మత్స్య మహా పురాణము
కల్పపాదప (వృక్ష)దాన కథనము
శ్రీమత్స్య నారాయణుడు మనువుతో ఇట్లు చెప్పెను. ఇప్పుడిక నీకు కల్పపాదపదానము అను మహోత్తమమగు కల్పవృక్ష ప్రదానమను, మహాదానపు విధానమును వివరింతును; వినుము. అది మహాపాతక నాశనమగునట్టిది. పుణ్యకరమగు శుభదినమున తులాపురుష దానమందువలెనే ఋత్విజులను, మండపమును సంభారములను సమకూర్చుకొనవలయును. నానా ఫల సమన్వితమగు బంగరు వృక్షమును అందు నానా పక్షి వస్త్రాభూషణములను యథాశక్తిగ పలత్రయమునకును వేయి ఫలములకును నడుమ తూకముగల బంగరుతో చేయించవలయును, మొత్తము తూకములో సగము తూకపు బంగరుతో వృక్షమును చేయించి దానిని ప్రస్థ మాత్రము గుడముపై తెల్లని వస్త్రద్వయముపై నుంచి మిగిలిన సగములో కొంతతో బ్రహ్మ, విష్ణు, రుద్ర, భాస్కరులను పక్షివస్త్ర భూషణాదికమును వృక్షము క్రింద ఉండునట్లు కామదేవుని, అతని పత్నియగు రతిని చేయించవలెను, దీనికి తూర్పున మొత్తము తూకములో నాలుగవ వంతుతో సన్తాన (మను కల్పవృక్ష విశేష)మును దక్షిణమున నేతిపై అదే నాల్గవవంతు తూకముతో మందారమను కల్ప వృక్ష విశేషమును లక్ష్మితో కూడను పశ్చిమమున పారిజాత మనెడు కల్పవృక్ష విశేషమును జీరకము నందు సావిత్రితో కూడ అదే నాలుగవ వంతు తూకపు బంగరుతోను అట్లే నాలుగవ వంతు తూకపు బంగరుతో నూవులపై కామధేనువుతో కూడ ఉత్తర దిశయందు హరిచందనమను కల్పవృక్ష విశేషమును ఫలములతో కూడను చేయించవలెను, పట్టు వస్త్రములను చెరకు గడలను పూవులను పండ్లను ఎనిమిది పూర్ణకలశములను పాదుకలను ఆసనములను పాత్రలను దీపకములను పాదరక్షలను ఛత్ర చామర ఆసనములను పలపుష్పాద్యలంకృత వితానకమును (మేల్కట్టు - చాందినీని) అష్టాదశవిధ ధాన్యములను సమకూర్చుకొని అన్ని వైపులను ఉంచుకొన వలయును. హోమమును అధివాసనమును ముగిసినతరువాత విప్రపుంగవులచే స్నానము చేయించు కొనబడి యజమానుడు కల్పవృక్షాదికమునకు అగ్నులకు ఆవాహిత దేవతలకు విప్రులకు త్రిః ప్రదక్షిణము చేసి ఈ మంత్రమును ఉచ్చరించవలయును. “చింతి (సంకల్పితార్థ ప్రదాయియగు) కల్పవృక్ష మునకును విశ్వంభరుడును విశ్వ మూర్తియు అగు దేవునకును తన్మూర్తియగు కల్పవృక్షమునకు నీకును నమః. నీవు విశ్వాత్ముడవును, బ్రహ్మవు, రుద్రుడవు, దివాకరుడవు, మూర్తమగు (రూపముగల) అమూర్త (రూపములేని) మగు తత్త్వములును, పరమ బీజరూపుడవును కావున సనాతన రూపా! నన్ను రక్షించుము. అమృత సర్వస్వమును అవ్యయుడగు అనంత పురుషుడవును నీవే; సంతానము. పారిజాతము. మందారము. హరిచందనము అనెడు వృక్ష విశేషములతో కూడిన నీవు మమ్ము సంసార సాగరము నుండి రక్షించుము.”
ఇట్లు అమంత్రించి కల్పవృక్షమును గురునకు ఈయవలయును; నలుగురు ఋత్విజులకును సంతానాది వృక్ష చతుష్టయమును ఈయవలయును; స్వల్ప పరిమాణముతో చేయునపుడు ఏకాగ్ని విధానముతో హోమము జరిపి (ఇందు ఋత్విజులెవరు ఉండరు కనుక) అంతయును గురునకే అర్పించవలయును; విత్తశాఠ్యమును (ధన ముండియు లేనివానివలె కొరత) చేయరాదు; ఇంత అయినదేయని యాశ్చర్యపడరాదు; ఈ విధానమున ఈ మహాదానమును అర్పించినవాడు సర్వపాప వినిర్ముక్తుడగును, అశ్వమేధఫలము నందును, అప్సరః సిద్ధచారణ కింకర పరివృతుడై వారిచే అంతరిక్షమున స్తూయమానుడై, పుత్ర పౌత్ర ప్రపౌత్రులతో కూడి రవి ప్రకాశ విమాన మారోహించి విష్ణులోకమున కేగును. తన గోత్రమునందు తన కాదరణీయులగు గడచిన - గడువనున్న - తరముల మనుజులను తరింపజేయును; స్వర్గమందు నూరు కల్పములుండును, తరువాత చక్రవర్తియై జనించును; నారాయణుని బలగముతో కూడి నారాయణ పరాయణుడై నారాయణ కథాసక్తుడై నారాయణపుర మేగును. ఈ సకల కల్పవృక్ష ప్రదాన ప్రక్రియను ఎవరు పఠింతురో, వినెదరో, అల్పధనులైనందున దీని నాచరించలేక స్మరించుచునైన ఉందురో వారును అప్సరసలతో కూడి ఇంద్రలోక మేగి పాపవిముక్త దేహులై మన్వన్తరకాలముండి సుఖింతురు.