శివచతుర్దశీ వ్రతము

నారదుడు ఈశ్వరునిట్లడిగెను, భగవన్; భూత-భవ్య-ప్రభూ! ఇంతవరకును మీరు చెప్పిన వానివంటిదే భుక్తిముక్తి ఫలముల నీయగలిగినది ఇంకనుఏదైన వ్రతమున్నచో దానిని నాకు తెలుపుము. అనగా ఈశ్వరుడతనితో నిట్లు చెప్పనారంభించెను. నారదా, ఇడుగో! ఈతడు వాఙ్మయ మంతయు కడముట్ట చదివి దానితత్త్వము నెరిగినవాడు. పురాణములు వేదములు అనురెండు విధములగు వాఙ్మయ విస్తారము నెరుగుటలోను తపశ్చర్యలోను నాతో సమానుడు. ఇతడు వృషభ రూపములో కనబడుచున్న ధర్మమేకాని వేరుకాదు. ప్రమథగణమువారిలో శ్రేష్ఠుడు. ఈతని పేరు నంది. ఇకమీదట ఈతడే నీకు మహేశ్వర ధర్మములను చెప్పగలడు అని పలికి ఈశ్వరుడచటనే అప్పుడే అంతర్ధానము నందెను. నారదుడు (ఆయా విషయముల) వినగోరిన వాడు (శుశ్రూషువు) అగుచు నందికేశ్వరు నిట్లడిగెను: అయ్యా! శివుడు నిన్ను తనకు ప్రతినిధిగా నిలిపెను గదా, కావున నాకు మహేశ్వరమగు (మహేశ్వరునకు సంబంధించిన) వ్రతమును ప్రతిపాదింపుము. అనగా నందికేశ్వరు డతనికిట్లు చెప్పెను.

బ్రాహ్మణా! వినుము; మహేశ్వరమగు వ్రతమును తెలిపెదను, అది శివచతుర్దశీ వ్రతమను పేరున త్రిలోకములయందును ప్రసిద్ధము. మార్గశీర్ష శుక్ల త్రయోదశినాడు దేవదేవేశుడగు ఈశ్వరుని “నేను నిన్ను శరణుచొచ్చినాను. చతుర్దశినాడు నిరాహారుడనైయుండి మహేశ్వరుని సమభ్యర్చించి సువర్ణ వృషభమును దానముచేసి భుజింతును” అని సంకల్పించి ఆనాడు (త్రయోదశినాడు) ఒక పూట మాత్రమే భుజించి యుండవలెను. ఇట్లు నియమము నేర్పరచుకొని రాత్రి నిద్రించి చతుర్దశినాటి ఉదయమున మేలుకొని స్నాన జపాదికము చేసికొని తెల్లకమలములతో గంధ మాల్యానులేపనములతో సహితుడగు శివుని పూజించవలెను.

తరువాత బంగారు వృషభమును బంగారు కుంభము (జలపాత్ర)ను శుక్ల మాల్యాంబరములు నానావిధ భక్ష్యములు “సద్యోజాతుడు దేవదేవుడు పినాకధనుర్ధారియగు పరమేశుడు ఈవ్రతముచే ప్రీతుడగుగాక!” అను అర్థము నిచ్చు మంత్రముతో గురు (ఆచార్యు-పురోహితు)నకు సమర్పించవలయును. శుచిత్వమును భక్తియు కలవాడయి భక్ష్య భోజనములతో బ్రాహ్మణులను సంతృప్తుల జేయవలయును. పృషదాజ్యము (పృష దాజ్యము అనగా గడ్డకట్టించిన గట్టిపరచిన పాలు-నేయి కలిపిన మిశ్రము; దూధ్ ఖోవా-దూధ్ బడా అను పాలవంట లేదా మీగడ పెరుగు.) ఆహారముగా తీసికొని ఉత్తరపు మొగమై నేలపై పడుకొనవలయును. పిమ్మట పూర్ణిమనాడు బ్రాహ్మణులను (భోజనాదికముతో) పూజించి తానును భుజించి మౌనియై గడుపవలెను. ఇట్లే మరల కృష్ణ చతుర్దశియందును ఇదియంతయు చేయవలయును. ఇట్లు మార్గశీర్షము మొదలగు అన్ని మాసములందును రెండు చతుర్దశులందును చేయుచుపోవలెను. ఈవిషయమున ఆయా మాసములందు వేరుగనుండు అంశములను తెలిపెదను వినుము. అట్లే (యజమాని) ఆహారము వరుసగా 1. గోమూత్రము; 2. గోమయము; 3. క్షీరము; 4. పెరుగు; 5. నేయి; 6. కుశోదకము; 7. పంచగవ్యము; 8. బిల్వ (ఫల)ము; 9. కర్పూరము; 10. సాంబ్రాణి, 11. యవలు, 12.నల్ల నూవులు, పూజకై పుష్పములు మార్గశీర్షాది మాసములందు వరుసగా-1. మందార; 2. మాలతీ; 3. ఇప్పు; 4. తెల్ల కలువ. 5. ప్రేంకణము; 6. అశోకములు; 7. మల్లె; 8. పాటలము-దాసాని అనెడు ఎర్రని పూవు; 9.జిల్లేడు; 10. కడిమి; 11. నూరు రేకుల పద్మము; 12. కలువ.

