మత్స్య మహా పురాణము
శుక్రదేవయానీ సంవాదము
శుక్రుడు ఇట్లనెను: ”దేవయానీ! ఎవడు ఇతరులు పలికిన అతివాదములను (అనరాని మాటలను) ఓర్చుకొనునో అతడే ఈసమస్త విశ్వమును జయించినవాడని ఎరుగుము. ఎవడు పైకి ఎగిరిపడుచున్న క్రోధమును గుర్రమునువలె నిగ్రహించి పట్టుకొనునో అతనిని సత్పురుషులు యంత (నియమించుకొనువాడు-సారథి) అని వ్యవహరింతురు. గుర్రము పగ్గములయందు చిక్కుకొని యుండును. (పగ్గములు లాగినచో గుర్రము నిలిచిపోవును. చిత్తమును నిగ్రహించినచో క్రోధము నిలిచిపోవును) పైకి ఎగిరి పడుచున్న క్రోధమును ధర్మముచే నిగ్రహించినవాడే ఈ విశ్వమంతయు జయించినవాడు. పైకి లేచుచున్న కోపమును కుబుసమును పాము దూరముగా త్రోసివేసినట్లు ఎవడుత్రోసివేయునో వాడే పురుషుడు. ఎవడు ధర్మమును అనుష్టించునో ఎవడు మిగుల ఓర్పుతో ఉండునో ఎవడు ఇతరులు తపింపజేసినను తపించడో అతడు ప్రయోజనము (శుభము)ను పొందును. నెలకు ఒకటి చొప్పున నూరేండ్లు అశ్వమేధములు చేసినవాని కంటెను నూరేండ్లు నిరంతరము అన్నదానము చేసిన వానికంటెను క్రోధమును అణచుకొన్నవాడే మేలు. విరోధము-ఓర్పు-అనువాని బలా బలములు తెలియనందున అవివేకముచే కుమారులును కుమారికలును (పసివారు) పరస్పరము కలహింతురు. కాని ప్రాజ్ఞులు అట్టిది చేయరు.”
దేవయాని ఇట్లు పలికెను, ”తండ్రీ! నావయస్సు చిన్నదైనను నాకు కార్యగతి (ఏ పని చేయవలెనో) తెలియును. క్రోధము అతివాదము అనువాని బలాబలములును నాకు తెలియును. తన శుభము కోరినవాడు ఎవ్వడును తనశిష్యుడు శిష్యుడుగా నడుచుకొనక పోవుటను సహించరాదు. సద్వర్తనము లేక ధర్మాధర్మముల సంకీర్ణపరచి నడుచుకొనువారి యొద్ద జీవించుట నాకిష్టము గాదు. సద్వర్తనము కలిగినవారిని మంచి వంశమున పుట్టినవారిని ఎవరు తగినట్లు గౌరవించరో అటువంటి పాపబుద్ధుల యొద్ద తన మేలుకోరిన ప్రాజ్ఞుడు నివసింపరాదు. ఎవరు తాము సద్వర్తనమును సద్వంశమును కలిగి అవి కలిగినవారిని గుర్తించి ఆదరింతురో అట్టి సాధుజనుల యొద్ద నివసించుట తగినపని. అదియే శ్రేష్ఠమగు నివాసము. ఇది ఇట్లుండగా వృషపర్వుని కూతురు పలికిన మహా ఘోరములగు దుర్వచనములు అగ్నిని సంపాదింపగోరిన వారు అరణిని మథించినట్లు నా హృదయమును మథించుచున్నవి. తన గొప్పతనము తరిగి పోవు చుండ ప్రజ్వలించుచున్న శత్రువుల గొప్పతనమును ఆశ్రయించి ఇతడు జీవించుచున్నాడు అని పించుకొనుట కంటె అపకీర్తికరమగు విషయము లోకములో మరేదియులేదని నా అభిప్రాయము.”