ్యదినమున గాని చేయవలెను. తండ్రి విషయమున అతని పుణ్యము నకై అతడు జీవించియుండగా కూడ వృషోత్సర్గము చేయవచ్చును. ఇవి ఈ విధముగా జరుపుట వలన గృహస్థుడు (మరణించినవారి కుమారులు మొదలగువారు) వృద్ధిపూర్వకములగు (నాందీ శ్రాద్ధమును జరిపి చేయవలసిన వివాహాది శుభకార్యములను) జరుపుటకు యోగ్యుడగును.

సపిండీకరణ శ్రాద్ధమున మొదట విశ్వేదేవులకును తరువాత పితరులకును ఆవాహనము అర్చనము భోజనము మొదలగునవి జరుపవలెను. అందునను పితరులు అనగా అప్పటికి పితృత్వమును పొందియున్నవారిని మాత్రమే గ్రహించవలెను. ప్రేతను వేరుగా పేర్కొనవలెను. పితృస్థానమునందు నాలుగు పాత్రలను (అర్ఘ్యమునకు) ఉంచి గంధములు తిలలు ఉదకము మొదలగువానితో వేరు వేరుగా (అప్పటికి పితృత్వము పొందియున్న మూడు తరముల వారికి మూడు-ప్రేతకు ఒకటి-మొత్తము నాలుగు) నింపవలెను. తరువాత ప్రేతపాత్రయందలి గంధతిలలతో కూడిన ఉదకమును మూడు భాగములుగా మిగిలిన మూడు పాత్రలయందు కలిపి వేయవలెను. “యే సమానా” అని ఆరంభమగు రెండు ఋక్కులతో నాలుగవ పిండమును మూడుగా విభజించవలెను. ఆ ఖండములను పితరులకు ఉద్దేశించిన పిండములతో కలుపవలెను. ఇంతేకాని నాలుగవ పిండమునకు అంతకంటె వేరు వినియోగము లేదు. ఈ సపిండీ కరణము జరుపుటతో ఈ మరణించిన జీవుడు ప్రేతత్వము వదలి పితృత్వమును పొందును. అన్ని విధముల పుష్టిని (శుభమును) పొందును. అగ్నిష్వాత్తాది పితృదేవతల దగ్గర ఉత్తమము అమృతము (శాశ్వతము) అగు స్థానమును పొందును. అందుచేతనే సపిండీకరణము జరిగిన తరువాత ఈ మరణించిన వ్యక్తికి వర్గత్రయములోని వాడుగానే కాని ఆతనికి వేరుగా పారలౌకిక పితృకార్యములు జరుపబడవు. ఏలయన అతని పిండము తనపై పెద్దల పిండము లోనికి చేరినది. కనుక ఇతడును వారిలో ఒకడుగా అయినాడు.

అది మొదలుకొని సంక్రాంతి - చంద్రగ్రహణము మొదలగు విశిష్ట పర్వములందును అతడు మరణించిన దినమున ప్రతి సంవత్సరమును పిండత్రయముతో శ్రాద్ధము జరుపవలెను. (మరణించిన పెద్దలకు) ఇదే విధముగ మృతదినమునను ఆశౌచదినములందును ఏకోద్దిష్ట శ్రాద్ధమునే ప్రేత నుద్దేశించి చేయవలెను. కాని అంతకుమించి అతనికి పితృత్వమును భావనచేసి పార్వణ శ్రాద్ధము మొదలగునవి చేయరాదు. అట్లు చేసినవాడు తల్లిదండ్రులను సోదరులను చంపినందువలన కలుగు పాపమును పొందును. ప్రేతలుగా నున్నవారు తనకు పితరులతో (గాని ఇతరులతోగాని) సంపర్కము కలిగినచో కలవరము చెందుదురు. కనుక వారికి ఏకోద్దిష్టమునే (వారిని ఒక్కరిని మాత్రమే ఉద్దేశించి చేయు శ్రాద్ధమునే) జరుపవలయును. కాని ఇతరులతో కలిపి జరుపరాదు. మృతదినములందు పార్వణ శ్రాద్ధమును జరిపిన మానవుడు క్రిందికి క్రిందికి పతితుడగును. కనుక సంవత్సరము నిండు వరకు ఏకోద్దిష్టమునే జరుప వలయును.

సంవత్సరము నిండువరకు మరణించినవారి (ప్రేతల) నుద్దేశించి ఉదకుంభమును అన్నమును దానము చేయువారికి అశ్వమేధయాగము చేసినచో కలుగునంత ఫలము కలుగును.

శాస్త్ర విధానానుసారము కర్మములను ఆచరించుట ఎరిగిన శ్రాద్ధకర్త అన్న శ్రాద్ధమును కాక ఆమశ్రాద్ధమును జరుపునప్పుడు అగ్నౌకరణము కాని పిండదానముగాని ఆమ పదార్థముల తోనే చేయవలెను కాని పక్వద్రవ్యములతో చేయరాదు. ప్రేతకు తనకు పై వారితో సపిండీకరణము జరుపగానే అతడును పితృవర్గత్రితయములో ఒకడగు స్థితిని పొందును. అప్పటినుండి అతడు ప్రేతత్వ బంధనమునుండి ముక్తి పొందును.

ఇట్లు ముక్తుడైనవాడు కూడ తన వంశమువారిలో తన కుమారుడు కాక మిగిలిన వారి నుండి లేపమును (పిండములు పెట్టినప్పుడు మిగిలిన అంటును) ఆహారముగా పొందదగిన వాడు అగును. ఈ లేపము కుశమార్జన పూర్వకముగా అందును. దీనికి కారణము ఏమన మూడు తరములు దాటి నాలుగవ తరమునుండి పై వారు లేపభాక్కులు. పితృపితా మహప్రపితామహులు పిండభాగులు. ఏడు తరములవరకు ఎవరైనను తమ పూర్వులకు పిండములు వేయ వచ్చును. ఏలయన సపిండత్వము ఏడు తరములవరకు నిలుచును.