మరల కార్తీక మాసము రాగానే బ్రాహ్మణులను ప్రార్థించి పిలిచికొనివచ్చి నానావిధ భక్ష్యములు మొదలగు వానితో పూజించి వస్త్రములు మాల్యములు భూషణములు బంగారుతో చేసిన ఉమామహేశ్వరుల ప్రతిమ గోప్రతిమ వృషభ ప్రతిమ గోవృషభ ప్రతిమలకు ఎనిమిదేసి ముత్యములు తెల్లని నేత్ర వస్త్రములు సర్వోపస్కారములతో కూడిన చక్కని శయ్య రాగి పళ్లెరములో (పాత్రలోకాని) తెల్లని బియ్యము అంగవైకల్యములేనివారు శాంతులు వేదవ్రతములను ఆచరించిన వారు సౌమ్యులు శుభమును ఆచరించువారు జ్యేష్ఠసామ (అను సామవేద భాగ)ము ఎరిగినవారు దురాచరణములు లేనివారు సపత్నీకులు అగు వారికిని-గుణజ్ఞుడు (ఉత్తమ గుణములు ఎరిగిన వాడు-కలిగినవాడు) శ్రోత్రియుడు (సాంగముగ వేదాధ్యయనము చేసినవాడు) తత్త్వవేత్తయు నగు గురువు ఉన్నచో గురునకును లేనిఎడల అట్టి బ్రాహ్మణునకును దానమీయవలెను. వేదోక్త విధానమున నీల వృషోత్సర్జనమును చేయవలెను. విత్తశాఠ్యము చేయరాదు. చేసినచో దోషము పొందును. ఈ విధానమున శివచతుర్దశీ వ్రతము చేసినవారు అశ్వమేధ సహస్ర ఫలము పొందుదురు. వారి తండ్రులో సోదరులో తానో చేసినవైనను బ్రహ్మహత్యాది దోషము లేవయిన ఉన్నచో వానివలన ఇహలోక పరలోక పాప ఫలము లేవేవియున్నను అవి యన్నియు నశించును. ఇహమున దీర్ఘాయురారోగ్యమును కులాభివృద్ధియు పరమున విష్ణు సారూప్యమును సిద్ధించును. ద్యులోకమున ప్రమథగణములకు అధిపతియై నూరుకోట్ల కల్పముల కాలముండి తుదకు శివ స్థామును చేరుదురు.

ఈశివ చతుర్దశీ వ్రతఫలమును చెప్పుటకు బృహస్పతికిని బ్రహ్మకును సిద్ధులకును నాకు (నందికేశ్వరునకు)ను నోటియందు పదివేలకోటుల నాలుకలున్నను శక్తి చాలదు. ఏలయన ఆ ఫలము అనంతమయినది.

ఈ శివ చతుర్దశీవ్రత విధానము సకల పాప విమోచనమును కలిగించునది; దీనిని స్మరించినను పఠించినను విమత్సరుడై వినినను వినిపించినను ఇంద్రత్వము సిద్ధించును. దీనిని అమర యువతి కోటులు స్తుతించుచుందురు. సదాఇట్టి ప్రశస్తమగుదాని నాచరించినచో కలుగు ఫలము ఇంతయని చెప్పనేల? స్త్రీయైనను తన భర్తనుకాని కుమారులను తన ఇంటి పెద్దలనుకాని అడిగి వారిఅనుమతిపొంది ఆచరించినను ఆమెయును పరమేశ్వరుని అనుగ్రహమునకు పాత్రురాలై పినాక పాణియగు ఆ మహానుభావుని పరమపదమును పొందును.