మత్స్య మహా పురాణము
రాజాను జీవుల అనువర్తన ప్రకార వివరణము
మత్స్యుడు మనువుతో ఇట్లు చెప్పెను. రాజానుజీవులు సర్వదా సదాచారులయి రాజు నెట్లనువర్తించ వలయునో చెప్పెదను; వినుము; విషయమునెరిగి రాజాను జీవులు రవిపుత్రా! మనూ! నిండుమనస్సుతో అన్నివిధముల రాజు ననువర్తించవలెను; ఎట్లన-రాజు చెప్పు వాక్యమును యత్నముతో వినవలెను; అతని మాటను నడుమనే నిలిపి తనమాట చెప్పకూడదు, జనసభలో నున్న రాజుతో అతనికి అనుకూలమును ప్రియమునునగు మాట పలుకవలెను; ఏకాంత మందు మాత్రము రాజునకు అప్రియమైనను హితమగు వచనము పలుకవలె(చ్చు)ను; ఇతరులకు మేలుకావలసిన పని ఏదయిన నున్నను రాజ మనస్సు సమముగా నున్నపుడు చెప్పవలెను, తన సొంతమునకు రాజు వలన కావలసినదేదైన నున్నచో అది అతనికి ఇతరులచే చెప్పించవలెనే కాని తాను చెప్పరాదు; ఏ పనిని గాని సమయము మించకుండ నెరవేర్చుటకు యత్నించవలెను; రాజాధికృతుడెప్పుడును రాజ ధనమును దుర్వినియుక్తము చేయరాదు; రాజు తనపై చూపు ఆదరమును అలక్ష్యము చేయక దానిచే తానతనికి ప్రియుడు కావలెను. రాజువలె తన వేషభాషా చేష్టితము లాచరించరాదు; (ఎగతాళిగా) రాజు ననుకరించరాదు; అతనికిష్టము కానివి విడువవలెను, రాజవేషమునకు సమము అధికమునగు వేషమును ధరించరాదు; ద్యూతము మొదలగు వానియందు తనకుగల నేర్పును అతనికి ప్రదర్శించవలెను, అట్లు ప్రదర్శించినను వాటి యందు రాజే తనకంటె గొప్పవాడని చూపవలెను; అంతఃపుర జనాధ్యక్షులతో శత్రురాజు దూతలతో తన రాజుచే వెడల గొట్టబడినవారితో రాజాజ్ఞ లేనిదే సంబంధము పెట్టుకొనరాదు, తనకు ఎవరియందుగాని స్నేహరాహిత్యము కాని అవమాన దృష్టికాని యున్నను దానిని బయల్పరచక దాచి ఉంచవలెను; రాజరహస్యములను లోకమున బయలుపరచరాదు. రాజు తనతో చెప్పిన పరమ గుహ్యములను బయలుపరచరాదు; దానిచే అతడు రాజునకు అప్రియు డగును; రాజు ఇతరులను ఏదయిన అజ్ఞాపించుచున్నను తానులేచి 'నేనేమి చేయుదును?' అనవలెను: కార్యస్థితి నెరిగి దానిని నెరవేర్పచూడవలెను.
కాని ఈ విధముగ కూడ ఎల్లప్పుడును చేయుచున్నచో తాను ప్రభువునకు తేలిక వాడగును; రాజునకు ప్రీతికరములగు వచనములను పలుకవలసినదే కాని అవి మిక్కిలిగాగాని మాటిమాటికి (ఎప్పుడును అదేపనిగా) కాని ఆడరాదు; మహాసుశీలుడుగా నుండవలెను; కనుబొమలు ముడి పడనీయకూడదు; ఎక్కువ మాటాడరాదు; బొత్తుగా మాటాడకుండరాదు; మత్సరముండరాదు; తను తానెట్టి స్థితియందును పొగడుకొనరాదు; రాజునందుగల దుష్కృత్యములను ఎప్పుడుగాని ఎక్కడగాని పేర్కొనరాదు; రాజిచ్చిన ssవస్త్రములను అస్త్రములను అలంకారములను తానే ధరించ వలెను కాని క్షేమము గోరువాడెవడును వానిని ఔదార్యముతో ఇతరులకీయరాదు; తెగ తినరాదు; అతినిద్ర పోగూడదు; ప్రవేశించవచ్చునని నిర్దేశించని (నిషిద్ధమయిన) వాకిటి యందు ఎన్నడును ప్రవేశించరాదు; రాజు దర్శించరాని చోటులందుండగా దర్శించరాదు; రాజునకు కుడి ఎడమలందే కాని ముందు వెనుకలందు కూర్చుండరాదు; రాజ సమీపమున ఆవులించుట, ఉమియుట, దగ్గుట, ఇతరులపైనను కోపించుట, వీరాసనమున కూర్చుండుట, కనుబొమలు ముడివేయుట, క్రక్కుట, కేకరించుట చేయరాదు. తనగుణములను తానే చెప్పుకొనుట తగదు. ఒకవేళ రాజునకు అవి తెలుపవలసి యున్నచో ఇతరులచే తెలిపించవలయును; రాజాను జీవులు నిర్మల హృదయులు రాజునందు పరమభక్తులు సోమరితనము లేనివారునయి కొంటెతనము ఆయా విషయములందు ఆసక్తి, చాడీలు చెప్పుట, నాస్తికత్వము, క్షుద్రత్వము, చాపల్యము విడువవలెను, వేద విద్యల యందు సుశీలమునందు మనస్సు దృఢముగా నిలుపవలయును. ఇట్లుండి రాజసేవ చేయుటచే శ్రేయస్సు కలుగును; రాజునకు పుత్రులు మంత్రులు ప్రియులునగు వారికి నమస్కరించు చుండవలెను; రాజ సచివులయందు నమ్మికతో నుండరాదు, రాజడుగనిదే మాటలాడరాదు, ఒకవేళ మాట లాడినను రాజహితులగు వారితో మాట కలిపి రాజునకు హితమును క్షేమకరమును సత్యమును అగు మాటనే చెప్పవలయును; సదా రాజ చిత్తము ఎరిగి వర్తించవలెను; ఇట్లుండి రాజు నారాధించ (మెప్పించ) వలెను.